Previous Page Next Page 
మేఘమాల పేజి 13


                                   7

    ఆ కొత్తయింట్లో రాత్రి పదిగంట లప్పుడు - కొత్తగా కొన్న చాపమీద పరిచిన బెడ్డింగ్ మీద త్యాగరాజు పడుకొని వున్నాడు.
    రాజేశ్వరి అతడికెదురుగా మరో చాప మీద కూర్చొని వున్నది.
    మానసికంగా ఎంతగానో అలసిపోయిన సత్యవతి దూరంగా చాపమీద పడుకొని అప్పుడే నిద్రలో మునిగిపోయింది.
    ఆపూట రాజేశ్వరి ఎంతగా వద్దన్నా వినకుండా త్యాగరాజు వాళ్ళిద్దరినీ గూడా తీసుకొని హోటల్ కు వెళ్ళి భోంచేసి వచ్చాడు.
    సలు ఇంటిదగ్గరే వంట చేస్తానన్నది రాజేశ్వరి.
    సామాన్లకోసరం బజారులో తిరగటంతో అలసిన రాజేశ్వరిని మరింత ఇబ్బంది పెట్టదలుచుకోలేదు త్యాగరాజు.
    'నిద్ర రావటంలేదా, రాజేశ్వరీ?' త్యాగరాజు అడిగాడు.
    ఆమె ఆలోచనలు పుటుక్కున తెగినట్లుగా ఉలిక్కిపడి, 'ఉఁహూఁ...!' అన్నది.
    ఎత్తైన పొడువుపాటి జడను బుజం మీదగా ముందుకు లాక్కొని కురులను అల్లుకోసాగింది.
    'మౌనంగా వుండిపోయినావ్?'
    'ఏం వున్నాయి మాట్లాడటానికి?'
    'ఏఁవీలేవా?' అన్నాడు తలెత్తి. పక్కకు ఒత్తిగిల్లి పడుకొని రాజేశ్వరి మొఖంలోకి చూడసాగాడు. 'నీ వెందుకో ఈ రోజు చాలా ముభావంగా వున్నావ్ రాజేశ్వరీ!' అన్నాడు.
    గుడ్డిదీపపు వెలుగులో రాజేశ్వరి త్యాగరాజు కళ్ళల్లోకి దేనికోసరమో వెతుక్కో సాగింది.
    'నీ నిర్ణయం గురించిగాని తిరిగి ఆలోచించుకోవడం లేదుగదా?'
    'దేనికి?'
    మరి-ఉద్యోగమూ, ఊరు, అమ్మనీ, చెల్లెల్నీ అన్నీ వదులుకొని వస్తివి....ఎన్నాళ్ళుంటావ్ ఇలా ఇక్కడ?'
    ఆమె ఒక్క క్షణమాగి, 'అవన్నీనా ముఖ్యం నాకు-మీ రెక్కడుంటే అక్కడే నా జీవితం!' అన్నది.
    ఆమె ఓ దీర్ఘ నిశ్వాసం విడిచింది.
    'నీ నిర్ణయం మారదా!'
    'మార్చుకోవాల్సిన అవసరం ఏఁవైనా వున్నదా?'
    'నేను మోసగాన్ని కాని నీకు నమ్మక మేఁవిటి?'
    'మీకేం లభిస్తుందని నన్ను మోసగిస్తారు?' హేలగా నవ్వింది.
    ఆమె కూర్చున్న చాపమీదకు త్యాగరాజు చేయి జాపాడు.
    ఆమె అతడి అరచేతిలో తన చూపుడు వేలుపెట్టి పిచ్చిగీతలు గీయసాగింది.
    'మనం యిల్లు చూడటానికి వచ్చినప్పుడు యింటి యజమానురాలు ఏఁవన్నదో మీకు గుర్తున్నదా?'
    'ఎందుకు లేదు! - అప్పటిబట్టే నీ ఈ ముభావనగూడా - నిన్ను ఆ ప్రశ్న ఎంతగా కలచివేసిందో నాకు తెలుసు రాజేశ్వరీ!' అన్నాడు. 'దానికి నేను క్షమాపణలు చెప్పుకోక తప్పదుగూడా!' అన్నాడు తిరిగి పశ్చాత్తాప కంఠంతో.
    ఆమె అతడి కంఠానికి విచలిత అయి, బెదురు బెదురుగా అతడి కళ్ళల్లోకి చూస్తూ, 'ఆమె మాటలకు మీరు క్షమాపణలు చెప్పుకోవటం దేనికి?' అన్నది.
    'నా వలననేగదా నీ వవమానం పొంగింది-మరి నేనుగాదా చెప్పవలసింది?'
    'అవమానమా?' కళ్ళు చికిలించి చూస్తూ వినబడీ వినబడకుండా గొణిగింది - గుండె ముందుకు ఉవ్వెత్తుగా లేవగా.
    ఆమె అరచేతిని అతడి అరచేతిలో పెట్టింది.
    ఆమె ప్రశ్నకు అతడికి వెంటనే సమాధానం దొరకలేదు.
    ఏదో చెప్పబోయాడు. వాడు పెగల్లేదు. హృదయం అడ్డుపడింది. నాలిక మడతపడింది.
    చటుక్కున ఆమె అరచేతిని తన చేతిలో బిగించివేసాడు.
    -ఆమె చేతినరాలు చిట్లి పోయేలా నొక్కాడు అతడికి ఆయాస మొచ్చింది.
    'రాజేశ్వరీ!' ... అన్నాడు భరింపలేని వేదనతో.
    ఇంకేదో చెప్పబోయాడు.
    కాని,
    రాజేశ్వరి అక్కడలేదు.
    అప్పటికే చేయి విడిపించుకొనివెళ్ళి, సత్యవతికి పక్కగా తనకోసరంగాను వేసుకున్న పక్కమీద పడుకున్నది!

                              *    *    *

    గూర్కాగాబోలు 'టకటకా' రోడ్డుమీద కర్రతో కొట్టుకుంటూ వెళుతున్నాడు.
    పదకొండు దాటివుండవచ్చు!
    కొత్త ప్రదేశమేమో త్యాగరాజుకు నిద్రపట్టలేదు.
    ఒక్కసారి లేచి నిలబడి కిటికీలోంచి మంచు కురిపిస్తున్న ఆకాశంలోకి మత్తు మత్తుగా తడిసిపోతున్న రోడ్డుమీదకి చూచి తిరిగివచ్చి బెడ్డింగ్ మీద పడుకొని దుప్పటి బుజాలవరకూ కప్పుకున్నాడు.
    చంద్రానికి తగ్గుతుందా?
    ఆ అర్ధరాత్రి నిశ్శబ్ద వాతావరణంలో వినేవారి గుండెలు కలుక్కుమనేలా, అతడి నుండి వెలువడిన ఓ వేడి నిట్టూర్పు ఆ పరిసరాలనంతా ఆవరించుకు పోయింది.
    -రేపు సత్యవతి వంటరిదయితే! ఓ భయంకరమైన ప్రశ్న!    
    పుట్టింటివారిని ఎగర్తించి, పారిపోయి భర్తతో వచ్చేసింది!
    -తిరిగివారు ఆమెను ఆదరిస్తారా?
    ఎందుకు ఆదరిస్తారు?
    అత్తగారూ-?    
    హూఁ.... వారు మాత్రం....
    కొడుకును బుట్టలో వేసుకొని, వారికి గాకుండా చేసినందుకుగానూ తరిమి కొడతారు!
    'భగవంతుడా! చంద్రం జీవితం కోసరం కాకపోయినా, సత్యవతికోసరమైనా సంద్రాన్ని బ్రతికించు!'
    ఇంటి యజమానుల తలుపు ఎవరో తడుతున్నారు.
    -ఓ రెండు నిముషాల తరువాత లోపలనుండి భయంకరమైన కంఠం వినబడింది.
    'తీయను! తీయను! .... ఎక్కన్నించి వచ్చారో అక్కడికే వెళ్ళి తెల్లవార్లూ గడపండి!....మీకు భార్య లేదు!  ఇల్లు లేదు!...... ఫోండి!......ఫోండి!'
    మధ్య చెక్కకూర్పిడవ్వటంతో ఆమె మాటలు స్పష్టంగా వినబడుతున్నాయి.
    ఆమె మాటలు ఆగిన కొన్ని క్షణాల తరువాత వాకిట్లోనుండి వో మొగకంఠం, 'తీయవే తలుపు ముందు.....ఎవరన్నా వింటే నవ్విపోతారు!' దీనంగా వినబడింది.
    'ఎవరన్నా వింటే నవ్వరు!...... ఇంత పేడకళాపి మీ మొఖాన జల్లుతారు!..... తెలిసిందా ?' అంటూనే పెద్ద మ్రోత అయ్యేలా తలుపు బార్లా తెరిచింది.
    -ఆ మ్రోతకూ, ఆమె వాగ్దాటికీ వాళ్ళ నాలుగు సంవత్సరాల పిల్లవాడు భూమ్యాకాశాలు ఏకమయ్యేలా నోరుతెరిచి ఏడుపు మొదలుపెట్టాడు.
    సత్యవతి చికాగ్గా లేచింది: 'ఏఁవ యింది?'
    'ఏఁవో!' పెదిమ విరిచి గూడ లెగరేశాడు త్యాగరాజు ఆ గుడ్డిచీకటిలో.
    'అదేఁవిటి .... ఇంకా మీరు నిద్రపోలేదా?'
    'లేదు!'
    'టైం ఎంతయింది?'
    'పదకొండు దాటి వుండవచ్చు!'
    తిరిగి యింటి యజమానురాలి కంఠం ఇంతలోనే వినబడింది-
    'ఇదుగో .... మీ కిదే ఆఖరిసారి చెబుతున్నాను .... ఇంకెప్పుడైనా ఇలా ఆలశ్యంగా వచ్చారంటే నేను సహించేది లేదు ... అడ్డమైన కొంపలూ తిరిగి అర్ధరాత్రప్పుడు వేంచేస్తే మీకు వండివార్చేందుకు నేనేం మీరు ఉంచుకున్న దాన్ని కాదు ..... తెలిసిందా!' గయ్ న కేక లేస్తోంది.
    ఆయన ఏదో చిన్నగా సర్ది చెప్ప ప్రయత్నిస్తున్నాడు.
    'నేనేం చిన్నపిల్లని గాదు!..... అర్ధరాత్రి దాకా ఆఫీసులో పనున్నదంటే నమ్మేందుకు.... మీ ఠోకరాల సంగతి ఈ ఇరవయి సంవత్శరాల జీవితంలో నాకు కొత్తా?' ఇంకా అరుస్తూనే వున్నది - అంతేగాదు, ఆమె వాలకం చూస్తే పడుకొని దుప్పటిగూడా బిగించి నట్లున్న దల్లే వున్నదిగూడా!
    .... వంటయింట్లో కంచాల చప్పుడవుతోంది!
    'భగవాన్!'

                               *    *    *

    సరిగ్గా ఆ కొత్తఇంట్లో జేరిన మూడవ రోజున - ఉదయం ఏడుగంటలప్పుడు స్వామి వచ్చాడు త్యాగరాజు దగ్గరకు.
    వస్తూనే నమస్కరించి నిలబడ్డాడు:
    'చెప్పు!' త్యాగరాజు దీక్షగా అతడి మొఖంలోకి చూస్తూ అన్నాడు.
    'ఒక సహాయం చేయాలి సార్!' సిగ్గు పడుతున్నట్లుగా తలవంచుకొని అన్నాడు స్వామి.
    'ఏఁవిటది?'
    'రోజూ మీకు తీరికున్నప్పుడు కాస్త నాకు చదువు చెప్పాలి సార్.....!' నాన్చుతూ, 'నేను డబ్బులిచ్చి ప్రైవేటు చెప్పించుకో  లేను సార్ .... క్షమించండి సార్ ఇబ్బంది కలిగిస్తే!' అన్నాడు.
    త్యాగరాజు తేలిగ్గా నవ్వాడు.
    'భలే వాడివోయ్.....నేను చెబుతాలే .... డబ్బులేమీ ఇవ్వనవసరం లేదు!'
    అతడి హృదయం సంతోషంతో నిండగా, వెళ్ళటానికి ఉద్యుక్తుడవ్వుతూ 'మధ్యాహ్నం వస్తాను సార్!' అన్నాడు.
    'మంచిది....నీ యిష్టం.....నీ కెప్పుడు వీలుంటే అప్పుడే .... నేను లేకపోయినా ఈ అమ్మగారైనా చెబుతుంది!' అన్నాడు అప్పుడే ఆ గదిలోకి వచ్చిన రాజేశ్వరిని చూపిస్తూ.
    రాజేశ్వరి అన్నది: 'ఏఁవిటది?"
    'స్వామికి చదువు చెప్పాలిట! ..... అన్నాడు నవ్వి త్యాగరాజు.
    'దానికేం.....అలాగే!'
    స్వామి వెళ్ళిపోయాడు.
    అతడు వెళ్ళినవైపే తదేకంగా చూస్తూ, చాలాసేపు - అతడిని, అతడి చదువుని, అతడి పువ్వేసిన కంటినీ గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు త్యాగరాజు.
    అలా ఆలోచిస్తున్నప్పుడు అతడి మొఖంలో తృప్తి, విచారం, దిగులు, జాలి ఒకటి తరువాత ఒకటి అతడిని చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేసినయి.
    'స్వామికి చదువు చెప్పాలి-అతడిలోని ఆసక్తిని ప్రోత్సహించి, అతడి కోరికను నెరవేర్చాలి! అది ఒక ధ్యేయంగా పెట్టుకోవాలి గూడా!' అనుకున్నాడు.
    రాజేశ్వరి ఫ్లాస్కో తీసుకువచ్చి త్యాగరాజుకు దగ్గిరగా పెడుతూ, 'ఇక మీదే ఆలస్యం!' అన్నది.
    త్యాగరాజు లేచి త్వరత్వరగా గుడ్డలు మార్చుకున్నాడు.
    'ఈరోజున ఆలస్యమయిందల్లే వున్నది "వాడికి ఆకలవుతున్నదెఁవో ... నేను రిక్షాలో వెడతాలే!' అంటూ ఫ్లాస్కో తీసుకొని బయల్దేరాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS