Previous Page
గాజు బొమ్మ పేజి 15


    డ్రాయింగ్ రూం లో కూర్చున్నారందరూ. రామ్ కిచెన్ లోకి వెళ్ళాడు. పాప హిమబిందు మెడలోని గొలుసు పట్టుకుని లాగుతుంది.
    శ్యామ్ నవ్వుతూ చేతులు జాపాడు పాపని పిలుస్తూ.
    రానన్నట్లు హిమబిందు భుజం మీద వాలిపోయి, మేడ చుట్టూ చేతులు వేసి గట్టిగా కళ్ళు మూసుకుంది.
    "ఈ పాపకి కూడా ఇష్టమే! పోనీ, ఇలాంటి బుల్లి పాపని నాకు ఇవ్వరాదా , బిందూ?"
    హిమబిందు మనస్సు పులకించిందా మాటతో. ఆ పాపను చూసినప్పటి నుంచీ తన కెందుకో ఆనందం పొంగి పోతున్నది.
    "ఈ పాప నిస్తారేమో! తీసుకు వెళదాం! ఎంచక్కా నవ్వుతుందో చూడండి!"
    "నా మాట విన్నావా అసలు! ఇంతకన్నా అందమైన పాప కావాలి నాకు! ఎప్పుడిస్తావు?"
    "మీకు మరీ సమయం. సందర్భం కూడా తెలియడం లేదేమిటి? ఎప్పుడూ నన్ను వేపుకు తినడమే మీ పనిలా ఉంది. చూడమ్మా, పాపా! అంకుల్ మంచబ్బాయి కాదు. కుట్టీ! అను!" అంటూ పాపను ముద్దెట్టు కుంది లేపి.
    "పాపా! అంటీ తో చెప్పమ్మా! ఈ మామయ్య ని కూడా ఒసారిలా ముద్దు పెట్టుకోమని!"
    "హుష్! ఆయనోస్తున్నారు! ఆపండిక!" అంటూ దూరంగా జరిగింది.
    ఎంతో సందడిగా గడిచి పోయిందా రోజంతా. స్నేహితునికి థాంక్స్ చెప్పి బయలుదేరా రిరువురూ.
    వెన్నెల తెల్లగా మెరుస్తుంది. సరాసరి తాజ్ మహల్ దగ్గరకు వెళ్ళారు.
    ముందు ఎంతో ఎత్తున ద్వారం ఉంది. దాటి లోన అడుగు పెట్టారు . తాజ్ మహల్ ప్రత్యక్షమైంది వెన్నెల్లో మెరిసిపోతూ.
    ఆ దృశ్యం హిమబిందు మనస్సుని పరవశింప జేసింది. ఆ పరవశత్వం లో తన చేయి శ్యామ్ చేతిలో ఉన్న మాటే మరిచిపోయింది.
    "అబ్బ! ఎంత అందంగా ఉంది!! వెన్నెలతో సింగారించుకుని గాబోలు ఇలా ఇంత చల్లగా, తెల్లగా కనుల పండువు చేస్తున్నది . తాజ్! అనురాగం ఇంత సుందర మైనదా? యమునా లో నీడ చూసుకుంటూన్నదా? పైన నీలాల నింగితో ఏమిటి అంటున్నది ముంతాజ్? ఎంత అదృష్టం తనది! యుగయుగాలు గడిచినా ఆ పేరు మధురాతి మధురంగా నిలిచి పోతుందే!
    శ్యామ్! నువ్వు షాజహాన్ వి అయితే?!' అతని వంక చూసింది ఆ ఊహకీ నవ్వుకుంటూ.
    "ముంతాజ్ కనిపిస్తోందా , బిందూ? ఏమంటున్నది నీతో?"
    "నా మనస్సున అనురాగం అమృతం సేవించింది. అందుకే ఇంత అందంగా , అజరామరమైంది " అన్నదామె.
    చలువ రాళ్ళ మీద రంగురంగుల పూలు , లతలు ఎంతో కనువిందు చేస్తున్నాయి.
    పై నుంచి క్రిందికి చూస్తుంటే ఆ ఇరువురి మనస్సు లూ ఆ సుందర దృశ్యానికి పరవశించాయి.
    మధ్యన నీళ్ళు. ఇరుపక్కలా పచ్చని చెట్లు ఎత్తుగా.
    "షాజహాన్ చివరి రోజుల్లో పల్లకీ లో కూర్చుని ఈ మహల్ అందాన్ని చూస్తూ ప్రేయసి తన ఎదుట ఉన్నట్లే మురిసి పోయేవాడట!"
    "మీ కవిత్వం కూడా కలపండి! అన్నట్లు, షాజహాన్ ఆ జన్మలో మీ అన్నగారేమో?"
    "ఆ సంగతేమో గానీ, హిమబిందు అన్న అమ్మాయి మాత్రం ఆ జన్మలో నా ప్రియురాలు! క్షణం కూడా నన్ను వదిలి ఉండేది కాదు. ఇదిగో, ఇక్కడే కూర్చుని తన ఒడిలో తల వాల్చుకుని వెన్నెల్లో ఎన్నో కధలు, కబుర్లు...."
    "ఊ ఊ! కానివ్వండి! కవిత్వం చేప్పండిక!"
    "చెప్పడం వరకేగా నా పని!"
    శ్యామ్ కళ్ళలోకి చూసింది నవ్వుతూ. అనురాగం తళుకు లీనుతూందామె నేత్రాల్లో.
    ఆగి నలువైపులా చూసి హిమబిందుని హృదయానికి హత్తుకుని పెదవుల్ని ముద్దు పెట్టుకున్నాడు మృదువుగా.
    "తాజ్ మహల్ ని చూసినట్లు గుర్తుగా ఒక్కసారి ఈ నీ శ్యామ్ ని ఈ ఎర్రని పెదవులతో ......." అంటూ చెక్కిలి నామే పెదవుల కందించాడు.
    "ఎన్నాళ్ళ కెన్నాళ్ళ కి ? ఈ శ్యామ్ అదృష్టం పండింది. బిందూ!"
    "హుష్! ఎవరో వస్తున్నారు, పదండి" అంటూ కౌగిట్లో నుంచి తప్పుకుని ముందుకి నడిచింది.
    "ఎక్కడా! అమ్మ దొంగా? తప్పించు కున్నావు గదూ? మళ్ళీ అందకుండా ఎక్కడికి పోతావో చూస్తాను!":
    ఎవరూ లేరని తన నుంచి పారిపోవడానికి అలా చేసిందని తెలిసి నవ్వుకున్నాడు.
    తాజ్ ని చూసి తిరిగి వచ్చేసరికి ప్రొద్దు పోయింది. భోజనం చేసి రూమ్ కి వెళ్ళారు.
    "కరుణ ఉంటె బాగుండేది!" అంటూ నడుం వాల్చిందామె.
    "ఏం? నేనుంటే బాగుండలేదా?"
    "అని నే నన్నానా?"
    "అవున్లే! ఈ శ్యామ్ ఎలా ఏడిస్తే నీకెందుకు.
    "ఏమైంది మీకిప్పుడు? ఇంతలోనే!"
    "మాటల్లో ఇంత చేరువగా వస్తావు? చేతల్లో అంత దూరంగా ఉండి పోతావెందుకు, బిందూ?"
    క్షణ మాత్రం ఆగిపొయిందామె.
    "భార్యాభర్తలు స్నేహితులుగా ఉండి పోకూడదా సెక్స్ లేకపోతె ఏం మునిగి పోతుంది?"
    "బిందూ , నీకు తెలియకే అడుగుతున్నావా ఆ ప్రశ్న? జీవితాంతం కలిసి ఉండెవాళ్ళ కి ఆ స్నేహమే చాలదు. అది మానసికంగా కొంతవరకు సన్నిహితం చేస్తుంది ఇద్దర్నీ! కానీ, శారీరక సంబంధం మనస్సు లోకి ప్రాకి ప్రేమని మరింత పెంచుతుంది . కష్టంలో, సుఖంలో ఒకరి కొకరు అండలా నిలబడతారు నీ మనస్సు నొప్పించాలని అడగడం లేదు. మీ బావ కు నీకూ ఈ భేదం ఉన్నదా?"
    ఆ మాటతో ఆమె ముఖం మలిన మైంది. బరువుగా నిట్టూర్చింది.
    "ఆ జీవితం స్వర్గం!"
    "ఈ జీవితం కూడా స్వర్గం ఎందుకు కాకూడదు బిందూ?"
    "నీడలా గతం నన్ను ప్రతి క్షణం వెన్నాడు తుంది . నేను తప్పు చేశానేమో మళ్ళీ పెళ్లి చేసుకుని?"
    "ఆ భావం రాకూడదు, బిందూ . నీ మనస్సులో నీకేం బాధ కలిగింది ప్పుడని అలా అన్నావు? నువ్వు కాదన్నా నిన్ను తన సర్వస్వం అని భావించే భర్త ఉన్నాడు. మధుర స్నేహమయి కరుణ ఉంది. అందం ఉంది. అంతస్తు ఉంది. కానీ , నువ్వే వాటి విలువ గుర్తించడం లేదు."
    "............"
    "డైరీ చదవకపోతే నిద్రపట్టలేదు నీకు మొన్నటి వరకు! ఈ నాలుగు రోజుల నుంచీ ఆ డైరీ మాటే మరిచి పోలేదా! మార్పు దానంతట అదే వస్తుంది, బిందూ! కాలంతో పాటు మారాలి!"
    ఆమె ఔననీ అనలేదు, కాదనీ పెదవి విప్పలేదు. అలాగే చూస్తుండి పోయింది. కొంతసేపటి కిలా అన్నది."
    "ఈ బిందు చని పోయిందనుకోండి! మీరు మళ్ళీ మరొకరితో ఇంత ప్రేమగా ........."
    "కాని వాటిని గురించి నేను ఆలోచించను, బిందూ!"
    అతనికి కోపం వచ్చిందని గ్రహించింది.
    "ఈ మధ్య మీకు కోపం పిలిస్తేనే పలుకుతుంది!"
    "..........."
    "మాట్లాడరా ఏమిటి నాతొ?"
    "మాట్లాడను! ఏం చేస్తావు?"
    "అబ్బ! పసి పాప లవుతున్నారే హటం లో!"
    "ఆ! నీకు పాపలంటే ఇష్టమని తెలిసి. రామ్ కూతుర్ని చూశాక నీ మనస్సు పిల్లల మీదికి మల్లించావనుకుంటానే?"
    "నిజంగా ఎంత అందంగా ఉంది వాళ్ళ పాప! వదిలి పెట్టి రాలేక పోయానంటే నమ్మండి."
    "అయితే పాప పుట్టాక ఈ శ్యామ్ గొడవే పట్టించు కోవన్న మాట! మన బుజ్జి ఇంకా అందంగా ఉంటుంది. నీ కళ్ళూ, తెలుపూ వస్తే! నీ కోపం మాత్రం రాకుండా ఉండాలి!"
    పకపకా నవ్విందామె.
    "ఎందుకలా నవ్వుతావు? పిల్లలంటే ఇష్టం లేదా నీకు?"
    "మనిషైన ప్రతి వాడికీ పిల్లలంటే ప్రేమ ఉంటుంది. మరి నేను మనిషిని కానా? ఆడదాన్ని కూడా! అమ్మ కావాలని ప్రతి స్త్రీ కలలు కంటుంది చిన్నతనం నుంచీ!"
    ఆమె మనస్సు పిల్లల విషయంలో మెత్తబడుతుందని గ్రహించాడు. 'అదే క్రమంగా తన పట్ల కోరికగా మారిపోతుంది' అనుకున్నాడు.
    "మీకు చాలా ఊహ లున్నాయి మన సంసారం గురించి. కానీ, నాకెందుకో అలా ఊహించ బుద్ది కావడం లేదు. నా మనస్సు నన్నో గాజుబొమ్మ గా మార్చి వేసింది. ఏ తాకిడి కో క్రింద పడుతుంది. పగిలి ముక్కలై పోతుంది. మళ్ళీ అతికినా ఆ ముక్కలు కలుసుకోవు."
    అతడు మాట్లాడలేదు కావాలనే. సన్నిహితంగా వచ్చే క్షణంలో దూరమై పోయిందనిపించిందతనికి.
    అర్ధరాత్రికి మెలకువ వచ్చిందామెకి. అతడు ఏదో పుస్తకం చదువు కుంటున్నాడింకా.
    "అరె, మీరింకా నిద్రపోలేదా?"
    "నిద్ర రానిదే ఎలా పడుకోను?"
    "ఆహా, ఇదంతా నామీద కోపమే లెండి. చాలు గాని, లేవండి. పన్నెండు దాటింది. ఇక పడుకోండి" అంటూ లేచి అతని చేతిలోని పుస్తకం లాక్కుని సూట్ కేస్ మీదికి విసిరివేసింది.
    "మరి నువ్వు నా పక్కన కూర్చొవా లమ్మాయ్ నిద్రోచ్చే వరకూ!"
    "అలాగే, మహానుభావా, అలాగే. జోల గూడా పాడనా!"
    తల ఊపాడతడు నవ్వుతూ.
    ఆమె చేతుల్ని తన గుండెల మీద పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు పడుకుని.
    "తెల్లని చీరలో అందంగా ఉన్నావు, బిందూ , ఈవేళ!"
    "మీకు నేను అందంగా కనిపించని దెప్పుడు? ఎలా ఉన్నా తా వలచినది రంభే ఎవరికైనా!"
    "అయితే ఈ శ్యామ్ కూడా నీకు........"
    "ఆ నలకూబరులు! చాలా? ఇంకా ........"
    "ఉహూ చెప్పనక్కర్లేదు" అంటూ ఆమెని తన మీదికి లాక్కున్నాడు.
    బిందు చెక్కిలిని తన చెంపకు వత్తుకుంటూ ఉద్వేగంతో ఊగిపోయాడు.
    "అబ్బ, వదలండి...."
    "ఉహూ వదలలేను , బిందూ! ఎన్నాళ్ళిలా ఉంటావు? ఇది సహజం . ఎక్కడా లేనిదేం గాదు. నీ మనసు నాదైనప్పుడు నీ అణువణువూ నాదే."
    అతని కంఠనా కోరిక బుసలు కొడుతుంది. ముద్దులతో ఉక్కిరి బిక్కిరయి పోయిందామె. ఏ ఊహ కదలలేక పోయిందా కౌగిట్లో. క్షణంలో ఆమెని సర్పంలా బంధించి వేశాడు.
    అతని ఆ పరవశత ఆమెని ఆనంద పరుస్తుంది. ఆ కౌగిట్లో వెచ్చదనానికి మనస్సు తూలీ పోతుంది. కళ్ళలో కళ్ళు ఉంచి చూస్తున్న అతని వైపు చూడాలంటె నే సిగ్గు ముంచుకు వస్తుంది. కానీ, మరో వైపు నుంచి ఏదో భావం నిలువెల్లా వణికించుతుంది.
    కొన్ని క్షణాలు గడిచి పోయాయి. అతణ్ణి వారించలేక పోతుంది. మనస్సే లాగో అయిపోతున్నది. ఆ మత్తులో అతడామె ని తనలో లీనం చేసుకున్నాడు.
    తృప్తి మెరుస్తున్న అతని వంక చూస్తూనే మూలిగిందామె "అబ్బా" అని.
    "ఏమైంది బిందూ?' భయంతో వణికిందతని స్వరం.
    "గుండెల్లో నొప్పి....గా ....ఉంది....అబ్బా........ అమ్మా!"
    "నొప్పా! గుండెల్లోనా? హార్ట్ ఎటాక్ కాదు గదా? ఉండు, డాక్టర్ని పిలుస్తాను." పరుగెత్తాడతడు.'
    మానేజర్ కి చెప్పి డాక్టర్ని తీసుకు వచ్చేసరికి ఆమె విలవిలలాడి పోతున్నది బాధతో.
    "బిందూ, ఎలా ఉంది? ఇలా చూడు. డాక్టర్! చూడండి! చేతు లింత చల్లగా ఉన్నాయేమిటి! త్వరగా ఇంజక్షన్ చేయండి, డాక్టర్!"
    "సో, సారీ, మిస్టర్! కొన్ని క్షణాలే ఇక! మందులు పనిచేసే టైం దాటిపోయింది. హార్ట్ ఎటాక్ ఉన్నప్పుడు ఆమె ఎందుకిలా ఉద్రేకాన్ని కొని తెచ్చుకుందో నా కర్ధం కావడం లేదోయ్!"
    "బిందూ!" ఏడుస్తూ అతడు ముఖంలో ముఖం ఉంచి ఆమె కళ్ళలోకి చూశాడు.
    ఎంతో కష్టంతో తెరుచుకున్న కనులు అతని వంక పూర్తిగా చూడక ముందే మూతలు పడ్డాయి శాశ్వతంగా.
    "బిందూ! నేనేం చేశాను? నిన్ను చేతులారా చంపుకున్నానా, బిందూ?" అతడామె మీద వాలిపోయి పెద్దగా ఏడవ సాగాడు.
    "ఊరుకోండి! ఈ హార్ట్ ఎటాకే ఇలాంటిది. మనిషిని గాజు బొమ్మని చేసి వేస్తుంది. చిన్న తాకిడి కే పగిలి ముక్కలై పోతుందా బొమ్మ!" అని డాక్టర్ వెళ్ళిపోయాడు.
    అతని కా డాక్టరు మాటలు వినగానే దుఃఖం సముద్రమై తనని ముంచి వేస్తున్నట్లు వణికి పోయాడు.
    "బిందూ! గాజుబొమ్మ ని పగల గొట్టాను పగిలి పోలేదు."
    దుఃఖంతో హిమబిందు మీద వాలిపోయాడతడు.

                                 (సమాప్తం )


 Previous Page

WRITERS
PUBLICATIONS