13

ఆత్రుతగా పేపరు వెతికిన హరి అందులో ఉమ నెంబరు కనబడటం తో, సంతోషంగా చిన్న పిల్లాడి లా వెళ్లి, ఉమకు కంగ్రాచ్యులేషన్స్ పంపించాడు -- ఇంటికి రాకుండా, అట్నుంచి ఆటే, గిరి దగ్గరకు వెళ్ళాడు-- గిరి, హరి కూడా 'లా' లో డిగ్రీ పుచ్చుకుని, అప్పుడే నాలుగేళ్లయింది-- ఇద్దరూ ప్రాక్టీసు పెట్టారు. గిరి త్వరలోనే పైకి వచ్చాడు. హరి ప్రాక్టీసు ఒక రకంగా ఉంది. ఆరోజు అదివారం కావటం వలన, గిరి ఇంట్లోనే ఉన్నాడు -- హరి వెళ్లి గిరి చేతులు పట్టుకుని ఉత్సాహంగా వూపుతూ "ఉమ పాసైందిరా!" అన్నాడు. గిరి కూడా ఉత్సాహంగా "కంగ్రాచ్యులేషన్స్ " అన్నాడు. కానీ అతని ముఖం దిగులుగా ఉంది. అదేమీ గమనించకుండానే హరి "నాలుగేళ్ళు గడిచి పోయాయి. ఇంకొక్క సంవత్సరం -- అబ్బ! కాలం ఇంత మెల్లిగా, నడుస్తుందెం?' అన్నాడు.
"మనకు కాలం మీదే దృష్టి ఉన్నప్పుడు అది కదలదు"అన్నాడు గిరి -- క్షణ కాలమాగి "నువ్వు నాకు సంతోషకరమయిన వార్త చెప్పావు. కానీ నేను నీకొక విచారకరమైన వార్తా చెపుతున్నాను. క్షమించు.' అన్నాడు.
హరి ఆందోళన తో "ఏమిటీ?' అన్నాడు.
"ఆవేశ పడకు! ఇవాళ దుర్గ దగ్గిర నుండి ఉత్తరం వచ్చింది. తన సంసారిక జీవితం అంత సుఖ ప్రదంగా లేదని వ్రాసింది."
"అదేమిటీ? దుర్గ ఇష్టపడి చేసుకున్నదే దేగా?.........."
"అయితే?.....," విషాదంగా నవ్వాడు గిరి.
హరి ఉత్సాహమంతా ఎగిరి పోయింది. అతడికి దుర్గ అంటే ప్రాణం --దుర్గ గిరిని చేసుకుంటే బాగుంటుందని మనసులో అనుకునీ కూడా , దుర్గ శంకర్ ని చేసుకుంటానని అన్నప్పుడు , తన మనసులో ఇష్టం లేకపోయినా అంగీకరించాడు. తలిదండ్రులు శంకర్ కు చదువు లేదని తటపటాయించినపుడు, దుర్గ అభీష్టం నెరవేరడానికి, ఆమె తరపున తల్లి దండ్రులతో వాదించి, వారిని ఈ వివాహానికి ఒప్పించాడు. గిరి ఇంతవరకూ ప్రయత్నం చెయ్యక పోవటానికి దుర్గ మీద అతని కున్న ప్రేమే కారణమని హరి అనుమానం.
ఒకసారి హరి, గిరితో "నేను విధిలేక నా పెళ్లి వాయిదా వేసికోవలసి వచ్చింది. నువ్వెందు కింకా పెళ్లి చేసుకోవు?' అన్నాడు. దానికి గిరి మొదట నవ్వి వూరుకున్నాడు. హరి మళ్ళీ మళ్ళీ అడగ్గా, "బహుశా, చేసుకోను." అన్నాడు.
"అదేం? ప్రేమ విఫలమయిందా?' తన మనసులోని అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలనే వూహతో , వేళాకోళం గా అన్నాడు హరి.
"విఫలమూ కాలేదు. సఫలమూ కాలేదు. ఆ ప్రేమ ప్రేమగానే ఉండి పోతుంది. నేను ప్రేమించిన వ్యక్తిని, నా దానిని చేసుకునే ప్రయత్నమే చెయ్యను నేను. అలా చెయ్యకూడదు." నిర్వికారంగా అన్నాడు గిరి.
హరి ఎన్నో విధాల ప్రయత్నించినా కూడా గిరి చేత, అతని ప్రణయిని పేరు చెప్పించా లేకపోయాడు -- హరి సమంగా అర్ధం చేసుకోలేక పోయాడు. అర్ధ మయినంత వరకూ , వాటిని దుర్గ పరం గానే అన్వయించు కున్నాడు.
ఇప్పుడవన్నీ గుర్తుకు వచ్చాయి హరికి. తాను కష్ట సమయంలో ఉన్నప్పుడు స్వంత అన్న కయినా, వ్రాయకుండా గిరికి వ్రాసిన దుర్గ, గిరిని ఎందుకు కాదందా , అనుకున్నాడు హరి.
"ఏది, అ ఉత్తరం చూపించు" అన్నాడు ఆందోళన గా. గిరి ఇరుకున పడ్డాడు -- దుర్గ ఆ ఉత్తరం లో పరిస్థితి నంతటిని వివరించింది. ఏం చెయ్యమంటావని అడిగింది. చివర ఆ విషయాలన్నీ రహస్యంగా ఉంచమనీ, ఆ ఉత్తరం ఎవ్వరికీ చూపవద్దని మరీ, మరీ, వ్రాసింది.
"క్షమించు, దుర్గ దాన్ని ఎవ్వరికీ , చూపించ వద్దంది." హరి గతుక్కుమన్నాడు. స్వంత అన్నకు కూడా తెలియరాని రహస్యాలున్నాయా గిరి, దుర్గ ల మధ్య? హరి అంటారంతరాలలో ఈర్ష్య తొంగి చూసింది. దానిని అణచుకుంటూ, "అయితే, నేను వెళ్లి దుర్గను చూసి వస్తాను.' అన్నాడు.
"తొందర పడకు, నువ్వు వెళ్లి ఉమను కలిసిరా! నేను దుర్గ సంగతి విచారిస్తాను.' అన్నాడు గిరి.
హరి మనసు మండింది. ఉద్రేకంగా లేచి "థాంక్స్, నా చెల్లెలి క్షేమం కంటే, నాకు నా ప్రణయం ఎక్కువ కాదు. నువ్వు నీ స్వంత పనులేమైనా ఉంటె చూసుకో! నేను దుర్గ దగ్గిరకు వెడతాను.' అన్నాడు.
హరి ఉద్రిక్త స్వభావానికి బాగా అలవాటు గిరి ఇంకేమీ వాదించకుండా వూరుకున్నాడు.
* * * *
తలవని తలంపు గా తన ఇంటికి వచ్చిన అన్నను చూసి ఆశ్చర్య పోయింది దుర్గ -- దుర్గను చూసి అంతే ఆశ్చర్య పోయాడు హరి. పెళ్లినాటి దుర్గ కాదు. ఈ రెండేళ్ళ లోనూ, ఆనవాలు పట్టలేనంత గా మారిపోయింది. ముద్దబంతి పువ్వులా ఉండేది పూచిక పుల్లల్లా అయింది. ముఖంలో కళా కాంతులు తగ్గిపోయాయి. పీలవమైన చిరునవ్వు తో తనను ఆహ్వానించిన దుర్గ వంక బాధగా చూసి, 'ఇలా అయిపోయావెం దుర్గా?" అన్నాడు.
లాలనతో కూడిన ఆ ఓదార్పు కి దుర్గ కరిగిపోయింది. ఆమె హృదయం లో గూడు కట్టిన దుఃఖం కరిగి ఒళ్లో వాలిపోయింది. హరి దుర్గ కన్నీళ్లు తుడిచి, "ఏమిటి దుర్గా! ఎందుకింత బాధపడ్తున్నావెం?" అన్నాడు.
దుర్గ తనను తాను నిగ్రహించుకోలేక పోయింది.
"బాధేమిటంటే , ఏం చెప్పనన్నయ్యా! బంగారు పంజారం లో చిలక లాగున్నాను. నాకసలు మనసనేది ఉన్నమాటే మర్చిపోయాను. నా మాటకు విలువ లేదు. నా ఆలోచన పనికి రాదు. అసలు నా అనేది ఏమీ లేదు. ఇవాళ నిన్ను చూస్తె నిద్ర పోతున్న నా మనసు మేల్కొని ఏడుపు వచ్చింది. లేకపోతె, ఏడుపు కూడా రాదు."
"మీ అత్తగారా? లేక బావగారేనా? దేని కంతకూ కారణం?"
"అందరి కందరూ --- మన బంగారం మంచిది కాకపోయాక.---"
సరిగ్గా ఆ సమయంలోనే పొరిగింటి కి వెళ్ళిన కామేశ్వరమ్మ తిరిగి రావడంతో దుర్గ సంభాషణ చటుక్కున ఆపేసింది. హరి బుసలు కొడ్తూ తనను పలకరించిన కామేశ్వరమ్మ కు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి, శంకర్ రాక కోసం ఎదురు చూస్తున్నాడు. దుర్గ తనను తాను నిగ్రహించు కోలేక హరి దగ్గర తెలిపోయిందే గాని, రోషంతో బుసలు కొట్టే హరి ముఖం చూసాక, ఏం ప్రళయం వస్తుందో నని కంగారుపడింది .------
శంకర్ ఇంటికి వచ్చి హరిని చూసి ఆశ్చర్య పోయాడు. తన ఆశ్చర్యాన్ని అణచుకుని మామూలుగా పలుకరించాడు. హరి బలవంతాన చిరునవ్వుతో సమాధాన మిచ్చాడు. అందరి భోజనాలు అయ్యే వరకూ ఎలాగో నిగ్రహించు కొన్న హరి, ఇంక ఆగలేక తిన్నగా, "మీరు మా చెల్లెల్ని అలా చూడటం న్యాయం కాదు.' అన్నాడు. ఎలాంటి ఉపోద్ఘాతమూ లేకుండా తలవని తలంపు గా హరిణి చూడం గానే ఇలాంటి దేదో ఊహించుకున్న శంకర్ ఏమీ కంగారు పడలేదు. అతనికి కూడా చాలా కోపం వచ్చింది.
"నా బార్యను నా యిష్టం వచ్చినట్లు చేసుకుంటాను."
"దుర్గ మీకు భార్యే కాదు. నాకు చెల్లెలు కూడాను."
"అవును---పెళ్లి కాక ముందు----"
"కాదు----ఇప్పటి కీను----"
"ఎంత మాత్రం కాదు. కనీసం, నా ఇంటిలో ఉన్నంత వరకూ ఆమె బాధ్యతలన్నీ నావే! ఆమె బాధ్యతలను మీరు తీసుకో దల్చుకుంటే , ఆమెను నా యింటిలో నుండి తీసుకు పోవచ్చు."
"తప్పకుండా తీసుకు పోతాను."
ఈ సమాధానంతో శంకర్ "దుర్గా!' అని గట్టిగా పిలిచాడు. అంత క్రితం వరకూ, గోడ వారగా నిలబడి సంభాషణ లన్నీ వింటున్న దుర్గ భయంగా శంకర్ దగ్గిరకు వచ్చింది.
"మీ అన్నయ్య ఏమిటో అంటున్నాడు విను." అన్నాడు శంకర్ నిర్లక్ష్యంగా.
"నీ సామాను సర్దుకో దుర్గా! పద పోదాం!" అన్నాడు హరి ఉద్రేకంగా. దుర్గ మాట్లాడక నిలబడింది. ఆమెకు వంచిన తల ఎత్తే ధైర్యం కూడా లేకపోయింది.
"ఏం దుర్గా!' అన్నాడు మళ్ళీ హరి --
"నేను రానన్నయ్యా!" అంది దుర్గ గడ్గాదికంగా----
హరి బిత్తర పోయాడు. మూడుడిలా , శంకర్ వంకా, దుర్గ వంక చూడసాగాడు.
శంకర్ వంకరగా నవ్వి, "మిస్టర్ హరీ! మీరింకా బ్రహ్మచారులు. దంపత్యమంటే ఏమిటో తెలియదు. ఏదైనా, తన దాకా వస్తేనే కాని అర్ధం కాదు. " అని దుర్గ వైపు తిరిగి "దుర్గా! నువ్వు వెళ్ళాలను కుంటే మీ అన్నయ్య తో వెళ్ళవచ్చు. ఉందామనుకుంటే , మాత్రం మీ అన్నయ్య ను ఇంకెప్పుడు యిక్కడకు రావద్దని చెప్పాలి. నన్ను అవమానించే ఉద్దేశం కలవారు నా ఇంటికి రావటం, నా కిష్టం లేదు.' అన్నాడు.
ఈ మాటలతో, హరి, దుర్గ యిద్దరూ నిర్ఘాంత పోయారు. "ఊ! తొందరగా తేల్చు." అన్నాడు శంకర్ కఠినంగా-- దుర్గ రెండు చేతులతో ముఖం కప్పుకుని గొణుగుతున్నట్లుగా "మీ యిష్టం." అని అక్కడి నుండి వెళ్ళిపోయింది--
14
తమ గుమ్మం ముందు కారు, ఆగేసరికి, బయటకు వచ్చింది దుర్గ. కారులోంచి అత్యంత ఆధునికంగా అలంకరించుకున్న యువతీ, యిద్దరు యువకులూ దిగేసరికి, ఆశ్చర్యంతో అలాగే నిలబడింది. దుర్గను చూసిన ఆ యువతి చిరునవ్వుతో ముందుకు వచ్చి "ఏమే! కాళీ , నన్ను గుర్తు పట్లలా?' అంది.
ఆ సంభోధనతో , దుర్గ చటుక్కున ఆ వ్యక్తిని పోల్చుకుంది. చిన్నతనం లో జానకి ఆటల్లో, ఓడిపోయినప్పుడల్లా దుర్గను "దుర్గా! మహం కాళీ!" అని ఏడిపించింది." నువ్వా, జానకీ !" అంది నమ్మలేనట్లుగా --
"ఆ! నేనే! ఏం, జానకి అంటే, యింకా లంగా జాకెట్లు వేసుకునే, ఒక చిన్న పిల్ల అనుకున్నావా? అది సరే, గుమ్మం లో నిలబెట్టే మాట్లాడతావా? లోపలికి రమ్మనవా?" అప్పటికి దుర్గ సంభ్రమంలోంచి తేరుకుంది. అందరినీ లోపలి కాహ్వానించి కూర్చో పెట్టింది. జానకి ఆ పురుషులలో ఒకరిని పరిచయం చేస్తూ, "ఈయన మా శ్రీవారు పేరు రాజారాం. యిక, రెండవ వారెవరో నీకు తెలియక పొతే, నిన్నేం చేసినా , పాపం రాదు." అంది. అతడు ప్రసాద్ అని గుర్తించిన దుర్గ , అతని వంక చూసి చిరునవ్వు నవ్వింది -- సమాధానంగా తనూ నవ్విన ప్రసాద్ "నీ ఉత్తరం అందిన దగ్గర్నుండీ రావాలనే అనుకుంటున్నాను. ఇన్నాళ్ళ కు గానీ, వీలు పడలేదు." అన్నాడు. అంతవరకూ, చిన్ననాటి స్నేహితులను కాలిశానన్న సంతోషంలో మునిగి ఉన్న దుర్గకు అతడు ఉత్తరం అనంగానే, తన గొడవలన్నీ గుర్తుకు వచ్చాయి. మళ్ళీ ఏం ప్రళయం వస్తుందేమోనని గాబరా పడింది.
కాఫీలు తయారు చేసి అందరికీ, అందిస్తున్న దుర్గను చూసి ఆశ్చర్యంగా , జానకి' అదేమే! వంట నువ్వు చేస్తున్నావేం? వంట మనిషిని పెట్టుకోక! ఎన్నడైనా పని ముట్టుకునేదానివా?' అంది.
దుర్గ నవ్వి, "మరే! దుర్గ అంటే యింకా బువ్వ లాటలు ఆడుకునే పాపాయి అనుకుంటుంది." అని తిప్పి కొట్టింది.
