6
సుచరితతో నాకు మొట్టమొదటి సారి పరిచయం మనో రంజని గారింట్లో నే కలిగింది. మనోరంజని ఆహ్వానించిన , ఒక పార్టీకి వెళ్లాను. లోపలకు అడుగు పెడుతుండగానే , అంతమందిలో ప్రత్యేకంగా మెరిసిపోతూ , నన్నలా నిలబెట్టేసింది ఒకావిడ! ఆమె పేరు సుచరిత అని తర్వాత తెలిసింది.
భగవంతుడు , మానవులకు ప్రసాదించే వరాలన్నింటిలో అపురూపమైనది సౌందర్యం. దాని విలువ సాటిలేనిది-- ఎన్ని బలహీనతలనైనా క్రమ్మి వేయగలదు. ఎంతటి క్షుద్రత్వాన్నయినా , దాచుకోగలదు. దీపం చుట్టూ పురుగులు చేరినట్లు, సౌందర్యం చుట్టూ మానవ హృదయాలు సంచరించక మానవు.
చామనచాయ కాదనిపించే పసిమి చాయ. చిన్నవి కావనిపించే పెద్ద కళ్ళు. గుండ్రం కాదనిపించే కోలమొహం. మొనదేలిన సన్నని ముక్కు. చిన్న బుల్లి నోరు! నవ్వుతుంటే సొట్టలు పడే , నిండైన బుగ్గలు. అంగసౌష్టవ సౌందర్యాన్ని రాణింపజేసే నడక తీరు!
ఆమె వంక కళ్ళప్ప జెప్పి చూస్తూ నిలబడి పోయాను. నా సంచలనాన్ని అర్ధంచేసికోన్నదా అన్నట్లు ఆమె సిగ్గుతో కూడిన గర్వంతో నవ్వింది. ఆ నవ్వులో నాకు కోటి మెరుపులు కనిపించాయి. ఆమె కూర్చున్న బల్ల దగ్గిర ఎవరూ లేరు. ఒక్కర్తే కూర్చుంది. అటు నడువ బోయాను. అంతలో మనోరంజని వచ్చింది.
'అక్కడ కూర్చోకండి. డాక్టర్ గారూ! ఇలా రండి"నన్ను ఆటంక పరుస్తూ అంది.
నేను చేసే పనిని ఎవరైనా ఆటంకపరుస్తే నేనా పనిని మరింత పట్టుదలగాచేస్తాను.
"ఫరవాలేదు. ఇక్కడ ఖాళీగా ఉంది కదా! ఇక్కడ కూర్చుంటాను." అంటూనే సుచరిత ప్రక్కనున్న కుర్చీలో కూర్చొన్నాను. సుచరిత సంతోషాన్ని సూచిస్తూ నవ్వింది. మనోరంజని ముఖం ,ముడుచుకుని వెళ్ళిపోయింది.
"నేను ఇక్కడ కూర్చోవటం , మీకు అభ్యంతరం లేదు కదా!' ఎలాగో మాటలు కలపాలని అడిగాను.
"నాతొ పాటు కూర్చోనేవాళ్ళు లేకపోవటంతో ఎండుకోచ్చానా, అని పరితపిస్తున్నాను. మీరు కూర్చోటానికి అభ్యంతరమా?"
కొంత దిగులుగా అంది.
నాకు కొంచెం ఆశ్చర్యం కలిగింది.
"ఆ దురదృష్టవంతులు మీ దగ్గర కూర్చోక పొతే మీకు దిగులెందుకు? అంతగా అయితే, మీరే వాళ్ళ దగ్గిరకు వెళ్ళలేక పోయారా?"
"అప్పుడు వాళ్ళంతా లేచిపోతారు."
"ఎందుకూ?"
"వాళ్ళ పరువు పోతుందని భయం."
నాకు మతి పోయినట్లయింది. బిత్తరపోయి ఆమె వంక చూసాను.
"మీరూ భయపడుతున్నారా?" ఆమె నవ్వింది. ఆ నవ్వులో ఏదో దిగులు రేఖలు.
"వాళ్ళను చూసి జాలిపడుతున్నాను. ఎందుకా నిష్కారణ భయం వాళ్ళకు?"
"నిష్కారణం కాదు. మా నాన్న దొంగ-- ఉరి శిక్ష వల్ల మరణించాడు. మా అన్నయ్య కూడా దొంగే! రెండుసార్లు ఖైదు కెళ్ళాడు. ఇంక ముందు వెళ్ళడని నమ్మకమూ లేదు. నా చరిత్ర లోని లోపాన్ని సానుభూతితో అర్ధం చేసుకోవటం కంటే, దాన్ని ఒకటికి పదింతలు చేయటం ద్వారా వారి పరువు మరి కాస్త పెరుగుతుంది కదా!"
సాధారణంగా ఎవరైనా, తమ బలహీనతలు దాచి పెట్టుకుని గొప్పలు చెప్పుకోవటానికి ప్రయత్నిస్తారు. చాలా కొద్ది మంది ,మాత్రమే , నిర్భయంగా తమ బలహీనాతలు కూడా చెప్పుకోగలుగుతారు. ఆమె కధ విన్న నాకు ఆమె పట్ల అసహ్యం కలుగలేదు. తన కగౌరవ కారణాలైన విషయాలను నిష్కపటంగా ఉన్నవి ఉన్నట్లు అంతమంది లో చెప్పగలిగిన ఆమె పై నాకు గౌరవమే కలిగింది.
మీరానాడు నలుగురిలో నిలబడి "నా కధ తిరిగొచ్చింది" అన్నప్పుడు నాకు సుచరితే గుర్తు కొచ్చింది. మీపట్ల నాకు ప్రత్యేకాభిమానం కలగటానికి అదీ ఒక కారణమేమో?"
",మిమ్మల్ని అవమానపరిచే వాళ్ళ మధ్యకు మీ రెందుకొచ్చారు/ మిమ్మల్ని ఆహ్వానించిన వాళ్ళకు మిమ్మల్ని మర్యాద చెయ్యటం తెలియదా?"
"సంఘంలో నాకు సరయిన స్థానం లేదని తెలుసు కానీ, ఇంత అవమానింపబడతానని అనుకోలేదు."
"పార్టీకి పిలిచి ఇంత అవమానం చెయ్యటం మనోరంజని గారికి తగదు." కోపంగా అన్నాను.
ఆమె దిగులుగా నవ్వింది.
"నన్ను పిలిచింది మనోరంజని కాదు. తార!"
"తార తో మీకెలా పరిచయం?"
"తార నేను పనిచేస్తున్న కాన్వెంట్ లో పోయిన సంవత్సరం మెట్రిక్ చదివింది. పోయిన సంవత్సరమే, నేనూ పనిలో చేరాను."
"మీరు కాన్వెంట్ లో పని చేస్తున్నారా?"
"అవును. మా అమ్మ నా చిన్నప్పుడే పోయింది. నేను మా అమ్మమ్మ దగ్గర పెరిగాను. మా ఇంటి ప్రక్కన ఒక క్రిష్టియన్ టీచర్ ఉండేది. నాకు జ్ఞానం వచ్చిన దగ్గర నుండీ నా కావిడ దగ్గిర చనువయింది. ఆమె నన్ను తనతో పాఠశాల కు తీసికెళ్ళేది. ఆవిడ ధర్మాన అని నాకు చదువులో ఆసక్తి కలిగింది. నన్ను కళ్ళల్లో పెట్టుకొని చూస్తున్న మా అమ్మమ్మ నేను చదువుకోడానికి అభ్యంతరం చెప్పలేదు. నేను హైస్కూల్లో చదువు తుండగానే మా నాన్నకు ఉరిశిక్ష పడింది. అందరూ, నన్ను పురుగును చూసినట్లు చూసేవారు. పాఠశాలలో ఏ దొంగతనం జరిగినా, నామీదకు నెట్టడానికి ప్రయత్నించేవారు. కానీ, ఆ టీచర్ నాకండగా నిలబడి, నన్ను శ్రీమహవిష్ణువు ప్రహ్లాదుడిని కాపాడినట్లు కాపాడేది. ఆవిడ ప్రోత్సాహం వల్ల, అండదండల వల్ల , నేను బి.ఏ.బి ఐ.ఇడి కాగలిగాను. ఆ టీచర్ నాకు కాన్వెంటు లో ఉద్యోగం రావటానికి కూడా సహాయపడింది. హైస్కూల్ వదిలినా, తార నన్ను మరిచిపోలేదు. నన్ను అభిమానించే వాళ్ళలో ఆ టీచర్ తర్వాత, తారనే చెప్పుకోవాలి. నా చరిత్ర తెలిసి, నన్ను అసహ్యించుకోవటానికి బదులు, "ఏమి దీక్ష మీది టీచర్! ఎంతటి ఎదురు దెబ్బలకైనా సహించి, మీ ధ్యేయం సాధించారు. నా కేప్పటి కైనా మీరే మార్గదర్శకులు!' అనేది. ఈనాడు తార బలవంతం మీద ఆమె మాట కాదనలేకనే ఇక్కడకు వచ్చాను. దురదృష్టవశాన తారకు ఒంట్లో బాగుండక ఇక్కడకు రాలేకపోయింది. లేకుంటే నేను మరీ ఇంతటి అవమానాన్ని ఎదుర్కొనవలసి వచ్చేది కాదేమో?"
సుచరిత కళ్ళల్లో నీళ్ళు నిండుకొన్నాయి. నా హృదయం ద్రవించింది.
సుచరిత తొందరగా చేతి రుమాలుతో కళ్ళు తుడుచుకొని నవ్వేసింది.
"నా సంగతి తెలిసీ, నాతొ స్నేహంగా మాట్లాడేవారు చాలా తక్కువ. మీరు కాస్త సానుభూతితో మాట్లాడగానే , ఏదో వాగేశాను. విసిగించినట్లున్నాను . క్షమించండి!"
"లేదు! లేదు! మీతో పరిచయమయి కొన్ని నిముషాలే అయినా, మీ మాట లెన్ని యుగాలయినా హాయిగా వినగలననిపిస్తుంది. తార లాగా నేను మీ దీక్షను ప్రశంసిస్తూన్నాను."
ఆమె వినయంగా నవ్వి తల వంచుకోంది.
సుందర్రావు , మనోరంజని , ఇంకా అక్కడివారు చాలామంది, నన్ను రమ్మని పదేపదే పిలువసాగారు.
"నేను రాన"ని చెప్పలేక విసుగొచ్చింది. అవమానంతో కృంగిపోతూ , సుచరిత "మీరు వెళ్ళండి! నా కారణంగా మీరూ వాళ్ళతో కలవకపోవడం బాగుండదు!' అంది.
"నాకు బాగానే ఉంది. ఇంకొకళ్ళ కు బాగుండక పొతే , లక్ష్య పెట్టవలసిన అవసరం నాకు లేదు." మొండిగా అన్నాను.
"అయితే, నేనే వెడతాను" సుచరిత లేచింది. నేను కంగారు పడుతూ "లేవకండి. నా కారణంగా మీరు వెళ్ళిపోతే , నేను చాలా కష్ట పెట్టుకుంటాను." అన్నాను.
సుచరిత కళ్ళతో కృతజ్ఞతలు కుమ్మరించింది.
"మీ కారణంగా వెళ్ళటం లేదు. మీ కారణంగానే ఇంతవరకూ కూర్చున్నాను. మీరు రావడానికి అయిదు నిమిషాలకు ముందే నేను వచ్చాను. వచ్చిన మరుక్షణం లోనే , వీరి మధ్య నా స్థానం అర్ధమయింది. వెళ్ళిపోదామనుకుంటుండగానే, నా పాలిటి భాగ్య దేవత లాగ మీరు వచ్చారు. నాకు సెలవియ్యండి. ఆలస్యమయితే , మా సిస్టర్స్ వూరుకోరు!"
ఇంక నేనామెను ఆటంక పరచలేకపోయాను. సాహసించి అడిగాను.
"మళ్ళీ, ఎప్పుడు కనుపిస్తారు?"
ఆమె తెల్లబోయింది.
"ఎందుకూ?"
"మీతో మరోసారి సావకాశంగా మాట్లాడుదామనుకొంటున్నాను. నా కోరిక అనుచితమైనది కాకపొతే మన్నించండి."
ఆమె ముఖం గంభీరంగా మారిపోయింది.
"నేను 'నన్స్' లో చేరిపోదామనుకొంటున్నాను డాక్టర్ గారూ? నాకా మార్గమే శరణ్య మనిపిస్తుంది. ఆ కారణం చేత మీతో మాట్లాడే అవకాశం నాకు లభించక పోవచ్చు. మీదయకు నా ధన్యవాదాలు."
స్థంభించిన నేను ఏ సమాధానమూ ఈయక మునుపే ఆమె వెళ్ళిపోయింది.
* * * *
సుచరిత పనిచేస్తున్న కాన్వెంట్ కనుక్కోవడానికి నేను పెద్ద శ్రమ పడవలసిన అవసరం లేకపోయింది. చాలసార్లు పని కట్టుకొని పాఠశాల ప్రారంభమయ్యే సమయంలోనూ, పాఠశాల వదిలేసే సమయంలోనూ కాన్వెంట్ మీదుగా వెళ్ళేవాడిని. కానీ, ఒక్కసారి కూడా నాకు సుచరిత కన్పించలేదు. రానురాను నాకామే ధ్యాస అధికమయింది. ఏపని చేస్తున్నా, ఆమె సుందర స్వరూపం నా మనస్సులోనే మెదుల్తూనే ఉండేది. అయినా తొందర పడక స్తిమితంగా చాలా రోజులు అలోచించుకొన్న మీదటనే , ఆమెను పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకొన్నాను. ఆమె నన్స్ లో చేరిపోతానానటం గుర్తుకొచ్చింది. ఎలాగైనా, ఆమె నొక్కసారి కలుసుకొని మాట్లాడితే బాగుండు ననిపించింది.
అక్కడి మదర్ కు రెండు వందలు పాఠశాలకు విరాళంగా యిచ్చేసరికి ఆవిడకు నేనంటే ఎంతో గౌరవం కలిగింది. కాన్వెంట్ లో సిస్టర్స్ డబ్బు బాగా వసూలు చేసేమాట నిజమే, కాని వాళ్ళలో స్వార్ధం తక్కువ. వసూలు చేసిన డబ్బును, పాఠశాలోద్దరణకే వినియోగిస్తారు.
మదర్ తో సుచరిత నాకు బాగా తెలుసుననీ, నా చెల్లెలు పుట్టినరోజు కామే నాహ్వానించటానికి వచ్చాననీ చెప్పాను. మదర్ కు కూడా ఒక ఆహ్వాన పత్రిక నిచ్చాను. మదర్ పిలిపించగా సుచరిత మా దగ్గిర కొచ్చింది. నన్ను చూసి, పరిచయ సూచకంగా నవ్వి నమస్కారం చేసింది. నేను వచ్చిన పని చెప్పాను.
"నన్ను క్షమించండి, డాక్టరు గారూ! నాకిలాంటి పార్టీలంటే , ఇష్టం లేదు. నేను రాలేను."
మృదువుగానే చెప్పింది సుచరిత.
హతశుడి నయ్యాను.
"మీరు రాకపోతే , మా చెల్లెలు చాలా కష్ట పెట్టుకొంటుంది. అసలు పార్టీయే చేసికోదు" అన్నాను జాలిగా.
"అదేమిటీ? ఆవిడకు నన్నెలా తెలుసు?"
"నేను చెప్తే తెలిసింది. మిమ్మల్ని చూడాలని ఆశ పడ్తుంది."

"పోనీ వెళ్ళు సుచరితా! అంతటి మర్యాదస్తులు రమ్మని అర్దిస్తుంటే, మోటుగా తిరస్కరించటం బాగుండదు." మదర్ కల్పించుకొని అంది.
సుచరిత అయిష్టంగానే అంగీకరించింది.
మదర్ కు హృదయపూర్వకమైన కృతజ్ఞత లర్పించుకొని, హుషారుగా బయటకు వచ్చాను. సాయంత్రం సుచరితను మా ఇంటికి తీసుకు రావటానికి నేనే స్వయంగా వెళ్ళాను. అందుకు సుచరిత నొచ్చుకుంటూ "నేను రిక్షాలో వచ్చేదాన్ని కదా? నాకోసం పార్టీలో , మిగిలినవాళ్ళ నందరినీ వదిలి ఎందుకు వచ్చారు?' అంది.
నేను సమాధానం చెప్పక చిరునవ్వుతో, నా కారు వెనక తలుపు తెరిచాను. కొద్ది క్షణాలు తటపటాయించిన తరువాత కాని, సుచరిత , కారు లోపల అడుగు పెట్టలేదు. మా ఇంటి దగ్గర కారు దిగిన సుచరిత, ఆశ్చర్యంతో "ఇదేమిటీ? ఎవ్వరూ లేరేం?' అంది.
నేను నవ్వుతూ "నేను పిలవలేదు" అన్నాను.
"ఎందుకింత మోసం?"
సుచరిత కోపంగా వెనక్కు తిరగబోతూ అంది. "ఇందులో మోసం ఏం లేదు. మీరు శాంతంగా లోపలకు రండి. మీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఆ మాత్రం నన్ను నమ్మలేరా?"
కొద్ది క్షనాలాలోచించిన తర్వాత సుచరిత లోపలకు వచ్చింది.
"మీ చేల్లెలేదీ?"
"నా కసలు చెల్లెళ్ళు లేరు. అక్కయ్య ఉంది. వాళ్ళ అత్తవారింట్లో ఉంది."
"అయితే, అన్నీ అబద్దాలేనా?"
"అవును. మీతో కొంచెం సేపు మాట్లాడాలంటే నాకింత కంటే మంచి మార్గం కనుపించలేదు."
"ఏం మాట్లాడుతారు?"
నా గొంతు వణికింది. ఎన్నెన్నో మాట్లాడాలను కొన్న నా గొంతు లోంచి మాటలు పైకి రాలేదు.
"మీరు నన్స్ లో చేరుతానన్నది నిజమేనా?"
