Previous Page Next Page 
అపశ్రుతులు పేజి 16

 


    చాలా కాలం తర్వాత పుట్టింటికొచ్చింది కామేశ్వరి. 'అబ్బా కళ్ళు కాయలు కాసేయే అమ్మా! నాన్నా తమ్ముడూ శాంతా అందరం అనుకుమ్తున్నాం. ఇన్నాళ్ళెప్పుడూ నువ్వు మమ్మల్ని చూడకుండా ఉండలేదని. అంటూ కాళ్ళు కడుక్కోమని నీళ్ళిచ్చింది జానకమ్మ.
    అమ్మాయ్ అంతా కులాసా? మీ మామగారెలా ఉన్నారు? ప్రశ్నించాడు రంగనాధం.
    ఆ.... పెద్ధవారయ్యేరు. మనవడు దూరంగా వెళ్ళిపోయాడని ఓ బెంగా, అంటూ నవ్వింది కామేశ్వరి.
    రండి వదినా కాఫీ తీసుకోండి. మేం ఏం తప్పు చేశాం. ఇన్నాళ్ళు అలిగినట్టు రావడం మానేశారు? హాస్యంగా అని ఆమె పెట్టేబెడ్డింగూ గదిలో సర్దింది శాంతి.
    మౌనంగా నిల్చున్న రాధవైపు చూసి అన్నయ్య ఉత్తరం వ్రాసేడు ఈ అమ్మాయా అంది రాధవైపు తేరిపార చూస్తూ కామేశ్వరి.
    "అవును, మా అభిమాన పుత్రిక మీకు మేనగోడలౌతుంది' అంది అప్పటికే రాధపై ఒక సద్భావం. అభిమానం ఏర్పడ్డ శాంత.
    కామేశ్వరి వైపు చూస్తూ మౌనంగా నమస్కరించింది రాధ.
    ఏం చదివావమ్మా? పలకరింపుగా ప్రశ్నించింది కామేశ్వరి.
    స్కూలు ఫైనలు ప్యాసయ్యానండీ వినయంగా చెప్పింది రాధ.
    పొలం నుంచి వస్తూనే, "అక్కయ్యా ఇన్నాళ్ళకి రావాలన్పించిందా? ఎన్ని ఉత్తరాలు వ్రాశాను?....నీకు అందమైన కోడల్ని తెచ్చానని చూపించాలనే ఆరాటంతో రమ్మని అర్ధిస్తూ మీ ఆయనకి ఎన్ని ఉత్తరాలు వ్రాశాను?" అన్నాడు శ్రీనివాసరావు.
    మొహం చిట్లించింది రాదని కోడలనగానే కామేశ్వారి. మళ్ళీ బాగుండదన్నట్టు నవ్వేస్తూ "ఎలా రానురా మామగారు మంచాన పడ్డారు. ఇదివరకైతే దగ్గరలో ఉన్నాం కనుక వచ్చే దాన్ని మీ బావ ప్రమోషను ధర్మమా అంటూ దూరంగా వెళ్ళిపోయాం, మీ ఇంటికి రావాలంటే బోలెడు చార్జీలు."
    "నువ్వొస్తే చార్జీలు నేను ఇవ్వకపోయావా? రామకృష్ణ ఎప్పుడు వస్తాడు? ఈ మధ్య వాడి దగ్గర నుంచి ఉత్తరాలే మైనా వచ్చాయా?"
    "రామకృష్ణ అన్న పేరు విన్న రాధ త్రుళ్ళిపడింది. ఏ రామకృష్ణ? ఎక్కడ ఉన్నాడు. అన్న సందేహాలొచ్చాయ్.
    "ఇంకో సంవత్సరం ఉండాలట. వాడొస్తాడేమో అనే ఇన్నాళ్ళూ, ఎదురు చూశాను. బావకెలానూ సెలవు దొరకదంటారు. వాడూ నేను కలిసివద్దామని."
    నాలుగు నెలలక్రితం కాబోలు నాకో ఉత్తరం వ్రాశాడు నీ కివ్వాలని. నిన్ను అల్లుడ్ని చేసుకోవాలనీ అందమైన అమ్మాయిని పెంచుకున్నా నని వ్రాశాను. మరి వాడి దగ్గరనుంచి ఉత్తరం లేదు.
    "చూద్దాం లెద్దూ ఆ చదువూ, సంధ్యా అవనీ వాడెవర్ని పెళ్ళి చేసుకుంటాడో." ఆ స్మభాషణ ఇష్టంగా లేనట్లు ఆమె ముఖకవళికలు స్పష్టంచేశాయ్.
    ఆ ఇంట్లో, ఆడపిల్ల కుండే స్వాతంత్ర్యం, అభిమానం, రాధ పొందుతూందని తెలుసుకున్న కామేశ్వరికి అసూయరేగింది. "ఇదెక్కడి పిల్ల. దాచిపెట్టినట్టు తింటూంది. పిన్నీ, బాబయ్యా బామ్మ తాతా ఇదెక్కడి బంధుత్వం! వీళ్ళందరూ మత్తుచల్లినట్లు మంత్రం వేసినట్టూ రాధ రాధా అంటూ మురిసిపోతున్నారేమిటి? ప్రతి పని దానిచేతే చేయించుకుంటాడు శ్రీను. "అమ్మా తువ్వాలూ, సబ్బూ తేమ్మా. మొదలు "కాస్త వాకిట్లో మంచం పడెయ్యి" అనేవరకూ, వాడి కెందుకో అంత ఇష్టం ఆ పిల్లంటే, అమ్మా రాధా, అంటూ నోరారకుండా ఒకటే పిలుపు! ఉదయం లేచింది మొదలు! బంగారు గొలుసూ ఖరీదైన చీరలూ, దీనిబాబు సొమ్ములా, ఇల్లు జొరబడి తింటూంది! కాస్త నాన్నే అంటీముట్టనట్టు ఉంటారు కాని రాత్రి అమ్మా పగలు శాంతా పసిదాన్ని పక్కలో వేసుకున్నట్టు దాన్ని పక్కన పడుకోబెట్టుకుంటున్నారు.....నేనంటే మునుపుండే గౌరవం అభిమానం వీళ్ళకి లేవు" అనుకుని తనలో తాను ఉడికిపోయే కామేశ్వరి ఓ రోజు విసుగ్గా అంది తల్లిని మందలిస్తూ. "దేవుడూ దెయ్యం పూజా పురాణం అంటావు. ఏ కులం దాన్ని పక్కలో వేసుకుంటావ్. వంట అది ముట్టుకున్నా ఊరుకుంటావు ఛీ ఛీ ఇదెక్కడి శరమ్మా" అంది.

 

                                    
    "అయ్యో......అదటే అనుకుంటున్నావు! బాగుంది, మన కులం పిల్లే శ్రీనుతో చదివేవాడట సుబ్బారావని, పాపం అతని కూతురట అంటూ కొడుకూ, రాధా చెప్పిన, తాను విన్న కథ ఏకరువుపెట్టింది జానకమ్మ.
    అంతా విన్న కామేశ్వరి. "సర్లే ఇదివరకెలా బ్రతికితేనేం ఇప్పుడు దీనిపని బాగుంది. ఎక్కడో సిరిపెట్టుకు పుట్టింది. మీ ముచ్చటా, దాని అదమూ రెండూ తీరుతున్నాయ్." అంటూ విససా విసా అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
    రాధ ఒక్కర్తే ఉన్నప్పుడు నెమ్మదిగా "చదివావ్ కాబోలు ఏదన్నా ఉద్యోగం చేసి బ్రతకరాదూ." అని అడిగింది కామేశ్వరి.
    "బాబయ్య ఒప్పడం లేదు." కాస్త ఆమె ఆ అడిగిన తీరుకే తెల్లబోయి కొంచెం నొచ్సుకుంటూ జవాబు చెప్పింది రాధ.
    "ఒకరింట్లో ఇలా సంవత్సరాల తరబడి తినడం నీకు సిగ్గెయ్యడం లేదూ." మళ్ళీ ప్రశ్న.
    ఆమె అసూయా, దురుసుతనం, అసహ్యించుకున్న రాధ తగినట్టూ జవాబు చెప్పాలనుకుంది."నన్నెప్పుడు మీ తమ్ముడు మృత్యువాత బడకుండా, నా జీవితాని కభయ మిచ్చి, నా ప్రాణం నిలబెట్ట దలిచారో, అప్పుడే మీ తర్వాత ఈ ఇంటి ఆడబిడ్డ నయ్యాను. కనలేదుకాని దత్తపుత్రిక లాటిదాన్ని వారికి. ఆడబిడ్డకు పుట్టింటి సొమ్ము తినడాన్కి సిగ్గెందుకు?" నవ్వుతూ ఎదురుప్రశ్న వేసింది.
    "ఎన్ని మాటలు నేర్చిన జాణవు కాకుంటే ఇంటందర్నీ ఇలా వశం చేసుకుంటావు. తిను ఏ నాడో ఋణమున్నారు. నీకు పెడుతున్నారు. నాకేం వీళ్ళ పెట్టిపోతలు అవసరం లేదు. నువ్వో నేనో ఎవరిమో ఒక్కరే ఈ ఇంటికి ఆడపిల్లగా ఉండాలి" అంటూ ఉక్రోషంగా రాధవైపు చూసి వెళ్ళిపోయింది కామేశ్వరి.
    మర్నాడే ప్రయాణమైన కామేశ్వరి. "ఇంకో నాలుగురోజులుంటానన్నావు. ఏమిటక్కయ్యా అప్పుడే ప్రయాణమయ్యావ్," మామూలు అభిమానంతోనే ప్రశ్నించాడు శ్రీనివాసరావు.
    "ఎందుకు నాయనా తిండీ బట్టాలేక మీ ఇంటికి రాలేదు నేను. మీ ఇంటికొచ్చి యాచించే బిచ్చకత్తెను చూచినట్టు చూశారే. చాలు దిక్కూ దివాణం లేని గతిమాలిన దానికిచ్చే ఆదరం గౌరవం నాకు లేవీ ఇంట్లో?" అంతా  ఈర్ష్యా అసూయా. పెల్లుబికి కన్నీల్లుగా ప్రవహించాయామెకి.
    అలా ఆమె ఏవో పెద్ద కష్టంలో ఉన్నట్లు ఏడ్చేస్తూంటే నిర్ఘాంతపోయి అర్ధంకానట్టు ఆమె వైపు అయోమయంగా చూస్తూ, నిన్నెవరేమన్నా రక్కయ్యా అమ్మా, నాన్నా, ఏమన్నా అన్నా, మనం నిష్టూరమాడముగా శాంత అమర్యాదగా మాట్లాడే మనిషి కాదు. చెప్పు శాంత ఏమన్నా నిన్ను చిన్నచూపు చూసిందా?" అడిగాడు శ్రీనివాసరావు.
    "ఎవరూ ఏమీ అనలేదు. ఎందుకులే నాకు బుద్ధి వచ్చింది. అనకపోతే ఏం? ఒకరన్నప్పుడు విని నవ్వితే ఆ మాట సమర్ధించనట్టేకాదో. ఎవర్తో అతీ గతీ లేనిదానిచేత....దిక్కుమాలిన....-"
    "అక్కయ్యా.....మరీచిన్నపిల్లలా...." అరిచి పెదవులు బిగబట్టాడు శ్రీనివాసరావు.
    "ఒరేయ్ నీ చేత కూడా ఎప్పుడూ పుట్టి బుద్దెరిగిన నన్ను పల్లెత్తి మాట అన్ని నువ్వు. అలా నా మీద కోపగించుకున్నా వంటే. ఇల్లు చేరి....అందర్నీ వశంచేసుకు ఆడించే ఆ రాక్షసి కదరా కారణం?"
    "మాట్లాడకు ఉండు" అని మళ్ళీ అరిచినట్టు అని శాంతా....." అని పిల్చాడు శ్రీనివాసరావు.
    సమీపంలోనే నిల్చున్న శాంత భయ భయంగా అక్కడికొచ్చింది.
    "రాధ ఏమిటంది ఈవిడని. నువ్వు విని నవ్వావట. ఉన్నదున్నట్టూ నిజం చెప్పు" గర్జించాడు.
    "ఎప్పుడు వదినా? మిమ్మల్నేమీ రాధ తప్పుగా అనడం నేను వినలేదే!" అంది కామేశ్వరివైపు చూస్తూ శాంత.
    "నిన్న సాయంత్రం అటు పెరటివైపు వస్తూ నవ్వలేదూ?" నిలేసింది కామేశ్వరి.
    మీరూ రాధా జామపిందెలు కొరికి ఉమ్ముతున్నారు. నాకు నవ్వొచ్చింది.
    "ఓ...అందుకే నవ్వొచ్చిందీ? ఎలా మార్చేస్తున్నావ్?"
    "మాట మార్చడాన్కి, అబద్ధాలు చెప్పడాన్కీ నాకేం అవసరంలేదు. మీరు మామ గార్కి కన్నకూతురైతే రాధ మీ తమ్ముడి పెంపుడు కూతురు. ఇద్దరూ ఈ యింటి ఆడ పిల్లలే నాకు మీరిద్దరూ ఒక్కటే.
    "ఇద్దరం ఒక్కలాటి వారమా?" అసహనంగా ఆమెమాట కడ్డం వస్తూ అంది కామేశ్వరి..
    కామేశ్వరి, అసూయా, ద్వేషం పసిగట్టేసిన శ్రీనివాసరావు "కాదక్కయ్యా నువ్వు పెద్ద దానివి. నీకూ రాధ ఆదిరంచతగ్గదేనా. నా కూతురంటే నువ్వు అసహ్యించుకుంటావా?.....పిల్లల కోసం వాచిపోతూన్న నాపై దేవుడు అనుగ్రహించాడు......... రాధ ఎక్కడో ఎలానో అంత మయిపోకుండా నా దగ్గరకొచ్చింది.......రాధ నెవరేమన్నా సహించలేనక్కయ్యా.....నేను ఏమన్నా నోరుజారినా మీరు నన్ను నిష్టూరాలాడినా కలిసొచ్చేదేం లేదు.....వెళ్ళిపోతానంటే......మధ్యాహ్నం భోజనంచేసి వెళ్ళిపో" అంటూ తన గదికెళ్ళి పోయాడు శ్రీనివాసరావు.
    "పోతే పో....అని ఎంత మాటన్నాడూ....." అంటూ ముక్కుచీది మళ్ళీ ఏడ్చింది కామేశ్వరి.
    రంగనాధం జానకమ్మ "వాడి కేదో గ్రహం నటిందమ్మా.....ఊరుకో అంటూ, కామేశ్వరి వోదార్చి రాధవైపు కొరకొరా చూసి శ్రీనివాసరావుని తిట్టుకున్నారు.
    ఎందరు బ్రతిమిలాడినా తన ప్రయాణం మానలేదు కామేశ్వరి "నన్ను క్షమించండత్తయ్యా.....మీరు హాస్యం చేస్తున్నారని అలా జవాబు చెప్పాను" అంటూ తనూ ఏడ్చింది రాధ.
    మౌనంగా పసుపు కుంకుమలతో వందరూపా యలు జతపర్చి ఇచ్చింది శాంత కామేశ్వరికి.         
    ఆరోజు అన్నం తినాలనిపించలేదు రాధకు. కాని అందరూ ఏమేమో అంటారని కంచం ముందు కూర్చుంది.
    'అస్సలు తానేమంది. నువ్వేం జవాబు చెప్పావ్?" అని శ్రీనివాసరావు అడిగేడు రాధను.
    భయం భయంగా అతనివైపు చూస్తూ, తనకూ, కామేశ్వరికి జరిగిన సంభాషణ చెప్పి భోరున ఏడ్చేసింది రాధ.
    "ఛ. ఛ...ఊరుకో నీ తప్పేం లేదు. వెళితే వెళ్ళనీ ఊరుకోమ్మా!" ఆమె తల మృదువుగా నిమిరి. లాలనగా అన్నాడు శ్రీనివాసరావు. కేవలం జాలీ సానుభూతి మాత్రమే కాక వాటి చాటున ద్యోతకమయ్యే అతని ప్రేమకు. అనురాగాన్కీ అర్ధం తెలియక కలవరపడేది రాధ.
    "నాతో పొలానికి రామ్మా!" పిల్చాడు శ్రీనివాసరావు.
    "ఎవరు బాపయ్యా!" తెల్లబోయి ప్రశ్నించింది రాధ.
    "నువ్వే! రా నాతో.....పొలంలో హాయిగా కూర్చుందుగాని అక్కర్లేని మాటలూ అవీ ఇంట్లో ఉంటే అన్నాడతను.
    "వెళ్ళనా పిన్నీ భయం భయంగా అడిగింది రాధ.
    వారిపై పూర్తి విశ్వాసమున్న శాంత. "వెళ్ళమ్మా ఇద్దరికీ భోజనం పంపిస్తాను సాయంత్రం బాబయ్యతోనే ఇంటికి రా" అంది.
    ఆ మాటవిన్న శ్రీనివాసరావు తృప్తిగా నిట్టూర్చాడు.
    ప్రతిరోజూ శ్రీనివాసరావు వెనుక పొలాన్కి వెళ్తూంది రాధ అతనికి ఓ రకంగా సాయం చేస్తూంది. కూలీలు సరిగా కలుపు మొక్కలు తీస్తున్నారా? గొప్పలు, ఉడుపులూ, అన్నీ పొలాన్కి సంబంధించిన అన్ని పనులూ, "బాబయ్యా మీరుండండి. ఎండగా ఉంది నే వెళ్ళి చూస్తాను అంటూ, ఒక్కోసారి ఆడకూలీలతో తానూ సర్దాగామాట్లాడి నవ్విస్తూ వారి పనిలో తానూ పాల్గొంటూ తిరిగే రాధను చూసి మురిసి పోయేవాడు శ్రీనివాసరావు.
    రాధ, శ్రీనివాసరావు, ఇద్దరికీవున్న అనుబంధం నిర్మలమైనదని వెల్లడవడానికి ఎన్నో రోజులు పట్టలేదు.
    "నోకావి శేటి పెవులేకాని కళ్ళులేవు. ఎంత మందిదా బొట్టి. పిల్లల్నేరు. పెంచుకున్నారు. బాబయ్యా అని పిలిపించుకొంటండు. మావుసూత్తన్నంగదా తప్పు పాపం. అంటూ ఇది వరకు అనుకున్న మాటలకు పశ్చాత్తాపంగా నొచ్చుకుంటున్నారా పల్లెజనం.
    ఒకటీ అరా ఇలాటి మాటలు విన్న శ్రీనివాసరావు తేలిగ్గా నిట్టూర్చాడు.
    ప్రతి సంవత్సరం కన్నా ఆ సంవత్సరం వంట ఎక్కువగా పండింది. నూర్సుల వుతున్నాయ్. రైతు పిల్లలాగే పొలానికి ఇంటికీ తిరిగి పనిచేస్తూంది రాధ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS