Previous Page Next Page 
ఆదివిష్ణు కథలు పేజి 15


    ఆ క్షణంలో సదరు పెద్దమనిషి సర్వీసులో ఉండగా తనకిచ్చిన వార్నింగులూ, చార్జిషీటులూ సమస్తం ఆ గుమాస్తాకి గుర్తుకొచ్చేయి. వాటివల్లే తనకి రావాల్సిన ప్రమోషను ఆగిపోయినందుకు ఇప్పుడు ఆ గుమాస్తా జగన్నాథం విషయంలో పిడికిలి బిగించేడు.
    తన సీటుముందు ఆ పెద్దమనిషి చేతులు కట్టుకు నిలబడే సౌకర్యం కోసం అక్కడున్న విజిటర్ల కుర్చీలను పక్కగదిలోకి పంపించి జాగ్రత్తపడ్డాడు.
    "ఇప్పుడు రారా అగ్గిరాముడా" అని మనసులో జగన్నాథాన్ని తిట్టుకుని తృప్తిపడ్డాడు గుమాస్తా.
    ఆ గుమాస్తా ఆశించినట్టు జగన్నాథం అతని సీటు దగ్గరికి రాలేదు. అస్సలు ఆ సెక్షన్ లోకి అడుగుపెట్టనే లేదు. జగన్నాథం ఆటో దిగి నాలుగడుగులు వేయగానే సొంత హార్టు అతన్ని 'హల్లో' అని పలకరించినట్టు తోచింది. అంచేత అదే ఆటోలో అతను తనకి బాగా తెలిసిన 'లక్కీ' హాస్పిటల్ కి వెళ్ళిపోయేడు.
    జగన్నాథానికి వైద్యపరీక్షలు చేసి గాలి పీల్చుకున్న డాక్టరు చిరునవ్వుతో అన్నాడు...
    "మీరేం భయపడక్కర్లేదు జగన్నాథం గారూ! నిశ్చింతగా వుండండి. జస్ట్ చెస్ట్ పెయినంతే! మందులు రాసిస్తాను. ఇంటికెళ్ళి రెండురోజులు రెస్ట్ తీసుకోండిచాలు"
    జగన్నాథం క్షణం ఆలోచించి అన్నాడు.
    "ఆ రెస్టేదో ఇక్కడే తీసుకుంటాను డాక్టర్. నేను ఇక్కడున్నట్టు మాత్రం మా ఇంట్లో తెలీకూడదు."
    ఆ డాక్టరు జగన్నాథం వేపు విడ్డూరంగా చూసేడు. ఆ టైపు చూపుకి తట్టుకోలేక అన్నాడు జగన్నాథం
    "మరేం లేదు... నేనిక్కడున్నానని తెలిస్తే నాకేం జరిగిందోనని... ఇంట్లోవాళ్ళు ఆందోళన పడతారు కదా? అదన్నమాట సంగతి" అని డాక్టర్ తో చెప్పాడు.
    "అఫ్ కోర్స్! మీరిప్పుడు క్షేమంగా వున్నారని తెలిస్తే వాళ్ళు అందరూ ఆనందిస్తార్లేండి" అన్నాడు డాక్టరు వెళ్ళిపోతూ.
    "ఈ డాక్టరొకడు! అర్ధం చేసుకోడు! ఇంట్లోంచి పారిపోయి కొన్ని గంటలు ఎవ్వరికీ దొరక్కుండా దాక్కుని అన్నపూర్ణను ఏడిపించి కసి తీర్చుకుందామన్న నాప్రయత్నానికి గండికోడుతున్నాడు" అని డాక్టరుమీద కోపం తెచ్చుకున్నాడు జగన్నాథం.
    సరిగ్గా అప్పుడే భయాందోళనలతో ఆసుపత్రికి రానే వచ్చింది అన్నపూర్ణ. మంచం మీద భర్తని చూసి కన్నీరు పెట్టుకుంది.
    నిశ్శబ్దంగా ఏడుస్తోంది. అన్నపూర్ణను గట్టిగా ఏడిపించేందుకు గుండెపోటు వచ్చిన మనిషల్లే నటించాలనుకున్నాడు జగన్నాథం.
    తన గదికొచ్చేముందు ఆ డాక్టరు 'జస్ట్ చెస్ట్ పెయిన్' అని చెప్పి వుంటాడని ఊహించి ఇలాంటి చెత్త డాక్టర్లతో రోగులు సుఖపడరని తిట్టుకున్నాడు.
    "ఇక్కడ అడ్మిట్ అయ్యేనని నీకెట్లా తెలిసిందో అడగనుగానీ, పిల్లలకి చెప్పేవా అన్నపూర్ణా?" అని భార్యని అడిగేడు. చెప్పినట్లు తలవూపింది ఆమె.
    "మరి.... వాళ్ళురాలేదే? నేను చచ్చినా బెంగపడనక్కర్కేదని డిసైడ్ చేసేసుకున్నారా?" అని అన్నాడు.
    "అవేం మాటలండీ?" అంది ఆమె.
    "ఎందుకో మరి? ఈ సందర్భానికి ఆ మాటలే సూటవుతాయని నా కనిపిస్తోంది!"
    "పిల్లలు డాక్టరుగారికి ఫోన్ చేసి గుండెపోతూ కాదని జస్ట్ చెస్టు పెయినని తెలుసుకున్నార్ట!"
    ఆ మాట వినగానే పక్కకి తిరిగి అనుకున్నాడు జగన్నాథం. "నాలాంటి రోగికి డాక్టర్లు సహకరించే తీరిదేనా? నేను దగ్గితే క్షయ బాగా ముదిరిపోయిందని నా భార్యా పిల్లలకి చెప్పి భయపెట్టాలి. అలాంటిది ఆఫ్టరాల్ పొడి దగ్గేనని నిజం చెబితే నా గతేంకాను? వెధవ బతుకు ఇంట్లోనే కాదు. వీధిలో డాక్టర్లు క్కూడా అలుసైపోయేను."
    లక్కీ ఆసుపత్రిలో .... ఆ రాత్రి బాగా పొద్దుపోయింతర్వాత..... భర్త పాదాలొత్తుతూ .... ఆవేశంతో మాటాడుతున్నా....ఆవేదన మాత్రమే వినబడుతున్న అన్నపూర్ణ మాటలు ఈ బాణీలో వున్నాయి.
    "ఇవాళ చెడ్డరోజండి! జీవితంలో మిమ్మల్ని మొదటిసారి నొప్పించేను క్షమించండి" అంది.
    "నీ సంజాయిషీ నేను వినదలుచుకోలేదు" అన్నాడు కటువుగా భర్త హెచ్చరికను అన్నపూర్ణ పట్టించుకోలేదు. తన ధోరణి మార్చుకోనూ లేదు.
    "మనిద్దర్లో ఎవరు ముందు కాలం చేస్తారో ఊహించలేను. నేను మీకంటే ముందుగా పోతే అదృష్టమే. నా ఖర్మకాలి...... నా కంటే ముందు మీరు వెళ్ళిపోతే.... నాకు మన పిల్లలే దిక్కవుతారు. వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద నా శేషజీవితం గడవాలి. అందుకని.... పిల్లల్ని ఇప్పట్నుంచే 'మంచి' చేసుకునే దీనస్థితి నాది."
    పొర్లుకొస్తున్న దుఃఖాన్ని అదుపులో పెట్టుకోవడానికి మౌనం వహించింది అన్నపూర్ణ. ఆమెను అర్ధం చేసుకున్న జగన్నాథం ఆ క్షణంలో బయటపడక తప్పలేదు....
    "నీ పిల్లల నీడలో నీ బతుకు సుఖంగా గడపాలనే తాపత్రయంతో నువ్వు జాగ్రత్త పడుతున్నట్టే. నా రిటైర్ మెంట్ వల్ల నా పవరుపోయిందనే అశాంతితో నేనున్నాను. మనిద్దరం బాధితులమే. నటనతో... ముసుగుచాటు బతుకుతో.. ఒకే ఒక్కరోజు గడవకుండానే మన బతుకు హీనంగా ఎంతో హేళనగా మారిపోయినందుకు సిగ్గుతో చచ్చిపోతున్నాను అన్నపూర్ణా! బతికినంత కాలమూ ఇదే మాదిరి హింసపడలేను. అంచేత ప్రశాంతమైన బతుక్కోసం వెంపర్లాడుతున్నాను. డోంట్ డిస్టర్బ్ మి!"
    ఆ రోజు లగాయితూ అతను ప్రశాంతమైన బతుకు యొక్క "చిరునామా కోసం" అన్వేషణ ప్ర్రారంభించేడు.
    అందుకోసం అతను దేశంలో వున్న గుళ్ళూ, గోపురాలు తిరిగేడు. అక్కడ భక్తుల రద్దీని ఎక్కువసేపు తిట్టుకుని తక్కువసేపు దేవుళ్ళను చూడగలిగేడు.
    అందువల్ల కాబోలు అడ్రస్సు చెప్పేందుకు ఆ దేవుళ్ళకు ఇష్టం లేదు. కొండలూ గుహలూ వెతికేడు. అక్కడ గెడ్డాలూ మీసాలూ పెంచుకుని.... పిచ్చి చూపుల్తో కాలక్షేపం చేస్తున్న సాధుమహారాజులెందరో కనిపించేరు. వాళ్ళు ప్రశాంతంగా బతుకుతున్న సూచనలు మచ్చుకైనా కనిపించలేదు. పిచ్చి చూపులే ప్రశాంతమైన జీవితానికి ఆనవాళ్ళు అని ఎవరైనా చెప్పివుంటే ఆ రకం బతుకు తనకి అవసరం లేదని చేతులు జోడించేవాడు.
    తన అన్వేషణలో అతడు మండుటెండల్లో తిరిగి మాడి పోయేడు. మంచుకొండలెక్కి వణికిపోయేడు. అంతే తప్ప తనక్కావలసిన అడ్రస్సు దొరకలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS