Previous Page Next Page 
అదివిష్ణు నవలు -2 పేజి 13

 

    "నా వివరాలు చాలా మాస్టారు?"
    "చాలండి."
    "మాస్టారూ! నన్ను అండీ గిండి అనీ పిలుస్తే నాకు కష్టంగా వుంటుంది. 'ఇందూ' అని పిలవండి."
    "పిలవలెను"
    "ఎంచేత మాస్టారూ?"
    "ఎంచేతో చెప్పలేను."
    "సరే కానివ్వండి. మీ యిష్టం వచ్చినట్టే పిలవండి. ఇవాళెం చెబుతారు.?"
    "మీ ఇష్టం వచ్చింది చెబుతాను."
    "ఇంగ్లీషు పోయిట్రీ చెప్పగలరా?"
    "ఏదైనా ఫరవాలేదు."
    "అయితే చెప్పండి. మొట్టమొదట మిల్టన్ పుస్తకమిదుగో!"
    అతను పుస్తకాన్ని అందుకుని మిల్టన్ పోయిట్రీ చూసేడు. మనసేమో యింటి చుట్టుతా తిరుగుతుంది. లాభం లేదు. ఇవాళ ఇంగ్లీషు పోయిట్రీ కాదు గదా, తెలుగు ముక్క ఒక్కటి గూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇవాళ మిల్టన్ పోయిట్రీ చెప్పి - ఈ పిల్ల చేత నగుబాటు చెందే కంటే మనసు బాగోలేదని నిజం చెప్పి, ఇంటికి వెళ్ళిపోవడం వుత్తమం అనుకున్నాడు.
    "ఏమిటి మాస్టారూ? పాఠం చెప్పరేం."
    "చెప్పలేను."
    ఇందిర పకపకా నవ్వినప్పుడు అతను బెదిరిపోయేడు. ఇందిర వేపు తీవ్రంగా చూచిన తరవాత గాని ఆ నవ్వు ఆగలేదు.
    "ఆడపిల్లలు నవ్వకూడదు."
    "మగపిల్లలే నవ్వాలా మాస్టారూ."
    "అనవసరంగా ఎవ్వరూ నవ్వకూడదు."
    "నేను అవసరంగానే నవ్వెను మాస్టారూ!"
    "ఏమిటా అవసరం?"
    "మీరే పాఠమైనా చెబుతానని రెండు, సరిగ్గా - రెండు క్షణాల క్రితం అన్నారాయే. పోయిట్రీ చెబుతారా అంటే యస్సన్నారు. తీరా చెప్పండని పుస్తకమిస్తే కాసేపు చూచి - చెప్పలేనని అంటుంటే నాకేమిటో సరదా అనిపించింది. జెర్రీ లూయిస్ గుర్తుకు వచ్చి నవ్వేశాను."
     "జెర్రిలూయిసా?"
    "మీకు తెలీదేమిటి?......హాలీవుడ్ నటుడండీ! బ్రహండమైన కమెడియన్. ఐ లైక్ హిమ్!"
    "మీకు నేను హాస్యగాడిలా కనిపించేనా ఇందిరా?"
    "ఎంతమాటండి? నేనలా అన్నానా? జేర్రీలుయిస్."
    "నా మొహం చూడగానే గుర్తుకువచ్చేడన్నారవునా అది చాలదూ? నిజం ఇందిరా. నేనుత్త బఫూన్ నే...రియల్లీ."
    "మేస్టారూ!"
    "అంత మహానటుడితో నన్ను పోల్చినందుకు థాంక్స్ . కాని, ఇందిరా , అతను మహానటుడు. నేను.....నేను - నా మనస్సు బాగోలేదు. ఇవాళ పాఠం చెప్పలేను."
    "పోనీండి మేస్టారూ! రేపు చెప్పండి."
    "రేపు నేను మళ్ళా బాబ్ హౌస్ లాగా కనిపించే ప్రమాదముటుందేమో ."
    "వండర్.....యూ లైక్ హిమ్మా?"
    "....."
    "ఏం సార్ . మీకు బాబ్ హోసంటే యిష్టమా? అవుతే , మీరూ యింగ్లీషు సినిమాలు చూస్తారా? మరి జెర్రిలూయిస్ తెలీనట్టు నటించారే . బలేవారండీ."
    "సినిమాలు చూడటం తప్పుకాదు గానీ, అదే ఒక గొప్ప క్వాలిఫికేషన్ గా భ్రమిస్తే పొరపాటు. నాలాటి గుమస్తా ఇంగ్లీషు సినిమాలు చూడరదనే రూలేమైనా ఉందా? నేను మీలాగా చాలా సినిమాలు చూసేను. జెర్రీలూయిస్, బాబ్ హోప్ కాదు.....డేనీకెయీ, నార్మన్ విస్ డమ్ , రెడ్ స్కేలేటన్ , డీన్ మార్టిన్, ఫ్రాంక్ సినేట్రా యెట్ పెట్రాలు నాకూ తెలుసు. అంతమాత్రాన ఎదుటి మనిషిని పట్టుకుని, నాకు తెలిసిన ఈ జాబితాలని వాళ్ళ ముందుంచి వాళ్ళని తక్కువగా అంచనా వేసే అలవాటు నాకు లేదు. ఇందిరా! మీరింకా ఇప్పుడిప్పుడే సినిమాలు చూస్తున్నారు. నేనెప్పటినుంచో చూస్తున్నాను, గాని నా సరదాలతో పరీక్షలు పోగొట్టుకోలేదు. నా సరదాల తోటి మనుషుల్ని విసిగించలేదు. ఈ మాత్రం బోడి సరదాలు లేనివారే గుమాస్తాలుగా స్థిరపడతారని మీరనుకుంటే అది కేవలం మీ అజ్ఞానం."
    ఇందిర తల దించుకున్నది. కాసేపటికి తల యెత్తి అన్నది -
    "క్షమించండి మాస్టారూ!"
    శ్రీనివాసరావు అనందించలేదు.
    "వెరి గుడ్. మీరు మంచివారు."
    ఇందిరకి అతను వెంటనే అర్ధమయ్యేడు కాడు.
    "రేపటి నించి నేను మీకు పాఠాలు చెబుతాను. ఈ పరీక్షలో మీరు పాసవుతారు. ఆ పూచీ నాది. ఇవాళకి మాత్రం సెలవు."
    అతను లేచి నించున్నాడు.
    ఇందిర కూడా లేచి అతనితో పాటు గుమ్మం వరకూ నడిచి , అక్కడ నుంచుని నమస్కారం చేసింది.
    అతను వస్తూ అనుకున్నాడు.
    "పాపం పసిపిల్ల! అనాగరికంగా జమ కట్టింది, జర్రీలూయిస్ ట!
    షి లైక్ హిమ్మట!"
    అతను రోడ్డంట నడుస్తుండగా అమ్మ గుర్తుకు వచ్చి భయపడ్డాడు. ఇప్పుడింత తొందరగా యింటికి వెళ్ళడంలో సుఖం లేదని అతను గ్రహించేడు. చుట్టుతా చూడగా అతనికో అందమైన సినిమా తాలూకు ప్రకటన కనిపించింది. అ సినిమా గురించి ఏడుకొండలు ఆఫీసులో గొప్పగా చెప్పేడు. ఆ సినిమాలో కధానాయకుడు విచిత్ర వేషాలు వేసి యెంతమందిని మోసం చేశాడో , కత్తి పట్టుకుని ఎందర్ని ఎదిరించాడో, అతన్ని ఎందరందగత్తెలు ప్రేమించారో , చివర్న మాంత్రికుడిని ఆ కధానాయకుడెంత తెలివిగా సంహరించేడో - వగైరాలు ఏడుకొండల్ని బాగా ఆకర్షించేయట.
    నిజజీవితంలో చేదుని భరించలేని మనిషి కాల్పనిక జగత్తులోని తీపిని కొన్ని గంటలపాటైనా అనుభవించడమే కాకుండా కొన్ని రోజుల పాటు ఆ జ్ఞాపకంలో బతుకుతూ చేదుని దిగమింగ గలుగుతాడు.
    కనక సామాన్య మానవుడికి ఈ సినిమాలు చాలా అవసరం. ఏడుకొండలూ శ్రీనివాసరావే కాదు మరో వెంకట్రావైనా సరే ఈ సత్యాన్ని ఒప్పుకు తీరాలి . ఈ ధర్మసూత్రాన్ని గమనించి పెద్దలు లక్షలు వెచ్చించి యిలాంటి సినిమాలు తీసి -
    "వెర్రి మనిషి రా! నీ కోసమే మేము ఎన్నో లక్షలు వెచ్చించి అధికంగా శ్రమించి ఒక చక్కటి తాయిలం తయారుచేసి, అతి చౌకగా నీకు అమ్మబోతున్నాం. ఈ మజా అనుభవించు. అస్తమానం దిగులు మింగే జాతకం నీదని మాకు తెలుసు. నీకీ సమయంలో విశ్రాంతి అవసరం. అందుకోసమే - నిన్నుద్దరించే నిమిత్తమే మేమింత  ప్రయత్నం చేసేం. తొందరగా రా!" అని పేరెట్టి మనుషుల్ని పిలవకుండానే డబ్బు సంపాయిస్తున్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS