Previous Page Next Page 
గుళ్ళో వెలిసిన దేవతలు పేజి 16


                                              13
    
    విఠల్ ఇంటికి చేరుకునేసరికి అంతా గందరగోళంగా ఉంది. పద్మావతి కుమిలి కుమిలి ఏడుస్తోంది. జీవంలేని ముఖంతో వెంకట్రావు పడకకుర్చీలో కూచున్నాడు.
    "ఏం జరిగింది?" అని అడిగిన విఠల్ చేతిలో టెలిగ్రాం పెట్టాడు వెంకట్రావు...
    "అనుపమ కనపడటంలేదు. వెంటనే బయలుదేరి రండి...అమృతమూర్తి."
    ఉన్నవాడు ఉన్నట్లుగా బయలుదేరాడు విఠల్.
    విఠల్ ను చూసి "బావగారూ! నా అనూ నన్ను అన్యాయం చేసి వెళ్ళి పోయింది" అని ఏడ్చాడు అమృతమూర్తి. ఆ ఏడుపు చూస్తోంటే జాలికలగ లేదు సరికదా, అసహ్యంవేసింది విఠల్ కి...
    "ఏం జరిగిందో వివరంగా చెప్పండి..." అన్నాడు.
    "ఏముందండీ! ఇటీవల స్త్రీ స్వాతంత్ర్యం అంటూ ఇదొక వేలంవెర్రి బయలుదేరింది. ఊ అంటే తప్పు-ఆ అంటే తప్పు....ఇంట్లో రోజూ నరకమే! అయినా సహించాను చివరకు ఇంతకు తెగించింది."
    అనుపమ తన చెల్లెలు కాకపోతే, చిన్నప్పటినుండీ అనుపమ ఎంత సాత్వికురాలో విఠల్ కి తెలియకపోతే అమృతమూర్తి మాటలు నమ్మేవాడే!
    అంతగా నమ్మించేలా ఉంది అమృతమూర్తి చెప్పినతీరు...
    "అనుపమ ఉత్తరమేదీ వ్రాయలేదా?"
    తడబడ్డాడు అమృతమూర్తి."
    "వ్రాసింది. వ్రాసింది..." అంటూ అనుపమ వ్రాసిన ఉత్తరం విఠల్ చేతికిచ్చాడు...
    "ప్రియమైన శ్రీవారికి,
    ఇప్పటికీ ఇలాగే సంబోధిస్తున్నాను. నేను మీకు ప్రియమైనదాన్ని అయినా కాకపోయినా మీరు మాత్రం నాకు ఎప్పటికీ ప్రియమైనవారే! మీతో సర్దుకు  పోవాలనే విశ్వప్రయత్నం చేసాను. కానీ నేను ఏంచేస్తే మీకు సంతోషం కలుగుతుందో, ఎలా ఉంటే మీకు సంతృప్తి కలిగించగలవో, ఇన్ని రోజుల సాంసారిక జెవెఇథమ్లొ నాకేనాడూ అర్ధంకాలేదు. నేను ఏంచేసినా మీకు తప్పుగానే తోస్తుంది. ఎలా ఉన్నా అపరాధమే ననిపిస్తూంది. నా మనసు బండరాయిచేసుకోవాలని ఎంతగా ప్రయత్నించినా ఇంకా అది మనసుగానే మిగిలిపోయింది. మీరు మాటలతో పొడిచే తూట్లకది తట్టుకోలేకుండా ఉంది...బ్రతికి ఉండి మిమ్మల్ని ఎదిరించే సాహసం లేకపోయింది. చచ్చి దెయ్యాన్నయి మీ అన్యాయం మీకు వివరించగలనేమో!
    శాశ్వతంగా సెలవు తీసుకుంటున్నాను.
                                                                                                                మీ
                                                                                                             అనుపమ..."
    ఉత్తరం చదువుతోన్న విఠల్ కళ్ళలోనుండి కన్నీరు జలజల ప్రవహించింది. ఆ ముఖం చూస్తూ ఏం మాట్లాడటానికి సాహసం కలగలేదు. అమృతమూర్తికి. విఠల్ నిగ్రహించుకుని "ఇందులో చచ్చిపోతున్నానని వ్రాస్తే మీరు ఎక్కడికో వెళ్ళిపోయిందంటారేం?" అన్నాడు.
    అమృతమూర్తి గుటకలు మ్రింగి "ఎక్కడా శవం కనపడలేదు...అందుకని..." అన్నాడు.
    "మీరు ఎక్కడెక్కడ వెతికారు?"
    "చుట్టుపక్కల అనుమానమున్న చోట్లన్నీ వెతికాను."
    "అనుపమ సంగతి నాకు బాగా తెలుసు. ఒక్కర్తే ఎక్కడికైనా వెళ్ళి ఉండగలిగే సాహసం అనుపమకు లేదు."
    "ఆ సంగతి నాకూ తెలుసు. కానీ వాళ్ళ వదినగారి దగ్గిరకు వెళ్ళిందేమోనని..."
    ఆ నుమానం విఠల్ కూ వచ్చింది.
    "వెళ్ళిచూద్దాం రండి!" అన్నాడు.
    తన సంఘానికి వచ్చిన విఠల్ అమృతమూర్తులను ఆశ్చర్యంగా చూస్తూ "బావమరుదులిద్దరూ ఇలా వచ్చారేం?" అంది పావని.
    విఠల్ మాట్లాడలేకపోతున్నాడు. అమృతమూర్తి తనే గొంతు పెగుల్చుకుని "అనుపమ కనపడటంలేదు ఇక్కడికి వచ్చిందేమోనని..." అన్నాడు.
    "అనుపమ ఇక్కడికి వస్తుందా? ఇక్కడికి రావటం వాళ్ళ అన్నగారి కిష్టం ఉండదని అనుపమకు బాగా తెలుసు. అన్నగారి కిష్టంలేని పని అనుపమ ఎన్నడూ చెయ్యదు. ఈ సంగతి నాకంటే ఆయనకే బాగా తెలుసు..."
    విఠల్ మాట్లాడలేదు. మళ్ళీ అమృతమూర్తే సమాధానం చెప్పాడు.
    "ఒక్కర్తీ ఎక్కడకూ వెళ్ళదు. మీదగ్గిరకి తప్ప మరొక చోటికి వెళ్ళే అవకాశమే లేదు..."

                         


    "పొరపాటు పడుతున్నారు. నా దగ్గిరకు వచ్చే అవకాశం అసలు రాదు. నా దగ్గిరకు వస్తే వాళ్ళ అన్నయ్యకు నలుగురిలో చిన్నతనం...తన చెల్లెలు చచ్చిపోయినా ఆయన భరించలేరని అనుపమకు తెలుసు...అందుకే చచ్చిపోయి ఉంటుంది."
    ఎర్రగా మండుతోన్న కళ్ళతో కసిగా అంది పావని...
    "పోనీ, ఒక్కసారి లోపలచూస్తే..." సాహసించి అన్నాడు అమృత మూర్తి...
    పావని చీదరించుకుంటూ "చూసుకోండి!" అంది.
    విఠల్ కదలలేదు, కానీ అమృతమూర్తి చొరవగా లోపల అంతా చూసి వచ్చాడు.
    పావని నీరసంగా "నమ్మకం కుదిరిందా? ఏం మనుషులు? అనుపమలాంటి సాత్వికురాలు ఎదిరించి నిలబడటానికి కూడా ప్రయత్నిస్తుందా? నిలువునా ప్రాణంతీసుకుంటుంది గాని..." అంది.
    "శవం కనపడలేదు." అన్నాడు అమృతమూర్తి.
    "కనపడుతుంది ఎప్పుడో ఏ చెరువులోనో, ఏ రైలుపట్టాల కిందో... ఆకారంకూడా తెలియకుండా మారిపోయి కనిపిస్తుంది. ఆ శవం మన అనుపమదే నని మనకు చెప్పే వాళ్ళుకూడా ఉండరు. ఎవరో ఈడ్చిపారేస్తారు."
    శరీరం జలదరించింది అమృతమూర్తికి....వినలేకపోయాడు విఠల్.
    "అలా మాట్లాడకు పావనీ! అనుపమ ఎక్కడో బ్రతికే ఉందేమో?"
    "బాధపడుతున్నారా? బాధపడండి. మీ బాధ చూస్తే నాకు జాలిలేదు. అనుపమ బ్రతికిఉందని ఆశపడుతున్నారా? బ్రతకటానికి ఏ మాత్రం ఆస్కారం కల్పించారని బ్రతుకుతుంది? తన వారంటూ ఉన్నారని కష్టసుఖాలు చెప్పుకుంటే అండగా నిలవకపోగా నీతులు చెప్పి బెదిరించి తన భర్తదగ్గిరకే పంపించారు. అతనికి మరింత లోకువ చేసారు. చవక ఏంచేస్తుంది? కొద్దిపాటి సానుభూతితో మీ చెల్లెలి మనసు అర్ధంచేసుకుని "నా దగ్గిర ఉండు. నీకు భయంలేదు." అని ఒక్కమాట అనిఉంటే బ్రతకటానికే ప్రయత్నించేదేమో! తన భార్య విధిలేక తన కాళ్ళదగ్గిరే పడిఉండవలసిన పరిస్థితి లేదని తెలిసివచ్చాక ఆ భర్తలోనూ పరివర్తన వచ్చేదేమో! ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం? మీకు నలుగురిలో తలవంపులు లేకుండా చచ్చిపోయిందని ఆనందించండి..."
    ఆవేదనతో నిప్పులు కక్కుతోన్న పావని ముందు నిలవలేకపోయాడు విఠల్.
    "అనుపమ లేకుండా నేను మాత్రం బ్రతకగలనా?" అని బుడిబుడి దీర్ఘాలు తీసాడు అమృతమూర్తి.
    మండిపోయింది పావనికి.
    "ఏడవకండి. అనుపమ మిమ్మల్ని వదిలి ఎక్కడికిపోదు. దెయ్యమై మీతోనే ఉంటుంది." అంది కసిగా.
    బిత్తరపోయి చూసాడు అమృతమూర్తి.
    
                                                14
    
    నళిని దిగాలుగా ఉంది. పావని కారణం అడిగితే "శంకర్ తో నా పెళ్ళి నిశ్చయం అయింది. కానీ మన పురోగామి సంఘ సహాయార్ధం నేను డాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తే శంకర్ నన్ను చేసుకోనంటున్నాడు..." అంది.
    సంఘపు ఎదురు తాకిడి పడిపడి అలిసిపోయింది పావని.
    "అయితే ఇంకేం! ప్రోగ్రామ్స్ మానేసి పెళ్ళిచేసుకో! ఉన్నదానితోనే సంఘం నడిచినంతవరకూ నడుస్తుంది" అంది నిస్పృహతో.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS