Previous Page Next Page 
మేఘమాల పేజి 15


    
                                   8

    శకుంతల గడచిన సంఘటనలను పునరావృతం చేసుకుంటూ దీనంగా శూన్యంలోకి చూస్తోంది.
    నర్సువచ్చి, 'ఒక్క నిముషం' ...అంటూనే శకుంతలను నోరు తెరవమని కాస్తమందు నోట్లో పోసి వెళ్ళిపోయింది.
    అప్పటికి టైం పదకొండు గంటల పైన అరగంటయింది.
    శకుంతలే అన్నది! 'మరి మీ భోజనాలు? ఎంతసేపు ఇలా నాతో మాట్లాడుతూ కూర్చుంటారు?' అని.
    'నీకూ, అమ్మకూ భోజనం?' రాజేశ్వరి అడిగింది.
    శకుంతల ఒక్కక్షణం తటపటాయించి, 'రాణి పంపుతానన్నది!' అన్నది చిన్నగా.
    త్యాగరాజు ఆ మాటలను వినీ విననట్లు ఊరుకున్నాడు.
    లేచి నిలబడుతూ, 'ఇక మేం వెళతాం .....వీలుంటే సాయంత్రం నేను వస్తాను!' అన్నాడు.
    శకుంతల 'సరే' నన్నట్లుగా తల ఊపింది.
    'మరొక్కమాట!.....మీ కిష్టంలేని పనిని మరొకటిగూడా చేశాను, నేను!' అన్నది శకుంతల తలఎత్తి త్యాగరాజు కళ్ళల్లోకి చూస్తూ.
    'ఏఁవిటది?'
    'జయరాంగారి దగ్గర ఉద్యోగంలో జేరాను!'
    త్యాగరాజు బయిటకు వచ్చేశాడు - ఆ విషయం మీద మాట్లాడటం ఇష్టం లేదన్నట్లుగా!
    రాజేశ్వరి శకుంతలకు చెప్పేసి బయిటకు వచ్చింది.
    హైద్రాబాదులో ఆ రోజు ఎండ విపరీతంగా మండిపోతోంది. పన్నెండు గంట లయిందేఁవో రోడ్డుమీద జనం పల్చగా వున్నారు.
    ఇద్దరూ స్టేషన్ ముందుకు వచ్చారు. బయిల్దేరేందుకు సిద్ధంగా వున్న ఎనిమిదో నెంబరు బస్సులో ఎక్కి కూర్చున్నారు.
    నాంపల్లి స్టేషన్ ముందు దిగి రిక్షా కోసరం చూస్తుంటే స్వామి కనబడ్డాడు.
    'మీ యింటినుండే వస్తున్నాను సార్!'
    'అయితే మళ్ళీ వెళ్దాం పద ... నీకు వేరే పనేం లేదుగదా! ..... రాజేశ్వరీ! స్వామిగూడా వున్నాడుగదా, తడుద్దామా?' అన్నాడు.
    'నడవటం ఎందుకు, సార్!....మీరు ముందు రిక్షాలో వెళ్ళండి. నేను వెనకాల వస్తాను!'
    'కాదులే, నడుద్దాం పద.......ఎంతదూరమున్నదని?    
    తరువాత అరగంటకు వంటయింటిలో త్యాగరాజు, రాజేశ్వరి భోజనం చేస్తుండగా స్వామి హాల్లో గడప ఇవతలగా కూర్చున్నాడు.
    'అది గాదోయ్! నీ కన్నెందుకు అలా అయింది?' అడిగాడు త్యాగరాజు ఉచ్చుకతతో.
    స్వామి మాట్లాడలేదు.
    'నిన్నేనోయ్!'
    'అదో కధసార్!'
    'ఏఁవిటది?' త్యాగరాజులో ఆ విషయం తెలుసుకోవాలనే కోరిక మరింతగా బలపడింది.    
    '-ఇంత చిన్న వయస్సులోనే అలా అయిపోవాలా?'
    'చిన్నప్పటి నుండిగూడా నాకు చదువుకోవాలని వుండేది, సార్!'
    'మీ ఊళ్ళో బడిలేదా?'
    'ఉండకేం వున్నది!'
    'మరి!'
    'నన్ను మావాళ్ళు వెళ్ళనిచ్చే వాళ్ళుగాదు!'
    'ఎందుకని?'
    'మా నాన్న కూలీపని చేసేవాడు......మా అమ్మా కూలీపని చేసేది!'
    'ఇంకేం?'
    '-నేనూ చేస్తే ఇంకాస్త డబ్బు లొస్తయ్యని వాళ్ళ ఆశ!'
    'దేనికిట?'    
    'ఆశ సార్!' వెగటుగా అన్నాడు ఆమాట.
    త్యాగరాజు మాట్లాడలేదు.
    'నేను ఇంట్లో చెప్పకుండా స్కూలుకి వెళుతుండే వాడిని.....కూలీకి తీసుకు వెళుతుంటే దారిలో దారిమార్చి పారిపోతుండే వాడిని!' అన్నాడు నవ్వి స్వామి.
    వింతగా చూడసాగాడు స్వామి మొఖం లోకి త్యాగరాజు.    
    'మా నాన్న నన్ను కొట్టేవాడు ... ఇనుపతీగెలు కాలేసి వాతలు పెట్టేవాడు....కూలీ తీసుకురాకపోతే అన్నం పెట్టననే వాడు!'
    త్యాగరాజు బొమ్మే అయ్యాడు.
    '-ఒకసారి మూడురోజులు అన్నంతినకుండా గడిపాను, సార్!'
    'నిజంగా?' జాలిగా చూస్తూ అన్నాడు.
    '-అప్పటికీ నా పట్టు విడవలేదు....నేను కూలీకి వెళ్ళలేదు .... అందుకని వోనాడు...'
    'ఒకనాడు-?' చేతిలోముద్ద నోట్లో పెట్టుకోబోతూ త్యాగరాజు అలాగే స్వామి ముఖంలోకి చూస్తూ ఆగిపోయాడు.
    'ఏఁవైంది?'
    '.....రాత్రి చూడు క్రింద గొంగళి కప్పుకొని ముడుచుకు పడుకున్నాను .... ఇంకా సరిగ్గా నిద్రపట్టలేదు ... ఇంత లోనే ఎవరో నన్ను కదలకుండా, గట్టిగా పట్టుకున్నారు.....వో కన్ను రెప్ప తెరిచి...' అతడు చెప్పలేక పోతున్నట్లుగా ఆగిపోయాడు.
    అతడి కళ్ళు చెమ్మగిల్లినయి.
    ఎందు చేతులతో మొఖం కప్పుకున్నాడు.
    '.....కంట్లో జిల్లేడు పాలు పోశారు సార్!'    
    అతడు భోరున ఏడ్వసాగాడు.
    '-రేపటి నుండి పనికి వెళ్ళకపోతే రెండో కంట్లోగూడా పోస్తానని బెదిరించాడు, సార్!'
    త్యాగరాజుకు అన్నం సయించలేదు....కంచంలోనే చేయి కడుక్కోసాగాడు.
    రాజేశ్వరి చేయి పట్టుకు వారించ బోయిందిగాని ఆగలేదు.
    ...నాలుగురోజులు గుండెలు బిగపట్టుకొని పనిలోకి వెళ్ళాను ...తరువాత పని చేయలేక, బ్రతికుంటే ఎప్పుడైనా, ఎక్కడైనా చదువుకోవచ్చనే ఆశతో పారిపోయి ఇక్కడకు వచ్చాను!'
    'స్వామీ!' వేదనాపూరిత కంఠంతో అన్నాడు త్యాగరాజు అతడికి ఎదురుగ్గా నిలబడి!

                                                  *    *    *

    మధ్యాహ్నం మూడుగంటలయింది.
    చాపమీద త్యాగరాజు పడుకొని వున్నాడు.
    రాజేశ్వరి కొద్ది దూరంలో మరో చాప మీద కూర్చొని వున్నది.
    తలుపు దగ్గిరగా మూసివున్నది.
    'నాకు భయంగా వున్నది!' అన్నది రాజేశ్వరి చాలా చిన్నగా- తలవంచుకొని, చేత్తో నేలమీద పిచ్చిగీతలు గీస్తూ.    
    'దేనికి?'
    '-ఈ మనుష్యులను చూస్తుంటే!'
    'ఏం చేస్తారు వాళ్ళు మనల్ని?'
    'మానసికంగా మనని హత్య చేయవచ్చు!'
    'ఎందుకు-దానివలన వాళ్ళు పొందే లాభం?'
    'లాభమేఁవున్నది!- లోకంతీరు అది!'
    '-నా కర్ధం కావడం లేదు!'
    రాజేశ్వరికీ అంతకంటే ఎలాచెప్పాలో అర్ధంకాలేదు.    
    'అసలు ఏం జరిగింది?' అన్నాడు త్యాగరాజు విచిత్రంగా రాజేశ్వరి మొఖం లోకి చూస్తూ, 'నీవు ఇలారా....దగ్గిరగా కూర్చో!'    
    రాజేశ్వరి కదల్లేదు - కనీసం తల గూడా ఎత్తలేదు. ఏదో ఆలోచనల లోతులలో కూరుకుపోయి లేవలేక పోతున్నట్లుగా దిగులుగా కూర్చన్నది.
    'నా గురించి మీరేఁవైనా ఆలోచించారా?'
    'ఏఁవి ఆలోచించాలో చెప్పు!' అన్నాడు నవ్వి.    
    'నేను ఎన్నాళ్ళయింది ఇక్కడకు వచ్చి?'
    'ఇంకా ఎన్నాళ్ళు వుండాలి ఇక్కడ?- అక్కడ మా అమ్మ, చెల్లెలు ఎంతగా ఆదుర్దా పడుతున్నారో గదా?'
    'ఆఁ ... మర్చిపోయాను! నీవు ఇంకా ఇంటికి ఉత్తరం వ్రాయలేదా?' అడిగాడు ఆదుర్దాగా త్యాగరాజు.
    నవ్వింది రాజేశ్వరి.
    'మీరు అమాయకులా - లేక కావాలనా...?'
    అర్ధోక్తిలో ఆగిపోయింది.
    త్యాగరాజు కలవరపడ్డాడు.
    'నీ వంటున్న దేఁవిటి?' అన్నాడు లేచి కూర్చోబోతూ త్యాగరాజు.
    'మీరు పడుకోండి-ఆవేశపడవద్దు!' అన్నది తాపీగా రాజేశ్వరి.
    ఒక్క క్షణమాగి, 'డొంక తిరుగుడుగా వద్దు-సూటిగా చెప్పు రాజేశ్వరీ!' అన్నాడు.
    '-ఇంటి యజమానురాలికి అనుమానంగా వున్నది!-మనమేదో లేచివచ్సిన బాపతులా వున్నామని!' ఫక్కున నవ్వింది - భారమైన వాతావరణంలో మంచుముక్కలు వెదజల్లు తున్నట్లుగా.
    త్యాగరాజు మొఖం నల్లగా మాడిపోయింది.
    తిరిగి అరగంటవరకూ అతడి నోటివెంట మాట పెగల్లేదు.
    మొఖం మాడ్చుకొని దుప్పటి కప్పుకొని-ఈ ప్రపంచాన్ని, దానిలోని వెలుగుణి చూడలేక పోతున్నట్లుగా - పడుకున్నాడు.
    రాజేశ్వరి పదినిముషాలు అలా చూస్తూ కూర్చొని, లేచివెళ్ళి కాఫీ తయారు చేసింది.
    గాజుగ్లాసులో పోసి తీసుకు వస్తూ, 'లేవండి ... కాఫీ త్రాగుదురు గాని!' అన్నది గ్లాసును అతడికి దగ్గరగా క్రింద పెడుతూ.
    అతడు ఆమెమాటలు వింటూనే కప్పుకున్న దుప్పటిని తొలగిస్తూ, 'దీనికి నేనొకటి ఆలోచించాను, రాజేశ్వరీ!' అన్నాడు ఆవేశంగా.
    'ముందు కాఫీ త్రాగండి! దాన్ని గురించి తరువాత ఆలోచిద్దాం!' అన్నది తాపీగా.
    'కాదు! ఆ సంగతే ముందు తేలాలి- రేపే నిన్ను వివాహం చేసుకుంటాను!'
    ఆమె ఉద్వేగాన్ని మనస్సులో నే అణుచుకుంటూ, 'దానివలన పడిన అపవాదు తొలిగిపోతుందా?' అన్నది- అతడి మొఖంలోకి కన్నార్పకుండా చూస్తూ.
    'అసలెవరన్నారా మాట?'
    'ఇంటి యజమానురాలని చెప్పాను గదా?'
    'ఆవిడ మాటలా నీవు చెప్పేది! భర్తకు నలభై అయిదు సంవత్సరాలు దాటినయి-సన్నగా, పుల్లలా, నడుం వంగి, జుట్టు నెరసి-రోడ్డు మీద పోతూ తలగూడా ఎత్తని ఆ అమాయకుణ్ణి పట్టుకొనే అభాండాలు వేస్తుంది-అలాంటిదానికి మనని అనటం ఒక లెక్కా?' అన్నాడు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ,


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS