అందరూ నవ్వుకున్నారు. అంతలో శంకర్ వచ్చాడు. దుర్గ ముఖంలో నెత్తురు చుక్క లేకుండా పోయింది. అతని ముఖంలో మారే రంగుల కోసం ఆత్రుతగా నిరీక్షిస్తుంది . దుర్గ భయాలకు పూర్తీ వ్యతిరేకంగా, శంకర్ ఉత్సాహ పూరితమైన చిరునవ్వుతో అందరినీ పలకరించాడు. వాళ్ళ మధ్య కూర్చుని అందరితో అందరితో సరదాగా మాట్లాడాడు. వాళ్ళు వెళ్లిపోతుంటే , మళ్ళీ వీలైనప్పుడల్లా రమ్మని ఆహ్వానించాడు. వాళ్ళూ దుర్గ, శంకర్ లను ఆహ్వానించారు. దుర్గ తెల్లబోయింది. జరుగుతున్నది కలో, నిజమో అర్ధం కావటం లేదు. విపరీతమైన చనువుతో తన ఆంగ్లో ఇండియన్ స్నేహితులతో, మాట్లాడే శంకర్, యింత సరదాగా, జానకీ, రాజారాం, ప్రసాద్ లతో మాట్లాడిన శంకర్ , తన నెందుకంత తేలిక పరిచి మాట్లలాడాడు? ఎంత మాట్లాడినా పర్వాలేదు కాని, కాగితం మీద కలం పెట్టి వ్రాస్తే మాత్రం తప్పని అతని భావనా?
అసలు ఈ తప్పొప్పులను గురించి ఆలోచిస్తే అంతా అల్లకల్లోలంగా ఉంటుంది. మనము మన క్షేమం కోసం ఏర్పాటు చేసుకున్నదే ఈ సంఘం -- మన వాతావరణానికి , మన జాతీయత కూ, మన స్వభావాలకు, మనస్తత్వాలకు అనుగుణంగా సక్రమమైన జీవన విధానానికి కొన్ని నియమాలను ఏర్పరచు కున్నాం. ఆ నియమాలను అనుసరించి తీర వలసిందే! అయితే, ఆ సంఘ స్వరూపాన్ని గురించి ఆలోచించినపుడే అనేక తికమకలు వస్తున్నాయి. ఏ దేశపు సారస్వతమైన , ఆ దేశపు సంఘ స్వరూపానికి ప్రతిబింబమంటారు. కానీ, అది పూర్తిగా నిజం కాదనిపిస్తుంది. మహీధర రామమోహానరావు గారి నవలలు చదివి సంఘం అలా ఉందను కున్నా, విశ్వనాధ సత్యనారాయణ గారి నవలలు చదివి సంఘం అలా ఉందనుకున్నా , పూర్తీ ప[పొరపాటే అవుతుంది. ఆయా రచయితలు. సంఘంలోని, ఒక ప్రత్యెకమైన భాగాన్ని తమ దృష్టి కోణం లోంచి చిత్రించారు. చలం లాంటి కొందరు అతి భావకులు, తమకు సంఘం ఎలా వుంటే బాగుంటుందని పిస్తుందో అలా చిత్రించారు.
ఏ కాలంలోనైనా నూత్నంగా మార్పులు రావాలని ప్రయత్నించే వాళ్ళు కొన్ని నిందలను భరించక తప్పదు. శ్రీ వీరేశలింగము పంతులు గారు, గురజాడ అప్పారావు గారు, ఈనాడు ఎంతటి గౌరవనీయులైనా, ఒకనాడు వారు సహితం నిందలను భరించ వలసి వచ్చింది. వితంతు వివాహాలను మతాంతర కులాంతర వివాహాలు, స్త్రీ విద్య లాంటివి ఈనాడు సాంఘిక సమస్యలు కానే కావు--" స్వర్గానికి నిచ్చెనలు "లాంటి నవలలో విశ్వనాధ సత్యనారాయణ గారు వితంతు వివాహాలు , హిందూ ఆధ్యాత్మిక తత్వానికే గొడ్డలి పెట్టు లాంటివని నెత్తీ, నోరూ, మొత్తుకున్నా, చదస్తామని తోసి పారేస్తాం-- స్త్రీ విద్య ఉచితమా , కాదా అని ఎవరైనా చర్చ ప్రారంభిస్తే ముఖం ఎదురుగానే పకాలున నవ్వుతాం. ఉత్సాహంతో ప్రగతి పధంలోకి ఉక్కిరిబిక్కిరిగా సాగిపోయే సంఘానికి, యిలాంటి అల్ప విషయాలు పట్టించుకునే తీరిక లేదు. ఒకనాటికి స్త్రీ పురుషులు పరస్పర స్నేహ సేహర్ద్రాలు అత్యంత సహజంగా భావించ బడవచ్చు-- కానీ ఆనాటి వరకూ, సాహసించి ఆ విధంగా ప్రవర్తించే వ్యక్తులు-- ముఖ్యంగా స్త్రీలు , కొన్ని నిందల పాలు కాక తప్పదు. ప్రస్తుత కాలంలో సంఘ వ్యవస్థ ఒక నిర్దిష్ట మైన, విధానంతో లేనే లేదు. ఆడది గడప దాటితే మహాపరాధమానుకునే రోజులు గడిచి పోయాయి. స్త్రీ సంపూర్ణ వ్యక్తిత్వాన్ని గుర్తించిన రోజులు యింకా రాలేదు. ఈ సంధి యుగంలో, మనుష్యుల స్వభావాలను బట్టి, ఆయా ప్రదేశాలను బట్టి సంఘ వ్యవస్థ రకరకాలుగా ఉంది. మొత్తం మీద స్త్రీలు విద్యా సంస్కారాలను అలవరచుకుని అన్ని రంగాలలోనూ ప్రముఖ పాత్రలు వహిస్తున్నారు. సంఘంలో అధిక భాగం, స్త్రీ పురుషులు ప్రకృతి సిద్దమైన తమ హద్దుల నతిక్రమించకుండా , పరస్పర స్నేహసౌహర్ధ్రాలతో ప్రవర్తించడం సభ్యతగానే భావించబడుతుంది. కొంతభాగం మరీ విచ్చల విడిగా ప్రవర్తిస్తుంటే, మరి కొంత మంది, ఆడది మొగవారితో మాట్లాడితేనే కొంపలు మునిగి పోతాయన్నట్లు ప్రవర్తిస్తారు.
విచిత్రలల్లో కెల్లా విచిత్రము , తాము కలివిడిగా అందరితో మసలే వ్యక్తులే, అలా స్నేహంగా మసలే ఇతరులను గూర్చి తేలికగా మాట్లాడటం-----
ఈ విషయం గురించే, ఆలోచిస్తుంది దుర్గ -- తానూ హరి అన్నయ్యా, గిరి , ఉమా అంతా కలిసి మెలిసి అన్యోన్యంగా ఉండేవారు. ఎన్నడూ, ఒకరిని గురించి తేలికగా ఆలోచించేవారు కారు. శంకర్, తాను ఎంతో కలివిడిగా అందరితో మసలుతూ కూడా, తనను గూర్చి తేలికగా భావించ గలిగాడు.
"ఆ ప్రసాద్ గురించి ఆలోచిస్తున్నావా?'
శంకర్ గొంతుకను ఉలికిపడి ఈ లోకంలోకి వచ్చిన దుర్గ "కాదు! మిమ్మల్ని గురించే" అంది. "కొయ్యటం కాదు -- మీ ఆంగ్లో ఇండియన్ సేల్స్ గరల్స్ సంగతి వదిలెయ్యండి. మా జానకి తో కూడా అంత స్నేహంగా మాట్లాడారు, నేను ప్రసాద్ ను స్నేహితుడి గా భావించానని అంత కోపమెందుకు?"
"చాలా బాగుంది నీ వాదన. నేను మొగవాడ్ని . నాకు సాగినట్లు నీకెలా సాగుతుంది?"
"బొత్తిగా అర్ధం లేకుండా మాట్లాడుతున్నారు. మొగ భావనలూ, అడ భావనలూ కూడా ఉంటుంటాయా?"
శంకర్ విసుక్కున్నాడు.
"నీ చదువుకున్న తెలివితేటల్ని నా దగ్గర చూపించకు -- నీతో వాదిస్తూ , కూర్చోటానికి నాకు టైం లేదు. నా ఇష్ట ప్రకారం ఉండదలచు కుంటే ఇక్కడ ఉండు. లేకపోతె, వెళ్లి పో!"
దుర్గ మనసులో మంటలు లేపాయి. చీటికీ మాటికీ ఇలా వెళ్లి పోమ్మనటం , ఆమె మనసుకు కెలికి నట్లయింది. "నా ఇంట్లోంచి నేను ఎక్కడకు వెళ్తాను?' కావాలని అంది దుర్గ. శంకరే దుర్గ వంక విచిత్రంగా చూశాడు. కనుబొమ లేగురవేసి "ఓహో! అంతవరకూ వచ్చిందా?....అని ఇంకేవో అనబోతుండగానే , బయట నుంచి 'శంకర్" అన్న గిరి పిలుపు వినిపించింది. శంకర్ హడావుడి గా బయటకు పరుగెత్తాడు.
15
తనకు దుర్గ ఉత్తరం అందిన దగ్గర నుంచీ, గిరి చాలా తరచుగా, శంకర్ ఇంటికి రావటం సాగించాడు. గిరి సమక్షం లో శంకర్ స్వరూపమే మారిపోతుంది. గిరి ఉన్నంత సేపూ, ఆ ఇల్లు స్వర్గ ధామమే ! గిరి నిశితంగా పరిస్థితులను పరిశీలించి, సమస్యలను కొంతవరకు , ఆకళింపు చేసుకున్నాడు. శంకర్ కు తన దాంపత్య జీవితాలలోని వెలితి ఏమిటో, అతనికి అర్ధమయ్యేలా , ఎలా బోధించాలా అని ఆలోచిస్తున్నాడు. సమయం కోసం నిరీక్షిస్తున్నాడు. శంకర్ చిరునవ్వుతో తన దగ్గిరకు రాగానే గిరి, అతని భుజం మీద వాత్సల్యంగా చేయి వేసి, "ఏం శంకర్! ప్రళయ తాండవం చెయ్యటం లేదు కదా!" అన్నాడు. శంకర్ సిగ్గుపడి చిన్నగా నవ్వి, " ఏవో చిలిపి తగవులు " అన్నాడు. అంతలో లోపలి నుంచి దుర్గ కూడా అక్కడకు వచ్చి "చిలిపి తగువులు కాదు గిరీ! నన్ను ఇంట్లోంచి పొమ్మంటున్నారు." అంది రోషంగా. శంకర్ ఆమె వంక కోపంగా చూశాడు. గిరి ఇదేమీ పట్టించుకోనట్లే బిగ్గరగా నవ్వుతూ "వాడి ముఖం వాడు నిన్ను పొమ్మనటమా , నువ్వు మాటలు సీరియస్ గా తీసికోవటమూ , నువ్వు గుమ్మం కదిలి రెండడుగులు వేసి, వెనక్కు తిరిగి చూడు! వాడు , నీ కొంగు వెనకాల ఉంటాడు." అన్నాడు గిరి. తననలా వెనుక వేసికొని వచ్చినందుకు శంకర్ ముఖం వికసించింది. తనమీద వాత్సల్యంతో శంకర్ కు గట్టిగా బుద్ది చెపుతాడని ఆశపడ్డ దుర్గ గిరి , శంకర్ ను సమర్ధించడంతో నిరాశ పడింది. మూతి ముడుచుకుని లోపలకు వెళ్ళిపోయింది. శంకర్ గిరితో "ఎప్పుడు వచ్చినా, ఒక్క రోజులో వెళ్లి పోతావు. ఈసారి రెండు రోజులుండ రాదూ?" అన్నాడు. గిరి నవ్వుతూ, "ఈసారి రెండు కాదు నాలుగు రోజులుందామని సెలవు పెట్టి వచ్చాను. ఒక్కడికీ ఏం తోచటం లేదు. హరి కూడా వూర్లో లేడు.' అన్నాడు.
ఆ రాత్రి శంకర్ సినిమా ప్రోగ్రాం పెట్టాడు-- దుర్గ తాను రానంది. శంకర్ మళ్ళీ బ్రతిమాల లేదు. గిరి కూడా ఏం మాట్లాడలేదు. గిరి, శంకర్ , కలిసి బయటకు వెళ్ళారు. దుర్గ విపరీతంగా బాధపడింది. శంకర్ సరే, గిరైనా , తనను రమ్మని బలవంతం చేయలేదు.
సినిమాకు వెడుతూ దారిలో యధాలాపంగా అన్నట్లు గిరి శంకర్ తో "దుర్గ మనసు కరిగిన మైనం ముద్దా లాంటిది. దాని మీద నీ ఇష్టం వచ్చినచ్చినవి చిత్రీకరించుకోవచ్చును. సుందర చిత్రాలు, చిత్రించు కుని, ఆనందించటమో, పిచ్చి గీతలతో దాన్ని ఖరాబు చెయ్యటమో, నీ చేతుల లోనే ఉంది." అన్నాడు.
శంకర్ కు ఆ మాటలు సరిగా అర్ధం కాలేదు. గిరి దుర్గను స్వంత చెల్లెలిగా అభిమానిస్తాడని శంకర్ కు తెలుసు....గిరి ప్రోత్సాహమే, ఈ వివాహానికి కారణమని కూడా తెలుసు. తానూ దుర్గతో కలహం పెట్టుకున్నందుకు , గిరి కష్ట పెట్టుకున్నాడేమో ననుకుని "మీ దుర్గకు అహంకారం చాలా ఎక్కువ. తాను చదువుకున్న దాన్నని గర్వం. నా అంతటి దాన్ని నేను ఈయన మాటలు లక్ష్యం చేయట మేం?' అన్నట్లు ఉంటుంది అన్నాడు.
గిరి నవ్వి, "మీ దుర్గ అంటావేమిటి? నువ్వు మా శంకర్ వి కాదా? దుర్గ అలా అంటుందా? నేను చెప్పి చూస్తా నుండు." అన్నాడు.
శంకర్ ఉప్పొంగి పోయాడు.
