Previous Page Next Page 
చదరంగం పేజి 13


    "తీరా అక్కడికి వచ్చాక మిమ్మల్ని మీ ఖర్మానికి వదిలి నేను ఆయనతో ఎలా రాను? ఆయనే స్వయంగా మీ భారాన్ని నెత్తిన వేసుకొంటానంటే నా హృదయం పొంగిపోయింది. మిమ్మల్ని తన ఒడిలో కూర్చోపెట్టు ఆని ఇంగ్లీషు నేర్పుతూ ఉంటే నా మనసంత సంతోషాన్ని పట్టలేకపోయేది.
    "ఒక్కొక్కప్పుడు అపకారం కూడా ఉపకారం అవుతూ ఉంటుంది. అక్కే ఉంటే ఆవిడ తాహతుకు మించి చదివించలేకపోయేది. మనం ఆయనకు ఋణపడి ఉన్నాము. ఈ ఋణభారం విష్ణుని నువ్వు చేసుకొంటే కొంతలో కొంతైనా తగ్గుతుందని." భారతి ఎటో చూస్తూంది.
    "సరేనమ్మా. విష్ణుని నువ్వేమీ అడగకు." రాము లేచి వెళ్ళి పక్కమీద పడుకున్నాడు.
    భారతి అడుగులో అడుగువస్తూ కదిలి వెళ్ళి పోయింది.    
    
                                *    *    *

    పక్కమీద అటూ ఇటూ దొర్లుతూనే ఉన్నాడు. ఎంతకూ నిద్ర రావద్మలేదు. 'రవి మొదటినుంచీ ఒక రకంగా అదృష్టవంతుడే. తనే దేనికీ తెగించే శక్తి లేని పిరికివాడు. ఆ మాట పదకొండో ఏట జయే అన్నది.
    'విష్ణు ఏం చేసింది? తనంటే ప్రేమ అంది. ఏమిటేమిటో అన్నది. తనకు ఆసక్తి లేదంటే ఆ ప్రేమ బలరాం వైపు మళ్ళింది. బలరాం.......ఛీ!
    'అమ్మ, నాన్నగారు. అవును. వాళ్ళిద్దరి అభిమానమే లేకపోతే కాలప్రవాహంలో ఎటు కొట్టుకు పోయేవారో?'
    తల బద్దలు చేస్తున్న ఆలోచనల్ని ఆపుజేశాడు. క్రమంగా నిద్ర ఆవరించింది.

                                                 *    *    *

    "ఇప్పుడు నేను వెళ్ళనత్తా. ఇక్కడే ఉంటాను. బావకి పెళ్ళి ఎంతలో జరుగుతుంది? ఆయనకి ఉద్యోగం కొత్త. ఊరు కొత్త ఇల్లు దొరికే......అన్నిటికీ ఇబ్బంది పడాలి" అంటూంది భారతీదేవి.
    రాము బట్టలు సర్దుకొంటూ భారతీదేవివైపు చూశాడు. నిండు మనసుతో అమ్మలాగే ఉంది. అమ్మకూడా చిన్నప్పుడు ఇలాగే మొహాన పొడుగుబొట్టు పెట్టుకొని ఒక జడ వేసుకొని నిండా కొంగు వేసుకొని మేలిమిచ్చాయతో ఇల్లంతా కలియదిరుగుతూ ఉండేది.
    భారతీదేవికి దగ్గరగా వచ్చి అన్నాడు రాము: "చూడండి, భారతీదేవి! తమ్ముడికి హోటల్ భోజనం పడదు. మీరు వెడితే బాగుంటుందేమో?"
    నిర్లక్ష్యంగా నవ్వి రాము మొహంలోకి చూసింది. "మీకు హాస్టల్ భోజనం పడదు మరి. అత్త రోజూ వంటచేసి పార్శిల్ చేస్తున్నదా?"
    "నా సంగతి వేరు."
    "అందరి సంగతీ ఒకటే, బావా. అత్తకు తోడుగా ఉన్నట్లు కూడా ఉంటుంది. ఇదేమీ పెర్మనెంట్ ఉద్యోగం కాదు కదా?"
    రాము మనసు తేలికపడింది. తమ ఇంట్లో ప్రవేశించిన ఈ కొత్తవ్యక్తికి అందరిపైన మమత పుట్టుకతోనే వచ్సినట్లుంది.
    
                            *    *    *

    "అన్నయ్యా!" రవి పిలిచాడు.
    "ఏమిట్రా?" రాము ప్రశ్నించాడు.
    "పెళ్ళి చేసుకున్న దగ్గర్నుంచీ నీ విషయం ఆలోచించడం లేదనుకొన్నావా?"
    "మొదట్లో అలాగే అనుకొన్నాను. కానీ ఇప్పుడదేం లేదురా."
    చాలా రోజుల తరవాత రవి మనసు విప్పి ఎంతో సేపు మాట్లాడాడు అన్నతో. రవి చాలామటుకు ఇంటిపట్టున ఉండక పోవడం కూడా కొంత కారణం. ఏది ఏమైనా పశ్చాత్తాపంతో అన్నను కౌగిలించుకొని వీడ్కోలిచ్చాడు.

                              *    *    *

    ఏడాది ఇట్టే గడిచిపోయింది. ఇప్పుడు ఇంట్లో భారతీదేవి ఒడిలో పాప కేర్ మంటున్నాడు.
    మనవడి ముద్దు ముచ్చట్లతో వేణుగోపాల్ భారతిలకు క్షణం తీరికలేదు. చిన్న వేణు ఆటపాటల్లో అల్లరితో ప్రపంచాన్ని కూడా మరిచిపోతున్నారు.
    గడిచిన సంవత్సరాలలో ఎంతో మార్పు వచ్చింది. ఇంట్లో పిల్లలిద్దరితో సతమతమయ్యే భారతి ఇంటి బాధ్యత కోడలిమీద పెట్టి తను విశ్రాంతి తీసుకొంది, కొడుకుల బలవంతంమీద.
    పొద్దున్నే లేచి అత్తమామలకు కాఫీ అందించి పిల్లడిని తీర్చిదిద్ది వంటకు సిద్ధమౌతుంది భారతీదేవి. తఃయారు చేసి ఉంచిన టిఫిన్ భర్తకూ బావగారికీ పంపి పదిగమలకు అత్తమామలతో తనూ భోజనం చేస్తుంది. మధ్యాహ్నం వచ్చిన బావగారికి వడ్డించి, భర్తకోసం ఎదురుచూస్తుంది. రోజులు నిమిషాల్లా దొర్లిపోతున్నాయి.
    భారతికి ఎంతో తృప్తి వేణుగోపాల్ అప్పుడప్పుడు అంటూ ఉంటాడు-"భారతీ, ఇప్పుడు ఇల్లు స్వర్గంలా లేదూ?" అని భారతి గర్వంగా "ఊఁ" కొడుతుంది.

                              *    *    *

    కింగ్స్ వేలో తండ్రి బలవంతంమీద చిన్న డిస్పెన్సరీ తెరిచాడు రాము హౌస్ సర్జన్ పూర్తిచేసి వచ్చి. హాయిగా నలుగురికీ మందు ఇచ్చి ఇష్టమైతే కాసేపు అక్కడే ఉండి ఇంటిదారి పడతాడు రాము. స్వంత ఇల్లూ, అయిన ఆప్తులూ ఇందరి మధ్య స్వర్గంలో ఉన్నట్లే ఉంటుంది. వీధిలో అరుగుమీద నిలబడి వచ్చే పోయే కార్లను చూస్తున్నాడు డాక్టర్ శ్రీరాం. బ్రిడ్జ్ మీద రైలు పెద్ద శబ్దం చేస్తూ దొర్లుకుంటూ పోతూంది.
    తలుపు తెరిచిన శబ్దం అవగానే అటు తిరిగి స్థాణువైపోయాడు. చీకట్లో తను గుర్తించనే లేదు ఆరోజు. అడుగు లోపలికి వేసి నిలబడిపోయాడు. అసలు మనిషిని నిలువెల్లా పరికించే అలవాటు తనకు లేనిదే! కాళ్ళను చుట్టేసిన విష్ణుతో కఠినంగా అంటున్నాడు: "నాకు తెలియదు. అసలు నాకు చేతఃకాదు. నువ్వూ డాక్టరువేగా?"
    "నీ కాళ్ళు పట్టుకొంటాను, బావా!"
    "నీమీద ప్రతీకారం నాకు లేదు, విష్ణూ నేను మొదట్లో చెబితే విన్నావా? ఈవేళ నా నెత్తిన ఇంత పెద్ద పని వేస్తే నేను మోయలేను. నీకు తెలుసు ఉపాయాలు. నీ ఇష్టం. ఈ డిస్పెన్సరీ వదిలి వెడతాను. నీకు  తోచిన మందు వేసుకో. ఆ పని మాత్రం నావల్ల కాదు. నేను అన్యాయం చేయను. చేయలేను. లక్షమందులు ఉన్నాయి. అయినా బ్రతుకంతా నా వెంటబడి ఎందుకిలా వేధిస్తావు నన్ను?"
    రాము కాళ్ళు పట్టుకొని ఏడుస్తూనే ఉంది విష్ణుప్రియ. "అను నీ ఇష్టం వచ్చినన్ని మాటలు అను నీ మాటలు శూలాల్లా గుచ్చుకొంటున్నాయి. నువ్వు నా బావవనీ, నా పరువు కాపాడతాననీ ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చాను. తీరా వచ్చాక తెలిసింది ఇక్కడకూడా నాకు అపజయమే ఎదురైందని.
    "నేనూ డాక్టర్నే నాకూ తెలుసు టైమ్ మించి పోయిందని. మందులూ, మాకులూ కాదు...."
    రాము ఆలోచిస్తున్నాడు. "పోనీ, వాడెక్కడుంటాడో చెప్పు."
    అంత దుఃఖంలోనూ ఆశ్చర్యంగా చూసింది రామువైపు.

                                *    *    *

    సందులూ గొందులూ తిరిగి జీరాలో వెతుక్కుంటూ వచ్చి ఓమూల చిన్న బంగళావంటి ఇంటిముందు మోటార్ సైకిల్ ఆపాడు. ఇల్లు చూస్తూనే గృహస్థు మనస్తత్వాన్ని చదివేయవచ్చు. చుట్టూ ప్రహరీ, ఇంటిమీదికి ద్రాక్షగుత్తులు లతతో కలిసిపోయి అందంగా ఎగప్రాకాయి. విలాసంగా చాలా అధునాతనంగా ఉన్నది.
    మోటార్ సైకిల్ హార్ న్ వేశాడు.
    బయటికి వచ్చి ఆశ్చర్యంతో నోరు తెరుచుకొని చూశాడు బలరామ్.                
    క్షణం తరువాత నోరు పెగుల్చుకొని నవ్వుతూ, "రా" అంటూ ఆహ్వానించాడు నమస్కారం చేస్తూ.
    రాము నవ్వుతూ ప్రతినమస్కారం చేశాడు.
    "ఊరకరారు మహానుభావులు! ఏమిటి విశేషం?" కళ్ళు చిత్లించి కుర్చీ వేశాడు బలరామ్.
    "పనుండే వచ్చాను, బలరాం. ఒకసారి బయటికి వస్తావా?"
    "డెఫినెట్లీ క్షణంలో వస్తాను!" బలరాం వెనుతిరిగి వెళ్ళి పదినిమిషాల్లో వచ్చాడు. వచ్చేటప్పుడు ఫ్లాస్కులో కాఫీ గ్లాసులో వంచి రాముకు ఇచ్చాడు. "నో థాంక్స్" అన్నాడు రాము. డ్రెస్సు మార్చుకొని రాము వెనక కూర్చున్నాడు బలరాం.
    మోటార్ సైకిల్ మెల్లగా మలుపులు తిరిగి తిరిగి హుస్సేన్ సాగర్ కు మూలగా నిర్మానుష్యంగా ఉన్న స్థలంలోకి వచ్చి ఆగిపోయింది.
    "పనిమీద తీసుకుపోతానని ఇక్కడ ఆపేశావేమిటి?" ఆశ్చర్యంగా చుట్టూ చూశాడు బలరాం.
    మొహం తుడుచుకొంటూ అన్నాడు రాము: "నాకో చిన్న సహాయం చేస్తావా, బలరామ్?"
    మరింత ఆశ్చర్యంగా చూశాడు బలరాం. "నీకా, నేనా? సహాయమా?"
    "అవును. నాకే సహాయం" అని కాస్సేపాగి నిట్టూర్చాడు. "నా దగ్గరకో పేషంట్ వచ్చింది. ఆమెకు గర్భస్రావం చేయాలి. హెల్ప్ చేయలేవూ?" బలరామ్ మొహంలోకి చూస్తూ అన్నాడు రాము.
    దిక్కులు దద్దరిల్లేట్టు నవ్వాడు బలరామ్. ఇంకా ఇంకా నవ్వుతూనే ఉన్నాడు రామువైపు చూస్తూ. ఆ నవ్వులో ఎంతో హేళన అద్దం ముందు ప్రతి బింబంలా కనిపిస్తూంది. 'నువ్వెంత ఫూల్ వి' అనలేక ఇలా నవ్వుతున్నాడని గ్రహించాడు రాము. మోటార్ సైకిల్ మీద కాలువేసి ఎటో చూస్తున్నాడు. బలరామ్ నవ్వుకు దూరంగా పారిపోవాలనిపించింది రాముకు.
    మెల్లగా నవ్వుస్థాయి తగ్గించాడు బలరాం. "చూడు, భాయ్ నువ్వెంతో తెలివైనవాడివనుకొనన్ను. నీకు తెలీదూ, అటువంటి పనులు చేయడం చట్టవిరుద్ధం అని?"
    రాము పళ్ళు పటపటలాడుతున్నాయి. కోపాన్ని దిగమింగుతూ శాంతంగా అన్నాడు: "చూడు, బలరామ్ మనం చేసే పనులన్నీ ఆత్మసాక్షిగా చేస్తున్నామనే అంటావా?"
    "అంటే?" అర్ధం కానివాడిలా ప్రశ్నించాడు.
    "చట్టం ఒకటి ఉన్నదనీ, దాన్ని ఎదిరించే అధికారం మనకు లేదనీ, చట్టానికి వ్యతిరేకంగా చేయకూడని పనులు అనేకం ఉన్నాయనీ!"
    బలరాం మొహం నల్లబడిపోయింది. "నువ్వు సంస్కృతం మాట్లాడుతున్నావు!"
    "లేదు, బలరామ్, నువ్వు అన్నదానికి నేను అడుగుతున్నాను. చెప్పు, చట్టవిరుద్ధంగా మనం, ఐమీన్ నువ్వు ఏదీ చేయడంలేదూ?"
    "ఏమిటీ నిర్బంధం?" చిరాకుగా అడిగాడు బలరాం.
    "ఏమైనాసరే, నువ్వు నావెంట వచ్చి తీరాలి. నాకు సహాయం చేయాలి. బలరామ్, నువ్వే తెలివైన వాడివి అనుకోకు. నీకన్నా, నాకన్నా తెలివైనవాడుమరొకడు ఉన్నాడు. వాడినెవరూ తప్పించుకోలేరు."
    "నేను రానంటే ఏం చేస్తావు?" నిర్లక్ష్యంగా చూశాడు బలరాం.
    "మర్యాదగా రానప్పుడు అతిక్రమించ వలసి వస్తుంది."
    రామును ఈ విధంగా ఎన్నడూ చూడలేదు బలరామ్. "ఎవరా పేషెంట్? అంత ఫూల్ లా ప్రవర్తించినప్పుడు విషం తీసుకోకపోయిందా?"
    రాము హృదయం మంటల్లో ఎగసి పడుతూంది. దగ్గిరకి పిలిచి చితకతన్నాలనిపించింది. మెల్లని స్వరంతో అన్నాడు: "చూడు, బలరామ్. అటువంటివాళ్ళు ఏం చేయాలంటావ్?"
    "లక్షణంగా పెళ్ళి చేసుకోవాలి."
    "ఎవర్నీ?"
    "ఇంకెవర్ని చేసుకొంటారు?"
    బలరాం కళ్ళలోకి బలంగా గుచ్చి చూశాడు. "అయితే విష్ణుని నువ్వు చేసుకొంటావా?" ప్రతి పదాన్నీ వత్తి వత్తి పలుతున్నాడు.
    అదిరిపడ్డాడు బలరాం.
    "ఏం ఆశ్చర్యపోతున్నావా?"
    గుటకలు మింగుతూ ఒక చేతిని పాంటు జేబులోకి పోనిచ్చి రెండో చేతిని కాలర్ వెనకవేసి తల దించుకొన్నాడు.
    "చెప్పు, బలరామ్!"
    కాస్సేపాగి దృఢంగా అన్నాడు బలరాం: "నీకు ఇండియన్ బైగమీ యాక్టు తెలియదూ?"
    నిర్ఘాంతపోయాడు రాము. "ఓ మైగాడ్! ఏమిటి?" అప్రయత్నంగా పెదవులు కదిలాయి.
    "విష్ణు సంగతి నాకు తెలియదు." బలరాం నిష్కర్షగా, నిర్మొహమాటంగా అనేశాడు.
    "యూ ఇడియట్! దానికా సంగతి తెలుసా?" రాము కనుబొమలు ముడిపడిపోయాయి.
    "ఇప్పుడు తెలుసు."
    "నీకెంత సిగ్గు లేదు! ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు! మించిపోయిందేమీలేదు, బలరామ్ నీక్కావలసిన డబ్బు ఇస్తాను, విష్ణుని కూడా చేసుకో ఆవిడని ఒప్పించు."
    "ఆవిడ ఒప్పుకోదు. చట్టం అసలే ఒప్పుకోదు."
    "నీకింత తెలుసే కోర్టుగురించి! ఎందుకిలా చేశావు?"    
    "విష్ణుని సరిగా చూస్తే అలా అనవు, శ్రీరాం. నేను మగవాడిని. నాకు కొన్ని కోరికలు ఉంటాయి. నిరంతరం ప్రజ్వరిల్లే అగ్నిజ్వాలలలో మిడతలా మాడిపోవడం విష్ణు దురదృష్టం."
    "నిన్ను మెచ్చుకోవాలి, బలరామ్."
    "పోనీ, నిను మెచ్చుకొనేట్లు చూసుకో. విష్ణుని నువ్వే చేసుకొంటే?"    
    రాము తలమీద నిశ్సబ్దంగా పిడుగుల వర్షం కురవసాగింది. కళ్ళలో నీళ్ళు కళ్ళలో ఆరిపోతున్నాయి. భగవాన్! ప్రపంచంలో ఇటువంటి మనుషులు ఇంకా ఎంతమంది ఉన్నారు? నిశ్శబ్దంగా కదిలి వెళ్ళి మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు.
    బలరామ్ మార్గమధ్యంలో ఆగిపోయాడు.
    రాము మనసు పరిపరివిధాల పోతూంది. 'అమ్మా, నన్ను ఎందుకు కన్నావమ్మా? నేను ఒక్కడినే ఇంత బాధ నెలా భరించను? నాన్నగా రేమనుకొంటారు? ఋణానుబందం నే అమ్మకు ఏమని చెప్పగలడు? ప్రపంచంలో నీలాంటివాళ్ళనే రోజులు, అనుకొంటున్నాడు. మోటార్ సైకిల్ బార్ వరకూ వచ్చి ఆగింది. కాస్సేపాగి వెనక్కు తిప్పాడు. ఈ రోజుల్లో మనసు బాగుండకపోతే బారుల్లో దూరడం ప్రతి హీరోకు ఫాషన్ అని నవ్వేశాడు తను. ఛ! తన అసమర్ధతకు తనలో తనే నవ్వుకొన్నాడు. మెల్లగా ఇంటివైపు తిప్పాడు.
    
                                   *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS