
"ఓ! ఆవిడ నీ వదినగారన్నమాట? చెప్పవేం? ఆడది చెడిపోయినా పరవాలేదనే ఆవిడ నీకు వదిన! నీకూ ఆ సిద్దాంతాలంటే ఇష్టమేనా?" అన్నాడు వెటకారంగా అమృతమూర్తి.
"నాకు ఏ సిద్దాంతాలూ తెలియవు. అతి మామూలు ఆడదాన్ని నేను. శాంతంగానే సమాధానం చెప్పింది అనుపమ.
"కానీ, మీ వదిన అంటే ఇష్టమేనా! నేను కనిపెట్టానులే!"
తన వదిన... తమలో ప్రతి ఒక్కరినీ ప్రాణంగా ప్రేమించే వదిన అంటే తనకు అసహ్యమని చెప్పలేకపోయింది అనుపమ.
"ఛీ! ఛీ! సంప్రదాయమైన కుటుంబమని మోసపోయి చేసుకున్నాను...."
ఆ చీదరింపు సహించలేక పోయింది అనుపమ...
"అంత కాని పనులు ఇక్కడెవరూ చెయ్యలేదు." అంది రోషంగా.
"నోరు మూసుకో! కుటుంబానికి ఇంత మచ్చ పెట్టుకుని తగుదనమ్మా అని మాట్లాడుతున్నావు."
"మీ వదిన కెందరు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు? నీ కెందరున్నారు?" అనుపమ సమాధానం చెప్పలేదు.
"ఎంత పొగరు? అడిగినదానికి సమాధానం చెప్పవూ?"
"ఏం చెప్పమంటారు? నాకు తెలిసినంతవరకూ మా వదిన చాలా మంచిది... నన్ను కాలేజీకి తప్ప మరెక్కడికీ పంపేవారు కాదు మా ఇంట్లో. నా కసలు స్నేహితులే లేరు!"
"చాల్లే! వేషాలు-మాది ఎలాంటి కుటుంబమో తెలుసా? మా చెల్లెలికి పన్నెండేళ్ళు నిండకుండానే పెళ్ళి చేసాము."
గర్వంగా చెప్పుకుంటోన్న అమృతమూర్తి మాటలకు ఆశ్చర్యపోతూ "ఇంకా ఈ కాలంలో కూడా అలాంటి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయా?" అంది అనుపమ.
"నీ మొఖం పల్లెటూళ్ళలోకి వెళ్ళి చూడు. వేల సంఖ్యలో కనిపిస్తారు. ఈ బోడి చదువులొచ్చి ఆడదాన్ని పాడుచేసేస్తున్నాయి."
హడలిపోయింది అనుపమ. సూటూ బూటూ వేసుకున్న ఈ నవ నాగరిక యువక మూర్తిలోనుండి, పాతరాతియుగపు మనిషి కోరలు జాపుతూ ప్రత్యక్ష మవుతోంటే నిలవలేకపోయింది.
రోజూ సూటి పోటి మాటలతో మనసును తూట్లు పొడుస్తోంటే భరించలేక పోయింది అనుపమ. ఆ ఇంట్లో ఉండలేక పుట్టింటి కొచ్చేసింది.
అనుపమ చెప్పింది విని పద్మావతి సమాధానపడలేక పోయింది.
"ఇంత చిన్నవిషయానికి కాపురాలు కూలదోసుకుంటారుటే! అతనేదో అనుకుంటాడు. నిన్ను కాదనుకుంటే పోలా? ఆడదానివి. అన్నింటికీ ఇలా రాద్దాంతం చేసుకుంటే ఎలా?" అని అనుపమకే బుద్ధి చెప్పటం ప్రారంభించింది.
తల్లి పెద్దది తనను అర్ధంచేసుకోలేకపోయింది. కనీసం అన్న అయినా తనను అర్ధంచేసుకుంటాడని ఆశపడి అన్నతో తన గోడు చెప్పుకుంది అనుపమ.
"ప్రతిరోజూ నన్ను సూటిపోటి మాటలతో పొడిచి పొడిచి కాని బయటకు కదలరు అన్నయ్యా! అక్కడికీ, ఎంతో ఓర్చుకుంటాను. నేను ఓర్చుకున్నకొద్దీ ఆయన ధోరణి మరింత ఎక్కువయిపోతుంది. ఏ మాట అంటే నా మనసు ముక్కలవుతుందో అలాంటి మాటలంటారు. విని, విని భరించలేక నేను ఏడుస్తే అప్పుడు పైశాచికంగా నవ్వుకుంటూ వెళ్తారు. ఇంక ఈ నరకం నేను భరించలేను అన్నయ్యా! నేను మనిషిని-నాకూ ఒక మనసుంది."
చెల్లెలి బాధ చూసి విఠల్ మనసు కరగక పోలేదు. కానీ అనుపమ భర్తను వదిలి పుట్టింట్లో ఉండిపోవటాన్ని మాత్రం హర్షించలేక పోయాడు.
"ఈ మాత్రం దానికే పుట్టింట్లో ఉండిపోతానంటే నలుగురూ నవ్వుతారు అనూ! నేను వచ్చి దిగబెట్టి మీ ఆయనకు నచ్చజెపుతానులే!" అన్నాడు.
సహజంగా సాత్వికురాలయిన అనుపమకు కూడా విఠల్ ధోరణికి కోపం వచ్చింది.
"నువ్వు ఎప్పుడూ ఇంతే అన్నయ్యా! ఏది మంచిదో గుర్తించగలిగీ కూడా నలుగురూ నవ్వుతారని భయపడతావు. ఈ భయంతోనే వదినను దూరం చేసుకుని కుమిలి పోతున్నావు."
తెల్లబోయి చూసాడు విఠల్.
తడబడింది అనుపమ.
"క్షమించు అన్నయ్యా! నీ దుఃఖం చూడలేకనే అన్నాను."
"సరేలే! రేపు నేనే నీతోవచ్చి బావగారికి నచ్చజెపుతాను," అన్నాడు విఠల్ ప్రస్తావన మారుస్తూ.
"వద్దన్నయ్యా! నువ్వేమీ నచ్చజెప్పక్కర్లేదు. అసలు ఎవరూ నచ్చజెప్పవలసినదీ ఏమీలేదు రేపటిదాకా ఎందుకు? ఇవాళే వెళ్ళిపోతాను."
"అనూ! కోపం తెచ్చుకోకమ్మా నీ మేలు కోరి ఇలా అంటున్నాను కాని నువ్వు కష్టపడాలని నేను కోరుకుంటానా?"
"నాకు తెలుసు నన్నయ్యా! అందరూ మేలుకోరేవారే! కానీ, ఆ మేలు ఏమిటో మాత్రం ఎవరికీ తెలియదు."
అనుపమ కన్నీళ్ళలో కదిలే వ్యధ పూర్తిగా అర్ధం కాలేదు విఠల్ కి. ఆ సమయంలో అనుపమకి ప్రోత్సాహమిచ్చి తనదగ్గిర ఉంచుకోవటంకంటే నచ్చజెప్పి భర్త దగ్గరికి పంపెయ్యటమే మంచిదనుకున్నాడు. కొంతకాలానికి కలతలు అవే సర్దుకుపోతాయని నమ్మాడు.
తన దగ్గిరకు తిరిగి వచ్చిన అనుపమను చూసి అట్టహాసంగా నవ్వాడు అమృతమూర్తి.
"తిన్నగా మీ వదిన సఘంలోకి వెళ్ళకపోయావా? తిరిగి నా దగ్గిరకు వచ్చావేం?" అని ఇంటికొచ్చిన ఇల్లాలిని కుశలప్రశ్న వేశాడు.
పైట చెంగుతో కన్నీళ్ళు వత్తుకుంటూ లోపలకు నడిచే ఇల్లాలిని సంతృప్తిగా సగర్వంగా చూసుకుని చిరునవ్వులు చిందిస్తూ బయటకు నడిచాడు.
12
సంఘంలో విద్యార్ధినుల మధ్య ఏదో అలజడి అవుతోంటే అదేదో కనుక్కోవడానికి అక్కడికి వెళ్ళింది పావని.
సీత అనే అమ్మాయి బిక్కముఖం వేసుకుని ఉంది. సరోజ రోషంగా బుసలు కొడుతోంది. పావని వాళ్ళమధ్యకు వచ్చి "ఏం జరిగింది? ఎందుకు గొడవ పడుతున్నారు?" అంది.
"నన్ను వీళ్ళతో సినిమాకు రావటానికి వీల్లేదంటున్నారు మేడమ్!" అంది దీనంగా సీత.
సరోజ పొగరుగా అది పెళ్ళికాకుండానే కడుపుతో ఉంది. దానితో కలిసి సినిమాకు వెళ్తే మమ్మల్ని చూసి నవ్వుతారు" అంది.
పావని కళ్ళముందు చీకట్లు క్రమ్మాయి. కాళ్ళక్రింద భూమి కదిలింది. ఏ ఆశయ సిద్ధికై తను ఈ సమాజాన్ని స్థాపించి ఇంతగా కృషిచేస్తోందో ఆ ఆశయం తమ సమాజంలోనే, తన కళ్ళముందే ఇలా వికృతరూపంతో ప్రత్యక్షమవుతోంది...
"సరోజా! నేను ఎన్నోసార్లు చెప్పాను. మళ్ళీ చెపుతున్నాను. సీత నీచురాలు కాదు. అల్పబుద్దులూ, నీచులూ, తమ అల్పత్వనని రహస్యంగా అణచుకుని పెద్దమనుష్యులుగా చెలామణి అవతానికే ప్రయత్నిస్తారు. తమకు నెల తప్పిందనే విషయం దాచిపెట్టి పెళ్ళిచేసుకునేవాళ్ళూ, రహస్యంగా ప్రసవించి శిశువును అనాధశరణాలయాలకు అప్పగించి మరొకపెళ్ళి చేసుకునేవాళ్ళూ, సజమలో గృహిణులుగా గౌరవింపబడుతూనే ఉన్నారు. ఏదో ఒక పొరపాటు కారణంగా ప్రకృతి శాపానికి గురిఅయిన అమాయకులూ, విధివంచితలూ, సమాజంముందు దోషుల్లా నిలిచి పోతున్నారు వీళ్ళు సమాజానికి బలి కాకుండా చూడటమే మన ధ్యేయం. ఇంకొకసారి ఇలా మాట్లాడకు. అందరూ కలిసి సినిమాకు వెళ్ళండి..."
సరోజ అప్పటికీ లొంగలేదు.
"మేం బీదవాళ్ళం. మీరు మాకు చదువు చెప్పించినంత మాత్రాన మా పరువు ప్రతిష్టలు వదులుకోమనటం న్యాయంకాదు" అంది.
పావనిలో సహనం నశించి అంతులేని కోపం వచ్చింది.
"సరోజా! పరువు ప్రతిష్టలు వదులుకోమనటంలేదు. అవి పెంచుకోమంటున్నాను. ముందు ఆ మాటలకు అర్ధం తెలుసుకోమంటున్నాను. సీత ఏ విధంగానూ మీకన్న తక్కువది కాదు. తనమీద మీరెవరూ జాలి చూపించనూ అక్కర్లేదు. అసహ్యించుకోవలసిన అగత్యం అసలే లేదు. మా సమాజం ఆశయాలు ముందే అందరికీ స్పష్టంగా చెప్పాను. చెపుతున్నాను. ఆ ఆశయాలు గౌరవించనివాళ్ళు ఈ సమాజంలో ఉండక్కర్లేదు."
