Previous Page Next Page 
ఆదివిష్ణు కథలు పేజి 14


                                             అగ్గి రాముడు
    
    జగన్నాథం చెడ్డ చిరాకు మనిషి పరమ కోపిష్టి. ఈ నైజంతో అతను అనేక సందర్భాల్లో కొందరిచేత ఛండశాసనుడు అని పిలిపించుకున్నాడు కూడా! జగన్నాథం  ఆర్టీసీలో రీజినల్ మేనేజర్ గా పనిచేసి మూడు నెలల క్రితమే రిటైరయ్యాడు.
    ప్రస్తుతం ఇంట్లోనే వుంటున్నాడు. అతను సర్వీసులో వుండగా అతని కింది ఉద్యోగులు యావన్మందీ అతని ధూంధాంలకు అదరి చచ్చేవారు. తన రీజియన్లో పనిచేసే కండక్టర్లు, డ్రైవర్లు, క్లీనర్లు, మెకానిక్ లాంటి బడుగు కార్మికులు మాత్రమే కాకుండా, డిపో డివిజనల్ మేనేజర్లాంటి అధికారులు సైతం తట్టుకోలేకపోయేవారు.
    అంచేత కనికరం బొత్తిగా లేని కసాయి మనిషిగా పేరు తెచ్చుకున్నాడు. అతనికి 'అగ్గిరాముడు' అని ముద్దుపేరు పెట్టుకుని, ఆ పేరుతో బండబూతులు తిట్టుకునేవారు అతని కింది ఉద్యోగులు ఇంట్లో కూడా అతను ఎల్లప్పుడూ ముక్కుపుటాలెగరేస్తూ వుండేవాడు.
    కట్టుకున్న భార్యా... కన్నబిడ్డలెవరైనా సరే అతి చనువుతో వ్యవహరించినా.... హద్దుదాటి ప్రవర్తించినా కళ్ళెర్ర చేసి గాండ్రించేవాడు.
    రిటైరై ఇంట్లో కూచున్నా తన ధోరణిలో ఎలాంటి మార్పు లేకుండా బతకాలనుకున్న తన ధ్యేయానికి భార్యాబిడ్డల కారణంగా బ్రేకులు పడుతున్నాయి. నిద్రమంచం దిగిన వెంటనే కాఫీ తాగడం అతని అలవాటు. రిటైరైన తర్వాత ఈ ఏర్పాటు సవ్యంగా సాగడం లేదు. ఆ రోజు కూడా అతను మంచం దిగుతూ 'కాఫీ' అని అరిచేడు. ఆ యొక్క ఆర్తనాదం పనిచేయలేదు. అంచేత మేడమీద తన గదికి కాఫీ రాలేదు.
    దాంతో అతని 'అహం' దెబ్బతిన్నది. కోపం కూడా వచ్చింది. అందువల్ల రెండోతడవ శృతి పెంచి 'అన్నపూర్ణా' అని మాత్రమే ఆర్తనాదం చేసేడు.
    అప్పటికీ తనకు కాఫీ రాలేదు.
    ఈ తడవ ఆర్తనాదాలకు చుక్కపెట్టి అతనే స్వయంగా మేడదిగి కిందికి వచ్చేడు. హాల్లో దృశ్యం చూడగానే అతనికి ఒళ్ళు మండిపోయింది.
    పెద్దకుమారుడు రవణకి అన్నపూర్ణ కాఫీ ఇచ్చింది. ఆ కాఫీ గుటుక్కున మింగే ప్రయత్నం చేసేడు రవణ.
    అతని ప్రయత్నాన్ని వారిస్తూ కంగారుగా అన్నది అన్నపూర్ణ. "వేడిగా ఉందిరా -ఊదుకు తాగు!"
    "ఆఫీసుకు వేళయిందమ్మా! ఊదుకుంటూ కూచుంటే ఉద్యోగం ఊడిపోతుంది!" అంటూ గారాలు పోతున్నాడు రవణ. రవణకి పెళ్ళయ్యింది. అతని భార్య పురిటికి పుట్టింటికి వెళ్ళింది. అంచేత అతని బాగోగులు తల్లే స్వయంగా చూసుకుంటోంది. "కాఫీ కోసం నేను నిన్ను రెండు తడవలు అరిచి పిలిచేను. "వినపళ్ళేదా?" అన్నాడు జగన్నాథం.
    ఎన్నడూ లేనిది భర్తమాటకు మొదటిసారి ఎంతో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది అన్నపూర్ణ.
    "వినపడింది లెండి! మీరేమైనా రవణమాదిరి ఆఫీసుకి వేళకు వెళ్ళాలా పాడా? రోజంతా మా మాదిరి ఇంట్లోనే వుంటారుగా? ఎందుకు తొందర?" అని అందామె.
    ఇన్నేళ్ళ వైవాహిక జీవితంలో భార్యనుంచి 'నిర్లక్ష్యధోరణి' అంత కటువుగా ఆనాడే తొలిసారి వినడం వల్ల తట్టుకోలేకపోయాడు జగన్నాథం!
    ఆమెను బండబూతులు తిట్టాలనుకున్నాడు. మెడపట్టి వీధిలోకి గెంటాలనుకున్నాడు. అనుకున్నాడే గాని పెద్దమనిషిగా 'సంస్కారం' అడ్డం పడడం వల్ల ఆ కార్యక్రమాలు అనుకోవడంతోనే ఆగిపోయాయి.
    "డోంటాక్ రబ్బిష్" అని మాత్రమే వార్నింగిచ్చి వంట గదిలోకి వెళ్ళేడు. తన కాఫీ తనే చేసుకుని తాగేందుకు అక్కడ వాష్ బేసిన్లో బెండకాయలు కడుగుతున్న రెండో కొడుకు శీనుని వ్యంగ్యంగా అడిగేడు.
    "ఇవాళ మన ఇంట్లో బెండకాయ వేపుడు కాబోలు!" అని అన్నాడు.
    "వేపుడు కాదు, బెండకాయ పులుసు పెట్టమని అమ్మని అడిగేను" అన్నాడు వెంటనే శీను జగన్నాథంతో.
    "మరింకేం? నువ్వు కూడా మీ అన్నమాదిరి 'ఉద్యోగస్తుడివే' కదా! నువ్వడిగితే తప్పకుండా చేసి పెడుతుంది బెండకాయ పులుసు. మొగుడి ప్రతిజ్ఞ మంటగలిపి కొడుకుల ముచ్చట తీర్చడమే ఇప్పుడు మీ అమ్మ ధ్యేయం! కానివ్వండి" అని అన్నాడు కోపంగా.
    అప్పుడే అక్కడికి వచ్చిన అన్నపూర్ణ "అది కాదండీ! వాడు" అంటూ చిన్నగా ఆమె ఏదో సర్దిచెప్పే ప్రయత్నం చేసింది.
    "నువ్వు నోర్ముయ్! చచ్చి స్వర్గాన వున్న మా అమ్మ కోసం నాకెంతో ఇష్టమైన ఆ యొక్క బెండకాయ ముట్టనని కాశీలో ఒట్టేసుకున్నాను. ఆ సంగతి నీక్కూడా తెలుసు. బాగా తెలుసు. అయినా సరే పంతం కొద్దీ బెండకాయ పులుసు" అని ఏదో చెప్పబోతుండగా తండ్రి మాటకి అడ్డంపడి అన్నాడు చిన్నకొడుకు...."ఆ పులుసు నా కోసం వండుతుంది నాన్నా! నేను తింటే తప్పులేదు. బామ్మఏమీ అనుకోదు!"
    "అనుకోదు సరే! నా కళ్ళముందు నాకెంతో ఇష్టమైన బెండకాయ పులుసుతో మీరు భోంచేస్తుంటే ఒట్టేసుకున్న పాపానికి నేను నోరు కట్టుకు చావాలా? కన్నతండ్రినిరా! నా ఒట్టూ ప్రతిజ్ఞలూ మీకు కూడా వర్తిస్తాయి. అండర్ స్టాండ్! అవున్లే..... ఉద్యోగాలు వెలగబెడుతున్నది మీరు! రిటైరైన ముష్టివెధవను నేను! నా మురికి ఒట్లు ప్రతిజ్ఞలు మీరెందుకు పట్టించుకుంటారు?" అంటూ మళ్ళీ మేడెక్కేడు జగన్నాథం.
    చల్లారని కోపంతోనే చాలా ఆలస్యంగా చన్నీటితో స్నానం ముగించేడు. చెక్కుబుక్కూ పర్సూ బ్రీఫ్ కేసులో సర్దుకున్నాడు. ఆ తర్వాత వీధిలోకొచ్చి ఆటో ఎక్కేడు.
    తాజ్ మహల్ హోటల్ ముందు ఆటోదిగి అక్కడే 'కసి'గా బ్రేకుఫాస్టు ముగించేడు. ఇంట్లో భార్యాపిల్లలవల్ల తనకి జరిగిన పరాభవం యొక్క మంట బ్రేకుఫాస్టుతో కొంత చల్లబడినట్టు డౌటు కలిగింది.
    ఏది ఏమైనా ఇప్పటికిప్పుడు అర్జంటుగా ఇంట్లోకి వెళ్ళాలనిపించలేదు. అటో ఎక్కి ఎక్కడికైనా పారిపోవాలనుకున్నాడు. లంచ్, డిన్నర్లు రెండూ హోటల్లోనే పూర్తి చేసుకుని ఆ తరువాత తీరుబడిగా తను ఇల్లు చేరాలి అనుకున్నాడు.
    ఆర్టీసీ నుంచి తనకు రావాల్సిన బ్యాలెన్సు డబ్బు ఇంచుమించు పాతికవేల వరకు వుంటుంది. ఇప్పుడు ఆ పైకంతో అవసరం లేకున్నా, ఆవంకతో ఆర్టీసీ ఆఫీసుకి పారిపోయే ప్రయత్నంలో అటో ఎక్కేడు.
    ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ముందు ఆటో దిగుతున్న జగన్నాథాన్ని చెక్కులురాసే గుమస్తా స్పష్టంగా చూసేడు. అ పెద్దమనిషి చెక్కు కోసమే ఆఫీసుకి వచ్చి వుంటాడని ఊహించాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS