గడిచిన రెండు మూడు సంవత్సరాలలో చెప్పుకోదగ్గ మార్పులే జరిగాయి. ప్రత్యేకంగా పార్వతి విషయంలో కాలం కుంటి కుంటిగా నడిచింది. ఉన్నంతలో సంతృప్తి పడుతూ భర్త తోనూ, బిడ్డలతోనూ , నిర్విచారంగా కాలం గడిపేస్తున్న సావిత్రి పుట్టెడు దిగులుతో , కళ్ళ నిండా నీళ్ళు నింపుకుని, నోరు పెగుల్చుకుని మాట్లాడలేని స్థితిలో కన్ను మూసింది. రుక్కు వెనక పది పన్నెండేళ్ళ కు దూరపు కానుపు కలిగింది సావిత్రికి. బిడ్డ కడుపులోనే పోయి పుట్టెడు జబ్బు పడి మరి తేరుకోలేక పసివాళ్ళను తండ్రికి అప్పగించి తన బాధ్యతలు చాలించుకుంది. అనుకోని ఈ పిడుగుపాటుకు క్రుంగి పోయిన తండ్రికి ఈడేరిన కూతురు పార్వతే ధైర్యం చెప్పుతూ అండగా నిలబడింది. తల్లి లేని పసివాల్లకు తల్లి అయి బరువు బాధ్యతలు మీద వేసుకుంది.
మెడిసిన్ లో సీటు సంపాదించి మద్రాస్ లో చదువుతున్న పద్మజ ఎప్పటి కప్పుడు ధైర్యం చెబుతూ వ్రాసే ఉత్తరాలు పార్వతిని కొంత నిశ్చింత పరిచాయనక తప్పదు. అశాపూరిత మైన భవిష్యత్తును తలుచుకుంటూ గతం మరిచిపోవడానికి ప్రయత్నించింది పార్వతి. రఘూ అమాయక స్నేహం, అతని తల్లి దండ్రుల అపారమైన ఆదరణ పార్వతి కన్నీటిని తుడిచి వేశాయి. ఏ ఘడియా నీడలా వెంటాడే రఘూ స్నేహం పార్వతి లో కొత్త కొత్త ఆశలు రేపుతూ వచ్చింది.
వరసగా రెండు మూడు పరీక్షలు తప్పటంతో రఘుపతి లో కాలేజీ మీద ఉండే ఆసక్తి పూర్తిగా సన్నగిల్లి పోయింది. కొడుకు మరి చదువులో రాణించడన్న నగ్నసత్యం తెలుసుకోగలిగిన చలపతి రావు, రఘుపతి ని కాలేజి మాన్పించి స్వంత వ్యాపారంలో కొంత బాధ్యత మీద వేశాడు. డిగ్రీల కోసం పెనుగులాడే కోరిక లేని రఘు తేలిగ్గా గాలి పీల్చుకుంటూ వ్యాపార సరళి లో సులువు బలుపు లన్నీ తెలుసుకోవాలన్న ఆసక్తి కనబరిచాడు. కాని అందులో కూడా సమర్ధత చూపించలేక పోతున్నడన్న విషయం చలపతి రావు గ్రహించినా కాలం మీదే ఆశ పెట్టుకుని ఊరుకున్నాడు.
"నువ్వు చదువు మానటం నాకెంత బాధగా ఉందొ నీకు తెలీదు, రఘూ! నువ్వూ ఏంతో పెద్ద చదువు చదువుతావని ఆశపడ్డాను. మనం తలుచుకుంటే సాధించలేనిదేముంది?" అంటూ నచ్చ చెప్పబోయింది పార్వతి.
రఘు అడ్డంగా తల తిప్పేశాడు. "ఇక నాకు చదువు రాదు, పారూ! చాలా తెలివి గల వాళ్ళకి గాని ఈ చదువు లంటవు."
"నువ్వు తెలివి తక్కువ వాడివని ఎవరన్నారు?"
"ఎవరో అనటం ఏమిటి? నాకే తెలుసు."
"అలా అంటే నేను ఒప్పుకోను. నువ్వు మాత్రం చాలా తెలివైన వాడివి. నీకా ఆత్మవిశ్వాసమే లేకుండా పోయింది." అంది పార్వతి మందలింపుగా. రఘు మారు మాట్లాడకుండా ఊరుకున్నాడు.
రఘుపతి టైఫాయిడ్ జ్వరంతో బాధపడ్డ నెల రోజులూ పార్వతి రఘుకు మరీ సన్నిహితంగా మసిలింది. ఆ బాధ్యతంతా అన్నపూర్ణమ్మ పార్వతి మీదే పెట్టింది.
గంటల కొద్ది రఘు సమీపంలో గడుపుతూన్న పార్వతి రఘూ మనస్తత్వం చాలా వరకు అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించింది.
"ఒళ్ళంతా చెమటలు పోస్తోంటే ఇలా ఉక్కతో బాధపడకపోతే కొంచెం లేచి పంకా వేసుకోలేక పోయావా, రఘూ?" అంది ఓసారి గదిలోకి వస్తూ.
"అబ్బ! పోనీ, పార్వతీ! నువ్వు వచ్చావుగా? తొందరగా స్విచ్చివెయ్యి. ఈ చెమటలతో చిరాగ్గా ఉంది" అన్నాడు రఘు విసుగ్గా. పంకా తిరుగుతుంటే గాలి పోసుకున్న చొక్కా ఎగురుతుంటే సొమ్మసిల్లి నట్లు కళ్ళు మూసుకున్నాడు. పార్వతి తిరుగుతున్న పంకా కేసే చూస్తూ కూర్చుంది. అన్నపూర్ణమ్మ బార్లీ నీళ్ళు కాగబెట్టి తీసుకు వచ్చింది." నిద్ర పోతున్నాడా, పార్వతీ? పొద్దుటి నుంచీ బొత్తిగా ఏమీ తాగలేదు."
'ఇక్కడ పెట్తత్తా! లేచాక ఇస్తాను."
అన్నపూర్ణమ్మ గ్లాసు బల్ల మీద పెట్టి వంటింట్లోకి వెళ్ళిపోయింది. "రఘు బాబు !" మృదువుగా పిలిచింది పార్వతి. కళ్ళు తెరిచి చూశాడు రఘు.
"ఒక్కసారి లేచి కూర్చుంటావా? బార్లీ తాగుదువు గాని." అయిష్టంగా మొహం చిట్లించాడు. "నాకు బార్లీ బావుండదు, పార్వతీ."
"అలా అంటే ఎలా? జ్వరం వచ్చినప్పుడు బార్లీ కాకపొతే ఇంకేమిటి తాగుతావు?' అంది బుజ్జగిస్తున్నట్లు.
"సగ్గుజావ కూడా తాగుచ్చునన్నాడు డాక్టరు."
"పోనీ నీకు సగ్గు జావ బాగుంటుందా? ఆ మాట చెప్పలేక పోయావా అత్తతో?"
'చెప్పకపోతే మాత్రం తనకు తెలీదేమిటి?"
"ఎలా తెలుస్తుంది? చెప్తే సగ్గు జావే కాచేదిగా? సరేలే , నే కాచి తీసుకొస్తాను, కాస్సేపు పడుకో" అంటూ లేచింది పార్వతి.
"వద్దులే. ఇలాతే అదే తాగుతాను."
"బావుండదన్నావుగా?"
"ఫర్వాలేదు. ఎలాగో తాగేస్తాను."
పార్వతి అయిష్టం గానే అందించింది గ్లాసు. మొహం చిట్లిస్తూ , బాధపడుతూ , వస్తున్న వెక్కిళ్ళు అణుచుకుంటూ సగం గ్లాసు ఖాళీ చేసి బల్ల మీద పెట్టేశాడు. తాగింది కూడా ఇముడ్చుకోలేక తూలుతూ తూలుతూ బాత్ రూంలోకి నడిచి వాంతి చేసుకుంటున్నాడు. కంగారుగా నీళ్ళు అందించింది పార్వతి. "మంచం దిగి ఎందుకు రావటం? పక్కనే బేసిన్ ఉందిగా? నీకు ఎంత తోస్తే అంతే" అంది మందలింపుగా.
"పోనీ , ఇప్పుడు సగ్గుజావ కాచి తీసుకు వస్తాను, కూర్చుంటావా?"
"మరి నాకేం తాగాలని లేదు, పార్వతీ!"
"ఓ బత్తాయి పండు వలిచి పెట్టనా?"
"ఊ"
"నిజం చెప్పు. బత్తాయి తొనలు ఇష్టమేనా? ద్రాక్ష పళ్ళు తింటావా?"
"ఏదైనా ఫరవాలేదు. నీ యిష్టం."
నవ్వుతూ అంది పార్వతీ: "నాకు రెండూ ఇష్టం లేదు. తినకుండా ఊరుకుంటావా?"
మాట్లాడలేదు రఘు.
"ఇంత అమాయకుడి నైతే ఎలా, రఘూ? నీకేం కావాలో కూడా నీకు తెలీదు. తెలిసినా పైకి చెప్పవు. ఇలా అయితే కష్టం కదూ?"
(1).jpg)
రఘూ నీరసంగా నవ్వుతూ అన్నాడు: "ఏమీ కష్టం లేదు, పారూ! నాకు కావలసినవన్నీ చూసుకోవటానికి నువ్వు ఉన్నావుగా?"
పార్వతి కళ్ళు దించుకుంది. బత్తాయి వలుస్తూ కూర్చుంది. ఎన్నడూ లేనిది రఘూ తనకేదో సన్నిహిత మౌతున్నాడు. మొన్ననొక రోజు చటుక్కున తన పైట కొంగు అందుకొని మొహం తుడుచుకున్నాడు. తను భయంభయంగా "ఇదేం పని, రఘూ?" అంటే "తప్పుపని మాత్రం కాదులే" అన్నాడు నవ్వుతూ.
తల్లి లేని లోటు లోటే అయినా భవిష్యత్తు మీది మధురమైన ఆశ అ లోటును చాలావరకు పూరించగలిగిందేమో పార్వతి విషయంలో. ఆ రోజు -- రఘూ కొత్తగా వచ్చిన రోజు -- లారీల లోంచి సామానులు దించుతుంటే , గేటు దగ్గరే నిలబడి వెళ్ళిపోతున్న పార్వతి కేసి ఆసక్తిగా చూసిన రఘుబాబు కళలో ఆ కోరిక అధికమైందే కానీ తగ్గలేదు. ఎప్పుడూ రఘూ ను తదేకంగా చూస్తూ ఉండాలన్న కోరిక పార్వతి కి కూడా సహజం గానే కలిగింది. పరిస్థితులన్నీ తమ కోరికలను పెంచుతూ వచ్చాయి. పార్వతి జ్ఞానం లోను, వయస్సు లోనూ కూడా ఎంతో పూర్ణత్వం సిద్ధించుకున్నట్టు కన్పిస్తుంది. రంభలా మైమరిపించే అందగత్తె కాకపోవచ్చు గానీ పార్వతి మొహంలో, పార్వతి సౌందర్యం లో పవిత్రతే ఎక్కువ గోచరిస్తుంది.
"బత్తాయి పండు నీకోసం వలుచుకుంటన్నావా ఏం పారూ?" రఘు పలకరింపుతో పరధ్యానం వదిలి తొనలు మౌనంగా అందించింది. "ఇలా ఓ సంవత్సరం వరకేనా నాకు జ్వరం ఉండిపోతే బావుండు ననుకుంటున్నాను, పారూ!"
"దానికేం భాగ్యం? నీ కడుపులో మాట కడుపులోనే దాచుకుంటే ఎన్నాళ్ళయినా వుండి పోతుంది జ్వరం."
"అయితే అలా నటించమంటావా?"
"అంత సాహసం ఉందా నీకు?"
చురుగ్గా చూశాడు రఘు. "వెక్కిరిస్తూన్నావా?"
"రఘుబాబు లేచాడా , పార్వతీ?" అంటూ వచ్చింది అన్నపూర్ణమ్మ. తొనలు బల్ల మీద వదిలి లేచి నిలబడింది పార్వతి.
"నీకోసం తాసిల్దారు గారి అమ్మాయి వచ్చింది, పార్వతీ!" అంది అన్నపూర్ణమ్మ . "వెళ్లిరా! నే కూర్చుంటాను."
"ఎవరూ? సుజాతా?" అంటూ గదిలో నుంచి వెళ్ళిపోయింది పార్వతి. సుజా పద్మజ వ్రాసిన ఉత్తరం తీసుకొచ్చింది. "నువ్వీ మధ్య బొత్తిగా అక్కయ్య కి ఉత్తరాలు వ్రాయటం లేదటగా, చిన్నక్కయ్యా? నిన్ను అడగమని అక్కయ్య నాకు వ్రాసింది." అంది తనకు వచ్చిన ఉత్తరం చూపిస్తూ. పార్వతి ఉత్తరం చదివి నవ్వుతూ "నిజంగానే ఆలస్యం చేశాను, సుజా! రఘు బాబుకి జ్వరంగా ఉంటుంది. ఇంట్లో పని అయిపోగానే నెను ఇక్కడే ఉంటున్నాను. ఖాళీ లేక కొంత నిర్లక్ష్యం చేశాననుకో. రా, మా యింటికి వెళ్దాం. ఇవ్వాళ తప్పకుండా వ్రాస్తాను. అక్కయ్యకి" అంటూ సుజా చెయ్యి అందుకుంది. పద్మజ దగ్గర కన్నా పార్వతి దగ్గరే సుజాకు చనువు ఎక్కువ. తన మనస్సులో మెదిలే ప్రతి ఊహ అమాయకంగా పార్వతి ముందు వెల్లడిస్తుంది. "అక్కయ్య మద్రాసు వెళ్ళిపోయింది చదువుకోటానికి. చాలా గొప్పది కదూ?" అంటుంది అప్పుడప్పుడూ కళ్ళు విప్పార్చుకొని.
"నీకు మాత్రం ఏం తక్కువ, సుజా? అక్కయ్య లాగే నువ్వూ చదువుకుంటావు."
"అవును. అక్కయ్య అలాగే చెప్పింది. ఈ ఏడు ధర్డు ఫారం పాసైతే మంచి బహుమతీ ఇస్తాననీ చెప్పింది." అంది కుతూహలంగా.
"చూశావా , మరి? నీకేం భయం లేదు. చెయ్యాల్సిన సాహసమంతా పద్మజే చేసింది. అక్కయ్య చెప్పినట్లు చదువుకోవడమే నీ పని."
పార్వతి ఉత్తరం వ్రాసుకుంటూ కూర్చుంటే సుజా రుక్మిణితో ఆడుకోవటం లో మునిగి పోయింది.
* * * *
