Previous Page Next Page 
అపశ్రుతులు పేజి 15

 

    బస్ దిగి కొంతదూరం నడిచి ఓ లాడ్జి దగ్గర నిల్చుని గది తీసుకోబోతున్న శ్రీనివాసరావు వైపు భయంగా చూస్తూ బాబయ్య గారూ! అంది రాధ.
    నాన్నగారూ! అని పిలువమ్మా ఏం? అన్నాడతను ఆర్ధమైన కంఠంతో తానేదో అతణ్ణి పొరపాటుగా ఊహించి భయం వ్యక్తం చేసి నందుకు సిగ్గుపడ్తూ.....గదెందుకు మళ్ళీ వెంటనే వెళ్ళిపోయే దాన్కి? అంది.
    "కొంచెంసేపు తల దాచుకోడాన్కి నాతో పాటు రోడ్లంట నిన్ను తిప్పమన్నావా? అతనున్నారో లేదో కనుక్కుని వస్తాను అంతదాకా ఇక్కడ ఉంటావు" అంటూనే ఆ లాడ్జి సర్వెంటు వెనుక నడిచాడు శ్రీనివాసరావు. అతన్ని అనుసరించింది రాధ.
    ఆమె నా గదిలో జాగ్రత్తగా ఉండమని బయటికి వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు.
    కొన్ని క్షణాల తర్వాత రాధకు కాఫీ టిఫినూ తెచ్చి ఇచ్చాడు లాడ్జి సర్వెంటు అతను పంపించారంటూ.
    గతం వర్తమానం తన వారన్నవారెవరూ లేకుండా గడచిపోతూన్న తన అభాగ్య జీవితానికి చింతిస్తూ కూర్చుంది రాధ.
    అరగంట తర్వాత తిరిగి వచ్చిన శ్రీనివాస రావు అలసటగా కుర్చీలో చతికిలబడుతూ ఆయన లేరు హైదరాబాదు వెళ్లారట" అన్నాడు.
    "అయితే వెళ్ళిపోదామా" అంది రాధ మంచంమీంచి లేచి నిల్చుంటూ- "వెళ్ళిపోదాం గంటన్నార టైముంది మన ఊరు వెళ్ళే బస్ కి." అని వాచ్ చూసి....."మీ అమ్మ.....అదే రమ చివరి క్షణాల్లో శ్రీధర్ కి ఏమిటి చెప్పింది? అక్కడేమో చెప్పెయ్యబోయి మళ్ళీ కథ తమాషాగా మళ్ళించేశావు." అన్నాడు శ్రీనివాసరావు విషాదంగా నవ్వుతూ.
    అతను తన తల్లిని "రమ" అని సంబోధించడంతో కొంచెం తెల్లబోయి అమ్మ పూర్తిపేరు రమాదేవి అని మరచిపోయి ఉంటారు. ఒకసారేగా తను చెప్పింది అని సరిపెట్టుకుని, "మీ వాళ్ళంతా చాలా మంచివాళ్ళు. వాళ్ళ దగ్గర నన్ను తల్లి తండ్రులు ఫలానా వారని చెప్తే వచ్చే ప్రమాదమేమిటో నాకు అర్ధం కావటం లేదు" అంది రాధ సంకోచంగా అతనివైపు చూస్తూ.
    "చంపెశావ్ ఇంకేమన్నా ఉందా? మా నాన్న గొప్ప చాదస్తుడు తెల్సా? నానా గొడవా పెట్టేస్తారు" అంటూ నవ్వి "చెప్పు మీ అమ్మ శ్రీధర్ కి ఏమని చెప్పింది నిన్నెలా అప్పగించింది!"        
    అతను తల్లిని ఏకవచన ప్రయోగం చేస్తూంటే కొంచెం ఆశ్చర్యపోయి కొందరికలా అలవాటు అనుకుంటూ "సరే చెప్తాను. నా కథ ఆసక్తిగా వినేవారు మీరే కన్పిస్తున్నారు" అంటూ తల వాల్చింది రాధ. క్షణంలో ఆమె వదనం విషాదంగా మారిపోయింది. "నాకేం తెల్సు నేనప్పటికి పసి దాన్నిగా! శ్రీధర్ మామయ్య అమ్మ గురించి ఆమె జీవితం. ఆమె ప్రాణం పోయే టప్పుడు ఉచ్చరించిన మాటలు ఒక కథలా మలచి వ్రాశాడు. ఉన్నదున్నట్లు నేను పార్వతి కక్క గారింటి కెళ్ళేటప్పుడు దుర్గత్తయ్య ఆ పుస్తకం నాకే ఇచ్చింది. అమ్మ సామానులతోపాటు".
    "డబ్బేమీ మీ అమ్మ తాలూకుది లేదా!" అప్రయత్నంగా ప్రశ్నించాడు శ్రీనివాసరావు.
    "మూడు నాలుగు వేలుండేది కాబోలు బ్యాంకిలో శ్రీనివాసయ్యరు పోయిన తరువాత. అదీ మోసమే. డబ్బు అర్జంటుగా అవసరమని ఏవేవో కాయితాలపై సంతకంచేయించుకున్నాడు విశ్వనాధన్ "మా అమ్మ తలపగిలి చాలా రక్తం పోయి నీరసంగా విస్త్రాణగా ఉందట స్పృహ వచ్చాక కూడా." అని రెండు క్షణాలు మౌనంగా ఉండిపోయి అమ్మ అంతిమక్షణాలు ఇలావ్రాసుకున్నాడు శ్రీధర్ మామయ్యా అని బరువుగా ఊపిరి కదిలి చెప్తూంది రాధ.
    రమ ప్రియమైన, దైవమిచ్చిన సోదరి. జీవితంలో ఎదురు దెబ్బలకు తలవంచక. ధైర్యంగా ఏటికి ఎదురీదిన రమ తలపగిలి మృత్యువు ఒడిలో ఒరిగిపోతూంది.
    తడబడే కళ్ళతో వార్డులో అడుగుపెట్టాను. వెలుగునిండే ఆ కళ్ళతో నావైపు చూసింది. గబగబా ఆమె మంచం దగ్గరగా వెళ్ళాను. శ్రీధర్ ఆయనకు మీ బావగార్కి, శ్రీనివాసరావుగార్కి వైరు చెయ్యవూ రమ్మని.... చెప్పాను డాక్టరు మరచేడట ఆయన అడ్రసు...... నాకు ఆయన్ని చూడాలని ఉంది శ్రీధర్. ఇవ్వాళే కాదు చాలా రోజులై ఆ కోరిక నా గుండెల్ల్లో ప్రజ్వరిల్లుతూంది.... కాని జీవితంలో ఎప్పుడో ఒకరోజు ఆయన వడిలో తలపెట్టి బోరున యేడవాలనుకున్నాను. ఆయన పెళ్ళి చేసుకుంటే నాకేం? ఆయన్ని విసిగించాను. ఆయనకి కొన్ని కోరిక లున్నాయ్ తీర్చుకోవడాన్కి పెళ్ళి చేసుకున్నారు. మాట్లాడలేదు. ఆయాసమొస్తూంది. ఆయన హృదయంపై తల ఉంచి హాయిగా నిద్రపోవాలనుంది. పోయేముందు సిగ్గేమిటి?..... ఎంతగా పోట్లాడుకున్నా. ఆయన ప్రక్కన చేరి హాయిగా నిద్రపోయేదాన్ని" అని చెప్పి టక్కున నాలక కరచుకుని తల వంచేసింది రధ.
    కళాహీనమై. చెమ్మగిలిన కళ్ళతో ఉన్న శ్రీనివాసరావు వదనం ఆమె చూడలేదు. క్షణం నిశ్శబ్దం తర్వాత. నాతో చెప్పడాన్కి సిగ్గుపడ కమ్మా. తండ్రి లాటి వాణ్ణి ఇంకేమిటి వ్రాశాడో గుర్తున్నదంతా చెప్పు.
    "-ఒక్కసారి నువ్వెళ్ళన్నాసరే మీ బావ గార్ని తీసుకురా అతన్ని ఐదేళ్ళయి వదిలేసి ఇప్పుడేడుస్తున్నానని నవ్వకు శ్రీధర్. ఆయన్ని మరచి క్షణం బ్రతకలేదేమో అన్పిస్తూంది ప్పుడు. ఆమె ఆయాసపడ్తూ ఏడుస్తూంది. నేను అడ్రస్ చెప్పమని అడుగుతున్నాను. ఆమె ఏమో చెప్పబోయి రాధ. అంది నాచెయ్యి గట్టిగా పట్టుకుంటూ. సిస్టర్ గాలి దుమారంలా వచ్చింది. ఆమెను మాట్లాడించినందుకు నన్ను కసురుతూ నా చెయ్యి పట్టుకున్న రమచెయ్యి చల్లగా అయి వాలిపోయింది నేనూ దుర్గా చాలాసేపు ఏడ్చాం" అని వ్రాశాడు.
    "ఆమె జీవితం గురించి ఏమీ వ్రాశాడు? అని  ప్రశ్నించాడు శ్రీనివాసరావు. కళ్ళూ మొహం తుడుచుకుంటూ.
    "అప్పుడప్పుడు చదివేదాన్ని. కాని సరిగ్గా గుర్తులేదండీ. పది పదిహేను పేజీలు , నా తల్లి తండ్రుల పేర్లూ నా జీవితచరిత్రా మీరే చెప్పాను. పార్వతి కక్కి ఎవ్వరికీ చెప్పకూడదని శాసించింది చివరకు నా ప్రాణమిత్రుడు రామకృష్ణకు కూడా శ్రీనివాసయ్యరు పెంపుడు కూతుర్ననే చెప్పాను అందరికీ అలానే తెల్సు."
    రామకృష్ణంటే? మేనళ్ళుడు ఆ ఊళ్ళోనే చదవటంవల్ల అనుమానంగా ప్రశ్నించాడు శ్రీనివాసరావు.
    "వాసూ రావ్ క్లాస్ మేట్."
    అతని గురించి నీ కేమేనా తెల్సా? తల్లీ తండ్రీ గట్రా."
    "మా వాసూరావుకి తెల్సు"
    "మరి వెళ్ళిపోదాం కాఫీ టిఫినూ బోయ్ తెచ్చాడు కదూ!" అంటూ లేచి నిల్చున్నాడు శ్రీనివాసరావు.
    కాలగమనంలో మనుష్యుల స్వభావాలు మారుతూంటాయి కాబోలు. క్రమంగా రమపై కరడుగట్టిన కసిస్థానంలో కరుణ ఆక్రమించుకుంది. రమ తాలూకు స్మృతుల బరువుతో బస్ స్టాండుకు నడిచాడు శ్రీనివాసరావు.
    మౌనంగా తనకి ఉద్యోగం దొరకలేదన్న దిగులుతో అతన్ని అనుసరించింది రాధ.

                                  *    *    *

    "ఎలక్షన్లలో నిలబడ నన్నావుట ఏవిరా అబ్బాయ్" రంగనాధం ప్రశ్నించాడు. శ్రీనివాసరావుని.
    "ఇంకే సంతోషం భరించే గుండెదిటవు లేదు నాన్నా, ఇప్పుడు మనకున్నది చాలు. రాధనో ఇంటిదాన్ని చేస్తే" జవాబు.
    "పిచ్చి ముదిరినట్టుంది. కులం సాంప్రదాయం అన్నీ వున్న పిల్లలకే పెళ్ళిళ్ళవడం లేదు. దీనికేం చేస్తావు పెళ్ళి!"
    "రాధ మనింటికెప్పుడు వచ్చిందో అప్పుడే నా కూతురు. నా కూతుర్నే చెప్తాను. ఇష్టమైన వాడే చేసుకుంటాడు"
    "బాగుందురోయ్ అబ్బాయ్ వరస."
    "ఇదివరకల్లా బాగులేదుకాని ఇప్పుడు బాగుంది."
    "ఏవిట్రా మొండి జవాబులు? ఏదో పిల్లల కోసం పంపిస్తున్నావని. పువ్వులూ, చీరలూ, ఆఖరికి మొన్న గొలుసు తెచ్చి ఆ పిల్లకిచ్చి నువ్వు మురిసినా వహించాం. కాని పెళ్ళీగిళ్ళీ అనకు నేలబోయేది నెత్తికి రాసుకున్నావు గనుక ఏదోదారి చూపించి వదిలేయ్" అంటూ తీవ్రంగా మందలించారు రంగనాధం.
    నిర్లక్ష్యంగా అలాగే అంటూ నవ్వేశాడు. శ్రీనివాసరావు.
    రాధపై ఎనలేని వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు శ్రీనివాసరావు. అతని దగ్గరా అందరి దగ్గరా చనువుగా తిరుగుతుంది రాధ.
    "అప్పుడప్పుడు తల్లిని తల్చుకు కళ్ళనీళ్ళు పెట్టుకునే శాంతవైపు వింతగా చూసిన రాధ. "బాబయ్యగారూ పిన్ని ఎన్నేళ్ళక్రితమోపోయిన వాళ్ళమ్మకోసం ఇంకా ఎందుకేడుస్తుంది!" పశ్నించింది.
    "ఆమెకు వాళ్ళమ్మను బాగా తెల్సు. అందు కే గుర్తొస్తే దుఃఖమొస్తుంది. నువ్వు అమ్మ కోసం ఎప్పుడన్నా, ఏమన్నా తలుచుకు ఏడవాలంటే ఏమున్నాయ్! శ్రీధర్ మామయ్యా, పార్వతి కక్కీ గుర్తొస్తే ఏడుస్తావ్. అమ్మ గుర్తొస్తే దుఃఖంరాదు కాని. నాన్న గుర్తొస్తే అతన్ని తిట్టిపోస్తావ్ అవునా?" అన్నాడు నవ్వుతూ.
    నవ్వి. "నాకు మా అమ్మా, నాన్నా ఫోటో తెచ్చి ఇస్తానన్నారు. తాతగారన్నట్టు నేనూ మిమ్మల్ని అబద్దాలాడ్తారని అంటాను." అంది గారంగా.
    "తాత దగ్గరయితే అబద్ధమాడాలి కాని, నీ దగ్గరెందుకు బాగా గుర్తు చేశావ్ ఫోటో తెచ్చాను మొన్న వెళ్ళి వచ్చినప్పుడు రా ఇస్తాను అంటూ తన పెట్టెతెరచి. అడుగున భద్రపరచిన చిన్న కార్డుసైజు ఫోటో రాధకిస్తూ ఇదేనా? విశ్వనాధన్ ఏవన్నా మరొకటి ఇచ్చాడా? ఫోటోలో నాకు, మీ అమ్మా నాన్ననా? చూడు.' అన్నాడు శ్రీనివాసరావు.
    సంతోషంగా నవ్వుతూ ఫోటో చేతులోకి తీసుకుని. "అబ్బా ఇ బాబయ్యగారూ," అంటూ ఆ ఫోటో హృదయానికి హత్తుకుంటూ "నా తల్లి తండ్రులెంత అందమైన వారో చూశారా బాబయ్యా." అంది రాధ.
    "నిన్నుచూస్తే నీ తల్లితండ్రులు అందహీనులని ఎవరనుకుంటారు. ఏదీ నావైపు ఒక్క సారి చూడమ్మా. సంతోషంగా ఉన్నప్పుడు నీ కళ్ళల్లో ద్యోతకమయ్యే వెలుగులు నన్నూ నా హృదయాన్నీ కదిలిస్తాయి." అన్నాడు శ్రీనివాసరావు.
    అతని ఆంతర్యంలోని బావమేమిటో ఆ మాటల్లో ఊహించలేని రాధ అర్ధంకానట్టు అతని వైపు చూసింది.
    "అమ్మా.... రాధా.... మా ఇంటికి వచ్చి సంవత్సరం దాటింది. విశ్వనాధన్ నీ సర్టిఫికేట్ ఇవ్వలేదు. నాకు నీ చేత ఉద్యోగం చేయించాలని లేదు నిన్నో ఇంటిదాన్ని చెయ్యాలనుకుంటున్నాను నీ ఉద్దేశ్యం ఆమె వదనంలోకి పరిశీలనగా చూస్తూ అన్నాడు శ్రీనివాసరావు.
    "విశ్వనాధన్ తమ్ముడు రామారావ్. ఫారెన్ నుంచి వచ్చారేమో మీకు తెల్సా బాబయ్యా! టైమయిపోయింది. వచ్చేసి ఉండవచ్చు" అంది రాధ. ఆ మాట విననట్టు.
    "నాకు తెలియదమ్మా ఈ సారి కనుక్కుంటాలే. అతనేం చదివాడూ!"
    "అతనూ రామకృష్ణా ఎమ్.ఏ. ఫస్టు క్లాసులో ప్యాసయి రీసెర్చి చెయ్యడాన్కి స్కాలర్ షిప్ మీదవెళ్ళారు" అంది రాధ.
    "ఏమైనా సంబంధాలు చూస్తానూ?"
    "ఇంకా కొన్నిరోజులు మీ ఇంట్లోనే ఉండాలని ఉంది బాబయ్యా!
    "పెళ్ళిచేసి నిన్ను అత్తవారింటికి పంపిస్తానని నీ ఉద్దేశమా? నా ఇంటికొచ్చే అల్లుడికే నిన్నిస్తాను."
    ఏ పూర్వ అనుబంధమో! మీకు నా మీద ఇంత వాత్సల్యం. ఇప్పుడనిపిస్తూంది. నేను దురదృష్టవంతురాలను కానవి."
    "నీ పట్ల దేవుడున్నాడని నేనేనాడో అనుకున్నాను. పూర్వ అనుబంధమో! ఎన్ని చేసినా, నీ కెంత విశ్వాసమున్నా ఒక్కసారి నీ చేత నాన్నా అనిపించుకోకపోయినా! పోనీ నీ భర్త మామగారూ అంటాడు. నీ పిల్లలు తాతా అంటారు."
    "అబ్బా.... ఏమిటి బాబయ్యా!" సిగ్గు పడింది రాధ.

                                     *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS