అలా ఇద్దరూ, అమాయకంగా బాసలు చేసుకున్నారు. ఒకరికి ఒకరు సలహా ఇచ్చుకున్నారు.
"ఈరోజు మా అమ్మ జొన్నరొట్టె కట్టింది."
"అరె నేను రుచిచూడాలి" అనేది రాధిక.
"ఏయ్ శ్రఈనూ! నీకిష్టమైన పూరి ఉంది." అని పిలిచేది. ఇద్దరూ ఒకరి భావాలు ఒకరు, ఒకరి టిఫిన్ మరొకరు పంచుకుని తినేవారు.
ఇద్దరూ కలిసి రావటం, కలిసి పోవటంతో ఈ ప్రపంచం ఉందని, దానికి వెయ్యి కళ్ళున్నాయని ఇద్దరూ మరిచిపోయారు.
రాధిక ఇంటర్ సెకండియర్ లోకి వచ్చింది. ఆ రోజు ఫస్ట్ టర్మ్ పరీక్షలు అయిపోయాయి. ఇద్దరూ సినిమాకి వెళ్ళారు! ఆరోజు ఇంటికి రాగానే యశోద రుస,రుసలాడుతూ కనిపించింది.
"రాధికా! నీకు పరీక్షలు ఎన్నిగంటలకు అయిపోయాయి?"
"ఒంటిగంటకే అయిపోయాయి. ఆ తరువాత నేను ఒక స్నేహితుడు కలిసి సినిమాకు వెళ్ళాం" అన్నా భయం, భయంగా చూచింది.
"యెవరా స్నేహితుడు!"
రాధిక తల్లి తీక్షణమైన ప్రశ్నకు చలించిపోయింది. నోట మాట రానట్టు నిలబడిపోయింది.
"యెవరూ! ఆ పార్వతమ్మ కొడుకేనా!"
అవును అన్నట్టు తలాడించింది.
"నీకు బుద్ధి జ్ఞానమూ ఉన్నాయా అసలు! అతని చరిత్ర తెలుసా! పార్వతమ్మ బీడీలు చేసి పొట్ట పోషించుకుంటుంది" అన్నదామె కోపంగా.
"అంతేకదా. యెవరింట్లో దొంగతనం చేయలేదుకదా."
"ఏమిటే ఏమన్నావ్?"
"తమ పొట్ట పోషించుకోవటానికి పనిచేయడం నేరమా -"
ఆమె మాట పూర్తికాకముందే రెండు చెంపలు కందిపోయాయి. ప్రళయ రుద్రుడిలా పురుషోత్తమరావు నిల్చున్నాడు.
"అయితే నువ్వు బీడీలు చేస్తావా......."
"నా......నాన్నా....." చెంపలు తడుముకుంది.
"వెధవ ఆలోచనలు మానెయ్యి. తెలియక తిరిగితే, ఈ రోజు నుండి మానెయ్యి, ఈనాడు వచ్చే వెధవ సినిమాలు, వెధవ నవలలు చదివి బొత్తిగా పాడయిపోతున్నారు" అని ఆయన వెళ్ళిపోయాడు.
"అమ్మా!"
"అమ్మనే చెబుతున్నాను. అతని విషయం మరిచిపో. ఆశయాలు ఆచరణకు వచ్చేవరకు చాలా తలకాయ నొప్పిగా ఉంటుంది. నామాట విను. నీకు శత్రువునా -" ఆప్యాయంగా, కూతుర్ని దగ్గరగా తీసుకుని, తల నిమిరింది.
"అది - అది కాదమ్మా -"
"ఏది కాదు. అతన్ని ్పరేమించానంటావు అంతే కదా. ఈ ప్రేమలు అభిమానాలు ఆర్ధికపరమైన విషయాలతో ముడిపడి ఉంటాయి. డబ్బులేని వారు ఎందుకూ కొరకారు" అన్నది.
రాధిక తల్లి హృదయంలో తలదాచుకుంది.
"అమ్మా! డబ్బున్నవాడు కావాలని ఎందుకు కోరుకుంటారు మనకున్నది చాలదా! అదికాక శ్రీనివాస్ పరిశ్రమలు పెట్టి మీకు తీసిపోనంత డబ్బు సంపాదిస్తానన్నాడు." అన్నది.
"సరే -అంత దీక్ష పట్టుదల ఉంటే కాదంటామా!"
"అతను డబ్బు సంపాదించేవరకు పెళ్ళి వద్దన్నాడు."
"అంతే కాదు. మీరు కలుసుకోవద్దు"
"అమ్మా!"
"అవును. అందరినోళ్ళలో నానటం నాకిష్టంలేదు. పదిమంది కంట పడితే మన పరువేం కావాలి. నువ్వూ నేను మరిచిపోయినా అతని తండ్రి పాలేరని లోకం గుర్తుంచుకుంటుంది " అన్నది యశోద.
