అతని హృదయం కూడా అందమైనదని అర్ధం చేసికొన్నాను. అన్నింటి కంటే, అతనికి నా పట్ల అంతులేని ప్రేమ! అంత ప్రేమించే భర్తను పొందగలిగే సౌభాగ్యాన్ని ఆర్ధికమైన ఇబ్బందుల కారణంగా వదులుకోలేను.
ఎనభై రూపాయలతో , సంసారం గడపటం కష్టమే కాని, నేను బి.యస్సీ. పూర్తయిన తరువాత బి.యిడి చేసి కాని పెళ్ళి చేసుకోను. అప్పుడు నేను ఉద్యోగం చేస్తూ రవిని పై చదువులకు పంపుతాను. రవి చాలా తెలివి గలవాడు-- తప్పక యం.ఏ. క్లాసులో పాసవుతాడు. అప్పుడతనికి మంచి ఉద్యోగానికి అవకాశాలు దొరకక పోవు. ఈలోగా నేను కూడా ప్రైవేట్ గా యమ్. ఎ పాసవుతాను. అంతవరకూ పిల్లల్ని కనము. ఇద్దరమూ పోస్ట్ గ్రాడ్యుయేట్లు మయి, ఉద్యోగాలలో స్తిరాపడిన తరువాత, ఇద్దరు పిల్లల్ని మాత్రమే కంటాను. ఫరవాలేదు. మా కుటుంబం హాయిగానే గడుస్తుంది.
అరుంధతి ప్రశంసా, ఆశ్చర్యమూ నిండుకొన్న చూపులతో తారను చూస్తూ కూర్చొంది. తార తనను కొన్నంత అమాయకురాలు కాదు. తాననుకొన్నదాని కంటే ఎక్కువ విలువలు కలిగినది. తార పధకం గాలిమేడ, ఎంతమాత్రమూ కాదు. ఆచరణ యోగ్యమైన పధకమే! ఇందుకు కావలసింది ఆత్మ విశ్వాసం మాత్రమే! తార విషయంలో సందేహం లేదు. కానీ, రవికి ఆత్మవిశ్వాసం బొత్తిగా లేదు. అయినా ఫరవాలేదు. తార రవిని కూడా సంస్కరించ గలదు.
మాట్లాడకుండా తన వంక చూస్తున్న అరుంధతి చూపులకు సిగ్గుపడుతూ , తార ఏమంటావ్ వదినా?' అంది.
"నువ్వింతదూరం అలోచించి నిర్ణయించుకొన్నాక నేననేదేముందీ? ఇంతకూ శ్రీధర్ గారు రవికి సహాయం చేయటానికి నిరాకరించారా?"
తార జరిగిందంతా, అరుంధతికి చెప్పింది.
అరుంధతి నిట్టూర్చింది.
"అదీ నిజమే! శ్రీధర్ గారూ, బావా సంఘం లో సాధారణ స్నేహాన్ని పాటించుకొంటారు. కానీ, మన మందరమూ కలిగిన వాళ్ళమయి ఉండీ , పోయి ఆయనను అర్ధించటమేమిటి? నేనే ప్రయత్నిస్తాను ఉండు. మీ అన్నయ్య గారిని అడిగి చూస్తాను."
"ప్రకాశరావుగారినా? లాభం లేదోదినా? అయన ధోరణి ని బట్టి తెలియటం లేదా?"
"అయన ధోరణి తెలుసులే! కానీ నా మాట కేమైనా విలువ నిస్తారేమో ప్రయత్నిస్తాను"
"నీ ఇష్టం! కానీ అన్నయ్యకు నచ్చజెప్పే మాట ఏం చేసావ్?"
"నా కిదంతా గొడవగా ఉంది. అయినా నీ మాట కాదనలేను. చెప్పి చూస్తాను. వింటాడని మాత్రం నమ్మకం కలగటం లేదు."
"ప్రయత్నించు-- అన్నయ్య ఒప్పుకొన్నా, ఒప్పుకోకపోయినా, నా నిర్ణయం మారదు. అన్నయ్య అంగీకరిస్తే, మా బాంధవ్యం నిలుస్తుంది. ఒప్పుకోకపోతే, ఒకరి కొకరం కాకుండా పోతామంతే!"
దృడస్వరంతో ఈ మాటలని వెళ్ళిపోయింది తార.
* * * *
ఆనాడు లైబ్రరీ లో పుస్తకాల కోసం శ్రీధర్ ఇంటికి వెళ్ళి లైబ్రరీ లో అడుగు పెట్టకుండా వచ్చిన దగ్గిరనుంచీ అరుంధతి, తన మనో చాంచల్యానికి చాలా బాధపడింది. తరువాత కూడా శ్రీధర్ ఇంటికి రావటం మానలేక పోయింది. కానీ, వస్తూనే తిన్నగా లైబ్రరీ కి బయలుదేరిది చాలాసార్లు. శ్రీధర్ ఆమెను లైబ్రరీ లో వదిలేసి, తానేక్కడి కైనా వెళ్ళి పోయేవాడు. కొన్నిసార్లు తనూ అక్కడే కూర్చొనే వాడు-- కానీ, ఎప్పుడూ రచయితలను గురించి రచనలను గురించే సంభాషణలు నడుస్తుండేవి. ముఖ్యంగా శ్రీధర్ ఆంగ్ల భాషా పాండిత్యానికి, అరుంధతి చాలా ముగ్ధురాలయ్యేది. ఏ పుస్తకం బాగుంటుందో, అందులో బాగున్నది ఏమిటో, అలా బాగుండటానికి కారణం ఏమిటో వివరిస్తూ ఆమెకు మంచి పుస్తకాలు అందించేవాడు శ్రీధర్. శ్రీధర్ తో పరిచయం వల్ల తన ఆలోచన శక్తి పెరుగుతున్నట్లనిపించేది అరుంధతికి. ఆమె మనసు మరింత వికసించింది. అతని తో గడిపిన కొద్ది క్షణాలూ ఆమెకు లౌకికమైన అనుబంధాలకు అతీతమైన మరేదో లోకంలో ఉన్నట్లనిపించేది. ఈ అనుబందాన్నింతకు మించి పెరగ నీయరాదని అరుంధతి నిశ్చయించుకుంది. ఆమె మనసు అర్ధం చేసుకోన్నాడో అన్నట్లు ఎన్నడూ వ్యక్తిగత స్థాయిలో సంభాషణలు నడిపేవాడు కాడు శ్రీధర్.
ఆస్కార్ వైల్డ్ నాటకాల గురించి తాను మాట్లాడుతున్నది అరుంధతి వింటున్నట్లు కనిపించక పోవటంతో, ఆమె వంక నిదానించి చూసాడు శ్రీధర్. ఆమె అన్య మనస్కంగా ఉందని వెంటనే గ్రహించాడు. అంతేకాదు, ఏదో విషయాన్ని గురించి తీవ్రంగా బాధపడుతున్నట్లు కూడా కనిపించింది. అతడు మాట్లాడటం ఆపేసిన ఇంచుమించు అరగంటకు అరుంధతి తన ఆలోచనల నించి బయట పడి, "అపెసారేం?' అంది.
శ్రీధర్ నవ్వాడు.
"నాకు చెప్పకూడనిది కాకపోతే, దేన్నీ గురించి అంత తీవ్రంగా మధన పడుతున్నారో చెప్పండి. మీకు నేనేమైనా సహాయం గలనేమో ప్రయత్నిస్తాను."
"మీరేం చేస్తారూ?రవికి సహాయం చెయ్యనని ఖండితంగా చెప్పేశారు కదా!'
'మీ ఆవేదన కదా కారణం? ఆ రవి ఎంత అదృష్ట వంతుడండీ?"
'అతడు నాకు తమ్ముడు!"
"తమ్ముడయితేనేం? సేవకుడయితేనేం? తన మేలు కోరి మనసా, ఆవేదన పడేటందు కిందరు వ్యక్తులున్న ఆ రవి నిజంగా అదృష్ట వంతుడు."
"నేను కేవలం రవి కోసమే ఆవేదన పడటం లేదు. డబ్బు మనుష్యుల నెంత హైన్యానికి పాల్పడజేస్తుందో నని, ఆశ్చర్యంతో , ఆవేదన పడ్తున్నాను."
"వివరంగా చెప్పండి."
"మావారు నన్నూ, రవిని కలిపి అవమానకరముగా మాట్లాడారు?"
"శ్రీధర్ కంగారు పడిపోయాడు.
"సరే! సరే! ఇవన్నీ యేవో కుటుంబ కలహాలు. నాకెందుకు చెప్తారూ?"
"ఫరవాలేదు. ఈ విషయం నాకు అవమానం కలిగించే దెంత మాత్రమూ కాదు. ఆయనకు నాలో కాని, రవిలో కాని అవిశ్వాసం లేశమాత్రం కూడా లేదు.
"శ్రీధర్ గారి లైబ్రరీ లో మంచి పుస్తకాలున్నాయి. ఆయనతో నేను పరిచయం పెంచుకోవటం మీ కంగీకారమేనా? అని ఆయనను స్పష్టంగా అడిగాను.
శ్రీధర్ డాక్టర్! మంచి హోదాలో ఉన్నవారు. అట్లాంటి వ్యక్తితో స్నేహంగా ఉంటె తప్పేమిటి?" అన్నారు.
"మీతోడి నా స్నేహాన్ని సహించ గలిగిన వ్యక్తీ నేను రవి పట్ల చూపిన జాలిని అర్ధం చేసికోలేరా?"
"మరి?,,,,,,"
"రవి పై చదువులకు వెళ్ళటానికి ఆర్ధిక సహాయం చెయ్యమని నే నయన్ను బ్రతిమాలాను.
"నీకేమైనా పిచ్చా?' అని మందలించారు.
"లేదు! అతనికి కొంచెం సహాయం చేసినంతలో మన కొచ్చే నష్టం లేదు, అన్నాను.
"ఒకరోజు , రెండు రోజులూ అయితే ఫరవాలేదు. నాలుగేళ్ళు! మాటలా! కోపంగా అన్నారు.
నేనెన్నో విధాల బ్రతిమాలాను. అయన కరగలేదు. చివరకు అయన కిష్టం ఉన్నా, ఇస్జ్తం లేకపోయినా , నేను సహాయం చేసి తీరుతానని మొండి కేసాను. అయన సంపాదనలో నేనా మాత్రం ఖర్చు చెయ్యటానికి హక్కుందని వాదించాను. కావాలంటే ఈ నాలుగేళ్ళూ నా ఖర్చులన్నీ తగ్గించు కొంటానన్నాను. నన్నీ ప్రయత్నం నుండి ఏ విధంగా వారించాలో అయన కర్ధం కాలేదు. అందుకని నీచాతి నీచమైన ఈ మార్గాన్ని త్రోక్కారు. ఈ రకంగా మాట్లాడితే, నేనింక నోరెత్తలేను కదా!
"డాక్టర్ గారూ! కేవలం డబ్బు కోసం తన భార్యని అంత దారుణంగా అవమానించే వాళ్లుంటారా?"
నిగ్రహించుకోలేక ముందున్న బల్ల మీద వాలి వెక్కి వెక్కి ఏడ్చింది అరుంధతి.
భాగ్యవంతుని ఇల్లాలయిన ఆ నిర్భాగ్యురాలిని ఏవిధంగా వోదార్చాలో అర్ధం కాలేదు శ్రీధర్ కు.
ఎలాగో గొంతు పెగల్చుకొని "ఊరుకోండి! హైందవ వివాహ చరిత్ర లో ఇది పెద్ద అపూర్వ మైన విషయమేమీ కాదు!" అన్నాడు.
కొంతసేపటికి అరుంధతి తమాయించుకొని కళ్ళు తుడుచుకుంది. అస్తమయ సూర్యబింబం చాయలో మెరుస్తున్నాయి ఆమె కళ్ళు.
"మీరు 'రెక్" చదివి ఉంటారు. నాకా నవల అంటే ప్రాణం. ఇంగ్లీష్ లో , తెలుగులో సంగ్రహంగా సంపూర్ణంగా ఎన్నోసార్లు చదివాను. అన్నిసార్లూ ఒకచోటికి వచ్చేసరికి , ఆగిపోయేదానిని. అది కమల తన భర్త కూర్చొని వెళ్ళిన ప్రదేశానికి భక్తితో నమస్కరించి, ఆ ధూళి శిరసున ఉంచుకొనే సన్నివేశం! ఆ భావనలోని పావిత్యానికి కరిగిపోయేదానిని. అక్కడ కొద్ది క్షనాలయినా ఆగి, మనసులో ఆ పవిత్రమూర్తి ని భావించకుండా ముందుకు పోగలిగే దాన్ని కాదు.
"ఏ మహాకవికలం , తన భర్త కూర్చొని లేచిన ప్రదేశాన్ని కూడా పూజించే పవిత్ర తేజో రాశిని సృష్టించిందో, మహా కవికలం లో నుండే వెలువడింది. అత్మౌన్నత్యం లో వెలిగిపోయే కుముదిని, అందరి అభ్యంతరాలనూ, త్రోసి రాజని తనకంటే వయోదికూడైన భర్త ను, భగవన్నిర్ణయంగా హృదయ పూర్వకంగా అంగీకరించి కూడా అతని క్షుద్రుత్వపు విశ్వరూపాన్ని అర్ధం చేసికొన్న తరువాత కేవలం పది మంది మధ్య తన మెడలో మంగల్యాలను బంధించాడన్న ఒకే ఒక కారణాన్ని ఆలంబనంగా చేసికొని అతనిని అరాధించడానికి అసమర్ధురాలయింది.
"వివాహమంటే కేవలం మంగళ సూత్రధారణ కాదని అందరికీ తెలిసీ ఎవరూ ఒప్పుకోరు. మానవుడు సుఖంగా జీవించటానికి కావలసిన ముఖ్యవసరాలలో డబ్బు కూడా ఒకటి కాని, మానవత్వాన్నే నాశనం చేసేటందుకు కాదనేది అందరికీ తెలిసిన, అందరూ ఒప్పుకొనే విషయమే. అయినా, ప్రపంచం లోని మిగిలిన అన్ని విలువలూ , దాని ముందు తలవంచి జోహరంటున్నాయి. చివరకు జీవితంలోని అర్ధతను కాల్చి వేసే అగ్ని కీలలాగా తయారయింది డబ్బు! రూపాయలను చూసుకొని మురిసిపోయే వాళ్లతో జీవితంలోని ప్రతి అంశాన్ని రూపాయాల లోకి మార్చుకొని దాని విలువను కొలుచుకొనే వాళ్లతో రూపాయలకు అతీతమైన సౌఖ్యమున్నదని అర్ధం చేసికొని, వాటి కోసం ఆరాటపడే వాళ్ళు జతపడితే వాళ్ళ గతి ఏం కావాలి డాక్టర్ గారూ? బహుశా మావారు కూడా నాలానే "డబ్బంటే బొత్తిగా లక్ష్యం లేని భార్య దొరికిందని" బాధపడుతుండవచ్చు . మూడు వంతుల దంపత్యాలిలా మేడి పళ్ళలా ఎందుకు తయారవుతున్నాయి? సాంఘిక మైన ఒక ఒడుదుడుకును మించిన ప్రాదాన్యమేదీ ఈ వివాహ బంధంలో లేనేలేదా?"
"మీ మాటలు వింటుంటే నా గుండెలు దడదడ లాడుతున్నాయి. వీటికన్నిటికీ సమాధానాలు నాకు తెలిసినా మీకు చెప్పలేను. యా మాటకొస్తే మీకూ తెలుసు? ముందు మీరు కళ్ళు తుడుచుకోండి! రవికి నేను సహాయం చేస్తాను."
అరుంధతి అతని వంక ఆశ్చర్యంగా చూసింది.
"నా కన్నీళ్ళ కు అంత విలువ ఇస్తున్నారా?"
"నిజమే! మీ కన్నీళ్ళు నేను చూడలేను. అసలు స్వయంగా రవి వచ్చి అడిగి ఉంటె ఏం జరిగి ఉండేదో? తారగారు వచ్చి అడిగే సరికి నా కేందుకనో అలా సమాధానం చెప్పాలని పించింది. మంచి రకం పట్టుచీర కట్టుకొని, ముత్యాల గొలుసు మెళ్ళో ధరించి నన్ను ఆర్ధిక సహాయం కోరితే ఎలా ఉంటుంది చెప్పండి?"
"తారను మీరు పొరపాటుగా అర్ధం చేసికోన్నారు." అని అరుంధతి , తారను గూర్చి వివరంగా చెప్పింది. "ఒక తల్లి బిడ్డలలో ఎంతటి వైవిద్యమో? ఒకసారి సుచరిత కూడా తారను ప్రశంసించినట్టు గుర్తు...."
ఆలోచన గా అన్నాడు శ్రీధర్.
"సుచరిత అంటే మీ భార్యనా? ఆమెను గురించి రకరకాలుగా వింటున్నాను. మీ కభ్యంతరం లేకపోతె యదార్ధం తెలిసికోవచ్చా?"
"తప్పక! మీరిదివరలో అడిగినప్పుడే చెప్పాలను కొన్నాను. కాని నా నోటితో అన్నీ చెప్పలేననిపించింది. ఆనాడే మీకియ్యాలని ఆ విషయాలన్నీ వ్రాసి ఉంచాను. ఇస్తాను. తీసి కేళ్ళండి"- శ్రీధర్ తన డ్రాయింగ్ టేబిల్ డ్రాయర్ లోంచి కొన్ని కాగితాలు తీసి అరుంధతి కందించాడు. అరుంధతి వాటి నందుకొని శ్రీధర్ దగ్గిర సెలవు తీసికొంది. ఇంటికి చేరుకోగానే ఆత్రుతతో వాటిని విప్పింది.
