Previous Page Next Page 
గుళ్ళో వెలిసిన దేవతలు పేజి 13

           


    "మేడమ్! మీరు మా అక్కయ్యకు చేసిన ఉపకారం మరిచిపోలేను. ఈ సంఘానికి నేను, మా అక్కా. మా కుటుంబం, ఎంతగానో ఋణపడి ఉన్నాం. ఈ సంఘ సహాయార్ధం నేను డాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తాను," అంది.
    శిరీష ఏర్పాటుచేసిన మీటింగ్ లో ఉపన్యసించి వేదిక దిగిన పావనికి అమృతమూర్తిని పరిచయం చేసింది శిరీష.
    "ఈయన చాలా కాలంగా నాకు పరిచితులు అభ్యుదయ భావాలు కలవాడు. సార్ధక నామధేయులు-" అని.
    అమృతమూర్తి పావనికి నమస్కారంచేసి "మీరు నడుపుతోన్న ఉద్యమం గురించి శిరీషగారి ద్వారా విన్నానండీ! నిజమే! ఈ నాటికీ సమాజంలో స్త్రీలు ఎదుర్కోవలసి వస్తోన్న అన్యాయాలకు అంతులేదు మీతోటివారు ఈ రకమైన సంస్కరణకి పూనుకోవటం ఎంతో సంతోషంగా ఉంది. మీ రొక్కసారి మా ఇంటికి రావాలి." అన్నాడు.
    సాధారణంగా ఎవరింటికీ వెళ్ళటం ఇష్టంలేని పావని "పని ఉంద"ని తప్పుకోబోయింది. కానీ అమృతమూర్తి బలవంతం చేసాడు. శిరీష కూడా వెళ్ళమని చెప్పింది. శిరీష మాట కాదనలేక ఒప్పుకుంది పావని.
    అమృతమూర్తితో అతని ఇంటికి వచ్చిన పావని ఆ ఇంట్లో అనుపమనిచూసి నిర్ఘాంతపోయింది...
    "అనూ! నువ్వు ఇక్కడ ఎందుకున్నావ్?" అంది.
    అనుపమ పావనిని చూసి పాలిపోయిన ముఖంతో, వణుకుతోన్న పెదవులతో నోట మాటరాక నిలబడింది -అమృతమూర్తి ఆ ఇద్దరినీ ఆశ్చర్యంగా చూస్తూ .    
    "మా అనుపమ మీకు తెలుసా? ఈవిడ నా భార్య. మీ కిద్దరకూ ఎలా పరిచయం? అనుపమ నాకెన్నడూ చెప్పలేదే!" అన్నాడు.
    పావని పాలిపోయిన అనుపమ ముఖంలోకి చూస్తూ "ఏం అనూ! నీకు కూడా నేను వదినగా చెప్పుకోవటానికి పనికిరానా?" అంది.
    అనుపమ తల మరింతగా భూమిలోకి దిగిపోయింది. అమృతమూర్తి మాత్రం హుషారుగా "వాట్! మీరు మా అనుపమ వదినగారా? అంటే నాకు అక్కయ్యే అన్నమాట! వాట్ ఎ గుడ్ న్యూస్?" అన్నాడు.
    పావనిలో ఉత్సాహమంతా హరించుకుపోయింది. అనుపమ ధోరణి అంతుపట్టడంలేదు. ఇంతగా మారిపోతారా మనుష్యులు?
    భోజనాల సమయంలో కూడా అనుపమ ఏం మాట్లాడలేదు. అమృతమూర్తి తానొక్కడే ఏదేదో మాట్లాడాడు. మర్యాదకు పావని సమాధానాలు చెప్పింది.
    ఆ రాత్రి తన ఇంట్లో ఉండి మరునాడు వెళ్ళమన్నాడు అమృతమూర్తి ... వెంటనే ఒప్పుకుంది పావని. అనుపమ దేనికో బాధపడుతున్నట్లుగా అనిపించసాగింది పావనికి. అదేదో తెలుసుకోవాలనిపించింది.
    ఒక రాత్రివేళ తన ప్రక్కన ఎవరో పడుకున్నట్లుగా తోచి మెలకువ వచ్చింది పావనికి .... అనుపమ చిన్నపిల్లలా ముడుచుకు పడుకుంది - ఆప్య్యంగా అనుపమమీద చెయ్యివేసి "అనుపమా!" అంది పావని ... ఆ మాత్రం అనునయానికే అనుపమ కరిగిపోయి పావని చేతుల్లో ముఖందాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది ... ఏదో మాట్లాడబోతున్న పావని నోటిమీద చెయ్యివేసి గట్టిగా నొక్కి మాట్లాడవద్దన్నట్టు సైగచేసింది.
    ఆ మరునాడు అనుపమ ఏం జరగనట్లే నవ్వుతూ కాపీలు అందించింది అందరికీ .... ఎన్నెన్నో అనుమానాలు మనసును పీడిస్తున్నా ఏమీ మాట్లాడలేకపోయింది పావని...
    అమృతమూర్తి పావనిని రైలెక్కించి "అప్పుడప్పుడు వస్తూ ఉండండి," అన్నాడు.
    "అలాగే" అంది పావని.
    తరువాత కొంచెం రోజుల్లోనే అనుపమ దగ్గిరనుండి పావనికి ఉత్తరం వచ్చింది...
    "వదినా!
    గుర్తుందీ? అన్నయ్యకు భయపడి ఊరుకున్నా నా ఇంటికి నేను వచ్చాక. నిన్ను పిలిపించుకుంటానని వ్రాసాను. కానీ, వదినా ఇక్కడికి వచ్చాక తెలిసింది, ఇది నా ఇల్లు కాదని.....ఎప్పటికీ కాదని...ఇలా వ్రాస్తుంటే ఆశ్చర్యపోతున్నావు కదూ! అమృతమూర్తితో మాట్లాడిన వాళ్ళెవరూ అతని అంతరంగాన్ని గురించి నేను చెప్పినది నమ్మలేరు. అతని పేరు నేతిబీరకాయ వదినా! ఆ పేరులో ఉన్న అమృతం మనసులో ఏ కోశానా లేదు. మేక వన్నె పులి....పైకి మాట్లాడేవన్నీ అభ్యుదయసూక్తులు. లోలోపల అన్నీ చాందసభావాలు. నీలాంటివాళ్ళు పైకి ఎంతో గౌరవమున్నట్లు మాట్లాడతారు. లోలోపల ఎంతో చులకన. ఇంకో భయంకర రహస్యం చెప్పెయ్యనా? కాస్త స్వంతంత్రించి వ్యవహరించే స్త్రీల శీలంలో ఈయనకి నమ్మకంలేదు. పైకి అలాంటి వాళ్ళని గౌరవిస్తున్నట్లు మాట్లాడుతూ స్నేహం చెయ్యటం, వాళ్ళు తనకి లొంగిపోతారనే ఆశతోనే!
    ఇలాంటి వ్యక్తితో ఎలా కాపురం చేస్తున్నావని అడక్కు ... సంసారం వదులుకుని రాగలిగే సాహసం నాకు లేదు వదినా! జీవచ్చవంలా అన్నీ సహిస్తున్నాను. నా మీద కోపం తెచ్చుకోకు. జాలిపడు.
                                                                                                              ఉంటాను.
                                                                                                               ప్రేమతో
                                                                                                                  నీ
                                                                                                              అనుపమ..."
    ఉత్తరం చదువుకుని నిట్టూర్చింది పావని .... ఆ రాత్రి అనుపమ ధోరణిని బట్టి ఇలాంటిదేదో ఉంటుందని ఊహించింది .... "సంసారం వదులుకుని రాగలిగే సాహసం లేదు." అంటూ మౌనంగా ఎన్నెన్నో సహిస్తున్న వాళ్ళెందరో ఉన్నారు. వాళ్ళలో అనుపమ ఒకర్తి ... ఎవరుమాత్రం చెయ్యగలిగింది ఏముంది?
    కేశవమూర్తి ఆ ఊళ్ళో కాలేజీకి కొత్తగా వచ్చిన లెక్చరర్. అతడు చాలా చక్కగా పాఠాలు చెపుతాడు. ఒక్క క్లాసుకూడా ఎప్పుడూ కేన్సిల్ చెయ్యడు- చక్కని విజ్ఞానముంది. తీరైన ఎక్స్ ప్రెషన్ ఉంది. అంచేత అతనంటే తెలివైన విద్యార్దులకూ, కష్టపడి చదువుకునే విద్యార్ధులకూ చాలా ఇష్టం ... స్ట్రిక్ట్ గా ఉంటాడు. క్లాస్ లో అల్లరి చెయ్యనియ్యడు. గోలచేసే విద్యార్దులను బయటకు పంపేస్తాడు. అంచేత అల్లరి విద్యార్ధులకు అతనంటే ఒళ్ళుమంట.
    కేశవమూర్తి పురోగామి సంఘానికి రెండు మూడుసార్లు వచ్చి పావనితో మాట్లాడాడు. పావనిపట్ల అతనికి చాలా గౌరవం ఏర్పడింది.
    యూనివర్శిటీ పరీక్షలు జరుగుతున్నాయి. వి.సి. ఆర్డర్స్ ప్రకారం కాలేజీలన్నీ కాపీలకు ఏమాత్రం అవకాశం ఇయ్యకుండా పరీక్షలు నడుపుతున్నాయి. కాపీలు కొట్టి పరీక్షలు వ్రాయటానికి అలవాటుపడ్డ విద్యార్ధులు దీనికి తట్టుకోలేకపోయారు. కొందరు ఎంత మందలించినా వినకుండా మొండిగా కాపీలు కొట్టారు. అలాంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా డిబార్ చేసేసారు.
    ఆ రోజు కేశవమూర్తి ఇన్ విజిలేటర్ గా ఉన్న హాల్లో ఒక పదిమంది విధ్యార్దులు కాపీకొట్టడానికి ప్రయత్నించారు కేశవమూర్తి ఆ ప్రయత్నం కొనసాగనియ్యలేదు. అప్పటికేం చెయ్యలేక ఊరుకున్న విద్యార్ధులు కేశవమూర్తి కాలేజీ ఆవరణదాటి బయటికి రాగానే మీదపడి కొట్టారు. కేశవమూర్తికి బలమైన దెబ్బలు తగిలాయి. వంటిమీద స్పృహలేని దశలో అతణ్ణి హాస్పిటల్ లో చేర్చారు....ఈ సంగతి పావనికి తెలిసింది. వెంటనే కేశవమూర్తిని చూడటానికి హాస్పిటల్  కు వెళ్ళింది అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ప్రైవేట్ హాస్పిటల్ కు మార్పించి తన ఖర్చుతో వైద్యం చేయించింది. అతనికి పూర్తిగా నయమయ్యేవరకూ రాత్రింబగళ్ళు తనే అతన్ని కనిపెట్టుకుని ఉంది.
    తనమీద విద్యార్ధులు ఒక గుంపుగా వచ్చి పడ్డారనీ, వాళ్ళెవరో తను చెప్పలేననీ కేశవమూర్తి స్టేట్ మెంట్ ఇవ్వటంతో కేశవమూర్తి కొట్టిన విద్యార్ధులపై తగినచర్య తీసుకోవడం జరగలేదు.
    ఈ సంఘటన భాగీరదమ్మకు కొండంత కొత్త బలాన్ని ఇచ్చింది.
    "తన మొగుణ్ణి వదిలేసింది. తనకంటే చిన్నవాడైన లెక్చరర్ తో కులుకుతోంది. ఇదీ, స్త్రీ స్వాతంత్ర్యం పేరిట ఈ ఆధునిక మహిళలుచేస్తోన్న పచ్చి వ్యభిచారం"  అని ప్రచారం మొదలుపెట్టింది... మరొకరిమీద నేరాలు చెప్పుకుని మురిసిపోయే అమ్మలక్కల కేనాడూ సమాజంలో కొదువ లేదుగనుక క్షణాలలో ఈ వార్త చిలవలూ పలవలూ చేర్చుకుని వ్యాపించింది.
    
                                                11
    
    పావని వచ్చి వెళ్ళిన తరువాత అనుపమ పరిస్థితి మరింత క్లిష్టమయిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS