"అయినా సరే , నేనీ సినిమాకి వెళ్ళను గాక వెళ్ళను" అనుకున్నాడు శ్రీనివాసరావు . ఈ శ్రీనివాసరావుకి మరో సిద్దాంతం తెలుసు.
ఎండ తీవ్రతను భరించలేని మనిషి , పదినిమిషాల చల్లదనం కోసం ఎయిర్ కండిషన్ గదిలో కాలక్షేపం చేసి బయటికి వస్తే, అక్కడ అతని కోసమే కాచుకున్న ఎండ ఒక్క దెబ్బ కొట్టి - అతన్ని కింద పారేస్తుంది. అంచేత - బతుకులో వున్న చేదుని, వీధిలో బాధిస్తున్న ఎండనీ ఈ మానవుడు తప్పించుకుప[పోలేడంతే!
ఈ థియరీ కి జాయింటుగా మరో చిన్న పాయింటూ శ్రీనివాసరావుకి తెలుసు. ప్రస్తుతం అతని దగ్గిర సినిమా చూచేందుకు సరిపడ్డ పైకం లేదు. ఏడుకొండలు ముప్పై పైసలతో చూసే సినిమాని శ్రీనివాసరావు రెండు రూపాయలతో గాని చూళ్ళేడు. ఇద్దరూ మనుషులే - చూసేది ఒకే సినిమానే -- అయితేనేం - అంతస్తులనే వర్గ పోరాటం శ్రీనివాసరావు నెప్పుడో గెలిచేసింది.
"ఏవండోయ్ అనెవరో పిలవగానే శ్రీనివాసరావు అక్కడ ఆగిపోయి వెనక్కి తిరిగి చూసేడు.
సైకిల్ షాపు రత్తయ్య నవ్వుతూ అడిగేడు.
"గుర్రమేదండీ? నడిచే వెడుతున్నారు."
"సైకిలేనా - పాతదైపోయిందయ్యా. ఇంట్లో పారేసాను. వీదీలోకి తెస్తే అది నన్నే తినేట్టుంది మరి."
"కొత్తది కొంటె పోలా."
"ఎందుకు పోదు ? పోతుంది. ముందీ పాతదాన్ని వదిలించుకోవాలిగా."
"అయితే అమ్మకానికి పెట్టినట్టేనా?"
"నిక్షేపంగా - నువ్వేమైనా కొంటావా?"
"నేను కాకపోతే మరొకళ్ళు. మిమ్మల్నంత యిబ్బంది పెడుతుంటే. దాన్నో తడవ మా షాపులో పారేయండి. మంచి బేరం నేను చూస్తాను."
శ్రీనివాసరావుకి అమ్మకి కొనవలసిన మందు సీసా, పిల్లలకి చిన్న సైకిలూ ఒకేసారి గుర్తుకు రావడంతో వెంటనే అన్నాడు.
"నేను రేపే సైకిలు పట్టుకొస్తాను. మంచి బేరం చూడాలి సుమీ!"
"ఆ విషయం నానెత్తినీట్టండి సార్!-"
శ్రీనివాసరావుకి రత్తయ్య నెత్తి మీద అభిమానం కలిగి లోలోన మెచ్చుకున్నాడు. అతనప్పుడు పెద్ద బజారు వేపు నడక సాగించాడు.
ఆ బజార్లో షరాబులున్నారు. అక్కడ విలువైన వస్తువులెన్నో దొరుకుతాయి. ఆ బజారెంత ఇరుగ్గా ఉంటుందో అంత రద్దీగానూ ఉంటుంది. అక్కడ జనం, ఎప్పుడు చూచినా హడావుడిగా ఆ కొట్టు నుంచి ఈ కొట్టుకి తిరుగుతూనే వుంటారు. అక్కడ పచ్చకాగితాల మార్పిడి విచ్చలవిడిగా జరుగుతూ ఉంటుంది. అక్కడంతా కన్నుల పండుగుగా వైభవంగా ఉంటుంది. అంచేత శ్రీనివాసరావు అటువేపు నడిచేడు.
దగ్గిరలో ఒక అందమైన మందులషాపు కనపడటంతో అతను ఆ షాపులోకి వెళ్ళాడు. జేబులో ఎవడో మిత్రుడు వ్రాసిన పాతకార్డు మడతలో అమ్మ మందు చీటీ నలిగి నిక్షేపంగా వుంది. దాన్ని బయటికి తీసి షాపతనికి యిచ్చేడు ఇస్తూ --
"ఇదెంతో చెప్పండి " అన్నాడు.
ఆ షాపతను నలిగిపోయిన ఆ కాగితం వేపు చూచి , శ్రీనివాసరావుని అంచనా వేసినట్టు అసహనంగా అన్నాడు.
"ఉంది. పదిహేడు నలబై."
"మునుపు పదహారన్నారే!"
"మునుపు అంటున్నారు? ఎప్పుడేమిటీ?"
"అవును, ఎప్పుడు? నేనెప్పుడు అమ్మకి మందు కొన్నానూ .....ఆ రోజు దసరా అడ్వాన్సు యిచ్చేరు గదూ. ఆ రోజే గదూ కొన్నది. అవునప్పుడే కొన్నాను. లెక్క వేస్తె ఎన్ని నెలలు గడిచినట్టు..... ఎన్ని నెలలు.....ఉండండి సార్. ఖచ్చితంగా చెబుతాను రోజులతో సహా! నన్ను కంగారు పెట్టకండి మరి.)
"ఏమిటో అంటున్నారు గాని, ధరలు పెరగడానికి గట్టిగా వారం రోజులు చాలు. నన్నడుగుతే ఒక్కరోజు చాలంటాను. ఈ షాపులో మీ మందు పదిహేడు నలభై కంటే ఒక్క పైసా తగ్గదు" అంటున్నాడు షాపతను.
"ఈ మందు నాకు కాదండీ. మా అమ్మకి" అన్నాడు శ్రీనివాసరావు.
"ఎవరికైతే మాకేమండీ?" దాని ధర అంతే"
శ్రీనివాసరావు ఆ చీటీ పుచ్చుకొని మళ్ళా కార్డులో పెట్టుకున్నాడు.
(రోజులు మండిపోతున్నాయి. అయ్యా! సార్! మీరన్నది యెంతో నిజమండి. ధరలు పెరగడానికి అనవసరంగా రోజులు ఎందుకండి, గంటలు చాలు పెరగడం వాటి ధర్మం. వాటితో పాటు మనం పెరక్కపోవడం మన కర్మం. నేనిటు యింటికి వెళ్లి మళ్ళీ మీ షాపుకి వస్తే దాని ధర యిరవై అంటారు. మీదేం పోయింది అంతే సార్. కరెక్ట్!)
"రైట్. థాంక్స్ అండి. వస్తాను. అన్నట్టు మాస్టారూ , రేపు ఈ ధర...."
"ఆ గ్యారెంటీ నేనివ్వలేను."
శ్రీనివాసరావు షాపు కిందికి అడుగు పెడుతున్నప్పుడు తన మీద యెవరో తూలీ పడినట్టు గమనించేడు. మీదపడిన మనిషి దగ్గిర నించి ముక్కులు పగిలెంతగా స్పిరిట్ వాసనా రావడంతో అదిరిపడి ఆ మనిషి వేపు చూసేడు. ఎవడో కాలేజి స్టూడెంట్ 'లేట్ మీ గో ఫస్ట్ " అంటున్నాడు.
(గో బ్రదర్ గో! మందు తాగిపోయే తమ్ముడూ , ఎంత సరదాగా ఉన్నావయ్యా! వెళ్ళు ఈ షాపులోనే పుచ్చుకున్నావా , మంచిది బాబూ! వెళ్ళు. "ఇక్కడన్నిరకములైన మందులు లభించును" అంటే అర్ధమేమిటో నువ్వు గ్రహించి కృతార్ధుదవైపోయావ్)
రాత్రి పదింటికి గూడా శ్రీనివాసరావు యింటికి వెళ్ళలేదు. విశాలమైన రోడ్డు మీద, ట్యూబ్ లైట్ల కింద దోమల్ని తోలుకుంటూ మనుషుల్ని పలకరిస్తూనే వున్నాడు.
రోడ్డు మీద జనం తగ్గిపోతున్నప్పుడు మాత్రం అతను ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఇంటివేపు నడుస్తుండగా ఒకే రిక్షాలో శాంతాదేవి, అంజనేయులూ ఎదురుపడగా , మనిషి నిలువునా వణికిపోయేడు.
ఇంక , అక్కడ నిమిషం పాటైనా నిలబడలేదు. పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ యింటికి నడిచేడు.
ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. అమ్మ బాధ కొద్ది మూలుగుతూ వుంది గని, దాని వల్ల నిశ్శబ్దానికొచ్చి పడే అంతరాయం ఏమీ లేదు. పిల్లలంతా నిద్రపోయేరు. సీత గుమ్మానికి తల ఆనించి కూర్చున్నది.
శ్రీనివాసరావు యింట్లోకి రాగానే, సీత గబిక్కిన లేచి నుంచుని అడిగింది.
"ఎక్కడికి వెళ్ళేరు."
"ఆ మాట విని తల్లి కూడా అన్నది.
"అబ్బాయి వచ్చేదా అమ్మాడూ"
"ఆ ....వచ్చాను" అన్నాడు శ్రీనివాసరావు.
'అయితే, వాడికి వడ్డించవే .....నాన్నా ఇలా వస్తావుట్రా?"
శ్రీనివాసరావు తల్లి దగ్గిరకు నడిచేడు. ఆ తల్లి అతన్ని తన పక్కన కూర్చోమని సైగ చేసింది. అతను కూర్చున్నాడు.
"నేనోమాట చెప్పనా నాన్నా"
"చెప్పు"
"నా గురించి నేనెప్పుడూ ఆలోచించను. నేను నీ గురించే బాధపడు తున్నాను. నువ్వేమో.....కుక్క పేగుల వాడివి. నా గురించి దిగులు. ఇదేం బాగోలేదు నాయనా! వెయ్యేళ్ళు వర్ధిల్లేవాడివి నీ కీ దిగులు కూడదు నాన్నా. నిన్నెంతలా పెంచుకున్నాన్రా నేను."
