ఇంతవరకూ మాటా మంతీ లేకుండా కూర్చున్న రామనాథం "హలో, సత్యా! మీ ఫ్రెండ్ నిన్నో మనిషిగా మారుస్తున్నది! నాకు సంతోషంగా ఉంది" అన్నాడు.
అసలే కోపంతో ఉన్న, ఉడికిపోతున్న సత్య-"అవునమ్మా! మనిషిగా మార్చటం మనుష్యులకే చేతనవుతుంది!" అని అంది.
నిశ్చేష్టుడయ్యాడు రామనాథం!
చలనం లేకుండా కూర్చున్నది లలిత!
సత్యలోని లోతులు చూస్తున్నాడు కృష్ణ!
మిగతావారు ఆశ్చర్యాన్ని అభినయించారు, పారిజాతం తప్ప.
పారిజాతం మామూలుగా, "అట్టే ఉద్రేకపడి లాభం లేదు, సత్యా! జీవితం అంటే కొందరికి వడ్డించిన విస్తరి కాదు. ఉద్యోగం పూలపాన్పూ కాదు! కడుపు నిండా భోజనం చెయ్యి. మన మింకా తిరగాలి. ఊఁ! కానీయి!" అని త్వరపెట్టింది.
కృష్ణ, "అక్కా! నువ్వే దీనికి కారణం! అవునా!" అన్నాడు చిరునవ్వుతో.
నవ్వుతూనే పారిజాతం, "పైకి అట్లాగే కనిపించుతున్నది, మరి! ఈ గొడవల కేంలే కాని, త్వరగా భోజనం ముగించి అమ్మగారిని చూసివద్దాము. దారిలో ఫిలిమ్ రీళ్ళు మూడు కొంటాను. ఏం, సత్యా! రెడీయేనా?" అని అంది.
ఈవేళ ఏమయిందో సత్యకు. "మరెవ్వరూ రాకపోతేనే నేను వస్తాను" అని అంది.
"ఎవ్వరి కేం పనుందమ్మా? మీరే తిరిగి రండి! పాపం, పెళ్ళికాని వాళ్ళు సరదాగా తిరిగితే ఎవరు మాత్ర మేమంటారు? సత్యవతమ్మా! మీ అన్నగారూ వదినెగారి ముందు చెబుతున్నాను. మీరు పారిజాతమ్మ స్నేహం మానితే బాగుపడతారు! మీరు గొప్పింటి బిడ్డ! అట్లాంటి స్నేహాలు పనికిరావు!" అంటూ తన మాటలను లలిత మెచ్చుకొన్నదా, లేదా అని ఓరకంట చూచింది హెడ్ మిస్ట్రెస్.
"ఇక లే, సత్యా! వీళ్ళ కయితే ఈ మాటలు కొత్తగాని, నీకూ నాకూ కాదుగా! ఒకమూల ఇంటి యజమానురాలు జబ్బుతో ఉన్నారు! ఆమె ఆతిథ్యం పొందుతూ మనం సిగ్గులేక పోట్లాడుకొంటున్నాము. ఇంగితజ్ఞాన మున్న వాళ్ళమయితే, ఇట్లా చేసి ఉండము! క్షమించు, కృష్ణా, మమ్మలిని!" అంటూ పారిజాతం భోజనం నుండి లేచింది.
"వీళ్ళతో రావడం అసలు నా బుద్దితక్కువ! పొజిషన్ తెలియకుండా మాట్లాడుతారు! పాపం, అనంత లక్ష్మమ్మ నేమన్నారో ఏమో, పొద్దుటినుండి ఒకటే బాధపడుతున్నది! ఏమి చూచుకొనో పారిజాతమ్మ కంత గర్వం!" అంది హెడ్ మిస్ట్రెస్ ఎవరూ జవాబివ్వలేదు.
లలిత అనంతలక్ష్మిని "ఏమన్నారండీ! ఏమన్నా రేమిటి మిమ్మలిని వాళ్ళు?" అని అడిగింది.
"నన్నెవ్వరేమీ అనలేదు! నా ఖర్మ ఇట్లా ఏడిపించుతున్నది. దుశ్శకునాన నే నీ ఊరు వచ్చాను!" ఏడుపు గొంతుతో జవాబు చెప్పి, ఇక తినకుండా లేచింది అనంతలక్ష్మి. ఆ తరవాత అంతా చేతులు కడుగుకొనడానికి లేచారు.
* * *

డాక్టర్ సి. ఎన్. శాస్త్రిగారి నర్సింగ్ హోమ్ లో పడుకొని ఉన్న సతీదేవిని చూడగానే, అందరికీ బాధ కలిగింది. మంచం పక్కనే ఉన్న ఈజీ చైర్ లో భద్రీ ప్రసాద్ గారు చిన్న కునుకు తీస్తున్నారు.
"అమ్మా! ఎలా ఉందమ్మా నీకు?" అని ఆత్రంగా అడిగాడు కృష్ణ. గొంతులో వ్యాకులత ధ్వనించింది.
సతీదేవి కండ్లు విప్పింది. ఎదురుగా పారిజాతం కనబడగానే. ఆమె ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. సత్య, పారిజాతం ఆమెకు చెరొక పక్క కూర్చున్నారు. కృష్ణ దగ్గరనే ఉన్న మరో కుర్చీలో కూర్చున్నాడు.
"బాగానే ఉందమ్మా! సాయంత్రానికి తప్పకుండా ఇంటికి వస్తాము. ఇప్పుడే రావచ్చు కాని, డాక్టర్ గారు మరో కేసు చూస్తున్నారు. వారు రాగానే చెప్పి వస్తాము. ఏమమ్మా! భోజనాలు బాగా చేశారా? కృష్ణ పసివాడు! వాడి కేం తెలియదు. అందుకే సత్యవతి అన్నమా, వదిననూ రమ్మని కబురు చేశాము. వాళ్ళు వచ్చారా? అంతా సరిగా జరిగింది కదమ్మా!" అంటూ ఒకేసారి ఎన్నో కుశల ప్రశ్నలు వేసింది. మధ్య మధ్య ఒకటే ఆయాస పడుతున్నది.
పారిజాతం, "మీరు ఆయాస పడకండమ్మా! జరగవలసినవన్నీ సక్రమంగా జరిగాయి లెండి! అయినా, కన్నతల్లి ప్రేమకొద్దీ అట్లా అంటున్నారు కాని, ఇరవై యారు ఏళ్ల వాడిని పట్టుకొని 'పసివా'డంటా రేమిటమ్మా?" అంది నవ్వుతూ.
కృష్ణ చిరుకోపం నటించాడు. సత్య నవ్వింది. సతీదేవి కూడా నవ్వుతూ, "బిడ్డకు ఎన్నేళ్ళొచ్చినా, తల్లికి పసిపిల్లలలాగే ఉంటారమ్మా!" అంటూ పారిజాతాన్ని రెండు చేతులతో పొదుపుకొంది.
కృష్ణ కోపం నటిస్తూ, "అమ్మా! ముందొచ్చిన చెవులకంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి! అక్క చిక్కినప్పటినుండీ నన్ను పిలవడం మానేశావు! నాకు కోపంగా ఉంది! సన్యాసం తీసుకొంటాను" అని బెదిరించాడు.
పకపక నవ్వి పారిజాతం, "చిట్టి తమ్ముడూ! సన్యాసం తీసుకొంటానని ఎంత హాయిగా అన్నావు! అదంత సులభమా! ప్రేమించే వాళ్ళని వదిలి పోవడం అంటే మాటలా?" అని, "ఇక వెడతామమ్మా! ఇక్కడ నుండి మేము రాత్రికి బయలుదేరి వెళ్ళాలి. ఇంకా డామ్ సైట్ చూడలేదు. బాబాయిగారు మంచి నిద్రలో నున్నారు! వారితో చెప్పిడసండి మే మొచ్చినా మని!" అంటూ మరొక్క మారు అందరినీ నవ్వించి లేచింది.
"అదేమిటమ్మా! ఈ రాత్రేనా మీరు వెళ్ళి పోయేది?" ఎంతో దిగులుగా అంది సతీదేవి. "సరే లెండి! లేకపోతే మా 'తాటకి' ఊరుకోదు!" అంది పారిజాతం.
"అక్కా! నీతో నీ స్నేహితురాలెట్లా వేగుతున్నదో కదా!" అన్నాడు కృష్ణ, తమాషాగా సత్య వైపు చూసి.
"నీ కెందుకయ్యా! నీ వెట్లా ఆవిడతో వేగుతావో ఆలోచించుకో. పైకి ముంగిలాగుంటుంది కాని, అమ్మో లోపల కడుపునిండా దిక్కులేనన్ని ఊహలు ఉన్నాయి! అవి నాకు తప్ప మరెవ్వరికీ తెలియవు. అనవసరంగా ఆవిడను చెడగొట్టుతున్నానని పైన నాకు బిరుదొకటి!" అని, "ఇక కదలండి. అమ్మా! మీరు సాయంత్రం ఆరున్నర కంతా మీ బంగళా దగ్గర మాకు స్వాగతమూ, వీడ్కోలుకూడా చెప్పటానికి సిద్దంగా ఉండాలి" అంటూ పారిజాతం కృష్ణనూ, సత్యనూ తొందర పెట్టింది.
సతీదేవి ప్రేమగా సత్యవతి వైపు చూసి, "చూడు, తల్లీ, పారిజాతం! ఏం జరిగిమా, ఈ ఇద్ధరితో మాత్రం ఎలాగేనా వేగు. వాళ్ళిద్దరినీ విడిచిపెట్టకమ్మా!" అని అంది.
సత్య ముఖం సిగ్గుతో ఎర్రబడింది. సత్యవతిని తాను జీవిత సహచారిగా ఎన్నుకొన్నాడన్న విషయం తల్లికి తెలిసిపోయిందనీ, ఆమె మనస్ఫూర్తిగా దీన్ని కంగీకరించినదనీ కృష్ణ గ్రహించాడు.
పారిజాతం, "శుభం! అమ్మా! సాధ్యమైనంత వరకు మీ మాట మీరను" అని అంది.
ఫిల్మ్ కొని బంగళా చేరేసరికి మూడు గంటలు కావచ్చింది.
పిల్లలంతా సిద్ధంగా ఉన్నారు కాని, హెడ్ మిస్ట్రెస్ మాత్రం ముసుగుతన్ని పడుకొన్నది. సత్యవతి ముఖం కడుగుకోవటానికి బాత్ రూం కు పోయింది. పారిజాతం కూడా టవల్ తీసుకొంటూ, "జగదీశ్వరి గారూ! హెడ్ మిస్ట్రెస్ గారిని లేపండి. వేళవుతున్నది" అని టీచర్ తో అంది.
"ఆమెకు కళ్ళు తిరుగుతున్నాయట. రానని చెప్పమన్నారు." జగదీశ్వరి గారు జవాబిచ్చారు.
ఇంకేమీ ప్రశ్నించలేదు పారిజాతం.
మరో పది నిమిషాలకు హెడ్ మిస్ట్రెస్ మినహా అంతా బస్సు దగ్గర హాజరయ్యారు.
