16
పందిరంతా కళకళలాడిపోతోంది. రంగు రంగుల లైట్లతో రకరకాల మనుష్టులతో తోరణాలు కట్టి వున్నాయి తోటంతా. చుట్టూ కుర్చీలతో మధ్య పూల వాజ్ లతో తెల్లాగా అమర్చి వున్నాయి టేబుల్స్.
ఆరోజు ఆ వూరి ప్రముఖులో చాలా మంది అక్కడ వున్నారు. రాజకీయాలతోనో, వ్యాపారాలతోనో, పెద్ద పెద్ద సంస్థల సంబంధమున్న స్నేహితులు, బంధువులు రకరకాల వాళ్ళతో తోటంతా నిండిపోయింది.
ఎప్పుడు ఎవరి ద్వారా పెళ్ళి సంబంధం వచ్చినా యిప్పుడిప్పుడే పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేదనో - మరేదో సాకుతో యింత కాలం వాయిదా వేస్తున్న ప్రభాకర్ క్షణాల మీద ఎవరిని పిలవకుండా , పెళ్ళి ఎందుకు చేసుకున్నాడో అనుకుంటున్న వాళ్ళందరికీ , కుసుమను చూడంగానే ఒక్క క్షణంలో అనుమానం చాలా వరకు తీరిపోయింది.
ఒకరిద్దరికి అంత మంచి సంబంధం చెయ్యి జారి పోయిందన్న బాధ కాస్త పొడ చూపినా, చూడ ముచ్చటగా వున్న కొత్త దంపతులను చూచి ఆనందించకుండా ఉండలేక పోయారు.
కుసుమకు ఎవరూ తెలియని అంతమంది లో తిరగాలంటే ఏమిటోగా వుంది. అసలు తనిక్కడ వుండదగిన వ్యక్తి కాదని, వాళ్ళందరి లో తనే విధంగానూ కలవలేననిపించ సాగింది.
అంతమంది లో మాములుగా అందరిని పలకరిస్తూ నవ్వుతూ ఆనందిస్తున్న ప్రభాకర్ ని చూస్తూ, అతని దరిదాపుల్లోనే తిరగసాగింది. అంతమందిలో అతను కూడా కలిసిపోతే, తను వంటరిదై పోతుందేమొన్న భావన భయంలా ఆవరించింది.
ఎవరెవరినో పరిచయం చేస్తున్నాడు. అందరికి నమస్కారములు పెట్టి, చిరునవ్వు నవ్వడం తప్ప ఒక్కళ్ళ పేరు కూడా కుసుమకు గుర్తిండటం లేదు. కొందరు చాల చనువుగా ప్రభాకర్ తో మాట్లాడుతున్నారు. ఆత్మీయుల మల్లె! కొందరు అతి క్లుప్తంగా, వ్యాపారంలా "హలో" చెప్తున్నారు. అంతమందిలో తిరుగుతున్నా, పుల్ సూట్ లో ఎత్తుగా ఎప్పుడూ నవ్వుతున్నట్లుండే ప్రభాకర్ లో ఒక ప్రత్యేకతను గమనించకుండా వుండలేక పోయింది కుసుమ..... అందరితో కబుర్లు చెప్తూ వుండి కూడా, మధ్యమధ్య అతను తనని గమనిస్తూనే వున్నట్లు గ్రహించి నిశ్శబ్దంగా నిట్టూర్చింది.
ఎవరో బాగా పరిచయస్తుడయిన ఒక్కాయన ప్రభాకర్ ఎదుట గానే అడిగేశాడు. "ఏం ప్రభాకర్ చెప్పా పెట్టకుండా క్షణాల మీద ఓ యింటి వాడయి పోయావు/ ఇంకా పెళ్ళి పిలుపు వస్తుందని ఎదురు చూస్తూనే ఉన్నాము" అన్నాడు నవ్వుతూనే!
"మీకు తెలియని దేముదండి మా నాన్న సంగతి. పెళ్ళంటూ పది మందినీ పిలవాలను కుంటే, అయన ఏ డాక్టర్ల ఆర్డర్స్ లెక్కపెట్టకుండా, స్వయంగా ఏర్పాట్లన్నీ మొదలు పెడతారు. అందుకే ఆయనకు అవకాశం యివ్వకూడదనుకున్నాను. కాని నేను తిరిగి వచ్చేటప్పటికే ఈ ఏర్పాట్లన్నీ చేయించేశారు'...."
"ఊ....ఏదో చెప్పు! నీకు తోచింది చేసెయ్యడం, అతికేటట్లు సంజాయిషీ యిచ్చేయ్యడం నీకు బాగా అలవాటు అయిపొయింది. మొత్తానికి గట్టి వాడవోయ్. ఏ పనిలోనూ ఏదో ఒక ప్రత్యేకత లేకుండా చెయ్యవు. ఆఖరికి నీ పెళ్ళి విషయం లో కూడా...." అన్నాడు ఆయన గుంభనంగా నవ్వుతూ.
అయన కుసుమ అందాన్ని గురించే అంటున్నాడని గ్రహించిన ప్రభాకర్ ఆయనతో పాటు చిన్నగా నవ్వుతూ కుసుమ వైపు చూచాడు. అక్కడికి కొద్ది దూరంలో నుంచుని , ఎవరో పలకరిస్తుంటే సమాధానం చెప్తోంది కుసుమ. ఆమె తల వూగించి నప్పుడల్లా, చెవుల రింగులతో పాటు తలలో పూలు కూడా కబుర్లు చెప్పుకుంటున్నాయి. ఆరోజు కుసుమ, పెద్ద జరీ అంచు నీలం పట్టుచీర, మేడలో సన్నటి ముత్యాలు, తలనిండా పూలు మ నుదుట పొడుగాటి కోల బొట్టు నిజంగానే దిగివచ్చిన దేవకన్యలా వుంది.
"ఏమండీ? యింతకాలం , స్నేహితులం. స్నేహితులం అంటూ పిలవన్నా పిలవలేదు! పెళ్ళికి ముందే మీ శ్రీమతి గారిని చూపిస్తే పట్టుకు పోతాం అనుకున్నారా?" అడిగింది. ప్రభాకర్ భాగస్తుల్లో ఒకతని భార్య, కొంచెం హాస్యం, నిష్టూరం రెండూ కలుపుతూ.
"మీరు పట్టుకు పోతారని భయపడలేదు గాని.....మీ అందరకూ చూపిస్తూ , పెళ్ళి చేసుకోవడం ఆలస్యం చేస్తే, అసలవిడే పారిపోతుందేమోనని భయం వేసింది." అన్నాడు ప్రభాకర్ నవ్వుతూ.

"చూడండి . అయన గడుసుతనం . చేసేదంతా చేసేస్తూ. నేరం మీ మీదకు ఎలా నేట్టేస్తున్నారో- తెలివిగా!" అంది ఆవిడ నవ్వుతూ పక్కనే వున్న కుసుమతో కుసుమ కూడా నవ్వి వూరుకుంది. ప్రభాకర్ హాస్యంగా అన్నా అందులో ఏదో పత్యం లేకపోలేదని పించింది.
కొంతసేపు గడిచేసరికి కుసుమకు కొంచెం తేలికగా అనిపించసాగింది. మొదట్లో వున్న బెరుకు. భయం దాటి మెల్లిగా తను కూడా ఆనందించసాగింది.
ప్రభాకర్ బలవంతంగా పెళ్ళే చేసుకోక పొతే తను జీవితంలో ఒకరికి భార్య అయ్యేది కాదు. ఎలాటి గౌరవాలు అనుభవించగలిగేది కాదు. యిలాటి వేవీ జన్మలో రుచి చూడగలిగేది కాదు.... అయినా భగవంతుడి కెందుకింత నిర్దయ? ఒకరిని పట్టు పాన్పులతో , ఒకరిని ముళ్ళ కంపల్లో పడేయ్యాలని చూస్తాడు? ఎలాంటి చోట పుట్టి పెరిగినా, పక్షిలా స్వేచ్చగా ఎగరగలిగిన తను ప్రభాకర్ బంగారు ఆవరణ లో బంధిత అయి పోయింది.... అతని భార్యగా.... నిజమే? తను నిజంగా భార్య అవలేనంత కాలం యీ స్వర్గసుఖాలన్నీ తనకు బంగారు సంకెళ్ళే! తను భార్య అవలేదు....యీ బంధం నుండి విముక్తి కాలేదు. నిశ్శబ్దంగా నిట్టూర్చింది.
నిద్ర మధ్యలో మెలుకువ వచ్చిన కుసుమ బద్దకంగా బరువుగా వున్న కళ్ళతో చూస్తూ వుండి పోయింది. అటు యిటు దొర్లి బలవంతంగా కళ్ళు మూసుకోబోయినా, తిరిగి నిద్రపట్టలేదు. పక్కగదిలో ప్రభాకర్ లైటు యింకా వెలుగుతూనే వుంది. గదికి. గదికి మధ్య వున్న వెంటిలేటర్ లోంచి లైటు కాంతి పచ్చని అద్దం లోంచి బంగారు రంగులో గదిలోకి పడుతోంది. పక్కకు తిరిగి గడియారం వంక చూసింది. ఒంటిగంట దాటింది. "అబ్బా! యింకా ఏం చేస్తున్నట్లు.... అనుకుంది సాలోచనగా లేక మొన్నలా నిద్ర పోయారేమో పుస్తకం చదువుతూనే....
కుసుమకు నిద్ర మధ్యలో మెలకువ వచ్చి నప్పుడు ప్రభాకర్ గది గుమ్మంలో నిలబడి పోవడం ఒక అలవాటయి పోయింది . ఆదమరిచి నిద్రపోతోంటే అతన్ని చూస్తుంటే ఏదో తెలియని భావాలు చుట్టుముట్టి , చేయని అపరాధాన్ని ఎత్తి పెట్టినట్లు చూపెడతాయి. పెదవి దాటే మాట, పైకి వచ్చే ఆవేశం అదుపులో వుంచగలరేమో గాని, గుండెల్లోంచి పెట్టె భావాలను ఏప్ శక్తి మాత్రం ఎవరికి వుండదు. తను చేయలేని పనిని గురించి తర్కించుకుంటూ గోచరించని కర్తవ్యాన్ని వెదుక్కుంటుంటే ఎంత టైము గడిచేది తెలియదు కుసుమకు.... ఎన్నిసార్లు వద్దనుకున్నా , సమాధానం దొరకని ప్రశ్న ఆమె మనసును తరచి చూస్తూనే వుంటుంది.... ఎందుకంత పట్టుదల యితనికి..... అతనికి సుఖం లేదు.... తనకు తృప్తి లేదు..... ఎన్నాళ్ళిలా..... యిలా తర్కించుకుంటుంటే ఎన్ని గంటలు గడిచిపోతాయో ఆమెకే తెలియదు.
ఆ యింట్లో యిప్పుడు కుసుమ ప్రభాకర్ గృహిణిగా బాగా అలవాటు పడిపోయింది. ఆప్యాయంగా పలకరించే మామగారు. భయ భక్తులతో ఎదురొచ్చే నౌకర్లు. ప్రేమ కోసం తహతహలాడే ప్రభాకర్..... ఆమె ఆ యింట్లో ఒక ముఖ్య వ్యక్తిగా మారిపోయింది. ప్రభాకర్ దగ్గరగా లేనప్పుడు ఎన్ని పనులయినా చేయించ గలిగే కుసుమ సాయంకాలం అవుతుండగానే ఆమెకు తెలీకుండానే ప్రభాకర్ ఆగమనం కోసం ఎదురు చూస్తుంది. కాని ఆ పరిధి దాటి, అతనితో తనని ఊహించేందుకు కూడా అసహ్యించుకునే మనసు యదార్ధానికి ఎదురు నిలుస్తుంది.
మెత్తగా మంచం దిగి మంచినీళ్ళు వంపుకుంది. చేతిలో గ్లాసుంచుకుని లైటు వేసుకునే నిద్రపోయి వుండవచ్చనుకుంటూ, అతనికి నిద్రా భంగం కలగకూడదని మెల్లిగా చప్పుడవకుండా తలుపు తీసింది.
దీక్షగా చదువుకుంటున్న ప్రభాకర్ తలుపు దగ్గర చప్పుడు విని తలెత్తి చూశాడు. హాయిగా ఆదమరచి నిద్ర పోతుంటాడనుకున్న వ్యక్తీ ఎదురుగా మంచం మీద కూర్చుని తన వంకే చూస్తుండటం గమనించి ముఖం మీద నీళ్ళు జల్లినట్లు ఒక్క అడుగు వెనక్కి వేసింది. "చ..... ఏమనుకుంటారు. అర్ధరాత్రి .....అతని గదిలో...." అనుకోకుండా వుండలేక పోయింది.
"నిద్ర పట్టడం లేదా యివాళ?" అడిగాడు ప్రభాకర్. ఆమె ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ.
అతడి ప్రశ్నకు సమాధానం యివ్వకుండా, "మీరింకా పడుకోలేదెం? నిద్రపోయారేమో లైటు తీసేద్దామని వచ్చాను." అంది.
"నాకు నిద్ర రాలేదు. రా! వచ్చి కూర్చో...." వెళ్ళి అతడి మంచం మీదే ఓ చివరగా కూర్చుంది. కుసుమ అంతవరకు పుస్తకంతో ప్రతి వాక్యాన్ని శ్రద్దగా చదువుతున్న అతని కళ్ళు బడలికను చూపుతున్నాయి. పుస్తకం మీంచి దృష్టి కుసుమ వైపు సారించాడు. పక్కన టేబిల్ లైటు కాంతి నీడగా ఆమె ముఖం మీద పడి, బుగ్గల నున్నదనాన్ని తెలుపుతోంది. రేగిన జుట్టు సడలిన పూలు మెడ మీద పడుతున్నాయి. నిద్ర మధ్యలో లేవడం మూలంగా కాబోలు నల్లటి కాటుక కళ్ళు ఎర్రగా వున్నాయి.
అంతదాకా ప్రసన్నంగా వున్న ఆమె ముఖం ప్రభాకర్ చేతిలో వున్న పుస్తకం చూడం గానే ఎర్రగా కందిపోయింది. అది, మానసిక వ్యాధుల మీద పెద్ద శాస్త్రవేత్త రాసిన పుస్తకం.... యిదన్న మాట యింత రాత్రి వరకు యితను పడుకోకుండా కూర్చుని చేసేది!
ఆమె ముఖంలో కలిగే మార్పులు గమనించ కుండానే "యివాళ ఎందుకని నిద్ర రావడం లేదు." అడిగాడు.
"..."
"మనసు బాగాలేదా?"
"అదేం లేదు. వూరికినే ఎందుకో మెలుకువ వచ్చింది." అంది.
కొద్ది రోజుల నించి అడుగుదామనుకుంటూనే వాయిదా వేస్తున్న విషయం అడగటానికి అంత కంటే మంచి సమయం దొరకదని పించింది ప్రభాకర్ కు.
"కుసుమా నీకు కొన్ని పుస్తకాలు తెచ్చిస్తాను, చదువుతావా?' అడిగాడు.
"ఏ పుస్తకాలు....?"
ఒక్కక్షణం తటపటాయించాడు.
తలఎత్తి చూచింది అతని ముఖం లోకి. గబగబా అయిదారు పుస్తకాల పేర్లు చెప్పింది." అవి చాలా? యింకా ఏం తేవాలో చెప్పమన్నారా?" అడిగింది నిశ్చలంగా. అతని ముఖంలోకి చూస్తూ ఆశ్చర్యంగా ఆమె వంక చూశాడు. కోపంతో ముఖం ఎర్రగా కందిపోయి వున్నా, మాటల్లో ఎక్కడా తోణకు లేదు.
"అన్ని చదివా వన్నమాట?" చాలాసేపటికి సుదీర్ఘంగా నిట్టూర్చి.
"నా భయాలు పోగొట్టుకోవాలని , అందరి లా బ్రతకాలన్న కోరిక నాకు మాత్రం లేవని ఎందు కనుకుంటారు?" అడిగింది.
ఎందుకో ఆమె ముఖం వంక చూడాలని పించలేదు ప్రభాకర్ కు . అర్ధం కాని ఆందోళన ఏదో కలిగింది అతనిలో. అంతలోనే 'నిజమే! అంతమాత్రం తను ఎందు కాలోచించ లేకపోయాడు." అనుకున్నాడు.
'అయితే డాక్టర్ల ను కూడా కలిశావన్న మాట?"
"....."
"ఏమన్నారు?"
"....."
