Previous Page Next Page 
రాక్షసీ...! నీ పేరు రాజకీయమా? పేజి 14


    తండ్రి సలహాకి కొడుకు ఉప్పొంగి పోయేరు. మందు సేవించడంవల్ల తిమ్మిరెత్తి మాటాడిన తండ్రి మాటలు-"మందు"లా పనిచేయగా కొడుక్కికూడా తిమ్మిరెత్తిపోయింది. ఉత్సాహంవల్ల అతని వళ్ళు తూలడం ప్రారంభించింది.
    మనసారా కొడుకు అన్నాడు.
    "మంచిది నాన్నా!......నా కోసం సీతాపతి వాళ్ళూ ఎదురు చూస్తుంటారు. టైమైంది, ఇంక వెళ్ళొస్తాను."
    "వెళ్ళిరా, నీ పనులన్నీ చక్కపరుచుకుని తిరిగి రా," అన్నారాయన.
    చిరంజీవి తండ్రి దగ్గర సెలవు పుచ్చుకుని మేడమేట్లు దిగి వచ్చేడు. హల్లో డాక్టరు ఎదురై-
    "మీ నాన్నగారి కెలా వుంది?" అని అడిగేరు.
    చిరంజీవికి డాక్టరుగారి పరామర్శ చప్పున అర్దమయ్యింది కాదు. డాక్టరుకి తండ్రి ఎందుక్కరంపేడో, ఏవఁని ఖబురం పేడో - వూహించడం కష్టం కాగా- తప్పుకునేందుకో మాట అడ్డం వేసుకుని చాలా ఖచ్చితంగా అన్నాడు చిరంజీవి.
    "ఇదిగో నేను మీకోసమే వస్తున్నాను సమయానికి మీరే వచ్చేపేరు. చాలా థేంక్సండి. మేడ మీద నన్న మీకోసం వెయిట్ చేస్తున్నాడు. వెళ్ళండి, వెంకటస్వామీ......డాక్టరుగారొచ్చారు, నాన్న దగ్గిరకి తీసుకెళ్ళు."
    వెంకటస్వామి వచ్చి డాక్టరుగారి 'మందుల పెట్టె, పుచ్చుకు: మేడ ఎక్కగా డాక్టరు అతన్ని వెంబడించేరు.
    ఆ ఇద్దరూ మేడ ఎక్కడం గమనించి చిరంజీవి గట్టిగా గాలి పీల్చుకుని వీధిని పడ్డాడు.
    -రంగుల మేడ సెంటర్లో చిరంజీవి తన మనుషుల్ని కలుసుకున్నాడు. అక్కడ సీతాపతి, సత్యం, రవి తనకోసం ఎదురు చూస్తో సిగరెట్లు కాల్చుకుంటున్నారు.
    సీతాపతి అడిగేడు-
    "ఇంత లేటు చేసేవేమిరా జీవీ! ముఖ్యమైన ఈ కాసిని రోజులూ లేటు చేయకురా బాబూ!"
    చిరంజీవి మెదడులో గొప్ప పాయింటొకటి ఆ క్షణంలోనే మెరిసింది. తడుముకోకుండా జవాబు చెప్పేడు.
    "మా నాన్నకి వంట్లో బాగోలేదురా. చాలా హడావిడి చేసేడు. డాక్టరొచ్చేంతవరకూ కూచున్నాను."
    "అరే......పాపం.......యిప్పుడెలా వుందండి?" అన్నాడు రవి.
    "మరేం ప్రమాదం లేదులేండి. హియీజ్ ఆల్ రైట్ నౌ గుండె పట్టింది. అంతే," అన్నాడు చిరంజీవి.
    "మరి.....మా మాఁవ యింట్లోనే వున్నాడేమిరా? మీ నాన్నకి గుండెపోటొచ్చిన సంగతి మావఁకి తెలీదేమిటి?" అన్నాడు సీతాపతి.
    "గుండెపోతూ ముందుగా చెప్పి వస్తుందేమిట్రా ఎక్కడైనా? అనుకోకుండా వచ్చింది. అలాగే తగ్గిపోయింది. రైట్....కదులుధామా యింక?"
    "ఏవిఁటో పెద్ద వయసుకదూ-సరే పదండి పోదాం," అన్నాడు సత్యం.
    "చిత్రమేమిటోగాని సార్, గొప్పవాళ్ళందరికీ యిదే జబ్బండి! గుండె జబ్బు! సరే పదండిక" అన్నాడు రవి.
    అంతా కలిసి ప్రచారవేట నిమిత్తం కదిలేరు.
    
                                       *    *    *
    
    రామదాసు మేడ ముందు కొన్ని కారులొచ్చి ఆగివున్నాయి. అక్కడ ఆవరణలో చాలామంది మనుష్యులున్నారు. వాళ్ళందరూ పురపాలకులే.
    రావలసిన జాతి మనుషులంతా వచ్చేసేరు.
    హాల్లో కొందరు, వరండాలో కొందరు. మేడ మీద రామదాసు గారి గదిలో కొందరు- ఎవరి హోదాల్లో వాళ్ళు వుండి, ఖంగారుగా తచ్చాడుతున్నారు.
    "ఏమిటో ఈ ఉపద్రవం. తిమ్మా పురానికేదో చేటు కాలమొచ్చింది." అన్నాడో పాలకుడు వరండాలో.
    "చేటు కాల మింకా రాలేదు గనకనే వారింకా క్షేమంగా వున్నారు" అని సరిదిద్దాడు మరో పాలక మహాశయుడు- వరండాలో.
    "ఆయన మనసెందుకో కలతపడినట్టు గ్రహించేను. మొన్న ఆ స్వామిజీ వచ్చి వెళ్ళినప్పట్నుంచీ యిలాగే వున్నారు," అన్నాడు హాల్లో వున్న పాలకుడు.
    "మరీ ఈ మధ్యనే ఆయనకి దైవ చింతన ఎక్కువై పోయింది," మాటందించేడు హాల్లోనే వున్న మరో పాలకుడు.
    "రాత్రి మా మేనల్లుడు చెప్పేడు దాసుగారికి గుండె నొప్పించిందని. ఇవాళ ఉదయమే యింత ముంచుకొస్తుందని మాత్రం నే ననుకోలేదండి డాక్టరు బాబూ!" అన్నాడు కనకం- రామదాసుగారి గదిలో- డాక్టరుతో.
    "పొద్దున్న సరసయ్య పరుగెత్తుకుంటూ వొచ్చినప్పుడే అనుకున్నాను- ఇక్కడేదో ముంచుకొచ్చిందని. ఏమైతేనేం- దాసుగారిని రక్షించేరు. చాలా థేంక్సండి డాక్టరుగారూ! చూడు నాయన, చిరంజీవీ, మరేం భయంలేదని డాక్టరుగారు అన్నారు గదా......ధైర్యంగా వుండు," అన్నారు లోకనాధం.
    "సైలెన్స్" అన్నాడు డాక్టరు.
    అందమైన ఆ గదిలో, అన్ని హంగుల మధ్య ప్రశాంతంగా నిద్రపోతున్నారు అన్నట్టు రామదాసు, కళ్ళు విప్పి ఆ గదిలోవున్న వాళ్ళ వేపు ప్రేమగా చూశారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS