స్వామి వచ్చాడు.
'చెప్పండి సార్!'
'ఛా ఒకటి పట్టుకురా!'
తిరిగి రెండు నిముషాల్లోనే ట్రేలో టీ పెట్టుకొని ఎదురుగ్గా నిలబడ్డాడు.
'ఓ గుక్కెడు త్రాగి వెళ్ళి పడుకో!' అన్నాడు సగం సాసరులో పోస్తూ.
రాజేశ్వరి త్రాగింది.
స్వామి వెళ్ళపోతుండగా, 'ఇల్లు సంగతి మర్చిపోకేం....కొద్దిగా అద్దె ఎక్కువయినా ఫరవాలేదు ..... నాంపల్లిలోనే కావాలి!' అన్నది.
'అలాగేనమ్మా!'
రాజేశ్వరి సత్యవతి గదిలోకి వెళ్ళి అంతకుముందే వేసుకున్న పక్కమీద నడుంవాల్చి-త్యాగరాజును కళ్ళముందు నిలుపుకాగా- మరుక్షణంలోనే నిద్ర పట్టింది.
కానీ,!
త్యాగరాజుకే తెల్లవార్లూ నిద్రపట్టలేదు!
* * *
తొమ్మిదిగంటలప్పుడు క్యారేజీలో అన్నం పెట్టుకొని ఒక ఫ్లాస్కోలో కాఫీ,మరో ఫ్లాస్కోలో పాలు పోయించుకొని సత్యవతీ, రాజేశ్వరి ఒక రిక్షాలోనూ, త్యాగరాజు మరో రిక్షాలోనూ ఎక్కి హాస్పిటల్ కు వెళ్ళారు.
అలా వెళుతుండగానే ఒక ఇంటి కిటికీకి కట్టిన 'టులెట్' అన్న చిన్న అట్ట ముక్కను చూచి వెనుక రిక్షాలో వస్తున్న త్యాగరాజుకు సైగచేసి చూపించింది రాజేశ్వరి.
చంద్రం వాళ్ళను చూస్తూనే సంతోషంగా నవ్వాడు.
'గుడ్ మార్నింగ్ టు ఆల్...' 'గుడ్ మార్నింగ్!' త్యాగరాజు చేయెత్తాడు.
బెడ్ దగ్గరకు వచ్చిన తరువాత, 'ఈమె రాజేశ్వరి!' అన్నాడు.
'నమస్తే!' రెండు చేతులూ జోడించాడు.
'నమస్తే!' చిరునవ్వుతో నమస్కరించింది.
'నీవు రాజేశ్వరికి చాలా రోజులక్రితం నుండి తెలుసు!'
చంద్రం నవ్వాడు.
'రాత్రెలా గడిచిందిరా చంద్రం?'
'ఫరవాలేదు.....బాగానే నిద్రపట్టింది!'
సత్యవతి మొఖాన్ని భర్తను చూడగానే వో కాంతిరేఖ అలుముకు పోయింది. పక్కన స్టూలుమీద కూర్చొని అంత మంది కొత్త వారున్నారనైనా సంశయించకుండా, అతడి నుదుటిమీద చేయి వేసి, చిన్నగా అతడి పీక్కుపోయిన మొఖంమీద పడుతున్న జుట్టును పైకి సర్దింది.
అలా సర్దుతుంటే ఆమె నుండి వో వేడినిట్టూర్పు వెలువడింది.
ఎన్నాళ్ళకు ఈయన మనిషి అవుతారు?
'ఏం సత్య! రాత్రి నిద్రపోయినావా సరిగ్గా?' అన్నాడు మొఖమెత్తి ఆమె మొఖంలోకి ప్రేమగా చూస్తూ.
ఆమె తల అటూ యిటూ తిప్పింది బరువుగా.
'ఆఁ...'
ఆమె కళ్ళలో నీరుగిర్రున తిరిగింది.
'నీనెత్తిన దేఁవుడు ఓటి నీళ్ళకుండను పెట్టాడోయ్....అవునా పిచ్చీ!' హృదయం కదిలేలా అన్న అతఃది మాటలకు- త్యాగ రాజు, రాజేశ్వరులకు గూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగినయ్.
రాజేశ్వరి సత్యవతి వెనగ్గా వచ్చి నిలబడి ఆమె బుజంమీద చేయి వేసింది.
ఉలిక్కి పడి సత్యవతి తల ఎత్తింది.
ఆమె చెంపలమీదుగా కారుతున్న కన్నీటిధారను చూస్తూనే రాజేశ్వరి చలించింది.
చంద్రం భార్యచేతిని తనచేతిలోకి తీసుకొని బలంగా నొక్కాడు.
'సత్యా! ఏఁవిటిది?'
'అరేయ్ చంద్రం...' మాట మారుద్ధామనే ఉద్దేశ్యంతో త్యాగరాజు అన్నాడు. 'నాంపల్లిలో నొ యిల్లు తీసుకుందామనుకుంటున్నామోయ్!'
'దేనికి?'
'ఎన్నాళ్ళు ఉండమంటావ్ హోటల్లో? రాజేశ్వరి గూడా కొన్నాళ్ళు శెలవుపెట్టి ఇక్కడే వుంటానన్నది.....అందుకనే ఆసుపత్రికి దగ్గరిగా ఉందామనుకుంటున్నాం!'
త్యాగరాజు ఉద్దేశ్యం అర్ధం కావటంతో చంద్రం కళ్ళు కాంతితో వెలిగినయి. కృతజ్ఞతతో చెమ్మ్గగిల్లినయి.
'సత్యా! వాడేమంటున్నాడో చూచావా? .....ఇంకెందుకోయ్ నీకు దిగులు ... నేను హాస్పిటల్ నుండే డిశ్చార్జి అయి వచ్చేటంతవరకూ నీవు నాముందునుండి కదలనక్కరలేదు!.....ఆ తరువాత, జీవితాంతం త్యాగరాజు ఫోటో మన పూజామందిరం నుండి తీయగూడదు గూడా-తెలిసిందా?'
త్యాగరాజు ఫక్కున నవ్వాడు.
'తెలివికి సంతోషించాం లేవోయ్!' అన్నాడు ఇంకేఁ వనాలో తెలియక.
మొహమాటం అతడిని సిగ్గుపడేలా చేసింది.
ఓ అరగంట పిచ్చాపాటీ మాట్లాడుకున్నారు.
'మరి.....నన్ను డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఏదైనా మాట్లాడి రమ్మంటావా?'
చంద్రం నవ్వాడు: 'ఏం మాట్లాడతావ్?'
'నవ్వబోకురా చంద్రా!' త్యాగరాజు సీరియస్ గా అన్నాడు.
చంద్రం గంభీరంగా మారి, 'అక్కర్లేదోయ్! రేడియం ట్రీట్ మెంట్ మొన్ననే గదా అయింది.....ఇక వంటికి పుష్టి చేకూరటమే కావాల్సింది.....దానికి ఓ నెల్రోజులు టైం పడుతుంది......ఆపైన డిశ్చార్జి......అంతే! ఇక మనం అడగవల్సింది వాళ్ళు చెప్పవల్సిం దీగూడా మరేవీ లేదు!' ఒక్కక్షణమాగి, అయినా, అవసరముంటే నేను చెబుతాగదా!' అన్నాడు,
'దెన్ ఆల్ రైట్...'
చంద్రం బలహీనమైన శరీరంనుండి ఓ వేడి నిట్టూర్పు వెలువడింది.
'ఈ ప్రాణి మిమ్మల్నందరినీ ఎలా హింసిస్తున్నదో' చూచావుటరా త్యాగీ !... నా మరోప్రాణం రోజులో ఎక్కువ భాగం దుఃఖంతోటే గడిపేస్తోందోయ్!' అన్నాడు పేలవపు నవ్వుతో.
త్యాగరాజు మితృడిని చూస్తూ మిత్రుడిమాటలు వింటూ చలించిపోతున్న గుండెల్ని అదుపులో పెట్టుకోలేక, 'అయితే చంద్రా!....మేం వెళ్ళివస్తాం...పోతూపోతూ ఇల్లు చూచి....కావాల్సిన వేవో ఏర్పరచుకొని మళ్ళీ సాయింత్రం నాలుగుగంటలకు వస్తాం....ఇక శలవా మరి మాకు!' అంటూనే సత్యవతి వైపుకు తిరిగి, 'ఏఁవమ్మా సత్యవతీ!...నీవు ఇక్కడే వుంటావుగదా ... మేం వచ్చి సాయింత్రం తీసుకువెళతాం!' అన్నాడు.
సత్యవతి అంగీకార సూచకంగా తల ఊపింది.
త్యాగారాజూ, రాజేశ్వరీ బయిటకు వచ్చేశారు.
హాస్పిటల్ మెట్లుదిగి రోడ్డెక్కిన తరువాత, రాజేశ్వరి త్యాగరాజు మొఖం లోకి తలెత్తి చూస్తూ, అసలు అతడు మొదటినుండీ అంతేనా-లేక ఈ జబ్బు మూలకంగా అలా సన్నపడిపోయాడా? అడిగింది.
త్యాగరాజు ఒక్కక్షణం గతంలోకి పోతున్నట్లుగా ఆగి, 'లేదు రాజేశ్వరీ! అతడు చాలా చిక్కిపోయాడు.....మనిషి నాలుగోవంతు అయ్యాడు.....బహుశః అది ట్రీట్ మెంటు ఎఫెక్టేమో?' అన్నాడు సంశయిస్తూ.
ఆమె తడబడుతూ, 'నాకు అతడిని చూస్తుంటే భయమేసింది .... కళ్ళల్లో మృత్యువు తొంగి చూస్తున్నట్లనిపించింది!' అన్న్హది.
అలా అంటున్నప్పుడు ఆమె కంఠం వణికింది.
అప్రయత్నంగా త్యాగరాజుచేతిని మణికట్టుదగ్గర పట్టుకున్నది.
త్యాగరాజు వింతగా చూచాడు ఆమె మొఖంలోకి.
ఆమె మొఖం నల్లగా వున్నది.
'అదేఁవిటి?....అతడిని చూచి నీవు గాని భయపడ లేదుగదా?' అడిగాడు ఆత్రుతగా.
'ఉఁహూఁ ... తల అడ్డంగా వూపింది. ఒక్కక్షణం తరువాత. 'లేదు.....కాని, నా కెందుకో అతడి లోతుకుపోయిన కళ్ళల్లోకి, పీక్కుపోయిన చెంపల్లోకి చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచే ఆలోచనలు వచ్చినయి!' అన్నది.
'అయితే ఇంకెప్పుడూ నిన్ను అక్కడకు తీసుకు వెళ్ళనులే!' అన్నాడు మరే ఆలోచనా లేకుండా త్వర త్వరగా.
రాజేశ్వరి కోలుకున్నట్లుగా నవ్వి, 'భలేవారే....నేనేం చిన్నపిల్ల ననుకుంటున్నారా మీరు?' అన్నది.
ఇద్దరూ కొంతదూరం మౌనంగా నడిచిన తరువాత, 'అదేఁవిటి మనం నడుస్తున్నాం .... రిక్షా ఎక్కితే పోదూ?' అన్నాడు త్యాగరాజు.
'ఎందుకు.....ఇందాక చూచిన ఇల్లు ఇక్కడకు దగ్గరలోనే గదా?... అక్కడి దాకా నడుద్దాంలేండి!' అన్నది తాపీగా.
వారిద్దరిమీదా వారివారి ఆలోచనలు నృత్యం చేస్తుండగా వారినడుమ మౌనమే శరణ్యమయింది.
'టులెట్' అన్న అట్టముక్క కట్టివున్న ఇల్లు తిరిగి వారికంట పడేటప్పటికి ఓ పదినిమిషాల నడక పట్టింది.
ముందు త్యాగరాజు మెట్లెక్కి తలుపు తట్టాడు.
లోపల ఘడియతీస్తున్న శబ్దమవటంతో ఒక్క మెట్టు క్రిందకు దిగాడు.
ఆమె తలుపు తీస్తూనే కొత్తవాళ్ళను చూస్తూ పెద్దగానవి, 'నేను తెలివితక్కువ దాన్నని మా యింటాయన అంటుంటారు-మీ రాకతో వారే తెలివి తక్కువ అని నిరూపించాను!' అన్నది చేతులు తిప్పుతూ ఫక్కున నవ్వి.
త్యాగరాజు, రాజేశ్వరి ఒకళ్ళ మొఖం లోకి ఒకళ్ళు విచిత్రంగా చూచుకున్నారు.
'రండి....రండి...మీ రెందుకొచ్చారో నాకు తెలుసు-ఆ అట్టమీద నేను రాయమంటే మావారు రాసిన అక్షరాలను చూసేగదా! .... అవునా!' అంటూ రాళ్ళు డబ్బాలో వేసి ఊపినట్లుగా నవ్విందా స్త్రీ.
చాలా లావుగా వున్న ఆమె వెనుతిరిగి లోపలికి అడుగులు వేసింది.
పులి నోట్లో కాలుపెడుతున్నట్లుగా ఆమె ఆకారానికి, ఆమె మాటలకు బిక్కచచ్చిపోయి లోపల-కాలు పెట్టారు-త్యాగరాజు, రాజేశ్వరి!
'మేం దీన్ని ఇరవైవేలు పెట్టి కొన్నాం!..... ఇరవై వేలంటే మాటలా మీరు చెప్పండి! ఆపైన దానికీ, దీనికీ బాగులన్నారు ..... ఓగులన్నారు .... రెండువేలు ఖర్చయింది.....ఇంతకీ నేను చెప్పొచ్చేదేఁవిటంటే ఏతావాతా తడిసి మోపెడయింది!'
ఆమె ఎందుకు అలా చెబుతున్నదో ఇద్దరికీ అర్ధం కాలేదు.
'ఇది హాలు....దీని వెనుకది వంటిల్లు.....అరె! అదేఁవిటి మొఖమాటం దేనికి?.....లోపలికి రండి..... చూచారా! వంట యిల్లంటే వంట యిల్లనుకున్నారా....అద్దంలా వున్నది.....అవునా....ఇంత ఏడ్చి దీనికి యనభయ్యే అద్దె.....నాకు మాత్రం ఎలాంటి ఆశా లేదు.....మంచివాళ్ళు రావాలి......పరువు గలవాళ్ళు రావాలి అంటాను.....అబ్బే ఆయనకివేం పట్టవ్....అద్దె వస్తే సరి.....ఎలాంటి వాళ్ళైనా సరే అంటారు.... నాకుమాత్రం నచ్చదు సుమండీ!' పెద్దగా నవ్వింది.
-అలా నవ్వినప్పుడు ఎత్తియిన ఆమె పళ్ళు అసహ్యంగా కనబడుతున్నాయి.
రెండుగదులూ యనభయి!
ఇది కలికాలం - అందునా హైద్రాబాద్ !
-అయితే వెలుతురు బాగా వస్తుంది. గదులు రెండూ ఫరవాలేదు, విశాలంగానే వున్నాయి!
దొడ్లో టాప్!
-ఇంకేం కావాలి? డబ్బు పోతేనేం?
'అద్దె ఏదైనా తగ్గించగలరా! రాజేశ్వరి చిన్నగా భయపడుతూ, భయపడుతూనే అడిగింది.
'ఇదుగో అమ్మాయీ! నీపేరేఁవిటో నాకయితే తెలియదుగాని-చూడు, ఇంకెప్పుడూ అద్దె ఎక్కువని మాత్రం అనబోకు - హైద్రాబాద్ మొత్తంలో ఈమాత్రపిల్లు ఎనభై రూపాయిలకు దొరుకుతుందేఁవో చూడు- తరువాతనే నా గడపలో కాలుపెట్టూ - ఆఁ! తెలిసిందా-' చాలా నిక్కచ్చిగా చెప్పేసింది.
రాజేశ్వరి తిరిగి ఏదో అనబోయే లోగానే, 'ఇంతకీ మీకేఁవైనా పిల్లలా?' అడిగింది.
ఇద్దరూ తడబడ్డారు.
'లేరు .... లేరు!' అన్నారు ఒక్కసారే.
'ఇంకేం ..... ఇంకోమాట చెప్పకుండా ఎనభై రూపాయిలు ఎడ్వాన్సు ఇచ్చి వెళ్ళండి .... తిరిగి మీ రొచ్చేటప్పటికి ఇల్లంతా పనిమనిషిచేత అద్దంలా కడిగించి అట్టె పెడతాను!'
త్యాగరాజు ఇంకేం మాట్లాడకుండా డబ్బులిచ్చేసి బయిటకొచ్చాడు.
రాజేశ్వరి అనుసరించింది.
త్యాగరాజుతో మాట్లాడాలంటే రాజేశ్వరికి భయంగా వున్నది!
ఆ యింటి యజమానురాలు 'మీకు పిల్లలా?' అని ప్రశ్నించి నప్పటినుండీ యిద్దరి మొఖంలోనూ జీవంలేదు.
'-అదేఁవిటి అలా అడిగింది ఆమె?' యిద్దరూ అనుకోసాగారు.
