Previous Page Next Page 
స్రీ పేజి 14

 

    "రఘూ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు పద్మా! పాపం. ఇన్ని రోజులుగా పాడు జ్వరంతో బాధపడ్డాడు. బహుశా ఈ వేసంగి లో అతగాడు పెళ్లి కొడుకు కాబోతున్నాడనుకుంటాను...." ఉత్తరం వ్రాయటం సగం లో ఆపుచేసి తనలో తనే నవ్వుకొంది పార్వతి. ఓ నెల్లాళ్ళ తర్వాత వ్రాస్తున్న ఈ ఉత్తరం చూసి పద్మజ కంగారు పడదు కదా? చూడాలి, పద్మ ఎలా షాక్ తింటుందో! తర్వాత అసలు విషయం విపులంగా వ్రాయవచ్చుగా?
    పోస్టులో వెయ్యమని ఉత్తరం సూర్యం చేతి కిచ్చి లేచింది పార్వతి. రఘూ కోసం నిరీక్షించటంతో ఏ పని మీదికీ మనస్సు పోలేదు. సూర్య కిరణాలు ఎర్ర బారుతుంటే అలాగే చూస్తూ కూర్చుంది కిటికిలో.
    రామనాధం మాష్టారు -- పార్వతి తండ్రి -- మెట్లెక్కి లోపలికి వస్తూ కనిపించారు. తండ్రి మొహం చూసి గతుక్కు మంది పార్వతి. అయన అలా దిగులుగా, బాధగా -- విస్మయంగా చూస్తూ నించుంది. తండ్రి మొహం చూస్తున్న కొద్ది ఏమిటో తెలీని భయం, అనుమానం పెనుగులాడాయి. తండ్రి మాటా మంతీ లేకుండా పడక కుర్చీలో కూలబడితే నెమ్మదిగా లోపలికి నడవబోయింది.
    "అమ్మా! పారూ! ఒక్కసారి ఇలా వచ్చి కూర్చో అమ్మా!"
    తండ్రి పిలుపుతో దగ్గరికి వెళ్ళి నేల చూపులు చూస్తూ నించుంది. కొంతసేపు మళ్ళా నిశ్శబ్దం గానే ఊరుకున్నాడు తండ్రి. చివరికి, "మనం, చాలా పోరపడ్డాం , తల్లీ! చాలా పొర పడ్డాం" అన్నాడు భారంగా.
    వెర్రిదానిలా చూసింది పార్వతి.
    "అందని పళ్ళకి అర్రులు చాచినట్టే అయింది. లోకం పోకడ తెలుసుకోలేక పిచ్చి భ్రమలు పెట్టుకున్నాం మనం....మనం...." మాస్టారి కంఠం వణికి మాటలు పెగలలేదు. పార్వతి గుండెలు ఒక్కసారి దడదడలాడి అగినట్టయిపోయాయి. ఊపిరి కూడా పీల్చకుండా తండ్రి కేసి చూస్తూ అలాగే నించుంది. "ఏమిటి నాన్నా? ఏమిటి అంటున్నావు?" అనేయ్యాలన్న కోరిక బలంగా కొట్లాడింది.
    "రఘుపతికి పెళ్ళి కుదుర్చుకున్నారమ్మా! ఇక ఆ ప్రసక్తి మనం వదిలి వెయ్యక తప్పదు."
    "నాన్నా!" విస్మయంగా అరిచినట్టే అంది  పార్వతి. మాష్టారు నిస్సహాయంగా ఒక నిట్టుర్పు విడిచారు. "ఇదంతా మన పొరబాటే తల్లీ! మీ అమ్మ ఎప్పుడూ అంటూనే ఉంది. వాళ్ళ అంతస్తేక్కడా ! మన కసలు అంతస్తేదీ? వాళ్ళని మనం ఎలా అందుకోగలం? అర్ధం లేని ఆశలు పెట్టుకున్నాం. ఆకాశాని కేగరాలని రెక్కలు కట్టుకున్నాం    "నాన్నా!' దించుకున్న తలఎత్తి తండ్రి కళ్ళల్లోకి చూసింది పార్వతి. "అసలేం జరిగింది? ఇప్పుడా పెళ్ళి మాటాలెందుకొచ్చాయి?" అంది నెమ్మదిగా. పార్వతికి తండ్రి మాటలు నమ్మశక్యంగానే లేవు. రఘుపతికి వేరే పెళ్ళి నిర్ణయించటం ఏమిటి? ఎవరు చేశారా నిర్ణయం?
    "నేను మాములుగానే వాళ్ళింటికి వెళ్ళానమ్మా! చలపతి రావు ఎవరో పెద్ద మనిషితో పెళ్ళి విషయాలు మాట్లాడుతున్నాడు. అంతవరకూ లోపలి గడప లో నిలబడి ఉన్న అన్నపూర్ణమ్మ నన్ను చూసి పలకరించకుండానే లోపలికి వెళ్ళిపోయింది. పెళ్ళి మాటలు వినగా వినగా నాకేదో అనుమానం పొడ చూపింది. చలపతి రావు మొహం కేసి చూశాను. మాట్లాడటానికే ఇబ్బంది పడుతోన్న వాడిలాగా కనిపించాడు . నెమ్మదిగా లేచి రాబోతుంటే లేని నవ్వు మొహం మీద మెరిపిస్తూ కాయితాల్లోంచి ఓ ఆడపిల్ల ఫోటో తీసి అన్నాడు: "కూర్చోండి, మాస్టారూ! చూడండి, మీ శిష్యుడికి  కాబోయే వధువుని" అంటూ చేతిలో ఫోటో ముందుకు చాచాడు.
    "ఎవరికి? రఘు.....రఘుపతికా?' అప్రయత్నంగా అడిగేశాను.
    చలపతిరావు అలాగే నవ్వుతూ , "అవునండీ! వాళ్ళమ్మ , కోడలు కావాలని గొడవ చేస్తోంది. కుర్రవాడికా పెళ్ళి వయస్సు వచ్చింది. సంబంధాలు  కుప్పతిప్పలుగా రానే వస్తున్నాయి. ఇక ఆలస్యం ఎందుకని....'
    "మరి....మరి' .... ఏదో అడగాలన్న బాధతో నా గుండెలు నలిగి పోయాయి.
    చలపతి రావే మాటలు పెంచాడు. 'దగ్గర సంబంధమే లెండి. కాదనుకుంటే నిష్టూరాలు తప్పవు. పదిమంది కుటుంబంలో పుట్టి పెరిగిన పిల్ల, కట్నం అడిగినంతా ఇస్తామంటున్నారు గానీ, చూడండీ, మాస్టారూ! పెళ్ళిళ్ళు నిర్ణయం చేయట మంటే మాటలు కాదు గదా? అదే ఆలోచిస్తున్నాను.'
    'ఇంకా ఆలోచన దేనికని నేనంటున్నాను, పంతులు గారూ! అమ్మాయిని చూసి ఇష్టపడనే పడ్డారు. అవతల ఆడపిల్ల వారు కంగారు పడుతున్నారు. ఏమాటా తేల్చుకు రమ్మనే నన్ను పంపించారు లెండి. మీలాంటి పదిమంది పెద్దల  ఆశీర్వాదంతో నా ప్రయత్నం ఫలిస్తే ....' ఆ పెద్ద మనిషి తన బాధ కూడా వెళ్ళబోసుకున్నాడు.
    "ఇక నేనక్కడ నిలబడలేకపోయానమ్మా! తల గిర్రున తిరిగి పోతుంటే, కాళ్ళూ, చేతులూ ఆడని పరిస్థితి లోనే బలవంతంగా అడుగు వేస్తూ -- 'మరి ఆలోచించకండి, బావగారూ! మీ యిష్ట ప్రకారం చేసెయ్యండి. వస్తాను' అంటూ చీడీలు దిగి గేటు తెరుచుకుని-- రోడ్డు దాటి ఇలా గడపలో పడ్డాను."
    పార్వతి శిలా ప్రతిమే అయింది. ఆందోళనతో హృదయం తల్లడిల్లి పోయింది. చలపతి మామయ్య కట్నానికి ఆశపడి , తమ అంతస్తు ల భేదం ఎంచి, ఇంత తేలికగా మనసు మార్చుకున్నాడా? "కట్నాలూ, వద్దు, కానుకలూ వద్దు, బంగారు బొమ్మ లాంటి పార్వతే మాకు కట్నం . నీ చల్లని చేతితో ఎప్పుడు వండి పెడతావే తల్లీ?' అంటూ ఆప్యాయత వెల్లడించిన మామయ్య--
    "భార్య భర్తల మనస్సులు కలిసి బతకాలి గానీ డబ్బుదేముంది బావా?" అంటూ నీతి మార్గాన్ని మెచ్చుకున్న మామయ్య--
    నిజంగా కట్నానికి , ధనాశ కు లొంగి పోయాడా? ఎలా నమ్మగలదు తను? ఉండబట్ట లేక అనేసింది పార్వతీ.
    "మామయ్య చాలా మంచి వాడు, నాన్నా!"
    "అతన్ని చెడ్డవాడనే హక్కు మనకు లేదమ్మా! మంచి వాడే! మాటలకీ, చేతలకీ పోలిక లేకుండా పోయింది. ఇన్ని సంవత్సరాలూ ఎన్నెన్ని కబుర్లు చెప్పాడు! అవన్నీ ఉత్త హాస్యానికే నంటావా? తీరా కార్యచరణ కి వస్తే ఇంత నిర్దయగా ప్రవర్తించగలిగాడు. మనలాంటి గర్భ దరిద్రుల్ని చూసి ఎవరు మాత్రం ఎందుకు జాలి పడతారమ్మా? ఎవరి స్వార్ధం వారిదే."
    దీర్ఘంగా నిట్టూర్చింది పార్వతి. 'పోనీ నాన్నా. ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. మనల్ని చూసి ఎవ్వరూ జాలి పడవద్దు. నువ్వు బాధ పడకు."
    నిరాశగా నవ్వాడు తండ్రి. "బాధ! బాధగాక ఏముందమ్మా? కన్న బిడ్డల్ని పెంసుకోలేని దౌర్భాగ్యుడికి బాధగాక ఏం మిగులుతుంది? ఈ భారం అంతా నా ఒక్కడి నెత్తినా పడేసి మీ అమ్మ నిక్షేపం గా దాటిపోయింది. ఈ నాటి కింత చేతకాని వాణ్ణి అవుతా నని నేను అనుకోలేదమ్మా, పారూ!"
    పార్వతి కన్నీళ్లు సుళ్ళు తిరిగాయి. తండ్రి ఇంతగా బాధపడినట్లు ఎన్నడూ గుర్తు లేదు. తల్లి పోయినప్పుడైనా ఆ దుఃఖాన్ని తనలోనే ఇముడ్చుకున్నాడు. కానీ ఇలా మనస్సు విప్పి బయటికి చెప్పుకోలేదు. లోలోపల మనోవ్యధతో క్రుంగి పోతున్న తండ్రి స్థితి పార్వతి కనిపెట్టక పోలేదు. తల్లిపోయిన క్షణం నుంచీ వయస్సు మళ్ళిన తండ్రిని పసివాళ్ళ కన్నా ఎక్కువ శ్రద్ధతో చూసుకోంటూనే వుంది.
    కాని, ఈ అనుకోని సంఘటన తనకూ, తండ్రికీ కూడా పిడుగు పాటే. వేయి కళ్ళతో ఎదురుచూస్తూ ఎన్నో ఆశలు పెట్టుకున్న భవిష్యత్తు ఎడారిలో ఎండమావిగా తయారౌతుంటే తన మాట ఎలా ఉన్నా తండ్రి తట్టుకోలేడు. మనస్సంతా విప్పి తన ఎదుట వెళ్ళబోసుకొంటున్న తండ్రిని ఒదార్చవలసిన బాధ్యత తన మీదే ఉంది. తను చిన్నదే అయినా పెద్దరికం వహించి యేవో రెండు ముక్కలు చెప్పక తప్పదు. ఎంత ఆలోచించుకున్నా మాట్లాడాలని ప్రయత్నిస్తే మాటలు దొరకనట్టయ్యాయి.
    "కొంచెం కాఫీ పెట్టి తెస్తాను, నాన్నా!" అందిఎమీ తోచక.
    "వద్దమ్మా! , వద్దు, ఇప్పుడెం  కాఫీ?" అంటూ ఉన్నా వినిపించుకోకుండా "ఫర్వాలేదు నాన్నా! కొంచెం తెస్తాను" అంటూ వంటగది లోకి వెళ్ళిపోయింది. గబగబా కుంపటి అంటించి ఓ గ్లాసుడు నీళ్ళు పడేసింది. బొగ్గులు ఎర్రగా రేగుతున్నా విసురుతూ ఎదురుగా కూర్చుంది.
    తండ్రి చెప్పిన విషయం ఇంకా నమ్మశక్యం గా లేదు పార్వతికి. చలపతి మామయ్యా కేవలం కట్నం కోసం మరో సంబంధం కుదుర్చుతున్నాడా? ఇన్నాళ్ళూ చెప్పిన కబుర్లన్నీ మరిచేపోయాడా? ఈ తతంగం అంతా రఘూ కు తెలుసా? తెలిస్తే ఊరుకుంటాడా? ఏదో అనుమానం గుండెల్ని పాములా పెనవేసుకుంది.
    ఊహూ! ఇంకా రఘు కు తెలిసి ఉండదు. తెలిస్తే ఎంతమాత్రం ఊరుకోడు. ఎప్పుడెలా ఉన్నా తన విషయం లో మాత్రం ఇంత నిర్లక్ష్యంగా చెయ్యడు. రఘును మాట మాత్రమైనా సంప్రదించకుండా తనిలా దిగులు పడటం దేనికి? ఇప్పుడెమంత మించి పోయిందని?
    పార్వతి మనస్సులో ఓ చిన్న ఆశాజ్యోతి దానంతటదే వెలిగింది. ఆ కాంతి కిరణాలు మినుకు మినుకు మంటూ ఎంతో బలాన్నీ ధైర్యాన్నీ కలిగించాయి.                                                               


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS