Previous Page Next Page 
చదరంగం పేజి 14

                                

    "ఏరా, రామూ, అలా ఉన్నావు?" హాల్లో నిల్చున్న వేణుగోపాల్ కొడుకును ప్రశ్నించాడు.
    "నాన్నగారూ!" అంటూ గట్టిగా కౌగలించుకొన్నాడు తండ్రిని. పొద్దుటినుంచీ పడే బాధ క్షణంలో మరిచిపోయాడు.
    "ఏమిట్రా, రామూ? ఎందుకూ?" వేణుగోపాల్ కొడుకు తలమీద చేయివేసి ప్రశ్నించాడు.
    ఎన్నడూ లేనిధి రాము ఇలా బేజారైపోవడం వేణుగోపాల్ ను కలవరపరిచింది. తన కొడుకు ఇలా గత పదిహేనేళ్ళలో ఎన్నడూ ప్రవర్తించలేదు. అతని పితృహృదయం బాధతో ఉడికిపోయింది. "అమ్మ ఏమైనా అన్నదా?" వేణుగోపాల్ కొడుకును ప్రశ్నించాడు.

                              *    *    *

    "చెప్పు, తమ్ముడూ ఇప్పుడు నన్నేం చేయమంటావు?" వెన్నెల్లో డాబామీద కూర్చున్నారు అన్నదమ్ములిద్దరూ. వేసవికాలం అయినా చల్లనిగాలి హుస్సేన్ సాగర్ మీదుగా వచ్చి కొద్దిగా వణికిస్తూంది.
    రవి ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఏమని సలహా ఇవ్వగలడు? అన్న అయితే రాముకే పాలుపోక సలహా అడిగితే, వయసులో అనుభవంలో చిన్న అయిన రవికి ఏం తెలుస్తుంది? అర్ధంకాని అవప్లేదో ఆవరించింది రవిని.
    "నీకేం చేయాలని ఉంది?" రవి అడిగాడు.
    నీరసంగా నవ్వాడు రాము. "నాకసలు తోచకనే కదురా నీ సలహా అడుగుత?"
    "పోనీ, గర్భస్రావం చేస్తే?"
    "లేదురా, రవీ ఆ అవకాశం లేదు."
    "పోనీ, మనకెందుకొచ్చిన గొడవ! వాళ్ళ అమ్మా నాన్నకూ చెప్పేస్తే?"
    "అలా చేయవని నాచేత ప్రమాణం చేయించు కొందిరా."
    "పోనీ, ఒకపని చేయండి. కొన్నాళ్ళు అక్కడే ఉంచి ప్రసవించాక బిడ్డను ఏ అనాథాశ్రమానికైనా ఇచ్చేసి తనని నిశ్చింతగా ఉండమనవచ్చును."
    ఇద్దరికీ తమలపాకులు ఇవ్వాలని వచ్చిన భారతీదేవి సంభాషణ అనుకోకుండా వినేసింది.
    రాము ఖంగారు పడ్డాడు. "మీరు అంతా వినేశారా, భారతీదేవీ?"
    "అనుకోకుండా విన్నాను. నావల్ల మీకెవరికీ అపకారం జరగదు, బావా! కూర్చోండి." తను కూర్చుంటూ అన్నది.
    "నిజమే, భారతీదేవి అన్నది సరిగానే ఉన్నట్టు తోస్తున్నది కదన్నయ్యా?"
    రవి సమాధానం తృప్తిగా అనిపించలేదు రాముకు. "ఎన్నాళ్ళని మనం అట్టే పెట్టుకొంటాం? ఇంత కంటే....." సగంతో ఆపుజేసి ఖంగారుగా క్రిందికి చూశాడు రాము. అప్పటికే రాధ పెట్టే బెడ్డింగ్ పెట్టేసి అన్నగారితో ఏదో మాట్లాడుతూంది. ఒకరు ఒకరుగా డాబామీదనుంచి దిగి వెళ్లారు ముగ్గురూ.
    భారతి భుజంమీద మనవడు నిద్రపోతున్నాడు. వేణుగోపాల్ వాడిని అందుకొని మంచంమీద పడుకోబెట్టాడు. రాధ హఠాత్తుగా ఊడిపడడం అందరికీ ఆశ్చర్యంగానే ఉంది.

                              *    *    *

    "నువ్వు ఎన్నైనా చెప్పు, రాధా! వాడిని నేను ఒప్పించలేను. నన్నెందుకిలా మిథ్యావాదిని చేస్తారంతా కలిసి? ఒకసారి కాదు, వందసార్లు ఆలోచించు. ఇదే నీ మొగుడైతే అలా చేస్తాడా?"
    రాధ కంట తడి పెట్టింది. "నా పరువు కాపాడన్నయ్యా. అది చచ్చిపోయినా సరే."
    "లేదు, చెల్లీ. నేను కఠినున్నే అనుకో. న్యాయం ఒప్పుకోదు. చట్టం శిక్షిస్తుంది."
    "ఇంట్లోకూడా ఏమిటన్నయ్యా, ఈ న్యాయాన్యాయాలు?"
    "ఇంట్లో కాదు. కనుచూపుమేరలో అన్యాయం జరుగుతూంటే ఊరుకోను. ఆఖరికి రామూ, రవే ఇలాంటి అవకతవక పనులు చేస్తే వాళ్ళని చంపి నేను......"
    "విష్ణుని నేను పెళ్ళి చేసుకుంటాను, నాన్నగారూ." రాము అనగానే ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు అంతా.
    వేణుగోపాల్ మాట్లాడలేదు. ఎవరికి వారే వినరాని సంగతి వింటున్నట్లు అచేతనంగా ఉండి పోయారు. భారతి కూడా మాట్లాడలేదు. భారతి కొడుకును పరీక్షగా చూసి మెల్లగా కదిలి వెళ్ళిపోయింది. చాలాసేపటి వరకు తండ్రి కొడుకులు ఇద్దరే మిగిలారు.
    "త్యాగంకోసం చేయకు. నాకు తెలుసు నీ బాధ. కానీ ఏం చేయాలి? నిన్ను ఆజ్ఞాపించడం కాదు, రామూ నీ మనశ్శాంతి కోసం. పోనీ, ఎక్కడికైనా వెళ్ళి కొన్నాళ్ళు ఉండిరా."
    "లేదు, నాన్నగారూ. పూర్తిగా నిర్ణయించుకొనే మాట్లాడుతున్నాను. మీమీద అభిమానంతోకానీ, అమ్మ ఆజ్ఞాపించిందనికానీ ఏ ఉద్దేశ్యం లేదు నాకు."
    "ఇటువంటి విషయాల్లో మనోదార్ధ్యం ఉండాలి, రామూ. నీకు తెలీదు. ఒకప్పుడు కాకపోయినా మరొకప్పుడు అయ్యో, అనిపిస్తుంది. ఎంతో బాధ, వేదన, ఒకటేమిటి? మానసికంగా నరకం అనుభవిస్తూ బ్రతకాలి."    
    "ఫరవాలేదు, నాన్నగారూ నేను బాగా ఆలోచించాను. భార్య వదిలేసిన మగవాడిని స్త్రీ సహించినపుడు, స్త్రీని ఎందుకు క్షమించకూడదూ?"
    వేణుగోపాల్ హృదయం అంతు తెలియని ఆవేదనకు గురి అయిపోయింది. అతని అంతర్గతఃవేధన గుర్తించ డానికి రాము మామూలు చదువు పనికి రాలేకపోయింది. చెవులు బద్దలు చేస్తూ పన్నెండు గంటలు కొట్టారు ఠాణాలో. వేణుగోపాల్ మంచం మీద అటూ ఇటూ దొర్లుతూ జాగరం చేయసాగాడు.

                              *    *    *

    తల దించుకొని డిస్పెన్సరీలో పేషంట్స్ నందరినీ పరీక్ష చేస్తూ, త్వర త్వరగా పంపించేస్తున్నాడు. దూరాన వేపచెట్టుక్రింద బెంచీమీద కూర్చొని 'ఎటేల్ ఆఫ్ టూ సిటీస్' చదువుతూంది విష్ణు. చదువుతూందో, మనసును లగ్నం చేస్తూందో ఊహించడం కష్టం.
    ఎనిమిది దాటాక పూర్తిగా జనం తగ్గిపోయారు. రాము స్టెతస్కోపు ఊగించుకొంటూ విష్ణు దగ్గిరికి వచ్చి భుజంమీద చేయివేశాడు. ఉలిక్కిపడి లేచి నిల్చుంది.
    "భయపడ్డానా, విష్ణూ?"
    "లేదు, బావా. పోనీ, నేనిప్పుడు పెళ్ళి చేసుకోకపోతే వచ్చిన నష్టం లేదుకదా?"
    రాము కోపగించుకొన్నాడు. "అయితే ఇంతసేపూ ఈ చెట్టుక్రింద కూర్చొని ఇదే ఆలోచిస్తున్నానన్న మాట. విషయం విని అమ్మ ఏమన్నదో తెలుసా? నిన్ను పెళ్ళి కూతురిగా ఎప్పుడు చూడాలా అని ఉన్నదట. ఇంకా ఏమి టేమిటో అన్నది, విష్ణూ!"
    "దేన్ని చూసుకొని చేసుకొంటావు, బావా?" విష్ణుప్రియలో పశ్చాత్తాపం అణువణువునా బయటికి వస్తూంది.
    విష్ణు భుజంమీద చేయివేశాడు రాము. "భయపడకు, విష్ణూ. నువ్వు పడే బాధ నాకు తెలుసు. నొసటివ్రాతలు ఎవరూ తప్పించలేరు. నీకు నా భార్యగా ఇవ్వవలసిన గౌరవం తప్పకుండా ఇస్తాను."
    విష్ణు మాట్లాడలేదు. మౌనంగా మనసును దూర దూర తీరాలకు తోలేస్తూంది.
    
                               *    *    *

    ఇంట్లో అంతా సందడిగా ఉంది. ఇంటికి రంగులు వేయడం, ముగ్గులు పెట్టడం, తోరణాలు కట్టడం లాంటి పనులు దగ్గర ఉండి భారతీదేవి చేయిస్తున్నది. రాధకు పుట్టిల్లు, విష్ణుకు అత్తిల్లూ ఒకటే కావడం వల్ల పెళ్ళికూడా ఇక్కడే జరగాలని నిర్ణయించాడు వేణుగోపాల్.
    పసుపు కుంకాలు దంపించి, వైభవంగా చేయాలని భారతి ఆరాటం. చిన్నకొడుకు పెళ్ళి తను చూడనే లేదు. ఈసారైనా తను స్వయంగా తన చేత్తో జరిపించే ఈ శుభకార్యం నాలుగురోజులపాటు నలుగురూ చెప్పుకొనేట్లు ఉండాలి. ఒంటినిండా నగలు పెట్టుకొని అత్తగారి హోదాతో నాలుగురోజులు ముందుగానే అందర్నీ పేరంటానికి పిలిచింది. భారతీదేవి కాబోయే అక్కగారితో పరిహాసాలు ఆడుతూ రోజుకోరకంగా పెళ్ళికూతుర్ని చేసి రాత్రి కాగానే భర్తకు వార్త లన్నీ అందించేది సంబరంగా.
    ఇంట్లో రోజుకు నలుగురైదుగురైనా ఉండేవారు భోజనాలకు.
    "బాబా, పెళ్ళికొడుకు నీలా ఉండాలా?" వచ్చీరాని మాటలతో పెదనాన్నలాగే సింగారించుకొని తోడ పెళ్ళికొడుకైన చిన్నవేణును ఎత్తుకొని ముద్దుల వర్షం కురిపించాడు రాము.
    "బాబా!" అని పిలుస్తూంటే అణగారిన రాము హృదయంలో రక్తం పొంగి ప్రవహిస్తూంటుంది. ఏమిటో ఈ రక్తసంబంధాలు!
    భారతీదేవి, రవి ద్వారా ఈ పిల్లాడు తనకు ప్రాణానికి ప్రాణం అయిపోతున్నాడు. డిస్పెన్సరీకి తీసుకువెడితేగానీ ఊరుకోడు. ఎక్కువగా తన దగ్గిరగాని, తన తల్లీ తండ్రీ దగ్గిరగాని ఉంటాడు. మరెవరిదగ్గరా ఉండడు. అసలు రవీ భారతీదేవుల దగ్గిర అలవాటు తక్కువే. పొడుగ్గా కుంకం పెట్టుకొని తలమీద క్రాపులో చిక్కుకుపోయిన అక్షింతల్ని దులుపుకొంటున్నాడు.
    విష్ణు సందడిలో బాబును నిర్లక్ష్యం చేయకూడదు. పసిహృదయాన్ని బాధ పెట్టకూడదు. రాము మనసుకు పాఠాలు నేర్పుతున్నాడు.

                              *    *    *

    "బావా, అత్త పడిపోయింది!" ఖంగారుగా చేతినున్న మసిఅయినా తుడుచుకోకుండా పరుగున రెండేసి మెట్లు దాటేస్తూ వచ్చింది భారతీదేవి. పిల్లాడిని అక్కడే వదిలేసి క్రిందికి పరిగెత్తాడు రాము.
    భారతికి స్పృహే లేదు. వేణుగోపాల్ ఖంగారుగా భారతి తలను ఒడిలో పెట్టుకొన్నాడు. రాము నాడి చూసి చటుక్కున లేచాడు. "నాన్నగారూ, అమ్మ డిస్పెన్సరీకి వెళ్ళిందా?" వేణుగోపాల్ కు కొడుకు ప్రశ్న అర్ధం కాలేదు.
    "అమ్మ కార్లో ఒకతే ఎంతదూరం వెళ్ళింది, నాన్నగారూ?"
    తల్లి కాళ్ళ దగ్గిర కూర్చున్న రవి నిశ్శబ్దంగా ఏడుస్తున్నాడు. రాము పిచ్చివాడిలా జుట్టు పీక్కుంటున్నాడు. భారతి శ్వాస ఏనాడో ఆగిపోయింది. అదేమీ గమనించలేదు రవీ, వేణుగోపాల్.
    "భారతీ!" వేణుగోపాల్ పిలుపు అందని అమరలోకానికి పరుగుపరుగున వెళ్ళిపోయింది భారతి.
    గుండెలు మండే వేదనకు దాచుకొందో, హృదయాన్ని బద్దలు చేసే విషాదాన్ని మూట గట్టుకొందో, బ్రతికి ఉన్నన్ని రోజులూ ఒంటరిగా ఎంత బాధ ననుభవించిందో అంతు తెలియని లోకాలకు ఎరిగిపోయింది భారతి జ్యోతి.
    వేణుగోపాల్ ఏడవలేదు. తల బద్దలు చేసుకోలేదు. శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు. భారతి ఇక రాదు. గడిచిన ఇరవై సంవత్సరాల తోడూ ఒంటరిని చేసి నిర్దయగా వెళ్ళిపోయింది.
    'భారతీ, నేను ఒక్కన్నే ఎలా ఉండగలననుకొన్నావు? నువ్వు లేకపోతే నేను లేనని నీకు తెలిసే ఎందుకిలా చేశావు? ఈ వయసులో నన్ను ఎవరికి అప్పగించి వెళ్ళిపోయావు? నన్ను నిలువునా కూల్చేసి నాకసలు శక్తి లేకుండా చేసి, నీ స్వార్ధానికి నన్ను బలి చేస్తున్నావుటోయ్.' ప్రేమగా ఒళ్ళంతా నిమురుతున్నాడు.
    'భారతీ, నిన్ను ఎవరేమన్నారోయ్, ఈవేళ ఇలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావు. గడప దిగితే నాతో చెప్పకుండా వెళ్ళని నువ్వు ఎందుకిలా చేశావు?'
    పెద్దకొడుకును దగ్గిరికి పిలిచాడు వేణుగోపాల్. "చూడు, రామూ. అమ్మ ఎంత పని చేసిందో!" వేణు గోపాల్ కళ్ళలో కాంతి లేదు. ఆరిపోయిన జ్యోతుల్లా ఉన్నాయి. "అమ్మని దక్కించుకోలేకపోయావు. మీ అమ్మ చెబితే ఏమిటో అనుకొన్నాను. పిల్లల్ని దూరం చేయకండీ, డిగ్రీలూ వద్దు, పాడూ వద్దు అంది. అవసరానికి పకినిరాని ఈ డిగ్రీలు అనవసరం అని మీ అమ్మకి తెలిసినంత అయినా నాకు తెలియదు."
    నేరస్థుడిలా తల దించుకొన్నాడు రాము. ధారావాహినిలా ప్రవహించే కన్నీటికి చొక్కా తడిసి పోతూంది. తల్లి వేసిన అక్షింతలు వంగోవడంవల్ల ఉండి ఉండి చేతులమీద పడుతున్నాయి. వెక్కిళ్ళు కూడా వినిపిస్తున్నాయి. తల్లిమీద చేయివేసి ప్రేమగా కళ్ళలోకి చూస్తున్నాడు. మూసుకున్న కళ్ళలో ఏమీ కనిపించడం లేదు. మాతృ ప్రేమకు మారుపేరుగా నిలిచిన భారతి వెళ్ళిపోయింది రెక్కలు విదిలించుకొని.
    "అమ్మ, అమ్మ!" రవి పెదవులు వణుకుతున్నాయి. "అమ్మా, నా పెళ్ళి చూడలేదని విచారించిన నువ్వు అన్నయ్య పెళ్ళిని ఆపేశామమ్మా?" రవి అంతులేని అనురాగంతో అడుగుతున్నాడు.
    క్షణంలో పెళ్ళిపందిరి భారతికి ఆఖరి వీడ్కోలు ఇవ్వడానికి సిద్ధమైపోయింది. వచ్చినవారంతా ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. రాము, రవి తల్లి కాళ్ళకు నమస్కరించారు.    
    పెద్దల హడావిడితో ఎక్కువసేపు ఉంచలేదు భారతి శవాన్ని. బ్రతికిఉన్నన్ని రోజులూ అందల మెక్కించే ఈ పెద్దలే క్షణంలో మారిపోతారు. భారతిని ఇంట నిలవనివ్వడంలేదు.
    శుచిగా స్నానం చేసి మడిబట్టలతో ధోవతులు బిగించి బ్రాహ్మణుల ఆదేశం ప్రకారం రవీ, రామూ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.
    తల్లికి స్నానం చేయించి నిండుగా ముస్తాబు చేశారు. ఒంటినిండా పెట్టుకొన్న నగలు అలాగే ఉన్నాయి. పెళ్ళినాటి చీరను ముచ్చటగా కట్టుకొంది భారతి. పిల్లలిద్దరూ తెల్లని కొత్త చీరలో తల్లిని చూడసాగారు. ఒంటినిండా పసుపురాసి, తలనిండా పూలుపెట్టి కొత్తపెళ్ళికూతురిలా సింగారించారు.
    భారతి పెదవులో చిరునవ్వు శాశ్వతంగా దోబూచులాడుతూంది. కొడుకులిద్దరి చేతిమీదుగా భర్త సాన్నిధ్యంలో వెళ్ళిపోతున్న తృప్తి, గర్వం కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నాయి.
    క్షణంలో పూలపల్లకీ తయారైంది, భారతి కోసం నిరీక్షిస్తూ. వేణుగోపాల్ నిస్తే జుడై భార్యకోసం విలపిస్తున్నాడు. నలుగురు మోస్తున్న సవారీలో నిండుగా, దర్జాగా పడుకొంది.
    ముందు పెద్దకొడుకు సాగుతూంటే వెనక పరివారంతో తిరిగిరాని ప్రదేశానికి నిర్విచారంగా తరలివెళ్ళిపోయింది భారతి. క్షణంలో భారతి అధ్యాయం కలమాదిరి కరిగిపోయింది.

                                 *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS