Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 14


    "ఉహు! లోకం -" మూతి ముప్పై వంకర్లు తిప్పింది రాధిక. ఆమెకు తల్లికి యెలా నచ్చచెప్పాలో తెలియటం లేదు. నారాయణగూడా హైస్కూల్లో చదువుతున్న ఒక అమ్మాయిని రాధికపై నిఘా ఉంచారు.
   
    రాధిక శ్రీనివాస్ ను తప్పించుకుని, తప్పించుకుని తిరిగింది. ఆరోజు అతను కాచిగూడా స్టేషన్లో పట్టుకున్నాడు.

    "దేవిగారికి కోపం వచ్చిందా!"

    "ఏంలేదు. పనివుంది" త్వరగా అవతలివైపుకు వెళ్ళింది. అతను ఆశ్చర్యంగా చూస్తుండగానే బండి వచ్చింది. అటు నుండి ఆమె, ఇటునుండి అతను ఎక్కేరు. ఇంటికి వచ్చి రాధిక. హోమ్ వర్క్ చేస్తూ కూర్చుంది.
  
    "రాధికా!"

    "ఏమ్మా!"

    "యెంత పొగరే నీకు! నేనేం చెప్పాను!"

    "ఏం చెప్పావు! శ్రీనివాస్ తో మాట్లాడ వద్దన్నావు. ఆ విషయమైనా అతనికి చెప్పొద్దా!" కాస్త ధైర్యం తెచ్చుకుని. 

    "చెప్పావా!"

    "లేదు"

    "చెప్పు. మీ నాన్నకు తెలిస్తే వాడి చర్మం వలిచేస్తారు" అన్నది యశోద.
 
    రాధిక మాట్లాడలేదు.

    "ఆ మర్నాడు కాలేజి టైమ్ లో శ్రీనివాస్ టైప్ ఇన్ స్టిట్యూట్ కు వెళ్ళింది.

    "ఒహో! గొప్పింటి అమ్మాయి రాధికగారా! ఏమిటండీ ఇలా వచ్చేరు! మమ్మల్ని గుర్తించేరా!" అన్నాడు.

    "శ్రీనూ!" దీనంగా చూచింది.

    "ఏమిటో చెప్పు -"

    ఇంట్లో జరిగిన విషయాలు చెప్పింది. వాళ్ళు పెట్టిన ఆంక్షలు తెలిపింది.
 
    "శ్రీనూ మీ ఇంటి అడ్రసు ఇవ్వు. ఉత్తరాలయినా రాస్తాను."

    "అంతకంటే మార్గంలేదు. మాట్లాడకపోయినా కనిపిస్తావు కదా!"

    "కాలేజీకి వస్తాను......." అతని చేతిలో చేయివేసింది. ఇద్దరూ మౌనంగా చాలా దూరం నడిచారు.

    "వస్తాను రాధికా! మీ నాన్నే నా దగ్గరకు వచ్చేలా చేస్తాను" శ్రీనివాస్ పిడికిళ్ళు బిగుసుకున్నాయి.
 
    అసహాయంగా చూచింది.

    ఆ రోజు అడ్రసు తెచ్చుకుంది. రోజుకో ఉత్తరం రాసుకునేవారు. మాట్లాడుకోవాలనుకున్నదంతా ఉత్తరాలు రాసుకునేవారు. పోస్ట్ మ్యాన్ తో చెప్పింది. తన పేరున వచ్చిన ఉత్తరాలు గదిలోకి వెయ్యమని. అతను కుర్రాడే అంగీకరించాడు. రాధిక గది బయటికి వుంటుంది. ఆమె లేనప్పుడు ఆ గది తీసి చూచే ఓపిక తల్లికి లేదు.
 
    ఒకరోజు ఉత్తరం గదిలోకి వెయ్యటం పురుషోత్తమరావు కంట పడింది అతను ఉత్తరం తీశాడు. భోజనాల దగ్గర ఉత్తరం విప్పాడు.

    "యెవరిదండీ!" యోశోద అడిగింది.

    "తినబోతూ రుచులెందుకు!"

    ఉత్తరం అటు, ఇటు తిప్పి చూచి, గట్టిగా పెద్దగా చదివాడు.

    "నా ప్రియాతి ప్రియమైన రాధీ!

    అబ్బ! దూరంనుండే నిన్ను చూచి ఊరుకోవాలంటే నరకయాతన కల్గుతుంది డియర్. నీ ఉత్తరాలే నాకు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఏమిటమ్మా! నిన్న అంతచిన్న ఉత్తరం రాసావు. ఈసారి పెద్దది రాయాలి. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి చదువు. నా ఇండస్ట్రీకి స్కీమ్ ఆలోచించాను. త్వరలో పని ప్రారంభిస్తాను. ఒక ఇండస్ట్రీయలిస్ట్ గా వచ్చి ధైర్యంగా మీ నాన్న ను అడుగుతాను......అప్పుడేమంటాడో మీ గర్వపోతు......"

    వుత్తరం చదవటం ఆపి రాధికవంక చూచాడు. ఆమె తల వంగి పోయింది. ముఖం ఎర్రగా జాబు పూసినట్టు అయింది.

    "మీ నాన్నను గర్వపోతు అన్నానని కోపగించకు. గర్వపోతు కాడా! మన ప్రేమను కాదనేహక్కు ఆయనకు లేదు. మీ అమ్మకు అసలు ప్రేమకు నిర్వచనం తెలుసా! తెలియదు. తెలిస్తే 'అయ్యే వయసులో పిల్లలు 'అని చూచి, చూడనట్టు ఊరుకునేది. వీళ్ళంతా బండరాళ్ళు........రాధీ.... ఇది ఈ రోజు అందంగా కనిపించినందుకు అందించేముద్దు......... మరేమో...... రాధిక చటుక్కున తండ్రి చేతిలోని వుత్తరం లాక్కుని, ముక్కలు ముక్కలు చేసింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS