Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 12


    "అనుకోనీ....... నీకు భయమా!"

    "నాకేం భయంలేదు. మాకు పరువుప్రతిష్ఠ మోతాదుగానే ఉన్నాయి మీకు కాస్త ఎక్కువ, అవి పోతాయి......" అన్నాడు.

    "పోనియ్యి........." చటుక్కున అతని చెయ్యిపట్టుకుని. భుజంపై తల వాల్చింది.
 
    "శ్రీనూ! ఐ లవ్ యు........అయి లైక్ యు - అన్నది.

    శ్రీనివాస్ పకపక నవ్వాడు.

    "లైలా మజ్నులమా, రోమియో జూలియెట్లమా -"

    చటుక్కున అతని నోరు మూసింది.

    "లేదు శ్రీనూ - నిజంగా .......నువ్వలా అనుమానంగా మాట్లాడితే నా తల బద్దలు కొట్టుకుంటాను" అన్నది.

    "మా చిట్టే, మా బుజ్జే! త్వరగా కొట్టుకోమ్మా. తలలో దూరిన పైత్యం తగ్గిపోతుంది" అన్నాడు.

    దాంతో రాధికకు కోపం వచ్చింది. రెండు, మూడు రోజులు అతనితో మాట్లాడలేదు.

    నాల్గోరోజు శ్రీనివాస్ వెంట, వెంట వచ్చాడు.

    "రాధికా! నువ్వు ఏదో చెబితే జోవియల్ గా తీసుకున్నాను. నిజంగా నిన్ను చూడకుండా, మాట్లాడకుండా ఉండలేనేమో.." అన్నాడు. 

    "అలాగా! రోమియోవా, మజ్నూవా!"

    "ఉహు! శ్రీనుని - నిజంగా రాధికా! కళ్ళు మూసినా, కళ్ళు తెరిచినా నీవే కనిపించావు" అన్నాడు అప్యాయంగా. చేతిలో చేయి పెనవేసి. ఆ చేతిని తన చేత్తో అల్లుకుపోయింది.
 
    "శ్రీనూ!"

    "రాధికా -"

    "శ్రీనూ! ఈ మాట మరిచి పోతావా!"

    "నాకు మరిచిపోవాల్సిన అవసరం, అవకాశం లేవు. నీకే ఉన్నాయి."
 
    "నాకెందుకున్నాయి!"

    "మీ వాళ్లు నీకు నాలాంటి బీదవాడిని ఎంపిక చేయరు రాధికా? వాళ్ళు లక్షాధికారి సంబంధం చూస్తారు."

    "చూస్తే............"

    "నువ్వు చిక్కుల్లో పడతావు"

    "ఏం లేదు. మానాన్న నామాట వింటాడు. నీ ఇష్టం అమ్మడూ మీ ఇద్దరన్నలతో పాటు ఇచ్చే భాగం తీసుకుని సుఖంగా ఉండు." అంటాడు.

    "ఉహు! మళ్ళీ ఆ శ్రీనుగాడితో కనిపిస్తే పాతేస్తాను అంటాడు. అప్పుడు నువ్వు ఏడుస్తావ్........"

    "ఏడ్చావ్!"

    "అబ్బే నేనెందుకు ఏడుస్తాను. ఒక్కసారి మర్యాదగా మాట్లాడి ఆ తరువాత అలనాడు సంయుక్తను పృధ్వీరాజు ఎత్తుకువచ్చినట్టు ఎత్తుకు వస్తాను" అన్నాడు.
 
    "శ్రీనూ......" అతన్ని హత్తుకుంది. అది పబ్లిక్ పార్క్ అని మరిచిపోయింది. అతను ఈమెను దూరంగా జరిపాడు.

    "ఇది పబ్లిక్ పార్క్ ప్రియతమా!"

    "ఫో-" అన్నది ఎర్రబడిన ముఖం అతనికంట పడరాదని తలవంచుకుని, నిలబడింది.
 
    "రాధికా! నీ మనసు తెలిసినా, మీ నాన్న విషయం బాగా తెలిసిన వ్యక్తిగా ఓ సలహా ఇస్తాను. మనము ఓ రెండేళ్ళు పెళ్ళిమాట తలపెట్టవద్దు. అన్ ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేటుగా ఏదయినా ఇండస్ట్రీ స్థాపిస్తాను. నా వ్యక్తిత్వం నిరూపించుకున్ననాడే ధైర్యంగా వచ్చి మీనాన్నను అడుగుతాను.

    "నేను అదే ఆలోచిస్తున్నాను శ్రీనూ! నేను బిఎస్సీ. కాగానే బియ్యిడీ చేస్తాను. ఎక్కడయినా ఉద్యోగం దొరుకుతుంది"

    "ఉహు! నా రాధిక ఏడు మల్లెపూల ఎత్తు సుకుమారి."

    "ఏం కాదు. అవసరం అయితే ఆదిశక్తి అవుతుంది"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS