Previous Page Next Page 
రాక్షసీ...! నీ పేరు రాజకీయమా? పేజి 15


    అప్పటిగ్గాని ఆ గదిలో వున్న "మహాశయుల" మనసులు కుదుట పడ్డాయి కావు.
    ఆయనలా చూస్తో అతి ప్రేమతో లోకనాథంగారిని తన దగ్గిరగా రమ్మన్నట్టు సైగ చేసేరు.
    లోకనాధం గారు అడుగులో అడుగు వేసుకుంటో శ్రీవారి మంచం దగ్గిరికి వెళ్ళి నించున్నారు.
    "లోకనాధంగారితో వారిని మాట్లాడనివ్వండి. మనం గది బయట నించుందాం రండి" అన్నాడు డాక్టరు.
    లోకనాథంగారూ, రామదాసుగారూ గదిలో మిగిలిపోయేరు. మిగతావారు బయటకి నడిచేరు.
    బయటికి రావడంతోటే హాల్లో వెయిట్ చేస్తున్నవారూ, వరండాలో తిరుగుతున్నవారూ అంతా కనకం వేపు చూసేరు.
    కనకం డాక్టరు బాబు పక్కన ముఖ్యమైన ప్రకటన ఒకటి చేసేడు.
    "ఇక మన దాసుగారి కొచ్చిన భయంలేదు. ఇదిగో ఈ డాక్టరు బాబే మన దాసుగారిని రక్షించేరు. ఇంక మన కొచ్చిన భయం లేదు."
    రామదాసుగారి గది లోపల-
    "ఎలా వుంది బావా?" అన్నారు లోకనాధం.
    రామదాసు మెల్లిగా నవ్వి అన్నాడు.
    "నా కొచ్చిన భయం లేదు బావా!......నా మీదున్న అభిమానం కొద్దీ వచ్చేవు......అదే పదివేలు......చూడు లోకం బావా,......నాలుగైదు రోజుల్లో......మన సభ్యుల హోదాల్లో ముఖ్యమైన మార్పులు కొన్ని చేయాలను కుంటున్నాను......నేను చాలా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చేను.....కూచో.....నా ప్రక్కన కూచుని శ్రద్దగా విను...."
    లోకనాథం రామదాసుగారి మంచంమ్మీద కూచుంటూ అడిగేరు.
    "ఏమిటి బావా?"
    నన్ను చూస్తివిగా.....ఆ శ్రీరాములవారి కటాక్షం వల్లనూ, శ్రీ స్వామివారి ఆశీర్వాదం వల్లనూ....చావు తప్పించుకున్నాను......అయినా బావా! మునుపున్న ఓపికా, ఆరోగ్యం.......ఇప్పుడు కొంచెం తగ్గినట్టు అనిపిస్తోంది......డాక్టరేమో రెస్టవసరమంటున్నాడు......తిమ్మాపురంలో......ప్రజల తాలూకు సమస్యలూ....రోజు రోజుకీ రెట్టింపవుతున్నాయి.....వింటున్నావా బావా?"
    "వింటున్నాను. చెప్పు బావా?"
    "నాకు కుడి భుజంలాటి వాడివి నువ్వు......నిజం చెప్పాలంటే నీ అభిమానం, నీ దక్షతే నన్ను పెంచేయి......అందుచేత......నా బాధ్యతలను కొన్ని నీకే వప్పగించాలనుకుంటున్నాను.....నిన్ను.....ఉప ప్రభువుగా నామినేట్ చేద్దామనుకుంటున్నాను."
    "బావా!" అన్నారు లోకనాథం ఆనందాన్ని ప్రకటించీ, ప్రకటించనట్టు.
    "కాదనకు బావా!" నాకీ సమయంలో నీ కన్నా ఎవరున్నారు ఆదుకునేందుకు? ఏఁవంటావ్?"
    "అదేవిటి బావా? నువ్వంతగా చెబుతూంటే నేను మాత్రం కాదంటానా? మనకి ప్రజల సుఖం కంటే కావలసిందేముంది. అలాగే బావా; అలాగే కానివ్వు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS