లలిత, రామనాథం సాయంత్రం వస్తామంటూ వెళ్ళిపోయారు.
డామ్ సైట్ ఎంతో అందంగా ఉంది. పిల్లల సంతోషం చెప్పతరం గాదు! వాళ్ళ ఉత్సాహాని కేదైనా లోటంటూ ఉన్నదంటే, అది భద్రీప్రసాద్ అక్కడ లేకపోవడమే!
కాలం తెలియకుండా గడిచిపోయింది. పిల్లలు సరదాగా రకరకాల ఫోజుల్లో ఫోటోలు తీయించుకొన్నారు. పారిజాతంకూడా పిల్లలు కోరినట్లు ఫోటోలు తీసింది.
ఆరు గంట లయేసరికి పారిజాతం పిల్లలతో-"పదండమ్మా! ఇక మన ఊరికి పోవాలిగా. త్వరగా బస్సెక్కండి" అని అంది. అంతా బంగళా చేరి, తమ తమ సామానులు సర్దుకొన్నారు.
తరవాత నర్సింగ్ హోమ్ నుండి సతీదేవి తో కూడా తిరిగి వచ్చిన భద్రీ ప్రసాద్ ను పిల్లలు అల్లరి చేస్తూ,బలవంతంగా తమ వెంట హోటల్ కు తీసుకుపోయారు. "మీరు రాకపోతే మేము భోజనం చెయ్యం, సార్!" అంటూ పట్టుబట్టారు.
సతీదేవి చల్లని చూపులతో అంతా ప్రశాంతంగా జరిగింది. లలితాం, రామనాథం కూడా వచ్చారు.
పారిజాతం వాళ్ళు బస్సు ఎక్కబోతున్నప్పుడు సతీదేవి నిగ్రహించుకోలేకపోయింది. "ఏం జరిగినా, ఈ తల్లిమీద కోపగించుకోకం డమ్మా!" అంటూ సత్యనూ, పారిజాతాన్నీ దగ్గరికి తీసుకొని దుఃఖించింది.
"ఇంత చక్కగా ఆదరించిన మీ మీద కోపమా, అమ్మా! మేము మనుష్యులం! రాక్షసులం కాము" అన్నా రిద్దరూ. ఇద్దరి కండ్లూ చెమర్చినాయి.
"కృష్ణా! జీవితంతో హంపీ ప్రయాణాన్ని మరిచి పోలేము! నాకు మాత్రం ఒక తమ్ముడు దొరికాడు. మిగతా వాళ్ళకి ఏమేమి దొరికాయో, చీవాట్లు కాక" అంటూ, "బాబాయిగారూ! సెలవు! మరిచిపోయిడనకండి మమ్మల్ని" అని సతీదేవితో సహా అందరినీ నవ్వించింది. హెడ్ మిస్ట్రెస్, మిగతా టీచర్లూ సతీదేవి, భద్రీ ప్రసాద్, రామనాథం, లలితల దగ్గర సాదరంగా సెలవు తీసుకొన్నారు. అనంతలక్ష్మి మాత్రం ఎవ్వరితో పలకకుండా బస్సులోనికి వెళ్ళి కూర్చుంది. బస్సు కదిలింది.
* * *
రెండు నెలలు గడిచాయి. ఒక ఆదివారం సాయంత్రం పారిజాతం చెట్టుకింద మంచం వేసుకొని సత్య, పారిజాతం మాట్లాడుతూ కూర్చున్నారు.
"ఇదిగో, సత్యా! గవర్నమెంట్ కేకాక, అందరికీ పనికి వచ్చే సూక్తి ముక్తావళి చెబుతున్నాను. జాగ్రత్తగా విను. కుటుంబ నియంత్రణ అనీ, జనాభాను అదుపులో పెట్టమనీ గదా ఘోషిస్తున్నది మన ప్రభుత్వం! నా సలహా వింటే, ఠక్కున అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది! ఈ ఆలోచన మన ప్రభుత్వానికి ఎందుకింత వరకు తోచలేదో నా కైతే తెలియదు. అవునులే! అంతా నా అంత తెలివిగలవా రుంటారా? 'తెలివొకరి సొమ్మా, తెలకపిండి సుబ్బమ్మా!' అన్నారట వెనకటికి ఎవరో" అని అంటుండగానే సత్యవతి విసుగుతో "ఏడ్చినట్లుంది! త్వరగా చెప్పరాదూ!" అని అంది.
"అంత విసుగుకోకమ్మా! ఇల్లాలు కాబోయేదానివి! సహనం ఉండాలి. ఇంతకీ అసలు సంగతి విను. వివాహితలకూ, అవివాహితలకూ అన్నిటా భేదం ఉంది. వివాహితలు పని చేసేది మూడు నెలలే. మిగతా తొమ్మిది నెలల్లో పురుళ్ళూ, పుణ్యాలూ ఉంటాయి. అసలా మూడు నెలల్లో వాళ్ళు పనిచేసేది మూడు గంటలే! మిగతా కాలంలో వాళ్ళకు సంసారాలమీదే ధ్యాస! అందరికీ కాకపోయినా కొందరికయినా ఈ మాట వర్తిస్తుంది. ఇంత తక్కువ పని చేసినా వాళ్లకు మనతో సమనంగా జీతాలు! పైగా, వాళ్ళకు మెటర్నిటీ లీవనీ, సింగినాదమనీ, జీలకర్ర అనీ- ఎన్నో ఉన్నాయి! ఇక మన సంగతి చూడు. మనకు సంసార తాపత్రయాలు లేవు. పనిలో లీనమౌతాము. చేసే పని శ్రద్ధగా చేస్తాము. ఎంత పనయినా ఏమీ అనుకోకుండా చేస్తాము. కాని, ఏం లాభం! గుర్రాన్నీ, గాడిదనీ ఒకే గాటికి కట్టినట్లు, అవివాహితలనీ, వివాహితలనీ ఒకే దృష్టితో చూస్తే ఎట్లా? రేపటి నుండి పెండ్లికాని వారందరికీ పెండ్లయిన వారికంటే ఏభై రూపాయలు హెచ్చించనీ! మనకి కాజువల్ లీవ్ మరో పది రోజులు ఎక్కువ చేసి, వాళ్ళకు మెటర్నిటీ లీవు రద్దు చెయ్యనీ! అవివాహితుల సంఖ్య హెచ్చుతుందో హెచ్చదో! ఈ గవర్నమెంట్ అసలు పిచ్చిదోయ్! పెండ్లికాని పిల్లలను ఎక్కడికి పడితే అక్కడికి ట్రాన్స్ ఫర్ చేయవచ్చునట! పెండ్లయితే మాత్రం భార్యా భర్తలు ఒకే చోట ఉండాలిట. భార్యా భర్తలు ఒకే చోట ఉంటే, జనాభా వృద్ది కాక ఇంకేమవుతుంది? తల్లిదండ్రుల చాటున ఉండవలసిన అవివాహితులను, 'ఎందుకయ్యా వాళ్ళనుండి వేరు చేసి, దూరంగా మారుస్తా'రని అడిగితే, 'ఒంటిగా పోయి, జంటలను వెతుక్కోండి' అంటూ జోక్ చేస్తారు! నాకే కనక అధికారం ఇస్తే, భార్యాభర్తలు కనీసం నూరు మైళ్ళ దూరంలో ఉండాలని ఆర్డర్ పారేద్దును! అంతేకాదు! ఒక బిడ్డ అయితే జీతంలో ఇరవై రూపాయలు తగ్గింపు- ఇద్దరయితే నలభై రూపాయలు- ఈ విధంగా చేసుకొంటూ పోనీ! ఏడాది లోపల ఎంత అద్భుతమైన ఫలితం కనబడుతుందో! మీకే తెలుస్తుంది!"
"ఇంత ఉపోద్ఘాతం చెప్పి కష్టపడ్డావు! అసలు సంగతి ఏమిటి, పారిజాతం?"
"ఏముందీ! హెడ్ మిస్ట్రెస్ గారు గర్భభరాలస కాబట్టి సోమవారం నుండి, ఎస్.ఎస్.ఎల్.సి.కి ఇంగ్లీషు కూడా నేనే చెప్పాలట! ఇప్పుడే 'శ్రీముఖం' వచ్చిందిలే! నాకు ట్రాన్స్ ఫర్ ఎందుకు రాలేదా అని బుర్ర బద్దలు కొట్టుకొన్నా! ఇదుగో, ఇందుకూ! నేను పోతే, ఇంగ్లీషెవరు తీయాలి?"
ఆశ్చర్యపోయింది సత్య. నవ్వుకూడా వచ్చింది. ఏదో ఆలోచించుకొంటూ రెండు నిముషాలు మాట్లాడలేదు.
"ఆలోచించకోయ్! జుట్టు వెరిసిపోతుంది ఆలోచనలతో!" అంది నవ్వుతూ పారిజాతం.
సత్య ఆలోచన మరో దారిని పడింది.
"పారిజాతం! నా కో విషయం తెలిసింది. బహుశా నీకూ తెలిసే ఉంటుంది. అది నిజమో, కాదో! నిజం కావడానికి కూడా అవకాశమున్నది. ఆ విషయం నీతో చెబుతాను. తిట్టకు. అయితే అవునను, లేకపోతే కాదను. ఇంతకూ అడగనా?" అని అడిగింది సత్య.
"అడుగు. తెలిస్తే నీకు చెప్పడానికి అభ్యంతర మేమిటి?" పారిజాతం జవాబు.
"అనంతలక్ష్మి గర్భవతి అని మన స్టాఫ్ అంతా గుసగుసలు పోతున్నారు. అసలు ఆమె మునుపే ఎవరితో అట్టే కలిసేది కాదు! ఇప్పుడు మరీను! ఎప్పుడూ కన్నీరు కారుస్తూ ఉంటుంది. నీవూ గమనించే ఉంటావుగా? అసలు ఈ సంగతి పనిగట్టు కొని ఊరంతా టముకు కొట్టుతున్నది అనంతలక్ష్మి ప్రాణ స్నేహితురాలు కాంతమ్మ! అనంతలక్ష్మి చెల్లెలిని పిలిచి ఏమేమో వాగిస్తున్నారట. ఆ పిల్ల సంగతి మనకు తెలిసిందేగా! ముదిపేరక్క! ఏం చెప్పిందో ఏమో, ఈ కాంతమ్మ ఊరంతా అనంతలక్ష్మి మీద చెప్పుతూ తిరుగుతున్నదట!"
"అవును, సత్యా! నేనూ విన్నాను కాని, దాని కంత ప్రాముఖ్యం ఇవ్వలేదు. నువ్వింత సీరియస్ గా అడుగుతున్నావంటే, అది నిజమే అయి ఉండవచ్చు. దానికి కారకు లెవరై ఉంటారు?"
"ఏమో, పారిజాతం! 'నిజం దేవుడెరుగు, నీరు పల్లమెరుగు!' ఐదారు రోజుల కిందట అనంతలక్ష్మి తల్లి వీథిలో నిలబడి ప్రాణేశ్వరరావుగారిని తిట్టి పోసిందట- 'నా కూతుర్ని చెడగొట్టా'వని! మొన్న రాత్రి సుబ్బారావు - బొంగుతో ప్రాణేశ్వరరావుగారి తలమీద మోదాడట. వాడు కూసిన కూతలు ఇన్నీ అన్నీ కాదట. వాడి రౌడీచేష్టలకు విసుగెత్తిన ఆ వీథి వాళ్ళంతా వాడిని పోలీసుల కప్పజెప్పారట. మాస్టర్ గారు, పాపం, చాలా విచార పడుతున్నారు. రిజైన ఇచ్చి తన ఊరు వెళ్ళిపోతారట. పిల్లలతో అన్నారట."
"సత్యా! ప్రాణేశ్వరరావుగారు పుణ్యాత్ములు! నా చిన్నతనంలో ఒక కథ చదివాను. అందులో ఒకడు తన పాపాన్ని అందరికీ పంచడానికి కూతురితోనే వ్యభిచరించినట్లు నటిస్తాడు. లోకులు నిష్కారణంగా అతని మీద నింద వేస్తారు. వాడి అంతా వాడి మీద నింద మోపిన వారికి చెందుతుంది. అట్లాగే ప్రాణేశ్వరరావు గారు చేసుకొన్న పాపం అందరికీ పంచబడుతున్నది! మనుష్యుల మైన తరవాత, కాస్త వివేచనా శక్తి ఉండాలి! వయసు మళ్ళిన పెద్దమనిషి మీద అభాండం వెయ్యడానికి వీళ్ళకు బుద్దు లెట్లా ఒప్పినాయో?" కోపంగా అంది పారిజాతం.
కొంతసేపు ఇద్దరూ ఏదో ఆలోచించుకొంటూ నిశ్శబ్దంగా ఉన్నారు.
తరవాత పారిజాతం-"సత్యా! అనంతలక్ష్మి ఎటువంటిదైనా వేశ్య మాత్రం కాదు! మంచిది కాకపోవచ్చు. చపలచిత్త కావచ్చు! కాని, పొరబాటున కాలు జారి ఉంటుంది. నీవూ ఆడదానివే! నేనూ ఆడదాన్నే! మన లాంటి ఆడదాని గతి ఆలోచించు! అనంతలక్ష్మి బలహీనతలో కాలు జారినట్లుగానే, మరో బలహీనతలో ప్రాణాలు కూడా తీసుకోవచ్చు. ఏమైనా సరే! ఆమె నుండ మనం సమాచారాన్ని రాబట్టి, చేతనైనంత సహాయాన్ని చేద్దాము. రేపే ఈ విషయాన్ని నెమ్మదిగా అనంతలక్ష్మి వద్ద కదుపుదాము. 'తాటకి' నాలుగు రోజులు వేవిళ్ళ సెలవు పెట్టింది. ఇంతకంటే మంచి అవకాశం చిక్కదు మనకు!" అని అంది.
"పారిజాతం! పెండ్లయిన వారంటే నీకు ద్వేష మనుకొంటారు! ఎవరినైనా ఇట్లాగే అంటావా?" అంది నవ్వుతూ సత్య.
"అట్లా అనుకొంటే, పప్పులో కాలేశారన్న మాటే! నేను అవివాహితను కాబట్టి, వివాహితలపట్ల నాకు ద్వేష ముంటుందని అనుకొంటే, అది నా తప్పా? మా అమ్మను నేను ద్వేషిస్తున్నావా? అది కాదు సంగతి. కొంతమంది, తమకు పెండ్లయినందువల్ల మనకంటే ఏదో గొప్ప అంతస్తులో ఉన్నామనుకొంటారు. మన మంటే చౌక! అంతెందుకు? కుట్టు టీచర్ కాంతమ్మ సంగతే చూడు. మాటిమాటికీ 'మేము సంసారులం. మా కెక్కడ వీలవుతుంది!' అని అంటుంది. నేను ద్వేషించేది ఆ అహాన్ని! అది ఉన్న మనుష్యులని!"
సత్య నవ్వింది. "సరే, పారిజాతం! మనం తల పెట్టిన బృహత్కార్యం నిర్విఘ్నంగా నెరవేరాలి. ఇక నేను వెడతాను" అంటూ లేచింది.
బాగా చీకటి పడింది. పారిజాతం, సత్యవతి వాకిట్లోకి వచ్చేసరికి భద్రగిరి నాయుడుగారు ఎదురువచ్చి, "రా, అమ్మా! నిన్ను ఇంటివద్ద దించి వస్తాను" అంటూ సత్యవెంట బయలుదేరారు.
* * *
భగీరథ ప్రయత్నంమీద అనంతలక్ష్మినుండి సమాచారాన్ని రాబట్టగలిగిన పారిజాతానికి వివరాలు తెలిసేటప్పటికి ఒళ్ళు మండిపోయింది. సత్యకు సిగ్గుతో వచ్చినంత పనయింది!
