Previous Page Next Page 
సంపెంగ పొదలు పేజి 14


                                    16

           
    అనుకోకుండా వచ్చిన ఉమను చూసి ఆశ్చర్య సంభ్రమాశ్చర్యాలతో ఉక్కిరిబిక్కిరయ్యాడు హరి. అతని ఆశలు ఆకాశాన్నంటుకున్నాయి. హవుసు సర్జను కూడా పూర్తీ చేసిన ఉమ ఇక శాశ్వతంగా తనది కావటానికే ఇలా వచ్చిందను కున్నాడు. ఆమె ముఖం లోని నీలి నీడలు, కన్నులలోని నిరుత్సాహము, చిరు నవ్వులోని పెలవత్వమూ, పొంగి పొర్లే హరి ఉత్సాహానికి ఆనకట్టలు కాలేక పోయాయి. హరి ఉత్సాహాన్ని, ఆనందాన్నీ చూసిన ఉమ మరింత కృంగిపోయింది. పసిపిల్లాడి లాంటి ఈ నిర్మల మూర్తికి తాను చెప్పదలచుకున్నది ఎలా చెప్పటం/ తన నింత గాడంగా ప్రేమించిన హరి, తనకోసం తహతాహ తో ఐదేళ్ళు నిరీక్షించిన హరి, వూహలు తెలియని పసితనం నుంచీ తనమీద సర్వాదికారాలూ చెలాయించిన హరి, ఈ ఆశా భంగాన్నేలా ఎదుర్కొంటాడూ? అతి సున్నితమైన హృదయమూ, అత్యంత ఉద్రిక్త మయిన స్వభావమూ కల తన బావ ఈ దెబ్బకు తట్టుకోలేక ఏమయినా అయిపోతే? ఆ పాపమంతా ఎవరికి చుట్టుకుంటుంది? అలా అని హరిని అంగీకరించటం తనను తాను మోసం చేసికోవటమే గాక, హరిని కూడా మోసం చేసినట్లే అవుతుంది. హరి కోరుతున్నది తన అనురాగాన్ని కానీ, తన శరీరాన్ని కాదు గదా! అలా అనుకుంటే హరి కోరితే. తనకంటే అందమైన వాళ్ళు అతనికి భార్యగా దొరకరా?
    వెనుక నుండి తన కనులు మూయబడటంతో ఉలికిపడి ఆలోచనల లోంచి తేరుకుంది. ఆ కనులు మూసిన ఆ చేతులనూ, ఆ స్పర్శ నూ, తేలికగానే గుర్తించ గలదు ఉమ. ఏ విధమయినా సంచలనమూ లేకుండా ప్రశాంతంగా " చేతులు తియ్యి బావా!' అంది.
    ఉమ ప్రశాంత గంబీర స్థిర స్వరం హరికి, ఉమ ప్రసన్నతగా భాసించింది. చిరునవ్వుతో చేతులు తీసి ఆమె మీదకు వంగ బోయాడు-- ఉమ చటుక్కున లేచి "బావా! నన్ను ముట్టుకోకు" అంది స్థిరంగా.
    ఇప్పటికి హరి తెల్లబోయాడు. అంతలో తేరుకుని నవ్వుతూ, "ఇంకా ఎన్నాళ్ళు ఇలా నన్ను దూరంగా ఉంచగలవో చూస్తాగా! అప్పుడు నా కసి అంతా తీర్చుకుంటాను" అన్నాడు.
    "నన్ను క్షమించు బావా! నిన్ను ఒకప్పుడు దగ్గిర చేసుకుందామనే భావన నాలో ఉంటె, ఇప్పుడే నిన్ను దగ్గర చేసుకునేదానిని. నిన్ను శాశ్వతంగా నాకు దూరంగా ఉంచాలనే నా నిశ్చయం. నాకు వివాహం మీద కోరిక లేదు. నీకు తగిన ఎవరినైనా , చూసుకుని పెళ్లి చేసుకో! నన్ను మర్చిపో!"
    హరి నోట మాట రాక, పిచ్చివాడిలా అలా ఉమ వంకే చూస్తూ నిలబడి పోయాడు. ఆ చూపులకు ఉమ గుండెలు అవిసి పోతున్నాయి. ఆపుకుందామని ఎంత ప్రయత్నించినా ఉమ కన్నీళ్లు ఆగటం లేదు. హరి దగ్గరగా వెళ్లి భుజాలు పట్టుకుని కుదుపుతూ "బావా!' అంది ఆందోళన గా ---హరి ఉమ చేతులు విదిలించి వెనకు వెళ్లి "నన్ను ముట్టుకోకు" అన్నాడు కసిగా.
    ఉమ నవ్వింది. "నువ్వు మనసారా ఆ మాట అనగలుగుతే అదృష్ట వంతురాలిని."
    "నవ్వుతున్నావా? అవును. నీకు నవ్వులాట గానే ఉంటుంది. అయితే నువ్వు ఎం.బి.బి.యస్. లో చేరటానికి కూడా కారణం ఇదే కదూ! ఈ ఉద్దేశం మనసులో ఎన్నడో కలిగింది కదూ! నువ్వు నాకంటే అందగాడ్ని, గొప్పవాణ్ణి , ఎవర్నో ప్రేమించి ఉండాలి. అందుకనే నన్ను అసహ్యించు కుంటున్నావు. ఛీ! ఏం ఆడవాళ్ళు! ఎంత చంచల మైన మనస్సూ?"
    హరి ఉద్రేకంతో వూగిపోతున్నాడు. ఉమ కన్నీళ్ళ ను ఆపలేక పోతుంది.
    "ఇంకా తిట్టు బావా! భాషలో ఉన్న పదాలన్నీ ఉపయోగించి తిట్టు. ఎంతటి తిట్లకయినా నేను అర్హురాలినే. కానీ, నేను నిన్ను అసహ్యించుకోవటం లేదు-- బావగా నిన్నేప్పటికీ అభిమానిస్తూనే ఉంటాను. నా భర్తగా మాత్రం నిన్ను చూడలేను."
    "నిన్ను తిట్టడానికి నేనవర్ని ఉమా! నీమీద నాకేం హక్కు ఉంది? నీ పెళ్లి ఎప్పుడో చెప్పు. వచ్చి మీ ఇద్దర్నీ చూసి సంతోషిస్తాను."
    "నేనసలు పెళ్లి చేసుకోను బావా! నాకు దేశ సేవ చేద్దామని ఉంది. అందుకనే డాక్టరు నయ్యాను. ప్రస్తుత దేశ పరిస్థితిని బట్టి ఎందరో డాక్టర్లు యుద్దంలో గాయపడిన వారికి అవసరం. నేను తేజ్ పూర్ హాస్పిటల్ లో అప్పాయింట్ అయ్యాను. డ్యూటీ ;లో చేరడానికి నిశ్చయించు కున్నాను. వెళ్లబోయే ముందు మిమ్మల్నందరినీ ఒకసారి చూడాలనిపించి వచ్చాను.
    హరి ముఖం పాలిపోయింది. చాలాసేపటి వరకూ, అతను మాట్లాడలేక పోయాడు. చివరకు "ఉమా! ఎందుకింత కసి నామీద నీకు?' అన్నాడు.
    ఉమ వంచిన తల ఎత్తలేక పోయింది.
    "క్షమించు బావా! క్షమించు. ఈ స్వార్ధ పరురాలిని నిర్లక్ష్యం చేయటం నేర్చుకో! నీ బ్రతుకు బాట నువ్వు దిద్దుకో!" అంది చివరకు.
    హరి సమాధానం చెప్పలేదు. చాలాసేపు ఆ ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యం చేసింది. హరి లేచి నిలబడి "ఈ లోపమేదో నా జాతకం లోనే ఉంది. నా ప్రాణం లా అభిమానించిన దుర్గ స్వయంగా నా ఇంటికి రావద్దంది. నా సర్వస్వంగా భావించిన నువ్వు నాకు దూరంగా పోవటమే కాక, ఈ లోకపు బంధాలకు కూడా దూరంగా పోవాలను కుంటున్నావు. వద్దు ఉమా! నేను నిన్నే విధంగా నూ బాధించను. నాకు భయపడి ఆ యుద్ద రంగం లోకి పారిపోవద్దు. నీకెలా సంతోషమో, అలాగే ఉంటాను. నీ సంతోషం లోనే నా సంతోషాన్ని వెతుక్కుంటాను. అక్కడికి వెళ్ళనని మాట ఇయ్యి" అన్నాడు.
    ఉమ తన ఆవేదన నణచుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది.
    "నువ్వు దేవతవి బావా! నీ ప్రేమకు అర్హురాలిని కాలేక పోవటం , నా దిరదృష్టం . కానీ నా నిశ్చయాన్ని మార్చటానికి ప్రయత్నించకు. ఇలాంటి అవకాశం మాత్రం ఎంతమంది కి వస్తుంది బావా! ఇది బ్రతుకును సార్ధకం చేసికోవటం కానీ వ్యర్ధం చేసికోవటం కాదు. నాకు సంతోషం ఇందులో ఉంది గనుకనే ఇలా నిశ్చయించుకున్నాను."
    హరి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు . ఉమ బరువుగా విశ్వసించింది. ఆమె గుండెల మీద నుండి ఎవరో పెద్ద కుంపటి ని దింపినట్లయింది. ఆవేదనతో గుండెలు కరిగి కన్నీరుగా ప్రవహించినా, ఈ కన్నీటి లో కొంత సంతృప్తి ఉంది.
    రెండు రోజులు గడిన తరువాత ఉమ తన మొహమాటాన్ని అణచుకుని, "బావా! గిరిని చూసి వద్దామా?" అంది. హరి నిర్లిప్తంగా "పద?" అన్నాడు.
    ఏదో పత్రిక చదువు కుంటున్న గిరి హరి, ఉమలను చూసి చిరునవ్వుతో ఆహ్వానించాడు. నీరసంగా నిరుత్సాహంగా ఉన్న హరిణి చూసి "ఏమయ్యా పెళ్లి కొడుకా, అలా ఉన్నావ్" అని వేళాకోళమాడాడు-- ఈ వేళాకోళం హరి మనసునూ, ఉమ మనసునూ కూడా కలత పరిచింది. హరి నిర్జీవంగా నవ్వి, "ఉమ యుద్దంలో గాయపడిన వారికి వైద్యం చెయ్యడానికి తేజ పూర్ వెళ్తుంది. మనకందర కూ "గుడ్ బై చెప్పడానికి వచ్చింది." అన్నాడు.
    గిరి స్థాణువులా అయి, "ఏమిటీ?' అన్నాడు నమ్మలేనట్లు -- ఉమ నవ్వుతూ-- "ఈ మధ్య సరిగా వినబడటం లేదా" అంది. గిరి తిరిగి నవ్వలేక పోయాడు-- ఉమ నిశ్చయానికి కారణమేమిటో అతనికి చక్కగా తెలుసు-- అంతులేని ఆవేదన అతని కళ్ళలో సుడులు తిరిగింది -- అతని పెదిమలు కదిలాయి. కానీ మాటలు పైకి రాలేదు.
    అతని ఆవేదన గమనించిన ఉమ తృప్తిగా నిట్టూర్చింది. "ఇది చాలు" అనుకుంది.
    గిరి బాధ పడ్తున్నాడని గ్రహించిన హరి, అది తన మీద సానుభూతి గా అర్ధం చేసుకుని, "ఎందుకు గిరీ. అలా బాధపడ్తావ్! మనలో ఒకరైనా ఇలాంటి మంచిపని చేస్తున్నందుకు మనం గర్వపడాలి " అన్నాడు.
    గిరి దిగాలుగా "దేశసేవ చేయాలనే దీక్ష సహజంగా ఉంటె చాలా మంచిదే! కానీ, వేరు కారణాలేవైనా దీనికి దారి తీస్తే మాత్రం ......." అని ఆగిపోయాడు.
    ఉమ వూరుకోక "కారణమే దైతే నేం? జరుగుతున్నది మంచిదేగా" అంది.
    గిరి, హరి వంక చూస్తూ, "కానీ ఒక అనురాగభరిత హృదయాన్ని క్షోభిల జేయటం మాత్రం క్షమింపరాని నేరం" అన్నాడు.
    ఉమ కొంటెగా నవ్వి "నిజంగా?' అంది.
    ఆ ఎత్తి పొడుపు సూటిగా గిరి గుండెల్లో గుచ్చుకుంది. ఆ తరువాత ఎంత ప్రయత్నించినా, ఆ ముగ్గురిలో ఎవ్వరూ సహజంగా ఉండలేక పోయారు. ప్రతి ఒక్కరి మనసు లోనూ ప్రచండమైన తుఫాను చెలరేగుతుంది. కొంతసేపు ఎలాగో కృత్రిమమైన మాటలతో గడిపి హరి, ఉమ, సెలవు తీసుకుని వెళ్ళిపోయారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS