Previous Page Next Page 
అదివిష్ణు నవలు -2 పేజి 15

 

    శ్రీనివాసరావుకి మళ్ళీ శనిగాడు గుర్తు వచ్చే ప్రమాదం ఎదురైంది.
    "ఆ ధర్మరాజు లేడు గాని శ్రీనూ .....ఒరే శ్రీనూ . నా మాట విని నీ మనసు గట్టి పరచుకో. ఈ మధ్య రాత్రిళ్ళు నువ్వు కలవరిస్తున్నావట. అమ్మడు చెప్పింది. నిన్ను నువ్వు చుచుకోవడంలేదు గాని, నాన్నా సగమైపోయేవురా . ఎవర్ని ఉద్దరించనురా యిది? పెద్డాడు దేశాలపాలయ్యేడు .నువ్వేమో నా కళ్ళముందే చిక్కి సగమై పోతున్నావు"
    "నాకేం జరిగిందని? నిక్షేపంగా ఉన్నాను. నాకేం ఫరవాలేదు .ఆరోగ్యమంటావా? ఇది సీజనే. మా ఆఫీసులో తరక్కడికీ తలో రోగం. అంతే. నువ్వేం మాట్లాడకు. కళ్ళు మూసుకు పడుకో. జరిగిదేదో జరుగుతుందంతే! నీ మందు రెండు రోజుల్ల్పో కొంటాను."
    ఆ తల్లి పేలవంగా నవ్వేసి ఊరుకున్నది.
    శ్రీనివాసరావు లేచి తన గదిలోకి వెళ్ళబోతుండగా సీత పిలిచింది.
    "కాళ్ళు కడుక్కుని రండి. వడ్డించేను."
    అతనక్కడే ఆగిపోయి అన్నాడు.
    "వద్దు సీతా! నాకు ఆకల్లేదు. వచ్చేటప్పుడు హోటల్లో చిరుతిండి తిన్నాను. ఫ్రెండేవరో కలిసేడు. వాడు బలవంతం చేస్తే .....తిన్నాను నువ్వు వచ్చేయ్."
    సీత రాలేదు. శ్రీనివాసరావు బట్టలు మార్చుకున్నాడు. సీత అప్పటికీ ఆగదిలోంచి రాలేదు. అతనే   వంటగదిలోకి వెళ్ళేడు.
    రెండు కంచాల్లో అన్నం వడ్డించి ఒక కంచం ముందు కూచున్నది సీత. మోకాళ్ళ తల పెట్టుకుని నేలవేపు దృష్టి నిలిపింది. శ్రీనివాసరావు గుమ్మం లోనే నించుని అన్నాడు.
    "సీతా ! లాభం లేదు. మనం మారిపోవాలి. ఈ సీను రసవత్తరంగా లేదు. కవిగాడు  చెత్త రాసేడు. ఇక్కడ నటించేందుకు మనసు తూగడం లేదు. నువ్వు భోం చేసిరా! నేను అలగలేదు. నా కెవ్వరి మీద కోపం లేదు. నువ్వు భోజనం చేయి. ఇవాళ నువ్వు భోం చేయకపోతే నా మీద ఒట్టు. మన ముగ్గురి పిల్లల మీదా ఒట్టు."
    సీత అతనివేపు జాలిగా చూచింది. సీత కళ్ళల్లో నీళ్ళు అతను చుడగలిగేడు.
    "ఏడుపుకూడానా? వద్దేడవకు! నువ్వు నాకలా కనిపించకు ప్లీజ్ ముందు భోజనం కానివ్వు. ఒట్టు గుర్తుందిగా."
    సీత కంచంలో చేయి పెట్టింది.
    "గుడ్ గరల్! మొగుడు చెప్పిన మాట అలా వినాలి. భోం చేసిరా!"
    అప్పటికి గాని అతనక్కడ్నించి కదిలి తన గదిలోకి వెళ్ళలేదు. మంచం మీద పడుకుని సిగరెట్టు పెట్టె తెరిచేడు. దాన్లో ఒకే ఒక సిగరెట్టుంది. దాన్ని ముట్టించి పొగ వదిలేడు.
    అతనికిప్పుడు నాన్న గుర్తు వచ్చేడు."
    

                                                               5

    చైర్మన్ ఎన్నికలు రెండు రోజులన్నవనగా జానకి రంయ్యగారికి గుండెల్లో భయం తళుక్కున మెరిసింది.
    అవతల పెద్ద మనిషి వరసగా రెండు తడవలనించి చైర్మన్ . ఆ మనిషి అర్హతల్ని అవతలకి నెట్టి 'పట్టణ సేవ చేసేందుకు మీబోటి పెద్దలే తగుదు'రని అత్మీయులంతా పట్టుపట్టి ప్రాణం తీసేరు.
    నిజమే ---
    గత రెండు తడవల అతని చైర్మన్ గిరి వాళ్ళ పట్టణం ఏం బాగుపడింది? ఎంత బాగుపడింది? ఎక్కడున్న గతుకుల రోడ్లక్కడే ఈసురోమంటున్నాయికావూ? జనం పాపం, నీటి సదుపాయల్లేక అల్లాడి పోవడం లేదూ? కొన్ని ముఖ్యమైన వీధుల్లో సైతం దీపాలు లేక జనం విసుక్కోడం లేదూ.
    కౌన్సిలర్లు స్వార్ధానికి లొంగి, స్వలాభం కొరకు ఎన్నెన్నో అవకతవక పనులు చేసేరు. వీటి వెనుక ఆ చైర్మన్ లేడూ. అతనికి, వాటాల మీద గల శ్రద్ధ జనం బాగుమీదేమైనా వుందా.
    అయినా సరే,
    గుడ్డి ప్రజలు అతన్నీ మళ్ళీ గెలిపించేరు. అతను గెలవడమే కాదు - మునుపటి కనకపు సింహాసనం ఎక్కేందుకు అతనేం సిగ్గుపడటం లేదు. అది మొన్ననే గట్టిగా తెలిసింది.
    ఎంత లౌక్యుడతను  - లోకనాధం తగ్గపెరే.!
    "నాదెం లేదు జానకి రామయ్య! ఏదో ఉడతభక్తితో నేను చేయవలసిన సేవ ప్రజలకి చేసెను యిన్నాళ్ళూ, ఇది మంచి, అది చెడు అని చెప్పగలిగింది ప్రజలే గాని, నువ్వూ నేను కాదు గదా. ఆ ప్రజలెం చేసేరు. ఘనమైన మెజారిటీతో నన్ను గెలిపించేరు. గర్వకారణమంటే , నీకిక్కడే విషయం చెప్పాలని వుంది. నీకూ నాకూ స్నేహం కొన్నేళ్లుగా వుంది కనక అదైనా చెబుతున్నాను. ప్రతి అల్లాటప్పగాడికి నేను చెప్పనిలా. నేనీ ఎలక్షన్లో ఖర్చు పెట్టింది బహు తక్కువ. గట్టిగా లెక్కవేస్తే వెయ్యి రూపాయలు దాటి వుండదు. అదైనా కరపత్రాలకి, వాల్ పోస్టర్లకీ మాత్రమే సుమీ. ప్రచార,మంటావా ? అదంతా ప్రజల అభిమానమే. నా వార్డులోనే గయు, ఈ ఊళ్ళో నేను ఏ వార్డులో నిలిచినా, ఇంత మెజారిటీతోనూ గట్టెక్కుదును. ప్రజలెం అమాయకులనుకుంటున్నవేమో , అదేం కుదరదు. వాళ్ళకి చైర్మనూ, ,మంత్రిగారూ అనే భయం లేదు. ఎలక్షన్ లో నిలబడ్డ మనిషి ముఖ్యం వాళ్ళకి. నాదంటూ నయాపైసా ఖర్చు లేకుండా కేవలం అభిమానం తోటీ , ప్రేమ తోటీ ఎంతో ఉత్సాహంగా ప్రచారం చేసేరు. అప్పటికీ నేను వాళ్ళ తోటి చెప్పి చూసేను." ఎందుకీ ప్రచారాలూ, ఆర్భాటాలూ ? - ప్రజలకి నేనేంటే విశ్వాసమున్ననాడు నేనెలాగూ గెలుస్తాను. ఈ లేనిపోని ఖర్చులు మీకెందుకు? ఈ ఎన్నికల్ని నా నిస్వార్ధ సేవకి పరీక్షగా పెట్టుకున్నా విన్నారా. లేదు పైగా నన్నవతలకి పొమ్మన్నారు. ప్రజలు సామాన్యులు కారు జనకిరామయ్యా'! మునుపటి వాళ్ళు కారు. మంచీ చెడు తెలిసింది. విజ్ఞానం పొందేరు. నిన్నూ నన్నూ మంచినవాళ్ళయి పోయేరిప్పుడు. ఇంతకీ నేచేప్పొచ్చేదేవిటంటే, ఈ ప్రజాభిప్రాయం ముందు మనం నిమిత్తమాత్రులమని , ఆ ప్రజలే నన్ను మళ్ళా ఆ స్థానాన్ని తీసుకోమంటున్నారు. నేనేం చెప్పినా వినిపించుకునే ఓపిక వాళ్ళకి లేదు. చివరికి నేను తలవంచెను. ఇంతకంటే నేనేం చేయను చెప్పు? నేను చేయవలసిందంతా చేసి ఓడిపోయేనయ్యా! లాభం లేదింక. పాపం - నీ విషయం తలచుకుంటేనే భయంగా వుంది. పదివేల ఖర్చుతో నువ్వు కౌన్సిలర్ వయ్యేవని విన్నాను. ఇప్పుడీ చైర్మన్ పదవికి పోటీ చేస్తే మరో పదిహేనిరవై వేలకి పైనే ఖర్చుంటుంది'. ఈ డబ్బంతా యెవరు తిన్నట్టు చెప్పు. నా ప్రజలు నా మాట వినివుంటే , మిత్రుడివి. నీకే ఈ పదవి యిచ్చి పక్కకి తొలిగేవాడిని. నేనేం చేసేది చెప్పు. నా చేతులు కట్టేశారయ్యా ప్రజలు."
    జానకిరామయ్య కోపం పెల్లుబికింది. లోకనాధం ముందు నోరు విప్పకపోయినా తన జనం ముందు ఎగిరెగిరి పడ్డాడు.
    "ప్రజలంట ప్రజలు! ఎంచక్కా అన్నాడండీ ప్రజాలనీ! వీడి తెలివి మండిపోనూ వీడేలా గెలిచాడో నాకు తెలుసు. నాకు పదివేలు ఖర్చవుటే, వీడికి పదిహేను వేలు ఖర్చయ్యాయి. తెలీదనుకుంటున్నాడేమో. ప్రజలట ప్రజలు., అభిమానం, ప్రేమ - వీడి శ్రార్ధమూనూ . అంతా గెస్! ప్రజలేమైనా తేరగా దొరికే కూరగాయలా? ఒక్కోడ్ని కదిపితే - పది ఇరవై అని ధర చెబుతున్నారీ ప్రజలు . ఇంకా అభిమానం - ప్రేమా ఏమిటండి , వాడి పిండాకూడూ! వీళ్ళంతా ప్రజలా? డబ్బుకి మొహం వాచీ ఓట్లమ్మే వాజమ్మలకి అభిమానం  అంటే ఏమిటో తెలుసా? ఈ భూమ్మీదా యింకా ప్రజలెక్కడున్నారుండి - డబ్బు మినహా? నేను నావార్డులో గెలిచేనంటే కారణం ఏమిటంటారు? అవతలవాడు ప్రజల్ని కొనలేని అసమర్ధుడు గనక , వాడిచ్చే రేటుకంటే నా రేటు అందుబాటులో ఉంది కనకాను. పదివేలు కౌన్సిలరైనట్టే మరో ఇరవై పోసి చైర్మన్ అవుతాను. అంతేగానీ - మధ్య ఈ ప్రజలేమిటండి - అర్ధం లేని మాట! ప్రజలిక్కడ దొరకరని రాసిస్తాను. పట్టణం ఎలా ఉందిప్పుడు? ఏ పరిస్థితిలో మనం బతుకుతున్నాం. ఇవన్నీ ఆలోచించేవాడు ప్రజల్ని ప్రజలనడు. నేను చైర్మనయి సాధించేదేమిటని మీరడగుతున్నారా? చెబుతాను. ఎంత ఖర్చయినా సరే, నాకా పదవి కావాలి. తద్వారా నేననుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా చేయాలి. కీర్తి రావాలి. పదిమంది చేత నేను అవుననిపించుకోవాలి, వీలైనప్పుడు నాచేత నైనా సేవ నేను చేస్తుండాలి. సేవ చేయడానికి ఒక్కడే అనే పద్దతి తప్పు. వాడొక్కడే అందుకు పెట్టి పుట్టలేదు. పదవుల్లో మార్పు రావాలి. మార్పనేది అభివృద్దికి అందమైన మాటని నా వుద్దేశం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS