Previous Page Next Page 
చదరంగం పేజి 12


    "నీ ఇష్టం, అమ్మా నీమాట కాదన్నానా? అడుగు. అడగడం కాదమ్మా. ఆజ్ఞాపించు." మెడిసిన్ పూర్తి చేసి వచ్చిన రాము తల్లితో అన్నాడు.
    "ఇటు రా, రామా!" మెల్లిగా పిలిచి పడుకొన్న మంచంమీద జరిగి చోటిచ్చింది. కూర్చున్న రాము మొహంలోకి చూస్తూ అంది: "భారతీదేవి నీకు మామయ్య కూతురు. రవి చెప్పాడా నీకు?"
    "నాన్నగారే చెప్పారమ్మా అన్ని విషయాలూ తమ్ముడు వైదేహి గురించి ఎప్పుడో చెప్పాడు. అప్పటికి బంధుత్వం తెలియదమ్మా. అసలు రవి హృదయం దెబ్బతింది. మంచిపని చేశాడు కదమ్మా?"
    భారతి నిట్టూర్చింది. "నువ్వు వట్టి అమాయకుడివి, రామూ."
    ఉలిక్కిపడ్డాడు రాము. "అదేమిటమ్మా ఈవేళ కొత్తగా మాట్లాడుతున్నావు?"
    "చూడు, రామూ నువ్వు పెళ్ళి చేసుకోవూ?"
    "పిల్లని చూడాలి. అప్పుడు కదమ్మా పెళ్ళి?"
    భారతి నవ్వింది. "పిల్లను చూడకపోతే చేసుకోవన్న మాట! సరేలే వాడి బాధ్యత వాడికి తెలిసింది. ఇంకా ఎన్నాళ్ళు, బాబూ, మాతృప్రేమతో మిమ్మల్ని బంధించడం? నువ్వూ ఒక ఇంటివాడివైతే..."
    రాము తల దించుకొన్నాడు. "ఈ రోజుల్లో ఆడపిల్లల తల్లిదండ్రులే అంత బాధపడడం లేదమ్మా. నువేమో కట్నాలు ఇచ్చుకోలేని గంపెడు ఆడ పిల్లల తల్లిలా మాట్లాడుతున్నావు!"
    "అది కాదు, రామూ నీకంటే చిన్నవాడుకదా- వాడికి పెళ్లైతే నీకు ఏమీ అనిపించడంలేదూ?"
    "ఏమోనమ్మా. నాకేమీ అర్ధం కావడంలేదు. ఇవాళేదో వింతగా మాట్లాడుతున్నావు. వాడికి పెళ్ళి అయితే నాకు ఈర్ష్య దేనికమ్మా? వాడూ, భారతీదేవి సుఖంగా ఉంటే మనకి లాభం కదమ్మా!"
    భారతి నిట్టూర్చింది తల్లి మంచంమీద కూర్చొని తిరిగి వెళ్ళిపోయాడు రాము.

                               *    *    *

    ఆట జోరుగా సాగుతూంది. కొత్త పిక్చర్ కావడం వల్ల రద్దీ కూడా బాగానే ఉంది. కథ మంచి సస్పెన్సులో ఉండగా 'విశ్రాంతి' అంటూ హాలంతా లైట్లు వెలిగాయి. వెనక సీట్లో కూర్చున్న రాము హాలంతా పరికించి చూశాడు. ఎక్కడా గాలి ఆడటం లేదు. భారతీదేవి, రవీ వస్తామని ఎందుకో మానేశారు. తనే ఒంటరిగా వచ్చాడు. రవిని వదిలి ఒంటరిగా రావడం ఇదే మొదటిసారి. రవి ఇదంతా మరిచిపోయాడు. చిన్నప్పటినుంచీ ఎంత స్నేహంగా పెరిగారు! సామాన్యంగా అన్నదమ్ముల్లా ఉండేవారా? అమ్మ అందుకే అన్నదేమో - 'రామూ, వట్టి అమాయకుడివిరా నువ్వు' అని.
    పాపం! అమ్మ మనసు ఎంత గాయపడిందో!
    తను వచ్చినప్పటినుంచీ చూస్తూనే ఉన్నాడు. ఏపని చేసినా అమ్మే చేసేది. కానీ ఈవేళ భారతీదేవే చేస్తూంది రవిపనంతా. తలకు నూనె రాయడం, స్నానం చేస్తూంటే వీపు రుద్దడం. తను బియ్యే చదివింది కదా! ఈపాటి ఆలోచించలేకపోయిందా?
    తన ఒకడి తలమీద నూనె రాసి ఎక్కువైన నూనె రవికి రాద్దామనకొన్న అమ్మ 'రవీ!' అని పిలిచి తన తలకే రాచుకొంది.
    అన్నం వడ్డించి ఇద్దర్నీ పిలుస్తే రవి ఆకలికావడం లేదన్నాడు. నిజంగా ఆకలి కాలేదా రవికి? తెల్లవారకుండా ఆకలి అంటూ లేచే రవి, భారతీదేవి రాగానే అన్నిటిలాగానే ఈ అలవాటు కూడా మార్చుకొన్నాడా?
    రాము మనసు మధనపడసాగింది. తనుకూడా పెళ్ళి చేసుకొంటే అమ్మనూ, నాన్నగారినీ ఇలాగే నిర్లక్ష్యం చేయవలసి వస్తుందేమో? ఎక్కడో, ఎవరికో సేవచేసి డబ్బు సంపాదించే బదులు, అమ్మకూ, నాన్నగారికీ దగ్గరే ఉండి వాళ్ళిద్దర్నీ తృప్తిపరిచి తను ఆనందిస్తే చాలదేమిటి?
    రాము ఆలోచనలు ఆగిపోయాయి. లైట్లు ఆరిపోయి ఆట ప్రారంభం. అయింది. రాము కళ్ళు స్క్రీన్ మీద నుంచి ముందు సీట్లోకి పడి ఆగిపోయాయి. ఆట సాగుతూనే ఉంది. రాము పక్కనే ఉన్న ఖాళీ సీట్లోకి వచ్చి కూర్చుంది విష్ణు. "ఎప్పుడు వచ్చావు, బావా? సేల్వుఅకు మా ఊరు వస్తానని అమ్మ అంది, నిజమేనా?" విష్ణు జరిగిన సంఘటనలన్నీ మరిచిపోయి నట్లు చక్కగా మాట్లాడుతూంది.
    రాము హృదయం మీద బలంగా ఇనప గుండు విసిరినట్లైంది. ఆరోజు కాలేజీలో అంత అవమానం జరుగుతూంటే, ప్రిన్సిపాల్ నలుగురి ఎదుటా నిలదీసి అడిగితే, ఒక్క మాట అయినా మాట్లాడిందా ఈ విష్ణు? ఛ! ఏం మనుషులు!
    "నేను ఫ్రెండ్ ఇంటికి వచ్చాను. రాత్రికి మీ ఇంటికే రావాలని బయలుదేరాను. ఈ చీకట్లో ఎలా గరా భగవాన్! అని భయపడ్డాను. దేవుడిలా కనబడ్డావు."
    తనేదో నేరం చేసినట్లు అందరూ నవ్వుతూంటే విని ఊరుకొంది. అసలు దోషిని అందలం ఎక్కిస్తే స్వేచ్చగా నవ్వింది. ఇదంతా ఎందుకు చేసింది? తన మీద ప్రతీకారమా?    
    "మాట్లాడవేం, బావా?"
    ఉలిక్కిపడి తెప్పరిల్లాడు. "నువ్వే మాట్లాడుతున్నావు. నన్నసలు మాట్లాడనిచ్చావా? అని. ఏం, బాగా ఉన్నావా?" చీకట్లో రాము మొహం స్పష్టంగా కనబడటంలేదు.
    చనువుగా రాము చేతిని తన చేతిలోకి తీసుకొంటూ అంది: "నువ్వు ఇంకా ఆ విషయం మరిచిపోలేదనుకొంటాను. ఏం చేయను, బావా? ప్రేమకూ, అతనికీ కట్టుబడిపోయాను."
    విష్ణు మొహం ఎలా ఉంటుందో ఊహించలేక పోయాడు. "పోన్లే, విష్ణూ అన్నట్లు పరీక్షలెలా రాశావు?"
    విష్ణు నవ్వుతూ అంది: "ఈ ఏడు పరీక్ష తవ్వేస్తుంది."
    "ఎంత తేలిగ్గా అంటున్నావు! ఎంత ఖర్చు పెట్టి చదివిస్తున్నారో తెలిసే అంటున్నావా?"
    "తెలిసి ఏం చేయగలను చెప్పు? పరీక్ష పోతుందని తెలిసి బాధ పడటం నాకు బాగాలేదు. పోన్లే ఈసారి కట్టచ్చు" అని అదేదో సామాన్యవిషయంలా తోసేస్తూ, "రావిబావ అదేమిటి అలా చేశాడు?" అని ఆశ్చర్యంగా అడిగింది.
    రాము శాంతంగా జవాబిచ్చాడు. "ఎవరి ఇష్టం వాళ్ళది, విష్ణూ మధ్యలో కలగజేసుకొని ఫూల్స్ కావడం తప్ప మరేంలేదు. అయినా వాడిప్పుడు తప్పేం చేశాడు? పెళ్ళి చేసుకొన్నాడు."
    చీకట్లో కళ్ళు పెద్దవి చేసుకొని మరీ చూసింది రామువైపు. "నన్ను దెబ్బ తీయాలనా, బావా? లెట్ ఇట్ బి. రవిబావ నీ తమ్ముడు కాబట్టి సమర్దించావు. మరొకరైతే చెయ్యి పట్టుకొని........"
    "తెలుసు, విష్ణూ అలా చేసి ఒకసారి బుద్ధి తెచ్చుకొన్నాను. మళ్ళీ అలా చేస్తావా?"
    విష్ణు మరి మాట్లాడలేదు.
    ఈ రాత్రి విష్ణును తీసుకొని తనువెడితే నాన్న ఏమనుకొంటారు? అమ్మ ఇప్పటికే బాధపడుతూంది. క్షణం ఆలోచించి, "ఇప్పుడే వస్తా" అంటూ లేచాడు.
    ఎక్కడికి అనికానీ, ఎందుకు అనికానీ విష్ణు అడగలేదు.
    
                                 *    *    *

    మెడమీద కాస్త పైకి చుట్ట చుట్టుకొని ఆకుపచ్చ చీర కటుకొని అవే రంగు గాజులు వేసుకొని అందాన్ని రెట్టింపు చేసుకొంటూ నవీన పద్ధతిలో తయారై మేనమామ ఇంట్లో అడుగు పెట్టింది విష్ణుప్రియ.
    పది గంటలైనా ఇల్లు సందడిగా ఉంది. మెర్క్యురీ లైటు వెలిగించి అందరూ హాల్లో బాతాఖానీ కొడుతున్నారు. భారతీదేవి వంట ఇంట్లో ఏదో చేస్తూంది.
    "అంతా బాగున్నారా, విష్ణూ?" భారతి అడిగింది.
    "అత్తా! నువ్వు చాలా పెద్ధదానివైపోయావు. అప్పుడు ఇంత ఉండేదానివి." విష్ణు కొంటెగా నవ్వింది.
    "నువ్వింకా పాపాయిలా అలాగే ఉన్నావు. అమ్మా! పాపాయిని ఎత్తుకొని ఉగ్గుపెట్టి గోరు గోరు ఆమ్..తినిపించు." రవి పరిహాసం చేశాడు.
    "చూడత్తా. నీ కొడుకులు బుద్దిమంతులన్నావు. మరి ఇప్పడేమంటావు?"
    భారతి పరిశీలిస్తూ, "ఇంకా ఆ చేతుల్లేని గౌను తొడుక్కుని మీ అమ్మ చంకలో ఉన్నట్లే ఉంది. అప్పుడే ఎంత ఎదిగిపోయావు!" అంది.
    "అన్నట్లు, బావా! మీ ఆవిడను చూపించనేలేదు. అత్తా! బావ పెళ్ళాన్ని దాచుకొన్నాడా ....అయ్య బాబోయ్! కండ తేలేలా గిల్లేశాడు రవి. కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి. నీ పెళ్ళాం ఎలా వేగుతోందో బాబూ!" చేతిని రాసుకొంటూ అంది విష్ణు.
    "దాని ఒళ్ళు కాయగాచిపోయింది." రవి నవ్వుతూంటే భారతి మెల్లగా చివాట్లు వేసింది-" తప్పుకదు, రవీ! ఇంకా అది చిన్నపిల్లనుకొంటున్నావా" అంటూ.
    పదకొండు కొట్టారు దూరంగా. అందరూ నిద్రకు ఉపక్రమించారు. రాము వాలు కుర్చీలో కూర్చొని ఆలోచించసాగాడు. రవి మారలేదు. ఇదివరకు మాదిరి గానే ఉన్నాడు. తనే అపోహపడ్డాడు.
    "ఫోన్ చేస్తే కాని నిన్ను నమ్మననుకొంటున్నావుట్రా, రామా! నమ్మకపోతే ఫోన్ చేసి నాటకం ఆడుతున్నావు అని కూడా అనుకోవచ్చుగా?" వేణు గోపాల్ తన చుట్టూ మఫ్లర్ చుట్టుకొంటూ అన్నాడు.
    తండ్రీ గొంతు విని లేచి నిలబడ్డాడు రాము. "కాదు, నాన్నగారూ! ఇదివరకే....."
    "అవును. ఇదివరకే నీమీద అనుమానంలో ఉన్నాను. ఈవేళ ఇలా తీసుకువస్తే ఇంట్లోంచి గెంటేస్తాననుకొన్నావేమిట్రా?"
    భర్త వెనకే భారతీ వచ్చింది. "ఆమాట కూడా చెప్పేయండి."
    "మీ అమ్మ ఏమంటోందో వింటున్నావా, రామా!"
    "నాకేం అర్ధం కావడంలేదు, నాన్నగారూ."
    "ఆమధ్య రాధకి ఒంట్లో బాగులేకపోతే వెళ్ళాను. నిన్ను చూడాలని అనుకొంది." సిగరెట్ పొగలు పోగాలుగా వదులుతూ అన్నాడు.
    "చూడు, రామూ! నువ్వు డాక్టరువి. విష్ణు కూడా డాక్టరు. ఇద్దరికీ ఇచ్చి చేస్తే బాగుంటుందని రాధ ఉద్దేశ్యంరా."
    అదిరి పడ్డాడు రాము.
    "వింటున్నావా,మ్ రామూ? మీ అమ్మకు కూడా ఇష్టమే. పోతే ఇప్పటివరకూ నిన్నేదీ అడగలేదు మేము. ఏమంటావురా? నీకు ఇష్టమో, లేదో రెండే మాటల్లో చెప్పేయి."
    రాము మనసంతా శూన్యం అయిపోయింది. "నన్ను కాస్త ఆలోచించుకోనివ్వండి, నాన్నగారూ."
    రామువైపు చూశాడు వేణుగోపాల్. "పోన్లే, రామూ మనసు విప్పి చెప్పేయి. నీ మనసులో ఎవరైనా ఉన్నారా?"
    "లేదు, నాన్నగారూ."
    "అదే అయితే నీ ఇస్జ్హ్తం వచ్చినంతసేపు ఆలోచించుకో. ఇందులో బలవంతం ఏమీ లేదు. నీ ఇష్టమే నా ఇష్టంఁ." వేణుగోపాల్ మెట్లు ఎక్కి వెళ్ళి పోయాడు.
    కొడుకు భుజంమీద చేయి వేసింది భారతి. "చూశావా, రమూ, నాన్నగారి మనస్తత్వం? ఆయన ఎటువంటివారో నీకు తెలుసనుకొంటాను." భారతి హృదయంలో భర్తమీద గౌరవం అంతకంతకు అధిగమించసాగింది.
    "విన్నానమ్మా పూర్తిగా విన్నాను." తల్లి పక్కనే కూర్చున్నాడు రాము.
    "రవీ, నువ్వూ ఇద్దరూ సమానమే నాకు. నువ్వు డాక్టరివి అయ్యావు. భారతీదేవీ కూడా మంచిపిల్లే. పోతే విష్ణు సంగతి.
    "రాధకి రక్తసంబంధంతో కూడిన అభిమానం ఎక్కువగా ఉంటుంది. తన అన్నపిలల్ని మరో పిల్లలు చేసుకోవడం ఆవిడకు బాధగా అనిపిస్తూంది. బంగారపు బొమ్మలా ఉన్న విష్ణుకేం లోటు? అది నీకు చక్కగా సరిపోతుంది. మాట్లాడవేంరా..."
    "చెప్పమ్మా."
    "అక్క జబ్బుగా ఉందని టెలిగ్రాం వస్తే నా మనసు తల్లడిల్లిపోయింది. అక్కకి అయినవాళ్ళు ఎవరూ లేరు. నేనూ దాని దగ్గిరే పెరిగాను. అక్క పోతే మీ ఇద్దర్నీ బావ పెంచలేరు. నాకా పిల్లలు లేరు. అక్కపోతే ఆ భారాన్ని నేను మోయగలనా అని భయపడ్డాను. మీ నాన్న బలవంతంమీద వచ్చాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS