Previous Page Next Page 
స్వాతి జల్లు పేజి 13

 

    "చూడు ఆరూ! నేను నిన్ను అన్యాయం చేసిన మాట నిజమేకాని...."
    సుందరరావు మాటలు పూర్తీ కాకుండానే అరుంధతి కోపంగా అడ్డుపడింది.
    "నువ్వు తప్పక బార్ నుండే వచ్చావు. ఎందుకీ అనవసర విషయాలన్నీ ఇప్పుడు? ఎవరూ ఎవరికీ అన్యాయం చెప్పలేదు. నన్ను నువ్వు ఆరూ అని పిలవటం క్రొత్తగా ఉంది నాకు!"
    సుందర్రావు అహానికి గట్టి దెబ్బ!
    "క్షమించు అరుంధతీ! నేను అనవసర విషయాలు మాట్లాడటానికి రాలేదిప్పుడు . తార విషయంలో నువ్వు ప్రవర్తించే విధానం ఎంత మాత్రమూ న్యాయం కాదనీ, దాన్ని మార్చుకోమనీ చెప్పటానికి వచ్చాను."
    "తార విషయం లోనా? నేను అన్యాయంగా ప్రవర్తిస్తున్నానా?"
    "ఎందుకలా అమాయకత్వం నటిస్తావు?"
    "నేను చక్కగా నటించగలిగే మాట నిజమే. కాని నిత్య జీవితంలో నటించే దౌర్భాగ్యరాలీని మాత్రం కాను" సుందర్రావు కు చురుక్కున తగిలింది.
    "తారకూ, రవికీ కావాలని ఏకాంతం కలిగించటం నీకు న్యాయమా? ఒక ప్లీడరు గుమస్తా పట్ల తార అభిమానాన్ని పెంచుకొంటుందని తెలిసీ, దానిని మందలించటానికి బదులు ప్రోత్సహించటం న్యాయమా? నీ తిరస్కారానికి ఈవిధంగా ప్రతీకారం తీర్చుకోవాలా?"
    ఇంత కల్మషాన్ని వెళ్ళగ్రక్కిన సుందర్రావు ను "బావా!' అని సంబోధించటానికి కూడా అరుంధతి కి మనస్కరించలేదు.
    "సుందర్రావ్! నోటికొచ్చినట్లేల్లా ప్రేలకు! తార నీకు చెల్లెలు! ఆమె మంచి చెడ్డలు చూసుకోవలసిన బాధ్యత నీది. ఆమె వ్యక్తిగత విషయాల్లో నాకే సంబంధమూ లేదు. రవికీ, ఆమెకూ గల అనుబంధం విషయం నాకేమీ తెలియదు. రవి పట్ల తారకు సానుభూతి ఉందని తెలుసు! ఆ మాత్రం సానుభూతి నాకూ ఉంది. ఇంత గగ్గోలు పడవలసిన దారుణ విషయంగా నాకది తోచలేదు. ఇంక తార ఎప్పుడంటే అప్పుడు మా యింటికి వస్తుందని నీకూ తెలుసు! నాకూ తెలుసు! కొన్నిసార్లు తను వచ్చినప్పుడు నేను లేకపోవటం , తటస్థించవచ్చు. అంతమాత్రానికే నన్ను నిందిస్తావా? నిజమే! తారతో, నేను 'లేనప్పుడు మా ఇంటికి రావద్దు' అని చెప్పలెనందుకు నిందించవలసిందే!"
    అరుంధతి మాటలు విని సుందరరావు ఆలోచనలో పడ్డాడు.
    తాను మనోరంజని మాటలు విని తొందరపడ్డాడెమో? అదేమీ చిత్రమో, మనోరంజని స్వభావంతో బాగా అలవాటు పడిన తరువాత కూడా ఆమె మాట లోక్కోక్కసారి ఎంతో నమ్మకంగా అనిపిస్తాయి. అందులో, ఇది తార విషయం కావటం చేత తేలిగ్గా నమ్మేసాడు. నిజానికి ఏమీ లేదేమో?
    "తొందరపడినందుకు నన్ను క్షమించి గానీ, నువ్వు తారను రవి విషయంలో సహాయం కోరటానికి శ్రీధర్ గారి దగ్గిర కెందుకు పంపించావ్? ఇది నాకెంత అవమానం? నేను మళ్ళీ అయన దగ్గిర తలెత్తుకోగలనా?"
    "తారను , నేను శ్రీధర్ గారి దగ్గరకు పంపటమేమిటీ? నువ్వు చెప్పేవరకూ , నాకీ విషయమే తెలియదు. నేను నా ఇంట్లో సంగతులే, పట్టించుకొను. ఇంక తార విషయం అసలు పట్టించుకోను. దయచేసి ఈ విషయంలో ఇంక నన్ను వేధించకు."
    "నీ మాటలు నమ్ముతున్నాను అరుంధతీ! నా తొందర పాటుకు చాలా సిగ్గు పడ్తున్నాను కూడా! కానీ, నువ్వు నాకొక సహాయం చెయ్యగలవా?"
    "ఏమిటీ?"
    "రవీ, తారల మధ్య అనురాగం ఏర్పడటం నిజమే అయితే, తారకు నచ్చ చెప్పి దీని మనసు మళ్ళించాలి. నీ మాట మీద దానికి విలువెక్కువ."
    "ఇదేమిటీ? మీరందరూ ఉండి, ఈ పనిని నా కప్పజెప్తున్నారు? నేను ఇంకొకరి విషయాల్లో కలిగించుకోను."
    "నేనూ చెపుతాను. కానీ, అది నా మాట లక్ష్య పెట్టకపోవచ్చు. దానికి నీ మాట మీద విలువేక్కువ ప్రయత్నించవూ?"
    "అలాగే!"
    "హార్టీ థాంక్స్! నేను నిన్ను అన్యాయం చేసినా, నాపట్ల ఇంత సుహృద్భావంతో ఉన్న నీ విశాల హృదయాన్ని ఎలా పొగడాలో అర్ధం కావటం లేదు."
    అరుంధతి విసుక్కొంది.
    "ఒకటికి పదిసార్లు అలా మాట్లాడకు. నువ్వు నన్ను అంగీకరించనందుకు ఒకప్పుడు విపరీతంగా బాధపడిన మాట నిజమే. కాని ఇప్పుడదంతా తలచుకొని నవ్వుకొంటున్నాను. తెలిసీ తెలియని పసి తనంలో , పెద్దవాళ్ళు నా మనసులోకి, ఒక భావనను ప్రవేశ పెట్టారు. వయసు వచ్చిన తరువాత యవ్వన సహజంగా వచ్చే వూహకు ఆ భావన ఆలంబనమయింది. అంతకంటే , ఇందులో ఏం లేదు. ఇప్పుడు నాకు నీ పట్ల ఏ భావమూ లేదు. లోకం లోని లక్ష మందిలో , నువ్వూ ఒకడివి. అంతే!"
    ఈ మాటలు సుందర్రావు కు తీయగా వినిపించలేదు. కొద్ది క్షణాలు తటపటాయించి, "కాని అరుంధతీ! నేను మాత్రం ఈ విషయాన్నంత తేలికగా తీసికోలేక పోతున్నాను. బీదరికం, అనుభవించి, అనుభవించి అదంటే బెదిరిపోయాను. ఆ బ్రహ్మ రాక్షసి బారి నుంచి తప్పించుకునే మహత్తర అవకాశం ;లభించినప్పుడు వదులు కోలేకపోయాను. ఈనాటికీ నేను పొరపాటు చేసానని అనను. అనుకోను. కాని నువ్వు నా బంగారు కలవి. అపురూపంగా నా గుండె లలో దాచుకొన్న దేవతవి. ఎంత చికాకులో ఉన్నా నీ దగ్గర క్షణ కాలం గడిపేసరికి ఏదో ఉల్లాసం లుగుతుంది. భగవంతుడు నన్ను పేదవాడిగా పుట్టించి ఉండకపోతే, నిన్ను వదులుకొనేవాడిని కాను."
    "ఇట్లాంటి మాట లిప్పుడు పూర్తిగా అనవసరం బావా!"
    నిర్లిప్తంగా సమాధాన మిచ్చి, ఏదో పని ఉన్నట్లు అక్కడి నుండి లేచిపోయింది అరుంధతి.

                             *    *    *    *
    "చూస్తుండగానే గొప్ప కధానాయకురాలి వై పోయావే!" తారను చూసి నవ్వుతూ అంది అరుంధతి.
    తార కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ముఖం కూడా బాగా వడిలి పోయి ఉంది. ఆమె ముఖంలోకి చూసి, ఇంటి దగ్గర ఏదో గొడవ జరిగి ఉంటుందని వూహించింది అరుంధతి.
    "మీరంతా కలిసి వస్తే అవకేం చేస్తానూ?"
    "మధ్య నన్ను కూడా కలుపుతావెందుకూ? నేను కలలో కూడా ఈ విషయం వూహించలేదు. ఇంతకూ శ్రీధర్ గారింటికి నువ్వే వెళ్ళావా? ఏమైంది."
    "శ్రీధర్ గారింటి దగ్గర ఏమీ కాలేదు. జరిగిందంతా , మా ఇంటి దగ్గిర జరిగింది. సరిగ్గా నేను శ్రీధర్ గారింటి కెళ్ళినప్పుడే మా వదిన ఇక్కడకు వచ్చిందట! పనిమనిషి ద్వారా నయానా, భయానా సంగతులు లాగి, వాటికి రంగులు పూసి అన్నయ్యకు అంటించింది. ఇంక చూసుకో! లాలింపులు, బెదిరింపులు!- ఒకటేమిటీ? నానా గొడవ!"
    ఇంతవరకూ నాకు రవి మీద జాలే ఎక్కువగా ఉండేది. అంతకంటే నా కభిమానం ఉన్నమాట నిజమేకాని, అతనిని గాడంగా ప్రేమిస్తున్నానా, లేదా అనే విషయం తేల్చుకోలేదు. ఈ గొడవలతో నా మనసంతా పూర్తిగా రవే ఆక్రమించుకొన్నాడు. అతనిని మరచిపోవడమనే ఆలోచన క్షణ కాలమైనా భరించలేకుండా ఉన్నాను. ఆరు నూరయినా , నూరు అరయినా , అతడినే చేసి కొంటాను. అన్నయ్య అసలు అంగీకరించక పోవచ్చు. నువ్వు నాకొక సహాయం చెయ్యగలవా వదినా?"
    "ఏమిటీ!"
    "అన్నయ్యకు నువ్వంటే ఎంత అభిమానమో నాకు తెలుసు! నీ నోటితో చెపితే, అతడు మా ప్రేమను అర్ధం చేసి కొంటాడెమో? అన్నయ్య నీ మాటకు తప్పక విలువిస్తాడు. మామీద కత్తి గట్టకుండా ఆశీర్వదించేలా చెయ్యవా వదినా?"
    అరుంధతి గట్టిగా నవ్వింది. "మీరంతా కలిసి నాకు లేని విలువల్ని అపాదిస్తున్నారు. మీ అన్నయ్య వచ్చి నువ్వు నా మాటకు విలువ నిస్తావనీ , నీకు నచ్చ జెప్పమనీ బ్రతిమాలాడు. నువ్వేమో మీ అన్నయ్యకు నచ్చ జెప్పమని ప్రాధేయపడుతున్నవే! నేనేం చెయ్యను?"
    తార కూడా నవ్వింది.
    "పోనీ వదినా! నువ్వే బాగా అలోచించి ఏది మంచి దని తోస్తే అలా చెయ్యి"
    "తారా! నువ్వు నాకా మాత్రం గౌరవమిచ్చావు గనుక చెప్తున్నాను. నువ్వీ నిర్ణయానికి వచ్చేముందు బాగా ఆలోచించుకున్నావా? నెలకు ఎనబై రూపాయల జీతం తప్ప మరే ఆధారం లేని వ్యక్తీ రవి. "వెధవ డబ్బు" అంటూ కబుర్లు చెప్పటం ఎంత తేలికో, డబ్బు లేకుండా గడపటం అంత కష్టం ఈ కరువు రోజుల్లో, ఎనభై రూపాయాలంటే ఏ మూలకి/ నీ ఒక్క చీర ఖరీదు -- అందులో బాగా బ్రతికిన దానివి. బాగా ఆలోచించుకో!"
    "రెండు రోజుల నుండీ నేనీ విషయాలనే ఆలోచిస్తున్నాను వదినా? ఒక అమాయకుని హృదయం తెలిసో, తెలియకో లేనిపోని ఆశలను ప్రవేశ పెట్టాను. ఇప్పుడు వాటిని నిర్లక్ష్యం చేసి, నా దారి నేను చూసుకొనే రాక్షసిని కాలేకపోతున్నాను. 'ఈ లోకమంతా ఇంతేనా?' అని ప్రశ్నించే రవి దీనమైన ముఖం తలుచుకుంటే నాకు కడుపులు త్రిప్పినట్లవుతుంది. అదీగాక, నేను కూడా రవిని వదిలి ఉండలేను. అతని సౌందర్యం నన్నాకర్షించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS