Previous Page Next Page 
మేఘమాల పేజి 14


    'అదేఁవిటి!....మీరు కాఫీ త్రాగకుండా వెళతారా?' అన్నది వెనగ్గా కాఫీగ్లాసుతో నిలబడ్డ రాజేశ్వరి.
    'ఇవ్వు!...' తన పరధ్యానానికి నవ్వుకుంటూ అన్నాడు.
    తీసుకొని అంత వేడికాఫీని రెండు గుక్కల్లో త్రాగేసి గ్లాసు క్రింద పెట్టాడు:
    'అంత హడావుడి దేనికి?'
    'స్వామితో మాటల్లోపడ్డాను...ఆలస్యమయింది!'
    చెప్పులు తొడుక్కొని బయటకు నడిచాడు.
    రాజేశ్వరి పనిలో మునిగిపోయింది.
    సత్యవతి స్నానం చేసేటందుకు బాత్ రూంలోకి వెళ్ళింది.
    -ఆమె గంటా, గంటన్నరలో భోజనంచేసి హాస్పిటల్ కు వెళుతుంది.
    
                            *    *    *

    సరిగ్గ్గా తొమ్మిదిగంటలప్పుడు త్యాగరాజు వుంటున్న అద్దె ఇంటి ముందు వో చిన్న కారు ఆగింది.
    అప్పటికి ఇంకా త్యాగరాజు చంద్రం దగ్గరనుండి ఇంటికి రాలేదు,
    అప్పుడే రాజేశ్వరి వంట పూర్తిచేసి సత్యవతికి భోజనం పెట్టింది-ఆవిడ తిని లేచి చేయి కడుక్కున్నది గూడా!
    ఇక హాస్పిటల్ కు వెళ్ళే ఉద్దేశ్యంలో చెప్పూ తొడుక్కుంటూ, తలుపుమీద వున్న వెంకటేశ్వరస్వామి ఫోటోకి కళ్ళు మూసుకునే ఒక్కక్షణం నమస్కరించుకున్నది.
    -అటువంటి సమయంలోనే రాణి లోపలికి వచ్చింది!
    'రా రాణీ!.....ప్రొద్దున్నేవచ్చావ్! ఏఁవిటి విశేషాలు?'
    రాజేశ్వరి రాణి రాకను గుర్తించి ఎదురుగా వచ్చింది ఆహ్వాన సూచకంగా-తడిచేతులను చీరె చెంగుకు తుడుచుకుంటూ.
    'శకుంతల వళ్ళంతా కాలిపోయింది!....ప్రస్తుతం హాస్పిటల్ లో వున్నది...మీకు చెబుదామని వచ్చాను!'
    'అరె!.....ఎప్పుడు?'
    'పొద్దున్నే!...వాళ్ళ పక్కింటి కుర్రవాడిద్వారా నాకు కబురందింది!.....వెంటనే నేనూ, ఆయనం మా బావగారూ వెళ్ళాం! .... గాంధీ హాస్పిటల్లో జేర్చి ఇంటికి పోతూ మీకు చెప్పి వెళ్దామని వచ్చాను!' అని గొంతు తగ్గించి. 'అన్నయ్య లేడా?' అడిగింది.
    'చంద్రం దగ్గరకు వెళ్ళారు?'
    'మరి అన్నయ్య్హతో చెప్పవద్దా!' అన్నది కొద్దిగా గుండె గుబులు గుబులు మంటుండగా.
    'సత్యవతి హాస్పిటల్ కే వెడుతున్నది...అన్నయ్యను తిప్పి పంపుతుందిలే!' అన్నది సత్యవతి వంక చూస్తూ.
    'పిలుచుకురానా మరి' అన్నది సత్యవతి.
    'నీవు అక్కడే వుండు.... ఆయన్ని పంపు!'
    సత్యవతి బయల్దేరింది.
    రాణి అన్నది! 'మరి కారులో వెళ్దామా?'    
    రాజేశ్వరి ఒక్కక్షణం గూడా ఆలస్యం చేయకుండా -
    'వద్దు....వద్దు! దగ్గరేగా వెళ్ళనీయ్!' అన్నది.
    సత్యవతి వెళ్ళిపోయింది.
    వెళుతున్న సత్యవతి మీద నుండి చూపులు మరల్చి రాణి మొఖంలోకి చూచే టప్పటికి-ఆమె మొఖం తెల్లగా పాలిపోయి వున్నది!
    రాజేశ్వరి మనస్సు కలతపడింది.
    'అదేఁవిటి అలా అయిపోయావ్?'
    'అన్నయ్యకు నామీద కోపం ఎప్పటికి తగ్గుతుంది వదినా!' అన్నది చాలా చిన్నగా గొణుగుతున్నట్లుగా- ఆమె పెదిమలు భయంతో అల్లల్లాడినయి-ఆమె కళ్ళల్లో నీరు గిర్రున తిరిగింది.
    రాజేశ్వరి ఆమెకు దగ్గరిగా వచ్చి బుజం మీద అనునయంగా చేయి వేస్తూ, 'ఛా, ఛా! భయందేనికి - నే నున్నాను గదా!' అన్నది.
    'అదే నాకు ధైర్యం .... చివరి ఆశ గూడా!' మాటలను ముద్ద ముద్దగా వుండల్లా దొర్లిస్తూ అన్నది.
    రాజేశ్వరి రాణి కళ్ళల్లోకి చూస్తూ, 'మరి మా అన్నయ్యగారిని చూపించే దెప్పుడు?' అన్నది- కళ్ళల్లో ఆశను కేంద్రీకరించుకుంటూ.
    'కారులో వున్నారు.....పరిచయం చేస్తా, పద!' అన్నది దుఃఖాన్ని తెలియని ఉత్సాహం మ్రింగివేయగా.
    'పద!' అన్నది రాజేశ్వరి ఆమెలోని మార్పును గమనిస్తూ.
    'రాణి ఇంకా పెరగాలి!' అనుకున్నది. 'రాణి చిన్నపిల్ల!'
    కారులో జయరాం స్టీరింగ్ ముందు కూర్చొని వున్నాడు.
    వెనుక సీట్లో సుందరమూర్తి కూర్చున్నాడు.
    ఇద్దరికీ, నవ్వును పెదాలమీద రుద్దు కుంటూ, 'మా వదిన....రాజేశ్వరి!' అని పరిచయం చేసింది.
    నమస్కరించింది ఇద్దరికీ రాజేశ్వరి.
    సుందరమూర్తి మందహాసంతో, 'ఒక సారి మీరూ మా బావగారూ, మా యింటికి రావాలి?' అన్నాడు.
    రాజేశ్వరి చిన్నగా నవ్వి, 'మాట అయితే ఇవ్వలేనుగాని.....రావటానికి ప్రయత్నిస్తాను!' అన్నది.
    'థాంక్స్.....మీకైనా మామీద అయిష్టిత లేనందుకు కృతజ్ఞులం!'
    'అలా అనబోకండి .... ఆయనకు మాత్రం అయిష్టత దేనికి?.....ఏదో పట్టింపు ... అదో మనస్తత్వం!' ఏదో సర్ధి చెబుతున్నట్లుగా అని, 'ఇక నేను వుంటాను, రాణీ!' ఆనంది.
    రాణి ఆమె మాటలను అర్ధం చేసుకున్నదానిలా, 'మరి వెళతాం!' అంటూ డోరు తెరిచి వెనుకసీట్లో కూర్చున్నది.
    'నమస్కారం!'
    'నమస్కారం!'
    కారు వెళ్ళిపోయింది.
    రాజేశ్వరి ఒక్కనిముషం అక్కడే నిలబడి - దూరంగా వెళ్ళిపోతున్న కారు కనబడకుండా మలుపు తిరిగేటంతవరకూ చూచి-లొపలికి వచ్చేసింది.
    తరువాత పది నిముషాల్లోనే త్యాగరాజు హాస్పిటల్ నుండి వచ్చాడు.
    వస్తూనే, 'రాజేశ్వరీ! నేను శకుంతల దగ్గరకు వెళ్ళి వస్తాను!' అన్నాడు.
    'పదండి....నేనూ వస్తాను!'
    'సరే....పద మరి!'
    ఇద్దరూ బయల్దేరారు.
    నాంపల్లి స్టేషన్ దగ్గరకు వెళ్ళి, ఆ పైన ఆర్టీసీలో సికింద్రాబాద్ స్టేషన్ కు వెళ్ళి-గాంధీ హాస్పిటల్ కు వెళ్ళేటప్పటికి పదిన్నరయింది.
    ఆసుపత్రి లోపలికి వెళ్ళబోతుంటే గేటు దగ్గరున్న గూర్కా 'ఇది టైము కాదం'టూ ఆపేశాడు!
    త్యాగరాజుకు కోపమొచ్చింది.
    ఏదో ఆ కోపంలోనే అతడిని అనబోయాడు గాని, రాజేశ్వరి చేయి పట్టుకొని పక్కకు తీసుకువెళ్ళింది.
    'మీకీ మధ్య కోపమెక్కువయింది-ఎందుకని?' అన్నది నవ్వి.
    'లేకపోతే-?' అన్నాడు విసుగ్గా?
    'మీరు కోపగించుకున్నంత మాత్రాన లోపలికి వెళ్ళగలుగుతారా? అతడు అతని విధిని నిర్వర్తిస్తున్నాడు!' అన్నది చాలా సౌమ్యంగా ముందు ఏం చేయాలో ఆలోచించండి!'
    'ఏంచేద్దాం మరి?'
    'ఆర్. ఎమ్.వోని కలుసుకొని పర్మిషన్ తీసుకోండి!' అన్నది.
    ఆ పన్లు పూర్తి చేసుకొని శకుంతల బెడ్ దగ్గరకు వెళ్ళేటప్పటికి వో పావుగంట పట్టింది.
    శకుంతల మెడవరకూ దుప్పటి కప్పుకొని, కప్పు వంక కళ్ళప్పగించి దీనంగా చూస్తూ పడుకొని వున్నది!
    ఆమె పక్కన, దుప్పటిమీద చేయివేసి భయం భయంగా, కూతురు మొఖంలోకి చూస్తూ వో స్టూలుమీద కూర్చొని వున్నది ఆమె తల్లి.
    త్యాగరాజును చూస్తూనే ఆమె కన్నీరు కారుస్తూ వెక్కి వెక్కి ఏడ్వసాగింది.
    'భయపడకండి....భయంలేదు!' అన్నాడు చిన్నగా త్యాగరాజు.
    శకుంతల మొఖం దగ్గరిగా నిల్చున్నాడు.
    శకుంతల తదేకంగా త్యాగరాజు మొఖం లోకి చూస్తూ వుండిపోయింది.
    'ఏం శకుంతలా! ఎలా వున్నది?'
    ఆమె మాట్లాడలేదు.
    శకుంతల తలవైపుగా రాజేశ్వరి వచ్చి నిలబడింది.
    'దేవుడు నాకు సరియైన శిక్షే విధించాడు!'
    'శిక్ష దేనికి?'
    'నా అహం అణిచేందుకు!'
    త్యాగరాజు ఆమె మొఖంలోకి చూస్తున్నాడు.
    'నీకు అహం వున్నదని ఎవరన్నారు?' రాజేశ్వరి అన్నది.
    'నేనే చెప్పుకున్నాను!' ఎక్కువ వచ్చేలా ఏడ్వసాగింది. 'నాకు తగిన శిక్ష విధించాడు-ఏ అందాన్నైతే చూచుకొని విర్రవీగానో-దాన్ని కాస్తా నానుండి లాక్కున్నాడు-నా గర్వమణిగిపోయేలా చేశాడు!'
    కప్పుకున్న దుప్పటిలో ఎక్కడెక్కడ కాలిందో అతడికయితే తెలియదుగాని- మొఖంమీద గూడా, ఎడమవైపు చెంప మీద, గడ్డంక్రింద కాలినట్లుగా పెద్ద    పెద్ద మచ్చలు కనపడుతున్నాయి-దాని మీద ఏదో నీలిరంగుమందు వ్రాసి వున్నది.
    'ఛా! తప్పు శకుంతలా-అలా బాధపడగూడదు!'
    త్యాగరాజు అనునయంగా పలికాడు.
    రాజేశ్వరి ఆమె తలమీద చేయివేసి మృదువుగా నిమరసాగింది.
    'అనవసరంగా లేనిపోని ఆలోచనలతో మనస్సు పాడుచేసుకోబోకు శకుంతలా!' అన్నది.
    'లేదక్కా! నే చెప్పేది నిజం!' అన్నది దృఢంగా.
    'ఎలా జరిగిందని అసలు?' అన్నది ఆమె మనస్సు మరలుస్తూ.
    'స్టౌమీద మసలుతున్న నీళ్ళను స్నానం చేసేందుకుగాను దింపబోయాను-స్టౌబోర్లాపడి ఒక్కారి భగ్గుమన్నది!'
    'అరె!'
    నిట్టూర్పు విడిచింది రాజేశ్వరి.
    'దెబ్బమీద దెబ్బ.....వాడు పోయి మూడు నెలలయినా కాలేదు.....ఈ ఘోరం...మా యింటినీ, నన్ను ఏదో శనిపట్టకు పీడిస్తోంది!.....ఆమెతల్లి ఏడుస్తూ అన్నది.
    'ఊరుకోండి.....ఊరుకోండి!' అన్నాడు పెద్దవారు మీరే ఇంతగా బెంబేలు పడిపోతే....ఇక శకుంతలకు ఎవరు ధైర్యం చెప్పగలరు....అన్నీ సర్దుకుంటాయి త్వరలోనే!' అన్నాడు త్యాగరాజు.
    రాజేశ్వరీ పక్కబెడ్ దగ్గరవున్న ఖాళీ స్టూలునుతెచ్చి త్యాగరాజుకు వేసింది.
    అతడు కూర్చున్నాడు.
    'వంటిమీద గూడా బాగా కాలిందా?' అడిగాడు శకుంతల మొఖంలోకి చూస్తూ.
    'అవున'న్నట్లుగా తల ఊపింది.
    'ఎన్నాళ్ళు ఉండవల్సి వస్తుందన్నారు ఆసుపత్రిలో!'
    'ఏఁవో అడగలేదు....అయినా ముందు వున్నదే కష్టం....ఎలా భరించగలనో ఈ బాధను నేను!' తిరిగి కళ్ళవెంట నీరు గిర్రున తిరిగింది.
    త్యాగరాజు జాలిగా నవ్వుతూ 'నిన్ను ఎంతో ధైర్యస్థురాలిగా ఊహించుకున్నాను....కాని నీవు చాలా భయస్థురాలివి! బలహీనురాలివి గూడా!' అన్నాడు.
    'మీరన్నట్లుగా నేను స్త్రీనే గదా?' అన్నది నవ్వి.
    త్యాగరాజు నవ్వాడు.
    'అయినా-నీవు అందరిలాంటి స్త్రీవి కాదు, అవునా?' అన్నాడు కవ్వింపుగా.
    'ఆ విషయం నాకు తెలియదు!' అన్నది చాలా తేలిగ్గా అతడి మాటలను తీసుకుంటూ.    
    రాజేశ్వరి కల్పించుకుంటూ 'త్యాగరాజుగారూ! మీరు వాదించుకోవటానికి ఇదేసమయం దొరికిందా?' అన్నది కాస్త నవ్వి.
    'అవనీయ్ అక్కా! ఆయనకు నామీద ఆ హక్కు వున్నది! .... ఇంకా ఎన్నన్నా గూడా ఆయన్ని నేనన్న వాటితో పోలిస్తే చాలా తక్కువే!'
    'శకుంతలా!' ఆమె కంఠస్వరానికి విచాలితుడయి అన్నాడు.
    కంఠమూ, మొఖమూగూడా చాలా గంభీరంగా మారిపోయినయి.
    రాజేశ్వరి ఫక్కున నవ్వింది-ఆకస్మాత్తుగా మారిన ఆ బరువైన వాతావరణం మీద తేలికదనాన్ని తెల్లని వెల్లలా వేస్తూ.
    'చూడు శకుంతలా! ఈ మొగవాళ్ళు వున్న హక్కులతోటే మన ప్రాణాల్ని కొరుక్కు తింటున్నారు ... ఇక మరిన్ని ఇచ్చాఁవో మనకు పుట్టగతులే వుండవు!    
    రాజేశ్వరి మాటలకు శకుంతల తేలిగ్గా నవ్వింది.
    -అలా నవ్విన ఆమె ఆ క్షణంలో విరిగిన వీనస్ లా కనబడుతోంది!    
    రెండుక్షణాలు తటపటాయించి త్యాగరాజు 'ఒకనాటి నామీద ద్వేషానికి కారణం తెలుసుకోవాలను కుంటున్నాను శకుంతలా!' అన్నాడు.
    'నా తెలివితక్కువ!' అన్నది క్షణం కూడా ఆలస్యం చేయకుండానే.
    రాజేశ్వరి కల్పించుకుంటూ, 'ఇంత టితో మీ వాదనలు ఆపరా?' అన్నది- కాస్త ఇబ్బందిగా అటూయిటూ కదుల్తూ.
    అంతకు క్రితమే శకుంతల తల్లి వరండాలోకివెళ్ళి ఒకపక్కగా కూర్చున్నది.    
    'కాదు ఏదో బలమైన కారణం వుండి వుండాలి!
    'అదేదో నేను చెప్పగా మీరు చాటుగా విన్నారు!' అన్నది నవ్వి శకుంతల-ఆమె మొఖం సిగ్గుతో ఎర్రబడింది!
    'నా ఉద్దేశ్యం అంతకంటేగూడా బలమైనదేదో వుండివుండాలని!' అన్నాడు ఒత్తి పలుకుతూ - ఆమె సమాధానం కోసరం పట్టుపడుతున్నట్లుగా.
    'ఏఁవున్నది!.....మీరేదో మాకు సహాయం చేసేందుకు నడుంగట్టారు ... ఈనాడు ఎవరైనా ప్రజాసేవ చేస్తున్నామంటే ఎంతమంది నమ్ముతారు .... ఉఁహూఁ.....ఎవరూ నమ్మరు!.... ఏం లాభంలేందే ఆ పని చేస్తున్నాడో అనుకుంటారు !..... అలాగే మీరు మాకు చేస్తున్న సహాయాన్ని అందరిలాగానే నేనూ అర్ధం చేసుకున్నాను-ఇందులో మీ కేదో కాంక్ష వున్నదని-ఆ కాంక్ష దేని మీదై వుంటుందా అని తీక్షణంగా ఆలోచిస్తే నాకు నేనే కనబడ్డాను - అప్పుడు నాలాంటి స్త్రీకి...అందునా అందాన్ని చూచుకొని విర్రవీగే నాలాంటిదానికి- మీమీద వెగటు భావం ఏర్పడటానికి అంతకు మించిన కారణం ఇంకేం కావాలి?' అన్నది చాలా చిన్నగా- ఏదో తప్పుచేసి క్షమాపణ కోరుకుంటున్న దానిలా.
    ఆమె కళ్ళు కావాలని మూసుకున్నది.
    శకుంతల పక్కమీద పక్కగా జారవిడిచిన చేతిని రాజేశ్వరి పట్టుకొని గట్టిగా నొక్కింది.
    వింతగా శకుంతల రాజేశ్వరి మొఖం లోకి చూచింది.
    రాజేశ్వరి చూపులు వెన్నెలలా- చల్లగా, మంచులా - ఆమెమీద కురుస్తున్నయి!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS