ఇటు సీత కన్నీళ్ళనూ, అటు సరోజ బొమముడినీ కూడా లక్ష్యపెట్టకుండా అక్కడినుంచి వచ్చేసింది పావని.
ఏమిటీ మనుష్యులు? ఒక విషయాన్నీ ఉన్నది ఉన్నట్లుగా ఎవరూ అర్ధం చేసుకోరేం? ఎందుకిలా వికృత రూపాలు కల్పిస్తారు? దీని నేవరైనా కథగా వ్రాస్తే పాఠకులలో మాత్రం ఎందరు అసలు సమస్య అర్ధంచేసుకుంటారు?
ఎవరో వచ్చి విజిటర్స్ రూంలో కూచున్నారని ఆయా వచ్చి చెప్పింది.
విజిటర్స్ రూంలోకి వచ్చి అక్కడ కూచున్న విఠల్ ణు చూడగానే ఆర్తితో అతని దగ్గిరకు రాబోయిన పావని అతని ముఖంచూసి ఆగిపోయింది. దూరంగా కుర్చీలో కూచుంటూ "ఇలా వచ్చారేం?" అంది మామూలుగా మాట్లాడటానికి విశ్వప్రయత్నం చేస్తూ.
విఠల్ కళ్ళు ఎర్రగా మండుతున్నాయి.
"కేశవామూర్తిని స్టూడెంట్స్ కొట్టారుటగా!" అన్నాడు.
విఠల్ మాట్లాడదలుచుకున్నదేమిటో పావనికి అర్ధమయిపోయింది. అప్రయత్నంగా పెదవుల మీద చిరునవ్వు విరిసింది. ఆ చిరునవ్వు చూసి మరింత మండింది విఠల్ కి.
"అతణ్ణి నువ్వే హాస్పిటల్ లో చేర్పించావా? దగ్గిరుండి సపర్యలు చేసావా?"
"అవును?"
"ఓహో! మీ సంఘం కార్యకలాపాల్లో ఇదీ ఒక భాగమా?"
"కాదు."
"అయితే నువ్వొక్కదానివీ ఇలా అందరికీ సేవలుచేస్తావు కాబోలు?"
"అందరికీ చెయ్యను"
"అంటే? ఇతడికి ఒక్కడికీ చెయ్యడానికి ప్రత్యేకమైన కారణముందా?"
"ఉంది!"
"అదేమిటో తెలుసుకోవచ్చా?"
పొంగి వస్తోన్న నవ్వును అణచుకుంటూ తన మాటలు జాగ్రత్తగా పేర్చుకుంది పావని.
"నా స్వార్ధం."
చివాలున లేచిపోయాడు విఠల్.
తిన్నగా కేశవమూర్తిరూంకి వెళ్ళాడు. తన గదికి వచ్చినదెవరా అని ఆశ్చర్యంగా చూస్తోన్న కేశవమూర్తిని చాచి లెంపకాయ కొట్టాడు. బిత్తరపోయిన కేశవమూర్తి క్షణాలలో తేరుకుని మళ్ళీ చెయ్యెత్తిన విఠల్ రెండుచేతులూ గట్టిగా పట్టుకున్నాడు. తనచేతులు వదిలించుకోవటం విఠల్ కి సాధ్యం కాలేదు.
"మిస్టర్! మీరెవరో నాకు తెలియదు-నేను బాక్సింగ్ లో ట్రైనింగ్ అయిన వాడిని. తలుచుకుంటే మిమ్మల్ని చావ బాదెయ్యగలను. కానీ నిష్కారణంగా నన్ను వెతుక్కుంటూ వచ్చి ఇలా ఎందుకు సన్మానించాలనుకున్నారో, వివరంగా చెప్పండి" అన్నాడు కేశవమూర్తి.
"నా చేతులు వదలండి. మీరు నన్ను చంపినా నాకు బాధలేదు. మీరో,నేనో ఎవరో ఒకరం చావటమే నాకు కావలసింది."
"అమ్మ బాబోయ్! పాకం చాలా ముదిరింది. నా అపరాధమేమిటో తెలుసుకో వచ్చా?"
"తన భార్యను ప్రేమించిన వ్యక్తిని ఎవరూ క్షమించలేరు."
"మీ భార్యను నేను ప్రేమించానా? అన్యాయం ఎవరి భార్యనూ నేను ప్రేమించలేదు. ఇద్దరు ముగ్గుర్ని సెలెక్ట్ చేసుకున్నాను. కానీ ఎవరిని ప్రేమించాలో ఇంకా నిర్ణయించుకోలేదు. వాళ్ళలో ఇంకా ఎవరికీ పెళ్ళి కాలేదు."
"లోకం కోడైకూస్తోంటే మీరు డబాయించీ ప్రయోజనం లేదు."
"లోకం... కోడి... కూత... మైగాడ్! మీరు పవనిగారి భర్తగారా?"
ఈ మాటలంటోనే విఠల్ చేతులు వదిలేసాడు కేశవమూరతి...మళ్ళీ చెయ్యి ఎత్తలేదు విఠల్-కేశవమూర్తి దగ్గిరికి ఎంత ఉద్రేకంతో వచ్చాడో అదంతా తగ్గి పోయి ఏదో సిగ్గు, సంకోచం కలగసాగాయి.
కేశవమూర్తి చాలా చిన్నవాడు. కొత్తగా డిగ్రీ తీసుకుని లెక్చరర్ గా జాయిన్ అయినట్లున్నాడు. తన వయసూ, తన విజ్ఞానం, ఏమయిపోయాయి? తన పావని మరొకరిని ప్రేమించిందనుకోవటం అంత పిచ్చివాణ్ణి చేసిందా తనను?"
"వెళ్తాను" అంటూ వెళ్ళబోయాడు విఠల్...
"అరెరె! ఉండండి! ఏదో అడగటానికి వచ్చి ఏదీ తేల్చుకోకుండానే వెళ్ళిపోతున్నారేం?"
"అయామ్ సారీ! ఏమిటో పిచ్చెక్కినట్లే ప్రవర్తించాను. ఒకవేళ పావనీ మీరూ ప్రేమించుకున్నా ప్రశ్నించే అధికారం నాకేముంది?"
"శభాష్! పావనిగారు మిమ్మల్ని సరిగానే అర్ధంచేసుకున్నారు. కొంచెమే పొరపాటుపడ్డారు."
"ఏమిటి?"

"ఆవిడ హాస్పిటల్లో నా దగ్గిరే ఉన్నప్పుడు 'లోకం ఊరుకోదు' అన్నాను నేనే.... 'నిష్కారణంగా ఈ లోకం నన్నేప్పుడో నిందలపాలు చేసింది. నా భర్త మాత్రం నన్నెప్పుడూ అపార్దంచేసుకోరు.' అన్నారు....పావనిగారు వర్ణించిన విశాల హృదయం మీలో కన్పిస్తోంది. కానీ లోకం మాటలకు లొంగిపోయే బలహీనత కూడా కన్పిస్తోంది. అసలిందులే ఆవిడని దూరంచేసుకున్నారేమో!"
"లోకం మాటలకు లొంగిపోయి కాదు. పావని స్వయంగా చెప్తే సహించలేకపోయాను..."
'ఏం చెప్పారు?"
"మీకు సేవచెయ్యటంలో తన స్వార్ధం ఉందని అంది."
"అదా..." పకపకా నవ్వాడు కేశవమూర్తి.
"ఆ మాటలు అక్షరాలా నిజం!" అన్నాడు.
తెల్లబోయి చూస్తోన్న విఠల్ కి వివరంగా చెప్పాడు.
"ఆ రోజు నన్ను కొట్టిన గుంపును లీడ్ చేసింది మీ తమ్ముడు రవి నన్ను కొట్టింది తన మరిది కావటంవల్ల నన్ను ఆదుకోవటం తన నైతికబాధ్యతగా భావించారు పావనిగారు. ఊళ్ళో పుకార్లు చెలరేగుతాయని తెలిసీ లెక్కచెయ్యకుండా ఒక అక్కలాగ నాకు తోడుగా ఉన్నారు. ఆవిడమీద ఉండే గౌరవం తోనే నేను రవిమీద రిపోర్ట్ ఇవ్వలేదు. నేను రిపోర్టు ఇచ్చి ఉంటే అది రవి భవిష్యత్తుమీద దెబ్బతీసి ఉండేది. నేను రిపోర్టు ఇవ్వకపోవటం రవిలోకూడా పరివర్తన కలిగించింది.
...తనలాంటి అనేకమంది రౌడీలు డిబార్ కావటంకూడా అతనికి కనువిప్పు కలిగించి ఉండవచ్చును. నా దగ్గిరికి వచ్చి క్షమార్పణ చెప్పుకుని సప్లిమెంట్ కి బాగా చదువుతానని చెప్పాడు. ఇప్పుడిప్పుడు రవితోపాటు కొందరు విద్యార్ధులు పుస్తకాల బూజు దులుపుతున్నారు-ఇదే నాకు సేవచేయటంలో పావనిగారి స్వార్ధం..."
మ్రాన్పడిపోయి కూచున్నాడు విఠల్.
సంఘం చులకనగా మాట్లాడే మాటలకు తట్టుకోలేక తనే పావనిని తనకు దూరంగా తరిమాడు. అయినా పావని ఈనాటికీ తన తమ్ముడిని బాగుచెయ్యాలని తాపత్రయపడుతోంది....అలాంటి పావనిని, 'నా భర్త నన్ను అపార్ధంచేసుకోరు' అని నిబ్బరంగా అనగలిగిన పావనిని.....క్షణికంగానయినా ఎలా ఊహించుకున్నాడు తను? తనను తనే అసహ్యించుకున్నాడు విఠల్.
పావనిని క్షమార్పణ కోరుకోవాలనీ, తిరిగి తన దగ్గిరకు రమ్మని ప్రాధేయ పడాలనీ సంఘానికి బయలుదేరాడు విఠల్. అప్పటికే పొద్దుబోవటంవల్ల గేటు మూసేసారు. చౌకీదార్ లోపలికి వెళ్ళడానికి వీల్లేదన్నాడు.
"విఠల్ వచ్చాడని చెప్పు, అమ్మగారు తప్పకుండా రానిస్తారు," అన్నాడు విఠల్...
నిద్రపోతున్న ఆయాని లేపి పావని దగ్గిరకి కబురు పంపించాడు చౌకీదార్.
ఆయా తిరిగొచ్చి "అమ్మగారు ఇప్పుడెవరినీ చూడటానికి వీల్లేదన్నారు" అని చెప్పింది.
"విన్నావ్ గా! వెళ్ళు" అన్నాడు చౌకీదార్.
విఠల్ వెంటనే కదలలేక పావని గదిలో వెలుగుతోన్న లైట్ ని చూస్తూ నిల్చున్నాడు.
"అలా నిల్చుంటావేమయ్యా? కదులు?" అని అదలించాడు చౌకీదార్... చేసేది లేక వెళ్ళిపోయాడు విఠల్....విఠల్ వెళ్ళిన ఒక నిముషంలోనే గేటు దగ్గిరకొచ్చి కన్నీళ్ళతో దూరమవుతోన్న అతని మూర్తిని చూస్తూ నిల్చున్న పావనిని విచిత్రంగా చూసాడు చౌకీదార్.
