"వెళ్ళయితే నీకొచ్చిన దిగు ల్లేదింక. నువ్వెళ్ళే దార్లో డాక్టర్లు. బాబు ఇల్లుంది. నేను పిలిచానని చెప్పు. వెళ్ళు."
నరసయ్య నమస్కారంచేసి వెళ్ళిపోయాడు.
నరసయ్య వెళ్ళినవేపు మత్తుగా చూచి, రామదాసు పొట్టెగరేసుకుంటో నవ్వేరు. అయితే, ఈ తడవ నవ్వు ఆ గదిదాటి యివతలికి రాలేదు.
ఆ రాత్రి బాగా పొద్దుపోయింతర్వాత చిరంజీవి యింటి కొచ్చేడు. తండ్రిని చూసి మరో గదిలోకి వెళ్ళబోయాడు.
కాని-రామదాసు చాలా ఆప్యాయంగా పిలిచేరతన్ని.
"రా, నాయనా! రా.......లోపలికి రా!"
చిరంజీవి మెల్లిగా వచ్చి కుర్చీలో కూచున్నాడు.
"ఏమిటి విషయాలు? నీ రాజ్యంలో అల్లర్లమాటేమిటి?" తండ్రి అడిగేరు.
చిరంజీవి నసుగుతూ అన్నాడు.
"ఉదయం నుంచీ నువ్విలాగే వున్నావు నాన్నా! నువ్వలా వుంటే నాకేవిటో భయంగావుంది. ఎందుకంత విపరీతంగా తాగుతావు చెప్పు?"
ఆ మాట వినీ వినడంతోటే రామదాసుగారి కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి. చిరంజీవికి ఆ కన్నీళ్ళు కనుపించడంతో మతిపోయినంత పనైపోయింది.
తండ్రి గొప్ప కష్టాల్లో పడిపోయేడని వూహించేడతను. తండ్రి కన్నీటిని అతను బహుకొద్ది తడవలే చూసివుండటంవల్ల కారణమేధో గొప్పదై వుంటుందని గ్రహించేడు.
తండ్రిని అంటిపెట్టుకుని బతికేది ఒక్క రాజకీయం మినహాయించి మరోటి లేదు. అందుచేత.....
"రాజకీయాలు చాలా చెడ్డవి నాన్నా! వాటిని గురించి కలత చెందకు," అని ఓదార్చాడు కొడుకు తండ్రిని.
కొడుకు నుంచి వచ్చిన ఓదార్పుకి తండ్రి మనసు గాయపడింది. కొడుకు తాలూకు 'చొరవ'కి ఆయన కించిత్తు కోపంగూడ చిత్తగించేరు.
"అధ్వాన్నంగా మాటాడకురా చిరంజీవీ! కాకి పిల్లవు నీకేం తెలుసురా రాజకీయం? అందుచేతనే చులకనగా మాటాడేవు అవునా? ఈ రాజకీయ మేరా, ఇవాళ నిన్ను పెంచుతున్న వృత్తి! మేడలూ కారులూ యిచ్చింది! మనల్ని కులాసాగా బతకనిస్తోంది! దీన్ని పట్టుకు వ్రేళ్ళాడకపోతే-ఒరేయ్ జీవీ-మనిద్దరం కుక్కబతుకు బతికి ముష్టెత్తుకునేవాళ్ళం తెలుసా? రాజకీయాన్ని తిట్టకురా అబ్బాయ్- కళ్ళు పోతాయి. తప్పు నాన్నా! ఇంకెప్పుడూ రాజకీయాన్ని తిట్టి నన్ను బాధపెట్టకు,". అన్నారాయన.
అయితే మరెందుకు తండ్రికీ కన్నీరు?
చిరంజీవి ఆలోచించలేక పోయేడు. బిత్తరపోయి తండ్రివేపు చూస్తుండి పోయేడు.
కొడుక్కి అసలు కారణం చెప్పకుండా యిబ్బందిలో వుంచడం ఆయనకి రుచించలేదు. అందుచేత వారు నిజం చెప్పక తప్పలేదు.
"ఒరేయ్ చిన్నా! నీకు మీ అమ్మ గుర్తుందిట్రా?" అని అడిగేరాయన.
అప్పటిగ్గాని చిరంజీవికి 'మిడతం బొట్లు' దొరికేడుగాడు. అయితే యిన్నేళ్ళుగా పెరిగి పెద్దవుతూన్న చిరంజీవికి, తండ్రి నుంచి 'మీ అమ్మ గుర్తుందిట్రా చిన్నా!' అనే పలుకరింపు ఆశ్చర్యంగా తోచింది.
బాగుండదని, చిరంజీవి పోజు మార్చుకున్నాడు. మొహంలో గబగబా దిగులు రంగులు పులుముకున్నాడు. చేతులు నలుపుకుంటూ చాలా బెంగగా అన్నాడతను.....
"లేదు నాన్నా! ఈ యింటో అమ్మ ఫోటోని చూడటం తప్ప ఆవిడ గురించే నాకేం తెలీదు.....నేను చాలా దురదృష్ట వంతుణ్ణి నాన్నా! అమ్మని చూడ నోచుకోని దౌర్భాగ్యున్ని!"
ఆ మాటలు విన్న రామదాసు మరింత కదిలిపోయేరు.
"ఏడవకురా జీవీ! మహాతల్లి అన్నపూర్ణే కదుట్రా? నిన్ను కని ఆ అన్నపూర్ణ కళ్ళు మూసింది. నిన్ను నా చేతుల్లో పెట్టి వెళ్ళి పోయింది. ఒరేయ్ చిన్నా!- అది నాకు అస్తమానం గుర్తుకు రాదురా, ఎప్పుడో ఒక్క మాటు అలా అలా కనుపించి 'క్షేమమా' అని అడిగి వెళ్ళిపోతుందంతే! రాత్రి వచ్చింది. సరిగ్గా, ఇదిగో ఇదిగో నా మంచమ్మీద కూచుని కన్నీరు పెట్టుకుందిరా మీ అమ్మ! అదిగో......అందుకే తాగుతున్నాను. నన్ను నేను మరిచేందుకు తాగుతున్నానురా. కానొరేయ్....ఎంత తాగినా, నాకన్నీ గుర్తుకొస్తూనే వున్నాయిరా. అంతే కాని....మన పవిత్ర రాజకీయాలకి నేను కలత చెందలేదు. చెందను. ఈ రాజకీయంలో నా సర్వీసెంతనిరా నీ ఉద్దేశం?......రాజకీయంలో నాది స్వర్ణ సింహాసనం కదుట్రా నాన్నా! ఆ శ్రీరామచంద్రుడి కటాక్షం నాకు దూరం కాదురా అబ్బాయ్."
అంతే....
అక్కడితో వాళ్ళ మధ్య మౌనం ఆవరించింది. తండ్రి కొడుకులు తల లొంచుక్కూచున్నాడు.
చాలాసేపు కూచున్న మీదట చిరంజీవి ఓపిక సన్నగిల్లింది. ఇక నటించేందుకతని దగ్గిర సరుకైపోయింది.
ఎన్నడో కన్నుమూసిన తల్లిని గురించి ఉపన్యాసం వినడమంటే చిరంజీవికి వొళ్ళు మంటే మరి! ఈ ప్రయోజనంలేని ఉపన్యాసాల్తో కాలం వృధాచేయడం అతని కిష్టంలేదు గూడాను.
వెళ్ళిపోయేందుకు లేచి నిలబడ్డాడు.
చిరంజీవి లేచి నించోడంతోనే రామదాసు అడిగేరు.
"అవున్రా జీవీ! అడగడం మరిచేను. నీ ఎన్నిక లెలా వున్నాయి! సీతాపతి ఏవంటున్నాడు?"
అప్పటిగ్గాని చిరంజీవి మనిషి కాలేదు. చాలా ఉత్సాహంగా జవాబు చెప్పేడు.
"ఎన్నికల రోజు దగ్గిర పడింది నాన్నా! మనకేం ప్రమాదం లేదు. సీతాపతిగాడు నువ్వన్నట్టు గట్టివాడు. అంతా వాడే స్వయంగా చూచుకు పోతున్నాడు. సుబ్బారావు మరి లాభంలేదు. వాడెంత గింజుకున్నా ప్రయోజనం సున్నా!"
"వెల్! మంచిమాట చెప్పేవురా. వాతావరణం అల్లా అన్ని వేపులనుంచీ కలిసిరావాలి. చూడు నాన్నా! నాదో ముచ్చటరా జీవీ! ఈ కాలేజీ ఎన్నికల్లో ఏముందిగాని- రేపు నా వారసుడివై నా సింహాసనం ఆక్రమించే శుభ ఘడియకోసం ఎదురు చూస్తున్నానురా నేను. నువ్వు ఎదిగి ప్రయోజకుడివయ్యేంతవరకూ మన సింహాసనాన్ని వెయ్యికళ్ళతో కనిపెట్టుకు కూచుంటాను. హరిహరాదులే వచ్చినా, నేనా సింహాసనం వాళ్ళ కివ్వను. అది నా తర్వాత నీకే! నీ తర్వాత నీపిల్లలకే!.....అందుచేత నువ్వు యువరాజువి, నేను మహా రాజుని. మన రాజ్యమైన ఈ తిమ్మాపురంలో మనకి వొంగి వొంగి నమస్కారాలు చేసే జనాన్నీ, మన మూలంగా కాణికీ అర్ధణాకీ కక్కుర్తిపడే స్వజనాన్నీ యిప్పట్నుంచే కనిపెట్టుకుని బ్రతుకు. అదే నాసలహా!"
