Previous Page Next Page 
ఆచరణ లో అభ్యుదయం పేజి 12


    'నాతో ఏం మాట్లాడతారు? నా చరిత్ర అంతా చెప్పమంటారు. అంతేగా. నాలాంటి వాళ్ళ కధలు వినటానికి మీకు వినోదం గా వుంటుందే తప్ప నా సమస్యని ఏ విధంగానూ పరిష్కరించ లేరు.' అనాలనిపించింది కాని, తన ఆలోచనలతో నూ, కష్టా కష్టాలతో నూ నిమిత్తం లేనట్లే , 'అలాగే' అన్నట్లు తల ఆడించేసింది. గుడ్లు అప్పగించి చూస్తూ, 'సరే నేను వెళ్తున్నాను. నువ్వు త్వరగా వస్తావు కదూ.' అనేసి మురళీ వెళ్ళిపోయాడు.
    'ఛ, నాకసలు బుద్ది లేదు. అతను ఒక్కసారి పిలిచేసరికి అంతా మరిచిపోయి అలాగే అంటూ తల తాటించాను -- అయినా అసలు నాతో మాట్లాడటాని కేముంటుంది? ఆవాళ అలా రూడ్ గా వెళ్ళిపోయారు కదూ, ఇవాళ కాస్త నెమ్మదిగా నచ్చ చెప్పే ధోరణి లో మాట్లాడతాడేమో -- 'నా పరిస్థితి నువ్వు కొంచెం అర్ధం చేసుకోవాలి కళ్యాణి-- అమ్మా వాళ్ళని ఒప్పించగలననే ధైర్యం నాకెంత మాత్రం లేదు. వాళ్ళని వ్యతిరేకించి ఈ పెళ్లి చేసుకుంటే ఇంక వాళ్ళని దూరం చేసుకున్నట్లే అయిపోతుంది-- నా ఒక్కడి సంతోషం కోసం వాళ్ళందర్నీ బాధ పెట్టడం నాకు ఇష్టం లేక పోయింది-- అందుకే నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళు చూపించిన అమ్మాయి మెడలో తాళి కట్టటానికి అంగీకరించాను. ఇదంతా నీకు చెప్పాలనీ నీ దగ్గర క్షమాపణ కోరుకోవాలని వచ్చాను.' అంటాడే మో బేల మొహం పెట్టి...'అసలు నేనిప్పుడు అక్కడికి వెళ్ళకపోతేనేం? కాస్సేపు చూసి చూసి విసుగొచ్చి అతనే తిరిగి వెళ్ళిపోతాడు. ' అని పౌరుష పడిన మనస్సు కాస్సేపటి లోనే మళ్లీ సరళంగా మారిపోయి 'ఏమైనా కాని, అతను చెప్పేది వినాలి. అడిగింది చెప్పాలి.' అని నిశ్చయించుకుని తలుపుకు తాళం పెట్టి బయలుదేరింది.

                           *    *    *    *
    ఆఫీసు నుంచి వచ్చి కాళ్ళూ మొహం కడుక్కుని తీరుబడిగా గదిలో మంచం మీద పడుకుని పేపరు చదువు కుంటున్నాడు వాసు-- ఇంతలోవాసూ అన్న పిలుపూ వీధి తలుపు తడుతున్న చప్పుడూ వినిపించి లేచి వెళ్లాడు పేపరు చేత్తో పట్టుకునే.
    తలుపులు పూర్తిగా తెరవకుండానే పలకరించేశాడు మురళీ. 'ఈ వేళప్పుడు ఇంట్లో వుంటావో వుండవో అనుకుంటూ వచ్చాను...ఉన్నావు' అంటూ.
    'ఏం చేస్తాను-- ఊరంతా తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి కాని కాలం గడిచినట్లే కనిపించటం లేదు-- సరే. ఇంట్లో కూర్చుని పేపరయినా చదువు కుందామని వుండిపోయాను.....ఏమిటో, ఒక్కొక్కసారి మరీ తిక్కగా వుంటుంద నుకో ఈ వంటరి తనం ' స్నేహితుడికి కుర్చీ చూపిస్తూ తనూ మరో కుర్చీలో కూర్చున్నాడు వాసు.
    'అక్కయ్య ఇంకా ఎప్పుడు వస్తారు-- ఇంతగా ఆపసోపాలు పడకపోతే ఆవిడ్ని త్వరగా వచ్చేసేయమని వ్రాయకపోయావా'
    'వ్రాస్తే వచ్చేస్తుంది, తనకేం అలాంటి అభిప్రాయాలు లేవు-- బొత్తిగా పసివాడితో చేసుకోలేక ఇబ్బంది పడిపోతుందని అక్కడయితే కాస్త విశ్రాంతి గా వుంటుందనీ నేనే వుండ మన్నా మరి కొద్ది రోజులు-- ఇంకెంత-- పదిహేను రోజులు లలో వచ్చేస్తుంది....నాన్న దగ్గరికి వెళ్లి పోదాం అని పాప ఒకటే మారాం చేస్తోందిట. దీన్ని పట్టుకోటం నా తరం కావటం లేదు. అంటూ వ్రాసింది ' అన్నాడు వాసు భార్యనీ, పిల్లల్నీ తలుచుకుంటూ.
    'ఈ నాలుగు నెలలకే ఎన్నాళ్ళో అయి పోయినట్లుంది పాపని చూసి!' అన్నాడు మురళీ తను చెప్పాలని అనుకున్నది ఎలా మొదలు పెట్టాలా అని వో చెంప ఆలోచిస్తూనే.
    'ఊ....ఇంకా ఏమిటి విశేషాలు.' స్వంత గోడుకి స్వస్తి చెప్పి స్నేహితుడికి అవకాశం ఇచ్చే ధోరణి లో అడిగాడు వాసు.
    'విశేషమే వుంది మరి. నీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను ప్రత్యేకంగా.'
    'ఊహూ ...ప్రత్యేకంగా నా సలహా కావలసి వచ్చే విషయం ఏమయి వుంటుందబ్బా.' సగం హాస్యంగానూ, సగం ఆసక్తి గానూ అంటూ మురళీ మొహంలోకి చూశాడు వాసు.
    మురళీ చటుక్కున కళ్ళు వాల్చేసు కుని చేతి వేళ్ళ వంకా ఆ తరువాత షూ లేసుల వంకా చూస్తూ కూర్చున్నాడు కాస్సేపు.
    స్నేహితుడి ధోరణి కి విస్మయంగా కళ్ళు చిట్లించి కుతూహలంగా అతన్నే పరికిస్తున్నాడు వాసు. అంతలో మురళీ మౌనానికి స్వస్తి చెప్పి, 'నేను పెళ్లి చేసుకోవాలను కుంటున్నాను.' అని మెల్లిగా చెప్పటంతో  , బిగపట్టి వుంచిన వూపిరి ఒక్కసారిగా వదిలేసి ఫెళ్ళున నవ్వుతూ స్నేహితుని వీపు మీద ఆప్యాయంగా ఒక్క చరుపు చరిచాడు వాసు-- మురళీ ఆ ఆర్భాటాన్ని భరించ లేనట్లు సిగ్గుతో ఇంకా ముడుచుకు పోయాడు.
    'వోయి నీ అసాధ్యం చల్లగా వుండ- నీ సస్పెన్సు చూసి ఇంకా ఏమిటో అనుకున్నాను-- పెళ్లి మాట చెప్పటానికి ఆడపిల్లలా ఇంతసేపు సిగ్గుపడి పోయావేమిటి?....ఊ, సరేలే....ఇంతకీ పెళ్లి చూపులు ఆయాయా? సంబంధం ఏ వూరు? పెళ్లి కూతురు ఏం చదువు కుంది? కట్నం ఎంత ఇస్తామంటున్నారు? అన్ని సంగతులూ చెప్పు మరి' వాసు తీరికగా కుర్చీలో జారబడి కూర్చుని చనువుగా అన్ని వివరాలూ అడుగుతుంటే , మురళీ మొహం అదోరకంగా ముడుచుకు పోయింది.
    "నీతో మాట్లాదాలీ అంటూ వో చెంప నేను మొత్తుకుంటుంటే , నువ్వేమిటి ప్రశ్నలతో ఇలా వూదర గొట్టేస్తున్నావు నన్ను? ' అన్నాడు కాస్త చిరచిర లాడుతూ.
    'వో- ఆమాటే మరిచిపోయెను -- ఊ-- ఏమిటిది?' వాసు మొహం లోంచి కాస్సేపటి క్రితం మాయం అయిపోయిన కుతూహలం ఆసక్తి మళ్లీ వచ్చి కూర్చున్నాయి.
    'కళ్యాణి నేనూ పెళ్లి చేసుకుంటున్నాం' ధైర్యంగా నే వాసు మొహం లోకి చూశాడు మురళీ.
    వాసు చిలిపిగా నవ్వుతూ కొంటెగా స్నేహితుడి వంక చూశాడు. 'నువ్వు ఈ మాట ఏదో ఒకనాడు చెప్తానని మేము అనుకుంటూనే వున్నాం -- ఆవాళ బస్సు దగ్గర నువ్వామేని పరిచయం చేసి నప్పిడు నీ గొంతులో మొహంలో ఏం కనిపెట్టిందో మీ అక్కయ్య మరి-- నాతొ ఒకటి రెండు సార్లు అంది. మా తమ్ముడు ప్రేమలో పడ్డట్టు న్నాడండి అంటూ -- అయితే మంచిదే. ఈడూ జోడూ బాగా కుదిరింది అనేవాడ్ని నేను...మరి ఇంక ఆలశ్యం ఎందుకు ? శుభ్యశ్య శీఘ్రం అన్నారు పెద్దలు....మాకూ త్వరలో పెళ్లి విందు అరగించాలని ఆశగా వుంది.......'-    
    మాటల కోసం తడుముకుంటూ, అసలు నేను చెప్పింది అతనికి ఎంతవరకూ నచ్చుతుంది. అని ఆలోచిస్తూ కొద్ది క్షణాలు మౌనంగా వుండిపోయాడు మురళీ. ఆ తరువాత నిదానంగానే అన్నాడు 'మా వాళ్ళకి ఈ పెళ్లి ఇష్టం వుండదు.....నీలాంటి స్నేహితులు, పరిచయస్థులు పది మందయినా మమ్మల్ని ఆశీర్వదిస్తే..........
    'ఏం?మీ ఇద్దరికీ మధ్య కులాలు అడ్డు వచ్చాయా?'
    'అందరికీ వచ్చే కులాల ప్రసక్తి కాదు. కళ్యాణి బోగం వాళ్ళమ్మాయి .'
    'వాట్?' దిమ్మరబోయాడు వాసు. అంతకన్నా అతని గొంతులోంచి మరి మాటలు పెగిలి రాలేదు. కాని అతని కళ్ళ లోనూ మొహంలోనూ మాత్రం అణుచుకోలేని తొట్రుపాటు, ఆశ్చర్యం, అయిష్టత లాంటి భావాలన్నీ వ్యక్తం అవుతున్నాయి.
    'ఏం? నేను చేస్తున్నది సరి ఐన పని కాదంటావా?'
    'అది కాదు మురళీ......'
    'నీ అభిప్రాయం నాకు అర్ధం అయింది-- అన్ని రంగాలలో నూ అభ్యున్నతిని , పురోగతి ని సాధిస్తూ దేశ ప్రజలంతా సగర్వం గా తల ఎత్తుకుని తిరుగుతున్న ఈ రోజులలో కూడా నా నిర్ణయం విని నువ్వింత ఆశ్చర్య పోతావను కోలేదు-- ముసలి వాళ్ళు, క్రిందటి తరం వాళ్లు ఎలా మాట్లాడినా నీలాంటి స్నేహితులంతా నన్ను అభినందించి, సంతోషంగా మాకు శుభాకాంక్ష లు అందజేస్తారను కున్నాను-- సరే కాని, నేను ఒకటి అడుగుతాను చెప్పు-- కళ్యాణి కి ఏం తక్కువ? అందం వుంది, చదువుంది. ఒకడు వంక పెట్టటానికి ఆస్కారం ఇవ్వని మంచి నడవడి వుంది....నేను భార్యగా కోరుకునే అమ్మాయికి ఇంతకన్నా ఇంకా ఏం కావాలి?'....సంజాయిషీ అడుగుతున్నట్లు, సవాల్ చేస్తున్నట్లు వున్న అతని , ధోరణికి కొద్దిగా విస్తుపోయాడు వాసు.
    'మొదట నీ ధోరణి చూసి నువ్వేదో నా సలహా అడగటానికి వచ్చావను కున్నాను. ఇప్పుడు నీ మాటలు వింటుంటే అంతా నిర్ణయం చేసుకున్నట్లే అనిపిస్తోంది....... అయినా.......
    చూడు మురళీ -- నేను చెప్పేది నువ్వు కొంచెం శ్రద్దగా వినాలి...నీ దృష్టితో చూస్తె కళ్యాణి లో ఎలాంటి లోపం లేని మాట వాస్తవమే -- కాని, మీ అమ్మా నాన్నా వాళ్ళిద్దరి వుద్దేశ్యాలూ ఎలా వుంటాయో ఒక్కసారి అలోచించి చూడు-- పెళ్లి కూతురు అప్సరస ని తలదన్నే అందకత్తె కాకపోయినా కాస్త కను ముక్కు తీరుగా వుంటే చాలు, సంసార పక్షం గా వుంది అని తృప్తి పడతారు. పోనీలే మా కోడలెం వుద్యోగాలు చెయ్యాలా, ఊళ్ళే లాలా, అవున్న చదువే చాలు' అని సరిపెట్టు కుంటారు. ఇవాళ వాళ్ళు పదివేలు కట్నం ఇస్తే మన దగ్గర వుండి పోతుందా ఏమిటి. అమ్మాయే లక్ష వరహాల పెట్టు అని కట్న కానుకల దగ్గర కూడ పట్టుదలలు సడలించుకుంటారు -- కాని మనవాళ్ళు ఈనాటి దాకా అత్యంట్ ప్రాధాన్యత ఇస్తూ ఎంతో వున్నతంగా చూసుకుంటూ వస్తున్నది కుటుంబ సంప్రదాయ మూ , వంశ గౌరవమూ పరువూ ప్రతిష్టా , ఇవే......'
    'ఆ చాల్లెద్దూ....ఆ గోప్పలన్నీ చెప్పుకోవటానికీ వినటాని కీ మాత్రమె బాగుంటాయి. అగ్ని హోత్రం లంటి వంశంలో పుట్టిన వాళ్ళు కూడా అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి వాళ్ళ తల్లి తండ్రులు పదిమంది లో తల ఎత్తుకో లేకుండా చేసిన సందర్భాలు కావలసినవన్నీ చూపించగలను నేను. సదాచార సంపన్నమయిన వంశంలో నీతి మంతుడే పుడతాడనే నియమం లేదు' దొర కడుపునా దొరే పుడతాడనే గ్యారంటీ లేదు....మనిషికీ వ్యక్తిగతమైన గుణం ప్రధానం గానీ, సాంప్రదాయం చట్టుబండలు లంటూ కూర్చోటం లో అర్ధం లేదు'- అంటూ స్నేహితుడి హోతబోధ ని తేలికగా ఎగర గొట్టేశాడు మురళీ.
    'మరి, ఇదే వాదనతో మీ వాళ్ళని ఒప్పించలేవా?' నిశితంగా మురళీ కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు వాసు.
    ఒక్క క్షణం తలబడ్డాడు మురళీ -- ఆ తరువాత మళ్లీ దృడంగానే సమాధానం ఇచ్చాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS