తేలిగ్గా నవ్వింది పద్మజ. "అదేమిటి , నాన్నా? చదువు కోక ఏం చెయ్యను?"
నిజమే, పద్మజ చదువుకోక ఏం చేస్తుంది? కోయిల పాడకేం చేస్తుంది? నెమలి అడకేం చేస్తుంది? పువ్వు పరిమళించ కేం చేస్తుంది? పద్మజ చదువుకోక మరేం చేస్తుంది?
ఈశ్వర సోమయాజి మాట్లాడలేక పోయాడు. పద్మజ అంత తేలిగ్గానూ నవ్వుతూ అంది : "నేను మెడిసిన్ చదవాలనుకొంటున్నాను , నాన్నా!" వజ్రాయుదానికి కూడా చెదరని స్థిరత్వం ధ్వనించిందా మాటల్లో.
కూతురి మొహంలోకి మరీ విస్మయంగా చూశాడు తండ్రి. డాక్టర్! పద్మజ డాక్టర్! అంత పెద్ద చదువు! నిజంగా చదువుతుందా, పద్మజ? నిశ్చలంగా ప్రకాశిస్తున్న పద్మజ కన్నుల్లో విద్యా కాంక్ష! అపురూపమైన ఆ అందాల ముఖంలో వింత తేజస్సు! అద్వితీయమైన స్త్రీ శక్తి ఆ చిరునవ్వులో మెరిసి పోయింది. ఆచేతనుడయ్యాడు సోమయాజి.
"ఆడపిల్లలకి వైద్య శాస్త్రం కన్నా ఉచితమైన చాడువేమిటి నాన్నా? వైద్యవృత్తి ఎంత ఉన్నతమైనదో అంత సున్నితమైనది కదా?అసలు వైద్యం అనేది స్త్రీ చేతుల మీదనే ఎక్కువగా జరగాలి నాన్నా! మనదేశంలో కావలసినంత మంది లేడీ డాక్టర్లు ఉన్నారంటావా, నాన్నా? అందుకే నేను డాక్టరీ చదవాలని ఉంది. అవకాశం వస్తే విదేశాలు కూడా వెళ్ళి చదువుకుంటాను.."
"అమ్మా! పద్మా!" ఆనందం, దుఃఖం ఒక్కసారిగా పెనవేసుకు వచ్చాయి సోమయాజి కి. ఆవేశంగా కూతుర్ని గుండెలకు హత్తుకున్నాడు అయన హృదయ భారం తీరిపోయింది. గులాబీ రేకుకన్నా తేలికై గాలిలో తేలిపోయింది. తీర్చిదిద్దిన మార్గం కళ్ళ ముందు దీటుగా మెరిసింది. అవును, పద్మజ అందరిలా సామాన్యమైన ఆడపిల్ల కాదు. సాక్షాత్తూ చదువుల తల్లి సరస్వతీ దేవే తన గర్భాన జన్మించింది. తను కన్న బిడ్డ తమ వంశానికే అపారమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెడుతుంది. ఇక తను ఎంతమాత్రం సంశయించడు. పురాతనాచారాలకు తలవంచడు. పద్మజ డాక్టర్ కావాలి. అంతే. ఆ పసి హృదయాన్ని నొప్పించే శక్తి తనకే కాదు, భగవంతుడికి కూడా లేదు!
"నాన్నా! ఏమిటి, నాన్నా, అంతగా ఆలోచిస్తున్నావు?"
"అమ్మా! ఎన్నడైనా నీ ఇష్టానికి వ్యతిరేకంగా జరిగిందా? నాకే కాదమ్మా, నిన్ను ఆటంక పరిచే శక్తి ఎవ్వరికీ లేదు. నీకు కావలసినంత వరకూ చదువుకో, అమ్మా! నీకు సంతోషం కలిగేంతవరకూ ,సంతృప్తి నిచ్చెంత వరకూ చదువుకో. నీ కోరిక తీర్చగలగటం కన్నా మరి నాకు--" ఆనందాతిశయంతో అయన కళ్ళు చేమర్చుతుంటే చిత్రంగా చూసింది పద్మజ. తన కోరికతో అంత చలింప జేసే విషయం ఏం ఉందనీ? అవకాశాలు కల్పిస్తే ఏ ఆడపిల్ల మాత్రం డాక్టర్ కాలేదు? అదేమంత సాహస మైనదీ, దుర్లభమైనది కాదే!
"ఏవిటండీ అలా కూర్చున్నారూ? ఏవిటైందీ?" వరండాలో పోతూ తొంగి చూసిన కామేశ్వరమ్మ ఆత్రుతగా లోపలికి వచ్చింది. భర్త మాట్లాడక పోయేసరికి -- "ఏవిటమ్మా, పద్మా? ఏమైంది? నాన్నగారలా ఉన్నారేం?' అంటూ కూతురి కేసి చూసింది.
"ఏమీ లేదమ్మా! నేను.....కాలేజీ కి ....."
"నువ్వు వెళ్ళమ్మా! లోపలికి వెళ్ళు." తండ్రి అజ్నాపించినట్టే అనటంతో పద్మజ మౌనంగా లోపలికి నడిచింది.
"మీ అక్కయ్య ఇంకా పెద్ద చదువు చదువుతానని అడుగుతోంది. అర్ధమైందా నీకు?" పార్వతి మాటలకు అమితాశ్చర్యంగా చూసింది సుజాత--" ఇంకా పెద్ద చదువా? అమ్మో!"
"అలా భయపడకూడదు మరి. నువ్వూ అక్కయ్య లా చదువు కోవూ?' సుజా గడ్డం ఎత్తి భోదిస్తున్న పార్వతి భుజం మీద నవ్వుతూ చెయ్యి వేసింది పద్మజ. "ఎంత సేపైంది నువ్వొచ్చి?"
"పార్వతి అక్కయ్య నా దగ్గరే కూర్చుంది అక్కయ్యా! నువ్వు నాన్నగారితో మాట్లాడుతున్నావని....." కుతూహలంగా తనే కల్పించుకుని చెప్పింది సుజాత. అక్కయ్యతో ఎంత ఎక్కువగా మాట్లాడితే సుజా కు అంత సంతోషం. పార్వతి, పద్మజ చెయ్యి పట్టుకుంది. "నువ్వు అదృష్టవంతురాలివి పద్మా! పెద్ద డాక్టరై నప్పుడు నన్ను మరిచి పోవుగా?"
"నేను మరిచిపోతే నీకేం నష్టం , పారూ?"
"అమ్మో! అలా ఊరుకోను. దీర్ఘరోగినై నీ హాస్పిటల్ లో పడి ఉంటాను గానీ నిన్ను మరిచి పోనివ్వను."
'చాల్లే నీ మాటలు." కోపంగా చూసింది పద్మజ. "ఇంతకాలం కలిసి చదువుకుని ఈనాడిలా విడిపోవాలంటే నాకెంత బాధగా ఉందొ ఎలా చెప్పను, పారూ?"
పార్వతి ఆశ్చర్యంగా చూసింది. "నిజంగా నేను లేకపోతె నీకు బాధగా ఉంటుందా పద్మా?"
'అదేమిటి పారూ? నన్ను నువ్వు ఇంతేనా అర్ధం చేసుకున్నది?" పద్మజ మాటల్లో తొణికిసలాడిన వేదన పార్వతి మనస్సుకు ఊరట కలిగించింది. "నీ మనస్సు నాకు తెలుసు, పద్మజా! ఎక్కడి కక్కడ సంతృప్తి పడటం తప్పితే మనం చెయ్యగలిగిందేముంది చెప్పు? నన్ను కాలేజీ చదువులు చదివించమని నాన్న నెలా అడగమంటావు? మా ఇంటి పరిస్థితి నీకు తెలియనిది కాదు గదా? ఈమాత్రం చదవగలిగినందుకే ఓ అదృష్టంగా భావిస్తున్నాను నేను."
"నిజమే పారూ!" అంది పొడిగా పద్మజ. "పోనీ , రఘుబాబు కాలేజీలో చేరుతున్నాడా?"
"నిజం చెప్పాలంటే రఘు కి ఏమంత చదువు మీద ఆసక్తి లేదు, పద్మా! అయినా, మామయ్యా కాలేజీ లో చేర్పిస్తాననే అంటున్నాడులే."
"రఘుబాబు బాగా చదవాలి , పారూ?" లేకపోతె అతను జీవితంలో రాణించలేడు. పిరికి వాడు. అలా అంటే అతనికి కోపం రాదు చూడు"అంటూ నవ్వింది పద్మజ కూడా నవ్వుతూనే అంది: కాని, ఓవ్యక్తి లోపాన్ని పదే పదే ఎత్తి చెప్తోంటే అతను మరీ క్రుంగి పోతాడేమో ఆలోచించావా?"
విస్మయంగా చూసింది పద్మజ. "రఘు బాబుని అన్నానని నీకు కోపం వచ్చింది కదూ?"
"ఛ! నాకేం కోసం రాలేదు! కాని, రఘూ ని నువ్వలా వెటకారం చేస్తే నాకు నిజంగా జాలి వేస్తుంది."
"క్షమించు, పారూ! రఘూ పిరికితనాన్ని ఎవరు విమర్శించకపోయినా అది అలానే ఉంటుంది. నువ్వే దాన్ని పోగొట్టటానికి ప్రయత్నించాలి. ఆ హక్కు నీకు ఉందనుకుంటాను."
సిగ్గుపడింది పార్వతి. ఆ ఇద్దరి మాటలూ బొత్తిగా అర్ధం కాక తెల్లబోయి చూస్తూ కూర్చుంది సుజాత.
"అమ్మాయ్ , పద్మజా! ఇటురా ఒక్కసారి." ఉరుముల్లేని పిడుగులా హుంకరిస్తూ పిలిచింది కామేశ్వరమ్మ. తెల్ల బోయిన పద్మజ పార్వతిని కూడా వెంటబెట్టుకు వెళ్ళింది.
కూతుర్ని ఓసారి ఎగాదిగా చూస్తూ అంది కామేశ్వరమ్మ. "నాన్నగారేమంటున్నారో విన్నావూ? నిన్ను డాక్టరమ్మ చదువు చదివిస్తారట."
'అవునమ్మా! ముందు నేనే చదువు కుంటానన్నాను. నాన్నగారు అలాగే చదివిస్తానన్నారు."
"చాల్లే! నోరు మూసుకో. " విరుచుకుపడింది కామేశ్వరమ్మ. "అగడానికైనా హద్దూ పద్దూ ఉంది. ఇప్పటికి చదివింది చాలు. ఎంత చదివి మాత్రం ఆడపిల్ల ఏం చేసుకోను? ఓ అయ్య చేతిలో ధారపోయ్యటానికేగా? కాస్త లక్షణమైన సంబంధం చూసి ఆ మూడు ముళ్ళూ వేయించేసి మా భారం తీర్చు కోవాలని చూస్తోంటే మధ్య నీ పెంటకం ఏమిటి? ఈడేరిన ఆడకూతురివి. ఇంకా ఎన్నేళ్ళు చదివితే ఆ డాక్టరు చదువు పూర్తిగాను? నిక్షేపం లా పెళ్ళి చేసుకుని కాపరం చేసుకో."
పద్మజకు నవ్వు వచ్చింది. అమ్మ మాటలు వింటూ అలాగే నిలబడింది. భయపడి బిక్కమొహం పెడుతుందేమో అనుకున్న పద్మ నిర్లక్ష్యంగా చూస్తూ నిలబడితే ఆశ్చర్యమే కలిగింది పార్వతికి.
కామేశ్వరమ్మ తన ధోరణి మళ్ళా సాగించింది. "నీతోటి పిల్ల పార్వతి ని చూడరాదుటే? నీలా వెర్రి మొర్రి వేషాలు వేస్తుందా? ఇంటి పట్టున కూర్చుని తల్లికి సాయం చేస్తుంది. పెద్దవాళ్ళు చెప్పినట్లు వింటోంది."
వరండా దిగి వస్తూ అనునయంగానే అన్నాడు సోమయాజి: "కాముడూ! నే చెప్పిందంతా పెడచెవిని బెట్టి ఎందుకలా అమ్మాయిని ఆరడి చేస్తావు? మన బిడ్డ పెద్ద డాక్టరై దేశంలోకి వస్తే ఆ పేరు ప్రఖ్యాతులు మనవి కాదుటే? మన తల్లి దయదలిచి దేవుడిచ్చిన వరమే! దాన్ని మనం దక్కించుకోవాలి." భర్త పట్టుదల ఏళ్ళ తరబడి ఎరిగి ఉన్న కామేశ్వరమ్మ కుంపటి ముందు కూర్చుని బొటబొటా కన్నీళ్లు కార్చింది.
* * * *
ఓ నెల్లాళ్ళ తర్వాత--
"శాస్త్రీ! ఇవ్వాళ కాలేజీ తీస్తారంటుంది పద్మ. దగ్గరే ఉండి నువ్వు చేర్పించిరా , పద్మని." తండ్రి అజ్ఞా దిక్కరించలేని శాస్త్రి ముహం ముడుచుకుని లోపలికి వచ్చేశాడు. చెల్లెల్ని ఏళ్ళ తరబడి కాలేజీ లలో చదివించటం విజయ శాస్త్రికి కేమంత ఇష్టంగా లేదు. చదువుకు హద్దేమిటి? అంతేక్కడ? అంతమాత్రం ఆలోచన నాన్నగారి కెందుకు లేకపోవాలి?
అయిష్టాన్ని అణుచుకోలేక పద్మజతో అననే అన్నాడు: "అమ్మని అలా ఏడిపించి నువ్వు కాలేజీ చదువులు చదవకపోతే ఏం, పద్మా?"
పద్మజ సహజంగా నవ్వింది. "నువ్వు అమ్మ కన్నా నాలుగుతరాలు ముందు పుట్టాల్సింది అన్నయ్యా! నేను బాగా చదువుతున్నానని ఏడ్చే అమ్మే నువ్వు బాగా చదవటం లేదని కూడా ఏడుస్తోంది అప్పుడప్పుడూ. పాపం, ఇద్దరం అమ్మని ఎడిపిస్తున్నాం."
శాస్త్రి మొహం ఎర్రబడి పోయింది. చదువు విషయంలో తనెంత నిర్లక్ష్యం చేస్తున్నాడో పద్మజకు తెలియందేమీ కాదు, లేకపోతే ఈసరికే తను బి.ఎల్. పరీక్ష పాసు కాగలిగేవాడు.
"నీకెందుకు శ్రమ? నేను వెళ్ళగలను లే అన్నయ్యా" అంటూ జోళ్ళు తొడుక్కుని పద్మజ బయల్దేరుతుంటే ఎడమొహం పెడ మొహం గానే చెల్లెల్ని అనుసరించాడు శాస్త్రి.
