ఆ షాకుని అతి ప్రయత్నమ్మీద దాచుకుంటూ తండ్రితో అన్నాడు. "ఈ అమ్మాయిని ఇంత క్రితం విశాఖపట్నంలో చూశాను".
"ఏమ్మా! మా వాడు చెబుతున్నది నిజమేనా?" పెళ్ళికూతుర్ని అడిగాడు లెక్కల మాష్టారు.
పెళ్ళికూతురు తల ఊపింది.
"మరింకేం? ఒకరికొకరు తెలీనట్టు ఈ పెళ్ళి చూపులెందుకు" అన్నాడు లెక్కలు మాస్టారు.
"అంతేగా మరి!" అన్నాడు సైన్సు మాస్టారు.
కార్యక్రమం జయప్రదంగా జరుగుతున్నందుకు మాస్టార్లు ముగ్గురూ షేక్ హ్యాండ్లిచ్చుకుంటున్నారు. వియ్యపువాళ్ళిద్దరూ సరేసరి - వాళ్ళ కళ్ళల్లో వెలుతురే వాళ్ళ ఆనందానికి గుర్తు.
గోపాలం మాత్రం సడన్ గా లేచి నించున్నాడు.
సీరియస్ గా ఇలా అన్నాడు.
'క్షమించాలి! ఈ పెళ్ళి నా కిష్టం లేదు!"
ఆ మాటకి అందరూ నిశ్చేష్టులయ్యారు. ఒకరి మొహాలొకరు చూసుకుంటున్నారు. పెళ్ళికూతురు ఆందోళనగా తల్లిపక్కన చేరింది. వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటోంది. గోపాలం మౌనంగా బయటకు వచ్చేసేడు.
విజయవాడ హోటల్లో తల్లిదండ్రుల ఎదుట గోపాలం ముద్దాయిలా నిలబడి వున్నాడు. తండ్రిగారు బాగా నీరసపడి నీరసంగా అంటున్నాడు...
"నువ్వు చేసింది మర్యాదగా లేదురా గోపాలం. "ఈ పెళ్ళి నాకిష్టం లేదు" అని చెప్పినంత మాత్రాన సరిపోదు. ఎందుకిష్టం లేదో చెప్పాలి గదా? నువ్వు చెప్పకపోతే - బంధువర్గంలో తలొక తలో విధంగా ఊహించుకుంటారు. ఊహించినవన్నీ 'వాస్తవాలు'గా చెప్పుకుంటారు. నువ్వు చెప్పేది ఒకే ఒక్క కారణం కావచ్చు. బంధువులు ఊహించి ప్రచారంలో పెట్టే అబద్దపు కారణాలు అనేకముంటాయి. ఈ వాతావరణంలో- ఒకసారి - పెళ్ళికూతురి పరిస్థితి కూడా ఆలోచించరా గోపాలం. నీకు తానెందుకు నచ్చలేదో తెలీక..... ఊహించలేక.....తనకి చావు ఒక్కటే పరిష్కారమనీ-"
"నాన్నా! నువ్వనుకుంటున్నట్టు ఆమె సుతిమెత్తని మనస్కురాలుగానీ - శుద్ధ అమాయకురాలుగానీ కాదు. దయచేసి నానుంచి ఇంతకంటే ఎక్కువ వివరాలు ఆశించవద్దు. నేను హైదరాబాదు వెళ్ళిపోతున్నా!" అని బ్రీఫ్ కేస్ తో ఆ గది విడిచి పెట్టాడు గోపాలం.
"నాన్నా కన్నా ఆగరా!" అంటున్నా ఆ తల్లి ఆవేదనను అతను పట్టించుకోలేదు. వెనక్కి తిరిగి చూడలేదు. "జీవితంలో మొట్టమొదటిసారిగా నా లెక్కకి కరెక్టు ఆన్సరు రాలేదు - వెంకాయమ్మా" అని భార్య దగ్గర గొణుక్కుంటున్నాడు మాస్టారు.
* * *
సరిగ్గా మూడు నెలల తర్వాత ...... ఆ వేళ గోపాలం తిరుపతి ప్రయాణం పెట్టుకున్నాడు. సికింద్రాబాదు స్టేషనుకి ఆలస్యంగా రావడం వల్ల కదుల్తున్న రైల్లో ధైర్యం చేసి ఎక్కవలసి వచ్చింది. క్షేమంగా కంపార్టుమెంటులో అడుగు పెట్టినందుకు ఆనందించినా - భయం తాలూకు దడ తగ్గలేదు. ఆ దడతోనే - తోటి ప్రయాణికుల కాళ్ళు తొక్కుకుంటూ తన బెర్తు వెతుక్కుంటున్నాడు గోపాలం. ఆ వెతుకులాటలో అతను ముద్దబంతి పూవును చూడగలిగాడు.
ఆమె పక్కన ఆమె భర్త కాబోలు - ఆమెను అతుక్కుని కూచున్నాడు. అతని చెవిలో ఆమె ఏదో చెప్పింది. అతను లేచి నిలబడ్డాడు. గోపాలానికి నమస్కరిస్తూ అన్నాడు -
"నా పేరు తిరుమలరావు. ఆర్టీసీలో డిపో మేనేజరుగా పనిచేస్తున్నాను!" అన్నాడు.
గోపాలం ప్రతి నమస్కారం చేస్తూ "కూచోండి!" అన్నాడు. తిరుమలరావు కూచున్నాడు. అతనికి ఎదురుగా గోపాలం కూచుంటూ అడిగేడు- "ఆర్టీసీలో ఉంటూ రైల్లో ప్రయాణం చేస్తున్నారేమిటి చిత్రంగా?"
"ఏమి చెప్పను మాస్టారూ? మా అన్నపూర్ణకు బస్సు ప్రయాణం పడదండి. పైగా ... వెళ్ళవలసింది చాలా దూరం తిరుపతి గదా? అందుకే రైల్లో వెడుతున్నాం" అన్నాడు తిరుమలరావు.
"అన్నపూర్ణా? ఆవిడెవరు?" అడిగాడు గోపాలం.
"ఎవరోనా? ఇదిగో ఈవిడే - మా ఆవిడ!" అన్నాడు తిరుమలరావు. అన్నపూర్ణ గోపాలానికి నమస్కరించింది. గోపాలం ఆమెనే అడిగాడు - "మీ పేరు అన్నపూర్ణా?" అని. ఆమె తల ఊపింది. వాళ్ళ వరస గమనించిన తిరుమలరావు నవ్వేస్తూ గోపాలాన్ని అడిగాడు.
"ఫన్నీ! పెళ్ళికూతురి పేరు తెలుసుకోకుండా పెళ్ళి చూపులు పూర్తి చేసుకుని వచ్చారా మాస్టారూ? సారీ..... ఏమీ అనుకోవద్దు! మీ గురించి చెప్పింది లెండి!"
గోపాలం తిరుమలరావుని పట్టించుకోకుండా అన్నపూర్ణతో అన్నాడు. "నిజం చెప్పాలంటే -ఇన్నాళ్ళూ .. ఇప్పటివరకూ మిమ్మల్ని నీలవేణిగానే భావిస్తున్నాను!"
"అంటే? ఇప్పటివరకు మీరు నీలవేణిని చూడనే లేదా?" ఆశ్చర్యంగా అడిగింది అన్నపూర్ణ.
"ఆ చూడకపోవడమే బోలెడు గందరగోళానికి దారి తీసింది. ఇంతకీ నీలవేణి ఎక్కడ వుంటుంది?" అడిగేడు గోపాలం.
"ఎక్కడో ఉండాల్సిన ఖర్మ దానికేం పట్టింది? విశాఖపట్నంలో నేను ఉన్న ఫ్లాటు నీలవేణిదే. మీరు వచ్చినప్పుడు తాను సింగపూరు వెళ్ళింది. అప్పుడే కాదు - నా పెళ్ళి ముందు రోజు కూడా సింగపూరే వెళ్ళింది." అన్నది పకా పకా నవ్వేస్తూ...
భారంగా తన బెర్తుకి చేరుకున్నాడు గోపాలం. పక్కబట్టలు సర్దుకుంటూ ఆ భగవంతుడ్ని ఒకసారి మనసారా తలుచుకున్నాడు - "జగన్నాటక సూత్రధారీ! కడుచమత్కారీ! నీకు - శతకోటి వందనాలు!"