"ఏం లేదండీ! ఆ రోజున హోస్పేటలో మీరంతా మేడముందు తోటలో కూర్చుని పాటలూ అవీ పాడుకొంటున్నారు. మేడమ్ పైకి పోయినప్పుడు నేనుకూడా ఆమెతో వెళ్ళాను. గుర్తుందా? మేడమ్ పడుకొన్నారు. నా కేమీ తోచక మేడమీద అటూ ఇటూ తిరుగుతూ ఉంటే, వెనక సిగరెట్ తాగుతూ అరుగుమీద కూర్చుని రామనాథం గారు కనుపించారు. ఏమయిందో నాకు! వెనక మెట్లనుండి దిగి, తోట లోనికి పోయాను. అంతే! మోసగించబడ్డాను! ఇక నేను బతికి ఏం లాభం! బతికితే నలుగురూ ఉమ్మే స్తారు! ఎవరిదాకానో ఎందుకు? మా ఇంట్లోనే నన్ను కుక్కకన్నా హీనంగా చూసి, తిట్టుతున్నారు. వెలివేసిన వాళ్ళని చూసినట్లు చూస్తున్నారు. నా రెక్కల కష్టం మీద బతుకుతూ, నన్నే అంటున్నారు! మా తమ్ముడయితే రోజూ చంపుతానని మీది కొస్తాడు! నేను ఛస్తే, మా వాళ్ళు తిండి లేక మలమల మాడి ఛస్తే, అప్పుడు తెలిసి వస్తుంది వాళ్ళకు! పాపిష్టిదాన్ని! పాపిష్టి పని చేసి, ఏ ముఖం పెట్టుకొని తిరగను?" అంది వలవల ఏడుస్తూ.
సాధారణంగా కాలు జారిన ఆడది ఆ పరిస్థితికి కారణాలు చెప్పడానికి జంకుతుంది! కాని అనంతలక్ష్మి స్థితి వేరు. సత్యవతి, పారిజాతం తన కేమన్నా సహాయం చెయ్యగలరేమో? అంతేకాదు! తనతో అంత ఆప్యాయంగా మాట్లాడినవారు ఈ రెండు నెలల్లో ఎవరూ కనిపించలేదు! అందుకే పారిజాతం అడిగినవెంటనే అనంతలక్ష్మి అసలు సంగతి బయటపెట్టింది.
ఈ ఘాతుకానికి కారకుడు తన అన్నే అని తెలిసేసరికి సత్యకు సిగ్గు, దుఃఖం కలిగాయి. ఒక కాముకుడు తనకు అన్న!
పారిజాతం ఆలోచన వేరు. జరిగినదానికి అనంత లక్ష్మి, రామనాథం ఇద్దరూ బాధ్యులే! ఎవరూ లేనప్పుడు అతని దగ్గరకు పోవడం అనంతలక్ష్మి తప్పు! వివాహితుడై కూడా హద్దు దాటడం రామనాథం తప్పు! అసలు అనంతలక్ష్మి ఇంత కొంప మునుగుతుందని ఊహించి ఉండదు. అతని హోదా, కారు, వేషం చూసేటప్పటికి ఈవిడ మతి పోయి ఉంటుంది! నిషాలో ఉన్నాడేమో, అతనికీ ఒళ్ళు తెలిసి ఉండదు. ఇద్దరూ తప్పు చేశారు! కాని, ఒకరు మాత్రమే దోషిగా పైకి పట్టుబడ్డారు. స్త్రీలపట్ల ప్రకృతే ఆప్యాయం చేస్తే, ఇక మానవ మాత్రులు చెయ్యడంలో వింతేమున్నది?
అనంతలక్ష్మి తప్పును ఆమెకు చూపడం చచ్చిన పామును కొట్టడమే! ఇప్పుడు జరిగిన తప్పును విమర్శించడం కంటే, దాన్ని సరిదిద్దుకోడం ముఖ్యం!
అనంతలక్ష్మిని ఓదార్చి, ధైర్యం చెప్పి పారిజాతం సత్యతో కూడా ఇంటికి పోయింది.
భద్రగిరి నాయుడుగారు మంచం మీద పడుకొని ఉన్నారు. సౌభాగ్యమ్మ గారు గుండె మీద ఉప్పుతో కాపడం పెట్టుతున్నారు.
పారిజాతం, సత్య-ఇద్దరూ కంగారుపడి, "ఏమి టమ్మా! నాన్నగారి కేమయింది?" అని ఆదుర్దాగా అడిగారు.
భద్రగిరినాయుడు గారు కళ్ళు విప్పి, "ఏం లేదమ్మా! కాస్త గుండెనొప్పిగా ఉందంటే, మీ అమ్మ హడావిడి పడుతున్నది" అంటూ నవ్వారు.
తండ్రికి గుండెనొప్పి అనగానే పారిజాతం మనస్సు కలుక్కుమన్నది. కాని, నవ్వుతున్న తండ్రి ముఖం చూడగానే ధైర్యం వచ్చింది.
"నాన్నగారూ! లేవగలరా? ఒక ముఖ్య విషయంలో మీ సలహా కావాలి. పెరట్లోకి రాగలరా?" అని అడిగింది పారిజాతం.
"నా కేమిటమ్మా? కాని, మీ అమ్మ లేవనిస్తుందా నన్ను? ఆ సంగతి కనుక్కో!" అన్నాడాయన.
పారిజాతం 'ముఖ్యవిషయం' అంటే, అది తప్పకుండా ముఖ్యమైన విషయమేనని గ్రహించిన సౌభాగ్యమ్మ గారు- "తండ్రీ కూతుళ్ళు ఒకటే! పోతే, కావాలనే నామీద ఈ నింద!" అని నవ్వుతూ ముగ్గురికీ కాఫీ చేయటానికి లోపలికి పోయారు.
పెరట్లో పారిజాతం చెట్టు క్రింద ఉన్న మంచం మీద భద్రగిరి నాయుడు గారు కూర్చున్నారు. ఎదురుగా కుర్చీలు వేసుకొని పారిజాతం, సత్య కూర్చున్నారు.
పారిజాతం తండ్రికి అనంతలక్ష్మి సంగతంతా వివరించింది. రామనాథం ప్రవర్తన, అనంతలక్ష్మి కాలుజారిన పద్ధతి, లలిత అహంకారం-అన్నీ వివరించింది.
"ఇప్పుడామెకు మూడో మాసమాట, నాన్నగారూ! స్కూల్లో గల పతివ్రతా శిరోమణులామెను సూటి పోటీగా హేళన చేస్తున్నారు. ఇంట్లో కూడా అంతా కలిసి రోజు కో నరకం సృష్టిస్తున్నారట. ఉరు మురిమి మంగలం మీద పడ్డట్లు, ఈ నింద ప్రాణేశ్వరరావుగారి మీద పడింది. పది రాళ్ళు విసిరితే, ఒక రాయైనా గురి తప్పకుండా తాకుతుంది! పది మంది కలిసి ఒక మాటంటే, ఒకరి మాటన్నా నమ్ముతుంది ఈ లోకం! పాపం, ప్రాణేశ్వరరావుగారు రిజైన్ చేసి వెళ్ళిపోతా రట. ఇప్పుడు కర్తవ్యం ఏమిటి, నాన్నగారూ?" అని అడిగింది పారిజాతం.
శాంతంగా ఆలోచించారు నాయుడుగారు. తరవాత సత్యవతితో ఇట్లా అన్నారు: "చూడమ్మా, సత్యా! నువ్వొకటీ, పారిజాతం ఒకటీ కాదు నాకు! నీలాంటి దానికి అంత దుర్మార్గుడు అన్న ఎట్లయాడు? క్షణికోద్రేకంలో బంగారం లాంటి జీవితాలను పాడుచేసి, పాడుచేసుకొనిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు! ఇప్పుడు మీ అనంతలక్ష్మి సంగతే ఆలోచిద్దాము. మగవాళ్ళ కయినా, ఆడవాళ్ళకయినా 'శీలం' అనే మాట సమానంగా వర్తిస్తుంది. అయితే, మగవాడు శీలహీనుడయినా, ప్రకృతి వాడి జోలికి పోదు. వాడి పాపానికి వాణ్ణి వదిలేస్తుంది. ఇక గుడ్డిలోకం సరేసరి! 'వాడికేం, మగమహారాజు! ఆడదానికి బుద్ది ఉండక్కర్లేదా?' అంటుంది. నిజం చెప్పాలంటే ఆడవాళ్ళను చులకనగా చూసేది ఆడవాళ్లే! స్వభావంలో ఆడవాళ్ళను పోలిన మగవాళ్ళు కూడా చులకన చేస్తారనుకో! అనంతలక్ష్మి లాంటి వాళ్ళను వెక్కిరించడం తను సతీత్వాన్ని చాటు కోవడమన్న మాట. ఇతరుల పతనాన్ని చూసి సంతోషిస్తారు కొందరు. కొందరు విచారించి, వాళ్ళను బాగు చెయ్య కోరుతారు. నాకు చాలా గర్వంగా ఉందమ్మా-నా పారిజాతం, దాని స్నేహితురాలూ ఇంత సంస్కార పతులుగదా అని! నిజమైన సంస్కారం అంటే ఇదే!
"ఇక సమస్యా పరిష్కారం చూద్దాము. నాకు రామనాథం కానీ, అనంతలక్ష్మి కానీ ఎవ్వరూ తెలియదు. కనక నేను హోస్పేట పోయి, ఈ విషయాలు మాట్లాడడం బాగుండదు. పారిజాతం! నీవు వెళ్ళి లలితమ్మ తోటీ, రామనాథం తోటీ ఈ సంగతి వివరించి, రామనాథం ఎలాగైనా అనంతలక్ష్మిని వివాహం చేసుకోవాలని, లేకపోతే అనంతలక్ష్మి తరపున కోర్టు కెక్కుతామనీ చెప్పు. సత్యవతి వద్దు. నువ్వొక్క దానివే వెళ్ళు. రామనాథానికి ఎలాగూ సంతానం లేదు కాబట్టి, చట్టం ఒప్పుకుంటుంది, లలితమ్మ ఒప్పుకొంటే. లలిత ఒప్పుకోకపోయినా, ఏ గుడిలోనో అతనితో అనంతలక్ష్మి కి పుస్తె కట్టిస్తే సరి! కావాలంటే అక్కడ భద్రీ ప్రసాద్ గారి సహాయం తీసుకో. ఆయనా, ఆయన భార్యా చాలా మంచివారని చెప్పావుగా? వాళ్ళ సహాయం ఉండడం చాలా మంచిది. అందువల్ల నీ పని సులువు కావచ్చు. రామనాథం అన్నిటికి మొండికి బడితే, నిజంగా కోర్టుకెక్కుదురుగాని! మీ మహిళా మండలి తరఫున దాన్ని నిర్వహించవచ్చు. మీ మెంబర్లు ఒప్పుకోవాలి!" అని అన్నారు.
"మావాళ్ళు తప్పక ఒప్పుకుంటారు, నాన్నగారూ! ఒప్పుకోవడమే కాదు, సరస్వతీదేవిగారి భర్త జగన్మోహన రెడ్డిగారు లాయరేనా? వారే మన తరఫున వాదించే టట్లు చెయ్యగలుగుతారు! నిజంగా మీ సలహా చక్కగా ఉంది!" అని సంతోషపడ్డారు పారిజాతం, సత్యవతి.
* * *

అనుకోకుండా వచ్చిన పారిజాతాన్ని చూసి భద్రీ ప్రసాద్, సతీదేవి, కృష్ణమోహన్ బ్రహ్మానంద పడ్డారు.
సతీదేవికి రక్తపు పోటు మళ్ళీ హెచ్చిందనీ, పరిస్థితి ఆందోళనకరంగా ఉందనీ భద్రీ ప్రసాద్ వైరిచ్చేసరికి, పదిహేను రోజులు సెలవు పెట్టి రెండు రోజుల క్రితమే వచ్చాడు కృష్ణమోహన్. ప్రస్తుతం సతీదేవి పరిస్థితి చాలా మెరుగయింది. అయినా మంచం మీదనే రోజంతా గడుపుతున్నది.
"కృష్ణా! నిన్ను ఇప్పుడు చూస్తానని కలలో కూడా అనుకోలేదు సుమా! నిజంగా కొన్ని అనుకోకుండా జరుగుతాయి సుమా!" అంది పారిజాతం ఆనందంతో.
"అదృష్టం నాదక్కా! ఇంత త్వరలో నిన్ను చూసానని అనుకోలేదు. మనకు తెలిసి జరగదు కాబట్టే అదృష్టం అన్నారు!" అన్నాడు కృష్ణ ఎంతో సంతోష పడిపోతూ.
"కాదు, కాదు, అదృష్టం మీ దెవరిదీ కాదు! నాది! నాది! భగవంతుడు నా మొర ఆలకించాడు. కాబట్టే నా తల్లి మళ్ళీ నా దగ్గరకు వచ్చింది. భగవంతుడు నన్ను మనసారా క్షమించాడు!" తనలో తాను అనుకొంటున్నట్లు అంది సతీదేవి.
భద్రీ ప్రసాద్ ఆనందం మాటల్లో కన్నా చేతలలో బాగా వ్యక్తమయింది. ఎంతో ప్రేఅగా పారిజాతం తల నిమిరి, "సత్యవతమ్మ అమ్మన్ని కూడా వచ్చిడిస్తే బాగుండేది!" అన్నాడు.
"నే నొక ప్రత్యేకమైన పనిమీద వచ్చాను, బాబాయిగారూ! ఈ పనిలో మీ అందరి సహాయం ఉంటే. అది చాలా బాగా నెరవేరుతుంది. సాయ శక్తులా సహాయం చేస్తానని మీ రంతా మాట ఇవ్వాలి!" అని అంది పారిజాతం.
"నీవు చేసె ప్రతి పనికీ మా సహాయం తప్పక ఉంటుందక్కా! అసలు సంగతి ఏమిటో తెలిస్తే కదా!" అన్నాడు కృష్ణ.
"నేను చెప్పబోయే విషయం మీకు అప్రియం కావచ్చు. మీ కంతా కోపం రాదు కదా!" అని అడిగింది పారిజాతం.
"నీ మీద కోపగించుకునే సామర్ధ్యం ఈ ఇంట్లో ఎవ్వరికీ లేదమ్మా! నీవే ఈ అమ్మ మీద కోపగించుకుంటావేమో?" అని రుద్ధకంఠంతో అంది సతీదేవి.
"ఉపోద్ఘాతాలతోటే చంపుతున్నావు కాని, విషయం ఏమిటో చెప్పవు కదా?" అని కృష్ణ విసుగు కొన్నాడు.
అనంతలక్ష్మి సంగతి వివరించింది పారిజాతం. అంతా నిశ్చేష్టులై విన్నారు!
"ఇది నిజమేనా, అక్కా! ఆమె చెప్పింది నిజమే నంటావా?" అని అడిగాడు కృష్ణ.
"అక్షరాలా! నాకు అణుమాత్రం అనుమానం లేదు. రామనాథం చూపులు కాముకుని చూపులు. బహుశా నీవు గమనించలేదేమో!" అంది పారిజాతం.
"లే దమ్మన్నీ! అబద్దమేమీ లేదు. రామనాథం ఇంతే. అమన్నులంటే పిచ్చి! 'యావుదు కప్పా, ఇది తప్పు' అని ఎన్నోమార్లు చెప్పిడిస్తిని. నా మాట ఖాతరే లేదు" అని అన్నాడు భద్రీ ప్రసాద్.
"అయితే, అక్కా, నీవు పోయి రామనాథం తో ఈ సంగతి చెప్పి, పరిష్కారమార్గం సూచించు. ఒప్పు కొన్నాడా, సరే! లేదా, తరవాత సంగతి ఆలోచిద్దాము!" కృష్ణమోహన్ సాలోచనగా అన్నాడు.
"ఆలోచనేం లేదు! మే మెప్పుడో నిర్ణయించుకొన్నాము. రామనాథం మర్యాదగా ఒప్పుకోకపోతే, అనంతలక్ష్మి కోర్టు కెక్కుతుంది. మీ ప్రోత్సాహం మీదనేలే! వ్యవహారం అంతదూరం పోదనే ఆశ!" అంది పారిజాతం.
ఓపిక లేకపోయినా కృష్ణమోహన్ కూ, పారిజాతానికీ స్వహస్తాలతో వడ్డించింది సతీదేవి. భోజనమైన వెంటనే రామనాథం బంగళాకు పోయింది పారిజాతం.
