Previous Page Next Page 
రాక్షసీ...! నీ పేరు రాజకీయమా? పేజి 16


    లోకనాధం గారు మంచం దిగి వచ్చేస్తూ డాక్టరుతో అన్నాడు.
    "మీ డాక్టర్లకి- వృత్తి ధర్మమో పాడో గాని - కరుకుతనం ఎక్కువండి బాబు! దాసు బావని ఈ స్థితిలో వదిలి రావడమంటే ఎంత కష్టమో నాకు తెలుసు! మీకేం తెలుసు? ఏం చేస్తాం కానివ్వండి. ఇవాల్టికి మీ మాటనే వింటాను సరా?"
    ఆ మాటలకి అటు డాక్టరు బాబూ, ఇటు లోకనాధం బాబూ యిద్దరూ బాబులూ కలిసి పగలబడి నవ్వడంతో కిందనుంచున్న మనుషులందరికి  కధ "సుఖాంతమ"నే భావం రూడిగా స్పురించింది.
    అందర్నీ పంపించి, డాక్టరోక్కడూ వచ్చి రామదాసుగారిని పరామర్శించేరు.
    "ఎలా వుంది సార్?"
    "బ్రహ్మాండమోయ్ డాక్టర్! సరే కానీ, నటించలేక చచ్చేను నీకేం? గుండె జబ్బని ప్రకటించి వూరుకున్నావ్! అది నటించాడమెలాగో చేప్పేవా? వల్లకాడా? దుంప తెంచి పారేసేవ్ పో! అయితేనేం. నాటకం మంచి రక్తి కట్టింది..... అయినా,  మా రాజకీయ బంధుత్వం నీకేం తెలుసు?" చాలా థాంక్స్..... వెళ్ళిరా? ఎప్పుడైనా అవసరముంటే కనిపిస్తుండు," అన్నారు రామదాసు.
    "సెలవు" అన్నాడు డాక్టరు.
    ఆ డాక్టరుకి రామదాసుగారి 'హెచ్చరిక' తో వళ్ళు మందిపోయిన మాట నిజం. దొంగ జబ్బులకైతే తనతో అవసరం గాని, నిజం రోగాలకి ఏ ఫారిన్ రిటర్న్ డో వచ్చి చూసి పోతాడే గాని - సాధారణమైన డాక్టరు తో ఏం పని? అనే నిజం సాదరమైన ఆ డాక్టరు బాబుకి బాగా తెలుసు.
    అయితేనేం.....?
    ప్రభువుల మెప్పు పొందే నిమిత్తం గడ్డి కరవమన్నా ......కరవాలి. తప్పదు గాక తప్పదు.

    
                                 5

    సుమతి దిగులుగా కూచుంది. ఆ పిల్ల మనసు మహా చికాగా వుంది.
    తల్లి కాఫీ చేసి పట్టుకొచ్చి సుమతి కిచ్చింది.
    తల్లి తెచ్చిన కాఫీని రెండు గుటకల్లో మింగేసి కాఫీ కప్పు టీపాయ్ మీద వుంచి నిశ్శబ్దంగా వుండిపోయింది సుమతి.
    సుమతి వాలకం చూసి ఆశ్చర్యపోయింది తల్లి.
    కారణమేవిటో కనుక్కునేందుకు ఆమె కూడా సుమతి పక్కనే సోఫాలో కూచుంది.
    తల్లి కూచునేందుకు జాగా యిచ్చింది కాని, నోరెత్త లేదు సుమతి. రెండు క్షణాలు గడిచిం తర్వాత తల్లి అడిగింది.
    "ఏమ్మా, సుమతీ! వంట్లో బాగో లేదా?"
    సుమతి పరాకుని అవతలికి నెట్టి, కొంచెం నవ్వేసి ----
    "నాకేం? బాగానే వున్నానమ్మా!" అన్నది.
    "మరి .....అదోలా వున్నావ్?"
    "నేను మామూలుగానే వున్నాను."
    తల్లి నవ్వి అన్నది------
    "నేన్నమ్మను. క్షణమైనా ఖాళీ లేకుండా గడగడా మాటాడే పిల్లవు, ఇవాళ మౌనవ్రతం పాటించేవంటే ఏదో కారణ ముంటుంది చెప్పు."
    'అబ్బే ..... ఏం లేదమ్మా! నీదంతా అనుమానం! అంతే!"
    సుమతి మాటని కొట్టిపారేసి అన్నది తల్లి.
    'అసలేం జరిగిందో చెప్పు. నీకేం కావాలో చెప్పు."
    సుమతి తల్లి వేపు లిప్త పాటు చూసి తలదించుకుంది.
    "చిరంజీవికే వోటిస్తున్నావా?" అడిగింది తల్లి.
    తలూపింది సుమతి.
    మీ వాళ్ళందర్నీ వొప్పించేవుగా?"
    మళ్ళా తలూపింది సుమతి.
    'అంటే, మీ అందరి వోట్లూ చిరంజీవికేనా?"
    అప్పుడు గూడా తలే వూపింది కూతురు.
    "మరింకేం? అంతా బావుండిగా. ఇంకెందుకు దిగులు?"
    "ఎన్నికల గురించి కాదమ్మా," అన్నది సుమతి.
    'మరి? పరీక్షల గురించా?" అడిగిందామె.
    దానికి వెంటనే అవునని తలూపింది పిల్ల.
    "ఓసి పిచ్చితల్లీ! ఎప్పుడో వచ్చే పరీక్షల్ని గురించి యిప్పట్నుంచే దిగులా? ఏది ఎల్లా జరగాలనుంటే అల్లాగే జరుగుతుంది. ఇంత మాత్రానికే దిగులు పడితే ఎల్లా? - అయినా నువ్వీ పరీక్షలు పాసై ఊళ్ళేలాలా ఏవన్నానా? ఆ మహారాజు మనకిం తిచ్చి వెళ్ళేరు. దాంతో మనిద్దరం బతకలేక పోము. దిగులు పడమాకు. ఇంట్లో కూచుంటే నీకు విసుగ్గా వుంటుందని చదివిస్తున్నానే గానీ నువ్వీ పరీక్షలు పాసై నన్నుద్దరిస్తావని కాదు గదా! .....ధైర్యంగా వుండు ......దేవుడు దయ తలుస్తే - నిన్నో అయ్యా చేతికి - అన్ని విధాలా తగిన వాడిని చూసి , అప్పగించేసి, కృష్టా, రామంటూ కాలం గడుపుతాను.... అన్నట్టూ అమ్మడూ! చిరంజీవి నీతో స్నేహంగానే వుంటున్నాడుగా ..... ముందున్న మంచి రోజుల్ని తలుచుకుంటూ మురిసిపోవాల్సింది పోయి, పరీక్షలని బెంగపడి పొతే ఎల్లానమ్మా? లే ....... లే .......వేనీళ్ళు సిద్దంగా వున్నాయి. స్నానం చేసి కూచో. కాసేపట్లో చిరంజీవి వాళ్ళ కారోస్తుంది కాబోలు. లే త్వరగా!" అని కూతుర్ని సముదాయించి, లేచి పెరట్లోకి వెళ్ళింది తల్లి.
    వెడుతూ వెడుతూ తనలో తనమాటగా 'పరీక్షలాట, పరీక్షలు. పాడు పరీక్షలు," అని గూడా అనుకున్నదామే.
    సుమతి తల్లి వేపు చూసి మళ్ళా తలదించుకుంది.
    అప్పుడామెకి ప్రేమ పరీక్షలు గుర్తుకొచ్చేయి!
    వరప్రసాదం ప్రేమలేఖ చదివేడో లేదో .....? ఒకవేళ, ప్రేమ లేఖ చదివే వుంటే ఇంతకాలం ఎందుకు "వెయిట్" చేసేడు? పై పెచ్చు ఇంటికి రావడం గూడా మానుకున్నాడేమిటి చిత్రం? కాలేజీలో కనుపించినా తప్పించు తిరుగుతున్నాడేమిటి విడ్డురం!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS