'ఊహు , లాభం లేదు-- వాళ్ళు ఒప్పుకోరు. ఇంకా ఆలోచిస్తుంటే అసలు వాళ్ళకి ఈ సంగతి చెప్పగలిగే ధైర్యం నాకు లేదమో ననిపిస్తోంది ....ఆ -- నీకో సంగతి చెప్పలేదు కదూ -- పది రోజుల పైన అయిందిలే నాన్నగారి దగ్గర నుంచి వుత్తరం వచ్చింది -- ఎవరో పెళ్లి కూతుర్ని చూడాలనీ వారం రోజులు సెలవు పెట్టి రమ్మనీ వ్రాశారు.....ఇక కళ్యాణి సంగతి! తను మా ఆఫీసులో చేరి సంవత్సరం కావస్తోంది. తను కొత్తగా ఆఫీసులో చేరిన రోజున మా ఆఫీసరు ఆమెని పరిచయం చేస్తుంటే నే, ఆవేళే ఆ మొదటి చూపులోనే తనంటే నాకు వో మంచి అభిప్రాయం ఏర్పడి పోయింది -- ఆ తరువాత నేనే కావాలని తనతో పరిచయం పెంచుకుని స్నేహం చేశాను. తనూ ఎలాంటి అయిష్టతా చూపించలేదు. క్రమంగా ఒకరి మనసు ఒకరికి అర్ధం అయిపోయినా ఆ విషయం ఏనాడూ పైకి మాట్లాడు కోలేదు ...సరే, ఆవాళ నాన్నగారి దగ్గర నుంచి వుత్తరం వచ్చిందని చెప్తూ నేను మీ విషయం నాన్నగారికి వ్రాయాలను కుంటున్నానని చెప్పాను.' అప్పుడు చెప్పింది తను ఫలానా అని. అది వింటూనే నాకు ఒళ్లు తెలియని కోపం ఆవేశం ముంచుకు వచ్చాయి. తను చెప్తున్నది సరిగ్గా వినటం కూడా ఇష్టం లేక పోయింది. కాస్త దూకుడు గానే లేచి వెళ్ళిపోయాను. ఆ వూపులోనే మర్నాడు బయలుదేరి మావూరు వెళ్లాను. నన్ను చూసి అమ్మా వాళ్ళూ చాలా సంతోషించారు. వాళ్ళ వుత్తరానికి సమాధానం గానే నేను వెళ్లానని , వాళ్ళ ప్రయత్నానికి నేను సుముఖంగానే వున్నానని అనుకుని వాళ్ళకి వుత్తరం వ్రాసేశారు. ఆ పెళ్లి కూతురు మేనమామది మా వూరే. వాళ్లు మూడో నాటికి పిల్లని తీసుకుని ఈయనింటి కి వచ్చారు. అక్కడే పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు -- ఇంక నా సంగతి -- ఈ వూరు వదలి వెళ్ళిన మరునిముషం నుంచి కళ్యాణి తలపులే నన్ను విడవకుండా వెంటాడటం ప్రారంభించాయి. ఆమె మాటలే చెవిలో గింగురు మంటుండేవి. ఏ పని చేస్తున్నా , అమ్మా వాళ్లతో మాట్లాడుతున్నా, పెళ్లి కూతుర్ని చూడటానికి వెళ్లి అనుక్షణం కళ్యాణి గుర్తు తప్ప మరో ధ్యాస లేకపోయింది. ఇప్పటి నుంచీ ఇంత పరధ్యానం వచ్చేసిందేమిటని మా చెల్లాయి హాస్యం కూడా చేసింది.......'
'ఇంతకీ ఆ అమ్మాయి ఎల్లా వుందో చెప్పనే లేదు-- అసలు చూడలేదా?' అన్నాడు వాసు మధ్యలో కల్పించుకుని.
'చూడకేం చూశాను. కళ్యాణి తో పోల్చి చూస్తె, అందగత్తె గా లెక్క రాదు కాని చూడగానే మాత్రం ఫరవాలేదని పిస్తుంది. అంతో ఇంతో కట్నం గుమ్మరించగలరు -- ఆ అమ్మాయి తండ్రీ అన్నగార్లూ చేసే ఆర్బాటం చూస్తుంటే నాకు కళ్యాణి పట్ల విపరీతమైన జాలి కలిగింది. మనదేశంలో ఆడపిల్ల తనంతట తానుగా నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పగలిగే స్థితిలో యింకా రాలేదేమో అని పిస్తుంది. అసలు అలా అడగక్కర్లెకుండానే పెళ్ళిళ్ళు మిలిగి పోతున్నాయనుకో. ఒకవేళ ఏ అమ్మాయి అయినా అలా అడగ వలసి వచ్చినా అయిన వాళ్ళంతా పోనుకుని దేశం అంతా గాలించ యినా వో పెళ్లి కొడుకుని సంపాదిస్తారు. కాని కళ్యాణి కి అలా ఆడుకునే వారు ఆదరించే వారు ఎవరున్నారు? ఒకవేళ నాలాంటి వారెవరైనా ఆమెకి దగ్గర కావాలని అనుకున్నా తీరా ఆమె కధ విని వెనక్కి పారిపోతారు....'
'అయితే కేవలం ఆమె పట్ల జాలి తోనే నువ్వీ పెళ్లి చేసుకో దలిచావా?'
వాసు మాటలు వింటూ ఏమిటింత నిర్మోహమ్మాటంగా ఇలా నిలదీసి నట్లు అడుగుతున్నావు అన్నట్లు ఒక్కసారి చూసి, మళ్లీ అంతలోనే సర్దుకుని, అన్నాడు మురళీ 'నువ్వు అలా అడిగితె జాలి ఒక్కటే కారణం అని నేను చెప్పలేను-- కళ్యాణి తను ఫలానా అని చెప్పగానే ఆవేశంగా లేచి వెళ్లి పోయానే కాని ఆ తరువాత ఆవేడి తగ్గి మనస్సు చల్ల బడ్డాక ఎందుకు నేనలా ప్రవర్తించాను. ఆసలు తనలో ఏం తక్కువ అని నేను నిరాకరించాలి అని ప్రశ్నించు కుంటే సమాధానం నాకే దొరకటం లేదు-- మరి అలాంటప్పుడు ఏవో సంప్రదాయం కుటుంబం అంటూ పాత చింతకాయ పచ్చడి భావాలతో తనని నిరాకరించడం ధర్మం కాదనిపిస్తోంది-- ఇంక ఆమెని కాదనటం నాకు సాధ్యం కాదని పించింది -- అందుకే అక్కడ అమ్మ ఆ సంబంధం నిశ్చయం చేసుకుందామా అని అడిగిన దానికి నేను మరోసారి ఆలోచించుకుని వ్రాస్తాను అని చెప్పి తప్పించుకుని వచ్చేశాను -- అలా వచ్చే ముందు కళ్యాణి సంగతి వాళ్లతో చెప్దామా అని ఒకసారి అనిపించింది. కాని ఆ మాటలు నా నోటి లోంచి వచ్చిన మరుక్షణం లో మా యింట్లో ఏం జరుగుతుందో నేను వూహించుకోగలను.
మా వాళ్ళంతా ఒక్కక్షణం తమ చెవులని తామే నమ్మలేనట్లు తాము విన్న విషయం నిజంగా జరగబోతుందా అన్నట్లు దిగ్బ్రాంతి లో మునిగి పోతారు. ఆ వెంటనే ఆ పరిస్థితి నుంచి తేరుకుని కాస్త చిరాగ్గా చివాట్లు వేస్తూ "ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలూ వేషాలూ మాని బుద్దిగా మేం చూపించిన సంబంధం ఒప్పుకో' అని నచ్చ చెప్ప పోతారు. నేను నా పట్టు విడవను. అప్పుడు అమ్మ వో మెట్టు క్రిందికి దిగి కన్నీళ్ళ తో నన్ను బ్రతిమి లాడుకోటం మొదలు పెడుతుంది. అయినా నేను కరగక పొతే నాన్నగారు వో మెట్టు పైకి వెళ్లి ఆగ్రహంతో చిందులు వేస్తూ 'నువ్వు నీ మాటే కావాలని అంత పట్టుదలగా వుండి ఆ పిల్లని పెళ్లి చేసుకున్నా వంటే నీకు నా యింట్లో స్థానం వుండదు. ఇవాళ మీతో లేక్కేమిటి అని మమ్మల్ని ఎదిరించి ఇంట్లోంచి వెళ్లి పోదలుచుకుంటే నువ్వు ఒక్క విషయం బాగా ఆలోచించుకుని మరీ వెళ్ళు. ఇవాళ నువ్వు దాటి వెళ్ళిన ఈ గడప మళ్లీ తొక్కటానికి వీలులేదు-- నీ జీవితంలో నీ భవిష్యత్తు తో మాకెలాంటి సంబంధమూ వుండదు ' ఇంక నీకు అమ్మా నాన్నా లేనట్లే. అని కేకలు వేస్తారు' నాన్నగారి కోపం నాకు తెలిసిందే.'
'అందుకని చెప్పకుండా వచ్చావా?' అన్నాడు వాసు ఎవ్వరికీ తెలియకుండా తను గొప్ప సంఘ సంస్కర్తలా పూనుకుని ఈ పెళ్లి చేయించాడు అనే నింద తన మీద పడుతుందేమో అనే భయం సంకోచం వ్యక్తం అయాయి అతని మాటల్లో.
'నిజంగా నేను చెప్పటమే జరిగితే అక్కడ ఎదురయే పరిస్థితి ఎలా వుంటుందో ఇప్పుడు చెప్పానుగా ----
సినీమాలో దృశ్యం చూసినట్లు ఆ సంఘటన ని బాగానే వుంటుంది కాని నిజంగా అదే సన్నివేశం ఎదురయితే ఎలా తట్టుకోవాలో నాకు తెలియలేదు. అమ్మ ఏడుపు, నాన్నగారి కేకలు, చెల్లాయిల బేల మొహాలు వీటన్నింటి మధ్యా నేను నిలదొక్కు కుని మాట్లాడ గలననే నమ్మకం నాకే లేకుండా పోయింది. నన్ను పిరికివాడ్ని అని నువ్వు వెక్కిరించినా సరే నేను చెప్తున్నాను. అన్ని వైపుల నుంచి వచ్చే ఆ ఒత్తిడికి తట్టుకోలేక నాకు నేనే అన్యాయం చేసుకుంటా నెమో-- నేను మన స్పూర్తిగా కోరుకున్న దానిని, జీవితాంతం పొందాలి అనుకున్న దానిని ఆ ఒక్క బలహీనమైన క్షణాలలో కాదనేస్తానేమో, కళ్యాణి ని చేజేతులా వదులు కుంటానేమో అనే భయం తోటే అక్కడ మాట మాత్రం చెప్పకుండా వచ్చేశాను..ఇక్కడ నీలాంటి పదిమంది స్నేహితుల్ని పిలుచుకుని ఏ దేముడి గుడి లోనో, రిజిష్ట్రారాఫీసులోనో పెళ్లి చేసుకుంటాం -- పెళ్లి జరిగిపోయాక మా వాళ్ళకి వ్రాస్తాను. మొదట వాళ్ళకి కోపం వస్తుంది....కాని , కొన్నాళ్ళ తరువాత యినా అన్నీ మరిచి వాళ్లు మమ్మల్ని ఆదరించగలిగితే సంతోషమే -- లేక ఏ నాటికి వాళ్లు పట్టుదలలు వదలక పోయినా నేను విచారించను-- అందర్నీ వదులు కున్నాననే బాధ కించిత్తయినా లేకుండా కళ్యాణి సహచర్యం లో జీవితం నంద వనం చేసుకుని శాంతిగా తృప్తిగా బ్రతక గలను. ఆ నమ్మకం నాకు వుంది.' ఒక్క వూపులో చెప్పేశాడు మురళీ.
'నువ్వు చెప్తున్నది వింటుంటే చాలా సంతోషంగా వుంది -- అయినా నేను మరొక్క మాట చెప్పదలచు కున్నాను. ఒక విధమైన ఉద్రేకంలో వేడిలో చేసుకున్న నిర్ణయాలు, ఏర్పరచుకున్న అభిప్రాయాలు ఒక్కొక్కసారి చాలాకాలం నిలవవు....నువ్వు చేసిన పనికి పశ్చాత్తాప పడే రోజు రావచ్చు, నీ వాళ్ళందర్నీ వదులు కున్నందుకు విచారించే రోజు రావచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నా నంటే ఒక సంస్కరణ యుతమైన పని చేయటానికి కేవలం విశాల హృదయం అభ్యుదయ భావాలు చాలవు. ఆ అభ్యుదయాన్ని ఆచరణ లో పెట్టటానికి వో విధమైన తెగువ, మొండితనం, ఎలాంటి పరిస్తితుల నైనా ఎదుర్కొని నిలబడ గలిగే సంస్కారం వుండాలి....నిన్ను నిరుత్సాహ పరచాలనీ, నీ నిర్ణయాన్ని మార్చుకోమని చెప్పాలనీ నా వుద్దేశ్యం కాదు, కాని మా పిన్ని కూతురు విషయం మాత్రం చెప్తాను. అది వింటే, నేను ఇంతసేపూ ఎందుకిలా మాట్లాడానో నువ్వే అర్ధం చేసుకుంటావు.
