Previous Page Next Page 
మరుపులో మెరుపులు పేజి 12

 

                                   14
    ప్రభాకర్ , కుసుమ హైదరాబాద్ వచ్చేటప్పటికి రంగనాధం గారి యిల్లంతా పచ్చని తోరణాలతో. రంగు రంగుల లైట్లతో పెళ్లి కళను సంతరించుకుంది. పక్కన పెద్ద తోటంతా పందిరి వేసి, చాందినీ లతో కళకళలాడుతోంది.
    రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాడు రామకృష్ణ ప్రభాకర్ ని మాములుగా పలకరించాడు. తను ఇంటర్వ్యూ లో హడలు కొట్టేసిన కుసుమను.... యిప్పుడు ప్రభాకర్ శ్రీమతిగా పలకరించడానికి అతనికి కొంచెం సంకోచం అనిపించింది. కుసుమకి కూడా అదే గుర్తుకు వచ్చి నవ్వు వచ్చింది. అతన్ని చూడం గానే!
    చిరునవ్వుతో దిగిన కుసుమను చూస్తూ సంతృప్తిగా నిట్టూర్చాడు ప్రభాకర్. కాని నిజానికి కుసుమ బయటకు కనిపిస్తున్నంత సంతోషంగా లేదు. తిరిగి హైదరాబాద్ వస్తుంటే అవ్యక్తమయిన భావాలు చుట్టూ ముట్టాయి. ఆవూరు విడిచి వెళ్ళేముందు జరిగిన ప్రతి సంఘటన , గడిపిన ప్రతి క్షణం కళ్ళముందు కదల సాగాయి. జీవితంలో అతి ముఖ్య మయినవన్నీ , అంత త్వరగా జరిగిపోవడం, ఆవూరు విడిచి వెళ్ళడం అన్ని ఒక కలలా అనిపిస్తున్నాయి. కాని అంతలోనే సిగ్గుపరచే సంగతులన్నీ , ఎదురై నిలచి. నిలదీస్తున్నప్పుడు అవన్నీ నిజంగానే కలయితే ఎంత బాగుండుననిపిస్తోంది. ప్రభాకర్ తో అంతవరకు గడిపిన జీవితం నిజం గానే ఒక పీడ కలలా మరలా మరచి. మరుగున పడిపోతే ....తియ్యని కలలాంటి కొత్త జీవితం తనే రుచి చూడగలిగితే.....
    జీవితం చూపించే ఆశ, వదలలేని భయం. తీరని కోరికలు, నిగ్రహించుకోలేని దౌర్భల్యం. రకరకాల భావాలు కుసుమను వదలకుండా యిల్లు చేరే అంతవరకూ వెంటాడు తూనే వున్నాయి.
    యింటి ముందు కారాపగానే పెళ్ళి అలంకరణం తో స్వాగతం పలికిన ఆ భవనం వంక చూడగానే ఏదో జంకు లాంటి భావం మెదిలింది. కుసుమాలో. స్త్రీ దక్షత లేని ఆ యింటికి తను సర్వదికారిణి కాబోతుందన్న భావం సంతోషం కంటే ఎక్కువ భయాన్ని కలుగ జేసింది.
    ఇంటి వంక చూచి కొద్దిగా ఆశ్చర్యపోయి "ఏమిటిదంతా?" అడిగాడు చిరాగ్గా ప్రభాకర్.
    "నాదే ముంది సార్. నాన్నగారు చేయించమన్న ఏర్పాట్లన్నీ చేయించడం తప్ప....." అన్నాడు రామకృష్ణ. "రేపు పార్టీకి వూళ్ళో అందరకు ఆహ్వానాలు వెళ్ళిపోయాయి." అన్నాడు తిరిగి.
    ఒక్కసారి చుట్టూ చూచి, "లోపలకు పద" కుసుమతో అంటూ లోపలకు దారి తీశాడు.
    విశాలంగా రకరకాల పూలమొక్కలతో వున్న ఆవరణ దాటి లోపలకు వెళ్ళి యింట్లో అడుగు పెట్టగానే , ఒక పెద్ద ముత్తయిదువ  పళ్ళెం నిండుగా ఎర్ర నీళ్ళు కలుపుకుని సిద్దంగా వుంది దిష్టి తీయడానికి.
    పైనించి క్రింద దాకా దిగ తుడుస్తూ వుంటే - ఎర్రగా కదులుతున్న నీళ్ళు చూస్తూ అలాగే నిలబడి పోయింది కుసుమ పెదిమలు అస్పష్టంగా కదులుతూ వుంటే, ముఖంలో అసహ్యం , జుగుప్స తో నిన్దిపోయిన్ భావాలు కదలసాగాయి. పక్కనే నుంచుని యధాలాపంగా కుసుమ ముఖంలోకి చూచినా ప్రభాకర్ కొంచెం యిబ్బందిగా చుట్టూ పరికించకుండా వుండలేక పోయాడు. ఎదురుగా తండ్రి, తెలిసిన వాళ్ళు నౌకర్లు.
    "బాగా అలసిపోయినట్లున్నావు. పైకి పద" అంటూ తొందర పెట్టి అక్కడ నుంచి పైకి తీసుకుపోయాడు.

                                     15
    పైకి వచ్చి కిటికీ లోంచి క్రింద పందిరి గా పరిచిన తాటాకులు, దూరంగా ఎత్తుగా  పచ్చని చెట్లు చూస్తూ చాలాసేపు మౌనంగా వుండి పోయింది.
    నౌకరు పైకి తెచ్చిన కాఫీ అందుకుని ప్రభాకర్ వైపుగా వచ్చింది. అప్పటికే ఆఫీసుకు సిద్దమవు తున్నాడు ప్రభాకర్.
    కుసుమను చూచి, "నేను ఆఫీసుకు వెడుతున్నాను, స్నానం చేసి హాయిగా రెస్టు తీసుకో. నాకోసం ఆగకుండా భోజనం చేసేయ్. నేను వచ్చేటప్పటికి  అలస్యమవుతుందేమో?" అన్నాడు.
    అంతవరకూ అతని వంకే చూచి, కాఫీ కప్పు మీదకు కళ్ళు దించుకుంది, "త్వరగా రండి" అంది క్లుప్తంగా??
    ఒక్కసారి ఆశ్చర్యంగా , ఆనందంగా కుసుమ వంక చూచాడు.
    "నాకేమిటో గా వుంది." అంది మెల్లిగా.
    మెల్లిగా భుజం మీద చెయ్యి వేసి, తడుతూ , "ఇవాలే కదా వచ్చావు. రెండు మూడు రోజుల్లో బాగానే వుంటుంది. ఏదైనా కావలసి వస్తే వెంకడిని అడుగు. మరీ యిదిగా వుంటే ఆఫీసుకు ఫోను చెయ్యి." అన్నాడు.
    స్నానం చేసి వచ్చాక ఎంతో హాయిగా అనిపించింది. ఏమీ తోచక యిల్లంతా తిరిగింది. ప్రభాకర్ తండ్రి యింట్లో వుంటారంటే ఏదో విచిత్రమైన అనుభూతి మెదిలింది. కుసుమకు తను పుట్టి పెరిగి బుద్ది తెలిశాక యింట్లో మగవాళ్ళు ఉండటమే ఎరుగని కుసుమకు ఏదో కొత్తగా అనిపించింది. తండ్రి, తాత ఏమీ ఎరుగని కుసుమకు ఆయన్ని చూడం గానే తెలియకుండానే గౌరవం లాంటి భావం మెదిలింది.
    రంగనాధం గారి దినచర్య అంతా అదో క్రమపద్దతి గా . గడియారం లా నడిచి పోతుంది. పొద్దున్నే ఎవరో మాట్లాడేందుకు వచ్చి పోతుంటారు. మధ్యాహ్నం పుస్తకాలతో . సాయంత్రం ప్రభాకర్ తో బిజినెస్ , విషయాలు మాట్లాడటం తో, ఎవరితోనో డేస్ ఆడటం తోనో- ఎక్కడికో అక్కడికి కాసేపు బయటకు వెళ్ళడం అయన దంతా కొత్త దనం లేని దైనందిక జీవితంగా మారిపోయింది.
    యిదివరకు చాలా భాగం బిజినెస్ విషయాలు అయన కూడా చూసేవారు. డాక్టర్ల ఆదేశం ప్రకారం . యిప్పుడు దాదాపు అంతా ప్రభాకర్ మీదే వదిలేసి విశ్రాంతి తీసుకుంటున్నారు.
    మధ్యాహ్నం ఒంటరిగా దొడ్డంతా తిరుగుతున్న కుసుమను చూస్తుంటే ఆయనకు తెలియకుండానే మనసు గతం భవిష్యత్తు లోకి ముందు వెనక్కి పరిగెత్త సాగింది. మళ్ళీ ఇల్లు కళకళ లాడుతుంది పిల్లా.... పాపలతో , వచ్చిపోయే వారితో ఎన్ని వున్నా యిల్లు....యింట్లో ఆడది లేకపోయాక...." నిట్టూర్చాడు. తన కోరిక తీరింది. ప్రభాకర్ కూడా ఒక యింటి వాడయ్యాడు. తనకింకా ఏ చింతా లేదు. పిల్లలతో యిల్లు గలగలలాడుతూ వుంటే - హాయిగా తను కూడా వాళ్లతో ....." పసిపిల్లల మీద వున్న ఆయన వూహ. ప్రభాకర్ చిన్నతనాన్ని గుర్తుకు తెచ్చింది. ఎదురుగా వున్న కాలెండర్ మీద బొద్దుగా, నల్లని జుట్టుతో రబ్బరు బొమ్మలా వున్న గ్లాస్కో బేబిని చూచి చిన్నగా నవ్వుకుంటూ తోటలోకి నడిచారు.
    ఎదురుగా మామగారు కనపడేటప్పటికీ ఏం మాట్లాడాలో తెలియక తడబడింది కుసుమ.
    సాయంకాలపు నీరెండ లో  చెట్లు మిసమిస లాడుతున్నాయి. కార్తీక మాసపు రోజుల మూలంగా గాలి చిరు ఉలిని కలిగిస్తోంది. మాట్లాడేందుకు ఎవరూ లేక ఎప్పుడూ యిటు చదువుకో-- అటు ఉద్యోగానికో అలవాటుపడి పోయిన కుసుమకు రోజు గడపడం గగనంగా వుంది. అందులో కొత్త చోటు, కొత్త మనుషులు. మనసు నిండా భయాలు. అయిదు గంటలు అయిన నుండి క్షణ క్షణం గడియారం వంక చూస్తూనే వుంది. యింకా ప్రభాకర్ రాలేదేమా అని. అతను చేరువగా వున్నప్పుడు ఒక విధమైన భయం మనసులో మెదులుతూ వున్నా, వంటరి తనంలో ఆమెకు తెలియకుండానే అతని కోసం ఎదురు చూచేలా చేసింది కుసుమ మనసు. అతని సాహచర్యానికి అలవాటు పడినట్లనిపించింది.
    సాయంత్రం యింటికి  వస్తూనే అలవాటు ప్రకారం తండ్రితో మాట్లాడి గబగబా పైకి వచ్చాడు ప్రభాకర్. అంతవరకూ కిటికీ దగ్గర నుంచుని, అతని రాకకోసం ఎదురు చూస్తున్న కుసుమ, యింటి ముందు ప్రభాకర్ కారు దిగడం చూడగానే చటుక్కున లోపల కొచ్చేసింది. ఆమెకు తెలియకుండానే గుండెలు గబగబా కొట్టుకోసాగాయి. యిన్నాళ్ళు ఆ వూళ్ళో ఎలా వున్నా, యిక్కడ అతని యింట్లో . అతని భార్యగా తన స్థానం వేరనిపించింది. హోటల్స్ లో వున్నంత కాలం తెలియని బాధ్యత ఏదో ఆ యింట్లో తనకు వుందన్న భావం భయం కలిగించసాగింది.
    నౌకరు పైకి  తెచ్చిన కాఫీ అందుకుని ప్రభాకర్ గదిలోకి వచ్చింది మెల్లిగా. అప్పటికే అతను బట్టలు మార్చుకోబోతున్నాడు. కుసుమను చూడంగానే చిరునవ్వుతో వెనక్కి తిరిగాడు.
    ఆమె చేతిలో కాఫీ కప్పు అందుకుంటూ కుసుమను పరికించడం లో నిమగ్నుడయ్యాడు. తెల్లని చీర, తల నిండా పూలతో విరిసిన మల్లె మొగ్గలా వుంది. ఆమె వంక చూస్తూ అలా యెంత సేపయినా గడపాలని పించినా, దృష్టి మరల్చు కుంటూ అడిగాడు.
    "ఏమిటి కబుర్లు?'
    "ఏముంటాయి ? యిప్పటికి మధ్యాహ్నానికి?" అంది.
    "ఏం చేశావు రోజంతా?"
    "ఏం లేదు? మీ యిల్లంతా తిరిగాను ఓ రెండు సార్లు. మీ నాన్నగారు అయన లైబ్రరీ చూపించారు."
    "ఓ! అప్పుడే నీకు యిల్లంతా ఓ టూర్ యిప్పించారన్న మాట."
    నవ్వింది కుసుమ. మనస్పూర్తిగా ?
    "టేబుల్ మీద మోచేతులు ఆనించి, మోచేతుల మీద గడ్డాన్నుంచుకుని, కిటికీ లోంచి ఎటో చూస్తూ కూర్చుండి పోయింది. బయట మెల్లిగా చీకట్లు ముసురుకుంటున్నాయి. గాలికి చెట్లు బద్దకంగా కదులుతున్నాయి. బయటకు దృష్టి సారించి వున్న ఆమెకు తెలియకుండానే ఆమె నోటి నుండి "నాన్న....!" అన్న పదం వెలువడింది. సాలోచనగా కూర్చున్న ఆమె వంక చూస్తూ "ఏమిటి?' అడిగాడు ప్రభాకర్.
    ఒక్క క్షణం అతని వంక పరధ్యానంగా చూచి, "ఏం లేదు." అంది.
    కుసుమ ముందుగా టేబుల్ కు అవతల పక్కన కూర్చుని వున్న ప్రభాకర్ మౌనంగా వుండి పోయాడు. అతని వెనకగా కిటికీ లోంచి ఎత్తుగా వున్న చెట్ల వంక చూస్తోంది కుసుమ. చెట్టు మీద వున్న పక్షి ఒక్కసారి పైకి ఎగిరి టపటపా రెక్కలు విదుల్చుకుని తిరిగి చెట్టు మీద వాలింది.
    బయట వున్న దృష్టి ప్రభాకర్ మీదకు సారించింది. అప్పటి వరకు కుసుమ ప్రతి కదలికను గమనిస్తున్న ప్రభాకర్ చూపులో, ఆమె చూపు కలిసింది. వెంటనే మరల్చుకుంటూ "మీరు చాలా అదృష్ట వంతులు." అంది మనస్పూర్తిగా?"
    ఆశ్చర్యంగా ఆమె వంక చూచాడు ప్రభాకర్. కుసుమ అలాంటి రిమార్కు చేస్తుందని ఆశించని అతనికి చాలా ఆశ్చర్యం అనిపించింది. కుసుమ వంక అలాగే చూస్తూ "ఏం?" అన్నాడు.
    "........" ఏమీ సమాధానం యివ్వలేక పోయింది కుసుమ.
    ఆమె ముఖంలోకి తరచి చూస్తూ "అందరూ అదే అంటారు. కాని నేనప్పుడే అనుకోను. నేనాశిస్తున్న మార్పు నీలో కలిగి, నేను కోరుకున్నదంతా పొందగలిగిననాడు, నా అంతట నేనే అనుకుంటారా మాట." అన్నాడు.
    అనుకోకుండా తను అనేసిన మాట మీద ప్రభాకర్ అన్నది వినం గానే ఎందుకో అర్ధం కాని ఆందోళన కలిగించింది కుసుమ లో.
    ఆమె ముఖంలో భావాలు చదువునట్లు "రేపటి పార్టీ సంగతి నాన్న చెప్పారా?' అడిగాడు మాట మార్చేందుకు.
    తలూపింది ఔనన్నట్లు. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS