
తెల్లవారింది . హిమబిందు లేచింది ముందుగా. అతడా సోఫాలోనే పడుకుని నిద్రపోతున్నాడు. తలగడా లేదు. దుప్పటీ లేదు. తనను తానె నిందించుకుంది. రెండు క్షణాల;లాగే చూస్తూ నిలుచుండి పోయింది.
అలసట కనిపించుతున్నదతని ముఖంలో. 'శ్యామ్! నిన్ను బాధపెడుతున్నాను. కానీ...ఏం చేయాలి? నిన్ను ప్రేమించ గలను. ప్రేమిస్తున్నాను! కానీ, నీకు భార్యను కాలేనేమ? స్నేహితులుగా ఉండి పోతేనే బాగుండేది! ఇప్పుడెలా?' అతడు కదిలాడు రెండో వైపుకి. ఆమె ఊహలు ఆగిపోయాయి.
"దిండు వేయనీయండి!" అంటూ దిండు ఉంచిందతని తల ఎత్తి. అతని కింకా మెలకువ రాలేదు. తలుపులు దగ్గిరకు లాగి వెళ్ళిపోయింది.
శ్యామ్ లేచేటప్పటికి బారెడు ప్రోద్దేక్కింది. అద్దంలో చూసుకున్నాడు. కళ్ళేర్రబడ్డాయి నిద్రచాలక. అమ్మ ఎమనుకుంటుందో ' అనుకుంటూ బాత్ రూం లోకి వెళ్ళాడు.
కావాలనే ఆ రోజంతా హిమబిందు తో మరింత ఆత్మీయంగా, నవ్వుతూ మాట్లాడాడు. క్షణం కూడా తనను వదిలి ఉండలేనట్లు ఆమె ఏదో పని మీద అటు వెళ్ళగానే, "బిందూ!'అంటూ పిలిచేవాడు.
హిమబిందు కది వింతగానూ ఉంది. ఆనందంగానూ ఉంది. బజారు నుంచి వస్తూనే కేకవేశాడు. తల్లి బిందు ని -- "వెళ్ళమ్మా! అబ్బాయి వచ్చినట్టున్నాడు" అని పంపించింది.
"మల్లె పూలంటే నీకెంతో ఇష్టం అన్నావుగా?' అంటూ పూల చెండు అందించాడు.
ఆమె ఎప్పుడూ అతనితో పూల గురించే మాట్లాడినట్లు గుర్తు లేదు. ఇదంతా అమ్మ కోసం ఆడుతున్న నాటకం అని తెలిసి పోయిందామెకి. అతని స్థితి చూసి జాలితో కరిగి పోయిందామే మనస్సు!
"కరుణ లెటరు వ్రాసింది " అని చెప్పింది.
"ఏమని? అమెరికా ఎలా ఉన్నదంటూన్నది? వదిన గారిని రమ్మన్నదా?"
"మీరు వ్రాశారటగా?"
"ఏమని? బిందు ని పంపిస్తాననా?"
"ఎందుకిలా పరిహసాలతో నన్ను చంపుకు తింటారు?' ఆమె కళ్ళలో నీళ్ళు నిండు కొచ్చాయి.
"అరె, ఇంత మాత్రానికే కన్నీళ్ళా! సరే! అనను, తల్లీ! అననిక! కరుణ కి వ్రాయి-- ' ఓ గాజు బొమ్మని ప్రేమించాడు మీ అన్నయ్య! ముట్టుకుంటేనే పగిలి పోతుందట!' అని."
తల ఎత్తలేక పోయిందామె.
"బిందూ! నవ్వడానికే అన్నాను సుమా! మళ్లీ కంట తడి పెట్టకు! ఏదీ, ఇలా చూడు! అదిగో! వినిపించుకోవన్న మాట నా గొడవ! అమ్మ హల్లో ఉంది! కరుణ ఏం వ్రాసిందో నీకని వినాలని వచ్చి ఉంటుంది, అందుకే అలా అన్నాను!" అన్నాడు గొంతు తగ్గించి చివరలో.
కన్నీళ్లు వత్తుకుంటూ అతని వంక చూసి నవ్వలేక నవ్వింది.
"మీరు మంచం మీద పడుకోండి! నేను సోఫా మీద పడుకుంటా నీ వేళ!" అంటూ తలలోని మల్లెపూలు తీసి టేబిల్ మీద పెట్టబోయింది.
"అరే, తీస్తున్నా వెందుకు? ఉంచుకోగూడదా? కమ్మని వాసన వస్తుంది తలంతా! పోనీ, నా కివ్వు!" అంటూ చెండు అందుకున్నాడు.
"పూలు నలిగిపోతాయి! కానీ, నా అంతట నేను స్వయంగా నలిపి వేయలేను. వాటంతట అవే వాడి పోవాలి!"
"..........."
మంచినీళ్ళు తీసుకు రావడానికి వెళ్లి వస్తూ చూసింది.
తన జడలోంచి తీసిన మల్లెల్ని ముద్దు పెట్టుకుని చెంపల మీదుగా మృదువుగా వట్టుకుంటూన్నాడతడు! ఆమె నా దృశ్యం కదిలించి వేసింది. తనపై అతని కెంత గాడానురాగం ఉన్నదీ దానితో అవగతమై పోయింది.
"శ్యామ్! ఈ బిందు నిన్ను పిచ్చివాణ్ణి చేసి వేస్తుందనుకుంటానే! నాకోసం నీ మనస్సు ఇంత తపించి పోతున్నదా?!! బావ కూడా ఇలాగే నా హృదయాన్ని క్షణక్షణానికీ కొత్త ఊహలతో నింపి వేసేవాడు! అక్కడితో మళ్ళీ మనస్సు మూగదై పోయింది.
డైరీ తెరిచింది. తల ఎత్తి చూశాడు శ్యామ్! క్షణం లో బయటికి వెళ్ళిపోయాడు రివ్వున, బాణం లా.
"అమ్మా! తలుపు వేసుకో! ఓ ఫ్రెండ్ ఫోన్ చేశాడిందాక రమ్మని! వెడుతున్నాను!" వీధిలో నిలబడి పిలిచాడు.
అ కేక వినిపించి గతుక్కు మంది హిమబిందు. 'ఎవరూ ఫోను ఎత్తిన పాపానే పోలేదు ప్రొద్దు న్నించి. ఇదేమిటి? ఇంత రాత్రి ఏ ఫ్రెండ్ రమ్మన్నాడు? కోపం వచ్చిందేమో నా మీద! బావ డైరీ చదువు తున్నాననెమో? ఇంత మాత్రానికే కోపం తెచ్చుకోడే శ్యామ్!' ఆమెకే జవాబూ నచ్చలేదు. డైరీ చేతుల్లోనే ఉంది! ఎప్పుడో నిదుర పొయిందామె.
ఒంటి గంటకి ఇల్లు చేరుకున్నా డతడు. లోనికి రాగానే సోఫాలో ముడుచుకుని పడుకున్న బిందు కనిపించింది. వంగి చూశాడు. చేతుల్లో ఉన్న డైరీని తీసి చూశాడు. మొదటి పేజీలోనే ఆగిపోయిందని తెలిసిపోయింది. మృదువుగా నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు.
ఆ రాత్రీ ఏ మధురాను భూతీ లేకుండానే తెల్లవారిందా ఇరువురికీ.
మెలకువ వచ్చి చూసేసరికి ఆమె మంచం మీద ఉన్నట్లు తెలిసింది. సోఫా వంక చూసింది. శ్యామ్ లేడు!
"భయపడకు, బిందూ! నీకు ఇష్టం కాని సంఘటన ఏదీ జరగలేదు. సోఫా మీద నుంచి క్రింద పడి అరిస్తే అమ్మ గాభరా పడుతూ లేచి వస్తుంది. అందుకే నిన్ను ఇలా చేతులతో ఎత్తుకుని అలా మంచం మీద పడుకో బెట్టాను! ఇంతే!" అన్నాడు లోనికి వస్తూ.
"నేనేం భయపడ్డం లేదు లెండి! రాత్రి ఎక్కడికి పారిపోయారో చెప్పండి కాస్త!"
"ఏం? చెప్పకపోతే శిక్షిస్తావా?"
"అని చెప్పాలా నేరుగా?"
"అయితే చెప్పనసలు! ఎలా శిక్షిస్తావో చూడాలి!" అంటూ దగ్గరగా వచ్చాడతడు.
"మీకు చెప్పగూడదా రహస్యం."
"ఏమిటబ్బా అంత తీయనిది? ఏదీ, నన్ను చూడనీ!" ఆమె కళ్ళలో కళ్ళు ఉంచి వెదుకుతున్నట్లు నటించాడు.
"బిందూ! ఎందుకిలా 'నాతి గల బ్రహ్మచర్యం' తో చంపుతున్నావు నన్ను? చెప్పవూ?"
ఆ కంఠం మారిపోయింది. ఆ మాట తీరు ఎప్పటిలా లేదు. ఏదో నిషా నిండిపోయిందా గొంతులో. గట్టిగా కళ్ళ మీద పదేపదే ముద్దు పెట్టుకున్నాడు వంగి. పైకి లేపి గుండెలకు హత్తుకున్నాడు.
"బిందూ! బిందూ! ఇలా చూడు?' భయంతో పడుకో బెట్టాడు.
ఆమె కనులు మూసుకునే ఉంది. కానీ, రెప్పల క్రింది నుంచి అశ్రు బిందువులు జారిపడుతున్నాయి. పెదవులు వణుకు తున్నాయి.
భయంతో మళ్ళీ పిలిచాడతడు. కళ్ళు తెరిచి నిర్జీవంగా నవ్వింది.
"ఏం లేదు. ఈ మీ బిందు మనస్సు మరీ దుర్భలమై పోయింది. మీ ప్రేమని భరించ లేకపోతోందేమో!"
ఆ మాటల్లో అర్ధం అతని మనస్సు ని మేల్కొలిపింది. విగ్రహంలా కూర్చుండి పోయాడు.
"మానస్సు నా మాట వినడం లేదు, బిందూ! నన్ను నేను నిగ్రహించు కోలేకపోతున్నాను!" తనలో తాను అనుకుంటున్నట్లు అని లేచి వెళ్ళిపోయాడు.
ఆ మధ్యాహ్నం అతడు నవ్వుతూ అడిగాడు.
"ఆగ్రా ;లో మా ఫ్రెండ్ రామ్ ఉన్నాడు! ఎప్పటి నుంచో వ్రాస్తున్నాడు రమ్మని? వెళదామా బిందూ?"
ఆమెకూ ఆ వాతావరణం అంత ఉత్సాహంగా లేదు. అందుకే వెంటనే అంగీకరించింది.
ఆ రాత్రే బయలుదేరారు అగ్రాకి.
ఆ ప్రయాణం ఆమె మనస్సుని కొంతవరకు మార్చగలిగింది . ఎప్పటిలా అతని స్పర్శకే వణికి పోవడం లేదు. ముద్దు పెట్టుకున్నా నవ్వుతూ వరిస్తుంది. గానీ, కంట తడి పెట్టుకోవడం లేదు.
అతని పక్కనే కూర్చుని చీకట్లో రైలు సాగిపోతుంటే వస్తూన్న చప్పుడికి నిడురతో తూలీ పోయేది అతని పైకి.
అతను ఒడిలో పడుకున్నా భయంతో ముడుచుకు పోవడంలేదు.
"మరీ చిన్నపిల్లా డమ్మా!" అంటూ నవ్వేది క్రాపు సవరిస్తూ.
"ఇలాగే ఉండిపో, బిందూ! ఈ ప్రయాణం ఇలాగే జీవితాంతం సాగిపోతే ఎంత ఆనందంగా ఉంటుందో?"
కబుర్లు
బిందు మనస్సూ అలాగే ఆలోచిస్తున్నది. రైలు పరుగెడుతుంది. పక్కనున్న చెట్లూ, గట్లూ దానితో కలిసి వస్తున్నట్ల నిపిస్తుంది ఆ వేగంలో. కొండల మధ్య నుంచి, లోయల్లో నుంచి పరుగెడుతోందో సారి! ఆ లోయల్లో చిన్న చిన్న సెలయేళ్ళు పచ్చని మొక్కలు, అక్కడక్కడ ఆవుల మందలు నయనా నందకరంగా కనిపిస్తూ క్షణంలో వెనక్కు పోతున్నాయి.
వేగంలోని ఊపు ఊయలై మనసుని జోకోడుతున్నది. విచారమూ కదలదు లోలోన. బాధా మెదలదు ఏ అణువునా! గతం ఉన్నట్టే అనిపించడం లేదు. 'ముందుకు పోతున్నాం' అన్న భావనే హృదయాన వెన్నెల వెలుగుల్ని నింపుతున్నది.
తనను గురించి ఊహే కదలడం లేదామే కి!
'ఈ రైలు ఆగిపోకూడదు. ఈ చెట్లూ, గట్లూ, లోయలూ, పూలూ, పక్షులూ , పశువులూ ఎంత అందంగా ఉన్నాయి! క్షణానికో సుందరమైన దృశ్యం కనిపిస్తుంది! అబ్బ! చీకటి! టనెల గాబోలు! అమ్మయ్య! వెలుతురూ! నా మనస్సునా వెలుతురే నిండిందేమిటి? శ్యామ్ నీ ఋణం ఎలా తీర్చుకోవాలి? ఆ పూలు ఎంత అందంగా నవ్వుతున్నాయి! నది గాబోలు ! ఇసుక మేట వేసిందే! దూరాన నీళ్ళు తళతళ మెరుస్తున్నాయి నా ఊహ సముద్రంలా!"
తనను తాను మరిచి పొయిందామె ఆ సుందర ప్రకృతి దృశ్యాల్లో లీనమై.
మధుర దాటిపోయింది రైలు. ఆగ్రా చేరుకుంది. శ్యామ్ దిగి కూలిని పిలిచి సామాను అందించాడు.
టాక్సీ లో హోటల్ కి వెళ్ళాడు. ఎంతో అందంగా ఉందా హోటల్ భవనం! స్నేహితుడికి ఫోన్ చేశాడు. అంతలో బిందు స్నానం చేసి, కాఫీ తాగుతూ కూర్చున్నది. శ్యామ్ తో కలిసి వస్తూన్న అతణ్ణి చూసిందామె నవ్వుతూ నమస్కరించాడతడు.
శ్యామ్ పరిచయం చేశాడు -- "రామ్ , అసిస్టెంట్ ఇంజనీర్!" అంటూ.
తమ ఇంటికి రమ్మని ఆహ్వానించాడు రామ్. ముందుగానే హోటల్లో ఎందుకు దిగావని కోప్పడ్డాడు. "వచ్చే ముందు వ్రాయగూడదా , శ్యామ్! స్టేషన్ కి వచ్చెవాణ్ణి గా? నువ్వెప్పుడూ ఇంతే! అన్నిటికి ఇబ్బందేమో వాళ్లకి అని ఆలోచిస్తావు!" నొచ్చుకుంది అతని మనస్సు.
"మళ్ళీ వచ్చినప్పుడు నువ్వు వద్దనే వరకు మీ ఇంట్లోనే మకాం!" నవ్వాడు శ్యామ్.
భోజనానికి ఆహ్వానించాడు ఇరువురినీ.
రైల్వే క్వార్టర్స్ ఏమో -- అందంగా ఉంది. ఇంటి ముందు చిన్న పూల తోట. చుట్టూరా ఎత్తైన పచ్చని చెట్లు. వరండాలో రెండు చిన్న సోఫాలు!
బెల్ నొక్కగానే రామ్ భార్య వనజ తలుపు తీసింది! ఆమె వెనకే ముగ్గురు పిల్లలు వచ్చారు -- "మమ్మీ, కౌన్?" అంటూ.
బొద్దుగా , తెల్లగా ఉంది చిన్న పాప! మగపిల్లలిద్దరూ వెంటనే నమస్కరించారు.
"అంటీజీ, నమస్తే! అంకుల్ జీ , నమస్తే! అందర్ అయియే !" అంటూ చిన్న వాడు చనువుగా హిమబిందు చేతిని పట్టుకొని లోనికి తీసుకొని వెళ్ళాడు.
బెడ్ రూం అందం విరజిమ్ముతుంది. ఫోటోలు మరింత వన్నె తెచ్చాయి. ఆ రూం కి. నీట్ గా, పొందికగా ఉంది అలంకరణ.
రెండు మంచాలు, డన్ లప్ పరుపులు. తెల్లని దుప్పట్లు. కిటికీలకు నీలిరంగు తెరలు.
మనస్సు ఆ అలంకరణ కి హాయిగా నవ్వింది. పిల్లలున్నా ఏ వస్తువూ అస్తవ్యస్తంగా లేదు. మురికిగా లేదు. కిచెన్ లో టేబిల్, కుర్చీలు. పిల్లలు టిఫిన్ గాబోలు తింటున్నారు.
రెండోవాడు రాజా! హిమబిందు ని క్షణం వదలడం లేదు. "అంటీజీ , నా గుర్రం బాగుందా? ఈ బొమ్మ విస్కీ తాగుతుంది , తెలుసా?" అంటూ కీ ఇచ్చాడు. బొమ్మ చేతిలో గ్లాసులోకి మరో చేతిలో ఉన్న సీసాలోంచి విస్కీ పడుతున్నట్లు తోస్తున్నది.
'అది ఖాళీ సీసా, అంటీజీ! బొమ్మ కెందుకు మరి విస్కీ!"
హిమబిందు కూడా తనకా విషయం తెలియనట్లు విన్నది నవ్వుతూ.
చిన్న పాపకి ఓ ఏడాది వయస్సుంటుందేమో? నవ్వుతూ తన చేతుల్లో వాలిపోయింది. తల్లి చెప్పగానే హిమబిందు చెక్కిలిని ముద్దు పెట్టుకుంది గట్టిగా. ముచ్చట వేసింది. తనూ ముద్దులతో నింపేసింది.
