Previous Page Next Page 
ఆచరణ లో అభ్యుదయం పేజి 14

                   
                                     6
    వాసు పిన్ని కూతురు సీత-- సీత తండ్రి చిదంబరాని కి బొంబాయి లో వుద్యోగం. అయన కుటుంబంతో దాదర్ లో ఒక ఫ్లాటు లో వుంటున్నాడు. సీతకి ఒక అన్నా ఒక అక్కా ఇద్దరు తమ్ముళ్ళూ వున్నారు. అక్కకి పెళ్ళయి అత్తావారింటి లో వుంది. అన్నయ్య చదువు కుంటున్నాడు. సీత కూడ కాలేజీ లో చదువు కుంటోంది. తమ్ముళ్ళు ఇద్దరూ హైస్కూల్లో చదువు కుంటున్నారు.
    వాళ్లు వుంటున్న బిల్డింగు లోనే ప్రక్క ఫ్లాటు లో మరో తెలుగు కుటుంబం వుంది. ఇకే అంతస్తు లో వున్న ప్రక్క ప్రక్క ఫ్లాటు లు కావటం చేతనూ రెండు తెలుగు కుటుంబాలు కావటం చేతనూ, ఆ రెండు కుటుంబాల మధ్య స్నేహం. ఒకరింటికి ఒకరు రాకపోకలు సాగించటం కాస్త ఎక్కువగానే వుండేది -- అయినా ఎంత స్నేహం వున్నా ఆ రెండు కుటుంబాల మధ్య కులం అనేది ఒకటి అడ్డు వచ్చి ఆ స్నేహానికి, రాకపోకలకి ఒక పరిధి ఏర్పరచి అవి దాటి రాకుండా చేసింది.
    అలాంటి సమయంలో, తన కూతురు సీత పొరుగు వాళ్ళబ్బాయి సత్యంతో కాస్త చనువుగా వుంటున్నట్లు అనుమానం తోచింది సుందరమ్మ గారికి-- అప్పుడే నిలదీసి అడగాలని పించినా తన అనుమానానికి ఆధారం ఏమీ లేదేమో, బొంబాయి లాంటి మహా పట్నంలో వుంటూ కాలేజీ చదువులు చదువుతున్న కూతురు కాస్త సోషల్ గ నలుగురి లోనూ మాట్లాడటం లోనూ, కుటుంబం లో వ్యక్తులందరి మాదిరిగానే సత్యం లోనూ కాస్త సరదాగా కబుర్లు చెప్పటం లోనూ అనుచితం ఏమీ లేదేమో నన్న భావం మరో ప్రక్క నుంచి వెనక్కి తియ్యటం వల్లనూ మనస్సులో మాట మనస్సులోనే వుండి పోయింది. కాని అలా చాలాకాలం ఉపేక్షించి వూరుకోటానికి ఆ తల్లి ప్రాణం ఒప్పలేదు. 'నిజం కానీ, కాకపోనీ, తన అనుమానం నివృత్తి చేసుకోవాలి-- వయస్సు లో వున్న పిల్ల పరాయి మొగవాడితో అంతగా వికవికలు పకపకలూ పోతూ ఖబుర్లేసుకు కూర్చోటం  ఏమిటి? ఏదోలే, చిన్నప్పటి నుంచీ స్నేహంగా వున్నారు అవి తను సరిపెట్టుకున్నా చూసేవాళ్ళంతా ఏమనుకుంటారు? అయినా పరీక్షలు దగ్గర పెట్టుకుని శ్రద్దగా పుస్తకాలు చదువు కోకుండా అస్తమానూ ఏదో వంకని ఆ పొరుగింటికి పెత్తనా లేమిటి? అనుకుంటూ ఆవిడ ఆలోచనలు సాగుతూనే వున్నాయి.
    వో సాయంకాలం సినీ స్టార్ లా అలంకరించుకున్న సీత తల్లి దగ్గరికి వచ్చి సినీమాకి వెళ్తున్నాను అని చెప్పింది.
    'ఎవరెవరు వెళ్తున్నారు?' అందావిడ యధాలాపం గానే.
    'నేనూ వాళ్ళ మోహినీ వెళ్తున్నాం' అంది సీత ఏ మాత్రం తడుము కోకుండా. మోహిని సీత స్నేహితురాలు, రెండిళ్ళ అవతల వుంటున్నారు.
    "సరే -- వెళ్లి రండి.' అంది సుందరమ్మ గారు.
    రాత్రి తొమ్మిది గంటలు దాటింది. కూతురు రాకకోసం చూస్తూ కిటికీ దగ్గర నిలబడిన సుందరమ్మ గారు ఇంటి ముందు టాక్సీ ఆగటం చూసి కళ్ళు చిట్లించుకుని మరీ చూసింది. అంతదాకా ఆవిడికి తన కూతురు మోహిని తోనే సినీమాకి వెళ్ళింది అన్నదాంట్లో ఎలాంటి అపనమ్మకం కలుగలేదు గాని ఇప్పుడీ టాక్సీ ని చూస్తె మాత్రం ఏదో అనుమానం భయం లాంటి భావాలతో మనస్సు ఉలిక్కిపడి నట్లయింది-- ఏమో, బస్సులు ఎంతకీ దొరకలేదేమో ఇద్దరమ్మాయి లూ కలిసి టాక్సీ చేసుకు వచ్చారేమో అనే ఆశాభావం మరో ప్రక్క నుంచి పెనుగు లాడుతూనే వుంది. అంతలోనే టాక్సీ తలపులు తెరుచుకుని సీతా సత్యం దిగి మెల్లిగా మేడ మెట్లు యెక్కి పైకి వచ్చారు.

                                       
    సుందరమ్మ గారిలో కోపం, అసహ్యం కట్టలు తెంచుకున్నాయి. అయినా తను నోరు చేసుకుంటే ఇంట్లో మరీ అల్లరి అవుతుందనే ఆలోచన వచ్చి కాస్త నిదానంగానే అడిగింది తలుపు తీస్తూ.
    'టాక్సీ లో వచ్చినట్లున్నావే ' అని.
    'అవును. సినీమా లో వాళ్ళ సత్యం గారు కనిపించారు. బస్సుల కోసం ఎంతసేపని కాచుకు కూర్చుంటాం , టాక్సీ లో వెళ్లి పోదాం అన్నాడు' అంది తొట్రు పాటుని దాచుకుంటూ.
    'మరి వాళ్ళ మోహిని.'
    'ఆ అమ్మాయినీ ఎక్కుంచు కున్నాం-- వాళ్ళింటి దగ్గర దింపేశాం.' నసిగేసింది సీత.
    'చూడు సీతా -- నువ్వేం చిన్నదానివీ చితక దానివీ కాదు-- చదువు కుంటున్నావు -- అన్నీ తెలిసిన దానివీ -- ఇలా అర్ధరాత్రీ ఆపరాత్రీ పరాయి మొగాడితో కలిసి టాక్సీలలో తిరుగటం ఎంత అప్రతిష్ట కి దారి తీస్తుందో నేను విడమరిచి చెప్పాలా -- అసలు -- ఈ మధ్య కొన్నాళ్ళు గా నేను అనుకుంటూనే వున్నాను-- ఏదో ఇరుగూ పొరుగూ అన్నాక కాస్త మాటా మంచీ వుండాలి కానీ ఇంత మితిమీరిన చనువూ, దోస్తీ ఏమిటీ నీకు-- అందులో ఆ అబ్బాయితో -- ఏ ధోరణి లో వున్నారో  నాన్నగారు అంత పట్టించు కోలేదు, లేకపోతె ఈ పాటికే ఎంత రాద్దాంత మో అయేది -- ఇంక నుంచయినా నువ్వు కొంచెం జాగ్రత్తగా వుండు-- పాటికి పది సార్లు వాళ్ళింటి కి వెళ్ళకు -- మనలో మరే దురుద్దేశ్యమూ లేకపోయినా అవతలి వారికి ఏవేల్టికి ఏం బుద్ది పుడుతుందో చెప్పలేం .......'
    సీత చీర మార్చుకుంటూ మౌనంగానే తల్లి వుపన్యాసం అంతా వింది-- ఆ తరువాత మౌనంగానే కాస్తంత అన్నం తిన్నాననిపించి, చెయ్యి కడుక్కుని వెళ్లి పడుకుంది.
    మళ్ళీ ఏదో చెప్పాలని కూతురు మంచం దగ్గరికి వెళ్ళిన సుందరమ్మగారు సీత కళ్ళకీ చెయ్యి అడ్డం పెట్టుకుని ప్రక్కకి తిరిగి పడుకుని వుండటంతో జరిగినదా నికీ తను ఇప్పటికే సిగ్గు పడుతోంద నీ అసలే పశ్చాత్తాపంతో బాధపడుతున్న పిల్లని మాటలతో ఇంకా ఇంకా పాడుం చెయ్యటం ఎందుకులే అనీ మాట్లాడకుండా తన మంచం దగ్గరికీ వెళ్ళిపోయింది.
    ఆనాటి నుంచీ సుందరమ్మ గారు కూతురు ప్రవర్తన ని ఓ కంట జాగ్రత్తగా కనిపెడుతూనే వుంది-- సీత తన కాలేజీ ఏమో చదువేమో ఆ ధోరణీ తప్పితే సినీమాలూ షికార్లు మానేసింది. పొరుగింటి కి వెళ్ళటం లేదు.
    'చిన్నతనం -- మంచీ చెడూ తెలుసుకునే జ్ఞానం లేదు-- సరదాగా తిరుగుదాం నలుగురితో స్నేహంగా ఉందాం అన్న ధోరణి తప్పితే దాని వల్ల వచ్చే దుష్పరిణామాల గురించి ఆలోచించే వయస్సు లేదు -- అది కూడని పనే అమ్మా అని ఒకసారి మందలిస్తే తన పొరపాటు తెలుసుకుని బుద్ది తెచ్చుకుంది ....ఈ మాత్రం దానికి వాళ్ళ నాన్నగారి దాకా వెళ్లి తెలివి తక్కువగా అల్లరి చేశాను కాదు.' అనుకుంది సుందరమ్మ గారు చాలాసార్లు.'
    రెండు మూడు నెలలు గడిచి పోయాయి. సీత పరీక్ష లయిపోయాయి.
    'అమ్మా-- ఇవాళ సినీమాకి వెళ్తాను.' అంది సీత , సాయంకాలం చపాతీ లకి పిండి కలుపుతున్న తల్లి దగ్గరికి వచ్చి.
    'సరే వెళ్ళు-- ఏ సినిమాకి ?'
    సీత చెప్పింది.
    'అయితే తమ్ముళ్ళ ని కూడా తీసుకు వెళ్ళరాదా -- ఎప్పటి నుంచో సరదా పడుతున్నారు.' అంది సుందరమ్మ గారు కలిపినా పిండి మీద మరో పళ్ళెం బోర్లించి వాష్ బేసిన్ లో చెయ్యి కడుక్కుంటూ.
    'ఉహూ , వాళ్ళని తరువాతేప్పుడ యినా వెళ్ళమను. టిక్కట్లు దొరకటం చాలా కష్టంగా వుంది-- మోహిని మా ఇద్దరికీ రెండు టిక్కట్లు బుక్ చేసి అట్టే పెట్టింది. నే వెళ్తున్నా.' అంటూనే గదిలోకి వెళ్లి పోయింది, తల్లి మరేమనటానికి అవకాశం ఇవ్వకుండా. బట్టలు మార్చుకుని మరో పది నిముషాల్లో సీత సినీమాకి వెళ్ళిపోయింది.
    రాత్రి ఏడు గంటలు దాటింది -- షికారుకు వెళ్ళిన చిదంబరం, ఆడుకోటానికి వెళ్ళిన, పిల్లలు ఇంకా యింటికి రాలేదు-- అప్పుడే వంటపని ముగించుకుని వచ్చి గదిలో కూర్చుని వారపత్రిక తిరగేస్తోంది సుందరమ్మ గారు. కాలింగ్ బెల్ మ్రోగటంతో పుస్తకం కుర్చీలో పడేసి లేచి వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా మోహిని . ఆ పిల్లని చూస్తూంటేనే సుందరంమగారి మనస్సు వులిక్కి పడింది-- ఆ వులికి పాటుని కప్పి పుచ్చుకుంటూ ఏదో అడగాలని ఆవిడ అనుకుంటుండగానే మో'హినే అంది లోపలికి వస్తూ. 'సీత దగ్గర నా పుస్తకం ఒకటి వుండి పోయింది -- ఏం తోచటం లేదు -- అది తీసుకు వెళ్దామని వచ్చాను--'
    ఆ పిల్ల ధోరణి చూస్తుంటే సినీమాకి వెళ్దాం ఆని ప్రోగ్రాం వేసుకున్నట్లు, టిక్కెట్లు ముందుగానే రిజర్వు చేయించినట్లూ ఏమీ అనిపించటం లేదు -- సీత ఎవరితో వెళ్లిందో అని క్షణం లోనే వూహించు కో గలిగింది.
    'సీత ఎక్కడికో వెళ్ళింది -- రేపు రా పుస్తకానికి-- ఏం తోచక పొతే కాస్సేపు కూర్చుని నాతో ఖబుర్లు చెప్పు.' అంది సీత మీద కలిగిన ఆగ్రహాన్ని అణచు కుని మామూలుగా మాట్లాడటానికి ప్రయత్నిస్తూ.
    'రేపు వస్తాలెండి.' అంటూ వెళ్ళిపోయింది మోహిని.
    కాస్సేపటి  తరువాత చిదంబరం , పిల్లలూ తిరిగి వచ్చారు -- వాళ్లతో మాట్లాడుతున్నా , వాళ్ళకి అన్నం వడ్డిస్తున్నా ఏ పని చేస్తున్నా సుందరమ్మ గారిలో పరధ్యానం -- ఆవిడ మొహంలో వేదనా చిహ్నాలు స్పష్టంగా కనిపిస్తూనే వున్నాయి. 'అలా వున్నావేం' అని చిదంబరం ఒకటి రెండు సార్లు అడగను కూడా అడిగాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS