Previous Page Next Page 
స్వాతి జల్లు పేజి 12

 

                                      5
    ధైర్యం చేసి మనసులో తారను తలచుకుంటూ శ్రీధర్ ఇంటికి చేరుకున్నాడు రవి. గేటు దగ్గిర దర్వాన్ కనుపించాడు.
    "లోపలికి వెళ్ళచ్చా?"
    "బాధగా' నవ్వుతూ, చేతులు నలుపుకుంటూ బెంబెలుగా చూస్తూ అడిగిన రవిని చూసేసరికి దర్వాన్ లో ఎక్కడ లేని పొగరు మోతుతనమూ , చోటు చేసుకొంది.
    "ఇప్పుడు వెళ్ళకూడదు. అయ్యగారు పనిలో ఉన్నారు." పొగరుగా సమాధాన మిచ్చాడు దర్వాన్.
    రవి వాలకాన్ని గమనించి తానూ ప్రయత్నిస్తే రెండో మూడో, చేతిలో పెట్టక పోడని ఆశ పడ్డాడు వాడు. ఎవరి తాపత్రయాలు వారివి.
    "ఎప్పుడు తీరిగ్గా ఉంటారు?"
    "సాయంత్రం !" నిర్లక్ష్యంగా అన్నాడు.
    సాయంత్రం వెళితే "ప్రొద్దున్న' అన్నాడు. ఉదయం వెడితే 'సాయంత్రం' అన్నాడు. అట్లాంటి ఉదయాలు, సాయంత్రాలూ ఒక పది గడిచి పోయేసరికి తారకు రవి మీద పట్టరాని కోపమొచ్చింది.
    "అబ్బ! మరీ ఇంత చేతకాని తనమేమిటి ?" స్పష్టంగానే విసుక్కుంది.
    రవి బిక్కచచ్చిపోయాడు.
    "నేనేం చెయ్యనూ? ఆ దర్వానే...."
    "వాడిని చాచి ఒక్క లెంపకాయ కొట్టక పోయారా?" రవి హడలిపోయి చూశాడు.
    "ఆశక్తి లేకపోతె, రెండు రూపాయలు వాడి మోహన కొట్టక పోయారా?"
    "ఇక్కడ కూడా లంచమా?"
    "లంచం కాదు. మీ చేతకాని తనానికి జరిమానా. నేనే వెళ్ళి అడుగుతాను లెండి. మీ తరుపున నేను అడగటమేమిటనే ప్రశ్న వస్తుంది. సరే! దానికీ సమాధానం చెబుతాను.."
    "ఏమని?"
    "కొంతమంది వ్యక్తులను అభిమానించటం కూడా మహా పాపమని...."
    విసురుగా వెళ్ళిపోయింది తార.
    డాక్టర్ శ్రీధర్ ఇంటి దగ్గర రిక్షా దిగి తార ఠీవిగా లోపలకు నడిచి పోతుంటే దర్వాన్ నోరు తెరుచుకు చూస్తూ నించున్నాడు. "ఇదీ లోకం!"అనుకోంది తార.
    శ్రీధర్ తారను సాదరంగా ఆహ్వానించారు. ఆమె వచ్చిన పని విని చాలా ఆశ్చర్య పోయాడు.
    "నన్ను క్షమించండి! ఎవరో యువకుని కోసం మీరు శ్రమ తీసుకొని రావటం...."
    ఈ ప్రశ్న వస్తుందని తారకు తెలుసు! సమాధానం కూడా సిద్దంగానే ఉంచుకొంది.
    'అతడు ఎవరో కాదు. నాకు కావలసిన వాడు౧"
    శ్రీధర్ అదిరిపడ్డాడు.
    "నన్ను క్షమించండి/ సుందరరావు గారు నాకు బాగా తెలుసు! మేము మంచి స్నేహితులం కూడా! అయన గట్టిగా తలచుకొంటే , రవిని ఎంతైనా వృద్దిలోకి తేగలరు. అయన ఒక్క పార్టీ కి ఖర్చు చేసే డబ్బుతో రవికి ఒక సంవత్సరం చదువు తేలిగ్గా అవుతుంది. మీ ధోరణి ని బట్టి ఇది మీ అన్నయ్య గారి కిష్టం లేని వ్యవహారం లా తోస్తుంది. ఇలాంటి వాటిలో నేను ఇరుక్కోలేను."
    తార ప్రాధేయపడుతున్నట్లు చూసింది. కానీ శ్రీధర్ నిర్ణయం మారలేదు.
    'మీ కోరిక నిరాకరించడానికి విచారిస్తున్నాను . కాఫీ తీసుకోండి!"
    తార కృంగి పోయింది.
    లేచి నుంచొని "క్షమించండి! నాకేమీ అక్కర్లేదు"అంది.
    "అదేం? అలవాటు లేదా? కూర్చోండి . పళ్ళు తెప్పిస్తాను."
    "వద్దండీ! నేను అర్జంటుగా వెళ్ళాలి."
    "అంత అర్జంటా ? నేను కారులో డ్రాప్ చెయ్యనా?"
    "థాంక్స్! మీకా శ్రమ అక్కర్లేదు. నేను వెళ్తాను."
    అవమానంతో, ఆశా భంగంతో మనసు కుతకుత ఉడుకుతుండగా బయటపడింది.

                               *    *    *    *
    సరిగ్గా డాక్టర్ శ్రీధర్ గారింటికి తార వెళ్ళిన సమయంలోనే మనోరంజని ప్రకాశరావుగారింటి కొచ్చింది. ఏదో పేరంటాని కెల్తూ అరుంధతీ తారలతో కలిసి వేడ్తామని వచ్చింది. బొత్తిగా నగలు లేని వాళ్ళిద్దరి మధ్యా , తాను ధరించిన దుస్తుల కనుగుణమైన నగలతో మెరిసిపోతూ, కనిపించటం, మనోరంజని కెంతో సరదా! మనోరంజని వస్తుందని తెలియని అరుంధతి ముందుగానే , వెళ్ళిపోయింది. పనిమనిషి ద్వారా , తార డాక్టరు గారింటికి వెళ్ళిందని విన్న మనోరంజని మ్రాన్పడి పోయింది.
    "డాక్టర్ గారింటికా?!"
    మనోరంజని భావ పరివర్తనను గమనించి పని మనిషి కంగారు పడుతూ , సర్ధటాని కన్నట్లు "రవి బాబు గారి పని మీద లేండ'మ్మా!" అంది.
    "ఏం పని?"
    క్రోధంతో మరింత వికారమయిన మనోరంజని ముఖం చూసిన తరువాత, పనిమనిషి కి మాటలు పెగల్లేదు.
    "ఏదో లేగండమ్మగారూ, నాకేటి తెలుస్తాదీ?" అని తప్పించుకోవడానికి ప్రయత్నించింది.
    మనోరంజని తన పర్స్ లోంచి అయిదు రూపాయల కాగితం తీసి దాని చేతిలో పెట్టింది. ఆ కాగితం దాని చేత, అద్భుతాలు పలికించింది. తాను విన్నదీ, కన్నదీ, కొంచెమే కావటం వలన ఊహించినది చాలా చేర్చి మనోరంజని కి చెప్పింది.
    ఇన్నాళ్ళకు తార మీద కసి తీర్చుకోవటానికీ, మనోరంజనికి మంచి అవకాశం దొరికింది. నిజం చెప్పాలంటే పై కధ మనోరంజని కి బాధను కంటే సంతోషాన్నే ఎక్కువ కలిగించింది. ఆమెకు తార స్వభావం బాగా తెలుసు! తార ఒక నిశ్చయాని కొచ్చిందంటే , దానికి తిరుగుండదు. వేరు సంబంధం ఏది చూసినా, అధమ పక్షం , అయిదు వేలయినా , సుందరరావు కట్న మిచ్చుకోక తప్పదు. ఇప్పుడయితే నెపం తార మీదనే వేసేసి కట్నం బాధ తప్పించుకోవచ్చు.
    పనిమనిషి చెప్పిన కధను తన కళా ప్రావీణ్యాన్ని కూడా జోడించి , సుందర్రావు చెవిన వేసింది మనోరంజని-- వింటూనే , సుందర్రావు భగ్గున మండిపోయాడు. సుందర్రావుకు తార అంటే , ఎంతో ప్రేమ! తన చెల్లెలు , ఒక ప్లీడరు గుమస్తా ను వరించటం , అతనెంతమాత్రమూ సహించ లేకపోయాడు.
    "రోజూ అరుంధతి గారింటికి కేడుతున్నానంటే, నిజమే ననుకొనేదాన్ని-- కానీ, తార వెళ్ళేసరికి , అరుంధతి ఇంట్లో ఉండదుట! ప్రకాశరావు గారు సాయంత్రం ఎన్నడూ, ఇంట్లో ఉండరని, అందరికీ తెలిసిందే! ఇంక మన తారా, రవీ వీళ్ళిద్దరిదే రాజ్యం! అయినా అరుంధతి కామాత్రం బుద్ది ఉండొద్దుటండీ! తెలిసి తెలిసి చిన్నపిల్లనిలా  ప్రోత్సహిస్తుందా? అంటే, మీకు కోపమొస్తుందేమో కాని, ఆవిడ వ్యవహారం నాకేం నచ్చదు."
    తన ఆవేదననంతా వెళ్ళకక్కుకోంది మనోరంజని.
    సుందరర్రావు మనసు కుతకుత ఉడికిపోయింది. అతనికి చెల్లెలి పట్ల అంతులేని అభిమానం -- తన చెల్లెలు ఒక ప్లీడరు గుమాస్తాను ప్రేమించటం, అతనెంత మాత్రమూ సహించ లేకపోయాడు. ఇందులో అరుంధతి ప్రోత్సాహం కూడా ఉందని విన్న సుందరరావుకు మతి పోయినట్లయింది. జీవితంలో ప్రేమనూ, ధనాన్నీ త్రాసులో పెట్టుకొని ధనం వైపే మొగ్గు చూపించినా, సుందర్రావు కు ప్రేమ విలువ తెలియక పోలేదు. అరుంధతి కీ, తనకూ మధ్య జరిగింది ఏమీ లేకపోయినా, చెప్పుకోవటానికి చాలా స్వల్పంగా అనిపించే కొన్ని కొన్ని సంఘటనలు తనకు కలిగించిన గిలిగింతలు ఈనాటికీ పరవశాన్ని కలిగించేవి.
    ఒకనాడు ఇంట్లో ఎవరూ లేరు. తన కెంతో ఆకలిగా ఉంది. ఇంతలో ఎక్కడికో వెళ్ళిన తారా అరుంధతీ వచ్చారు. ఆకలిగా ఉందని తను తారతో చెప్పాడు.
    "ఇప్పుడే బజారంతా తిరిగి వచ్చా నన్నయ్యా! చాలా బడలికగా ఉంది. హోటల్ కెళ్ళి తినరాదూ?" అంది.
    తనకు కోప మొచ్చింది. తారనేమీ అనలేక, తన గదిలోకి పోయి కూర్చున్నాడు -- కొంచెం సేపట్లోనే ఫలహారం పళ్ళెం చేతిలో పట్టుకొని అరుంధతి అక్కడకు వచ్చింది. తను కృతజ్ఞత తో కరిగి పోయాడు.
    ఆప్యాయంగా ఆమె వంక చూసేసరికి, అరుంధతి సిగ్గుపడి, చటుక్కున అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
    ఇంకొక నాడు అరుంధతి ఒంట్లో బాగులేదని పడుకొంది. చుట్టూ ప్రక్కల ఇళ్ళలో పిల్లలు , పడుకొన్న అరుంధతి చుట్టూ చేరి గోల చేస్తున్నారు. తానూ చూసి సహించలేక పోయాడు. తొందరగా అక్కడకు వెళ్ళి మంద స్వరం లోనే, వాళ్ళను మందలించాడు-- పిల్లలంత గోల చేసినా, నిద్రపోయిన అరుంధతి, తన మెల్లని స్వరానికి దిగ్గున లేచి కూర్చొంది. తాను అపరాధిలా చూసాడు. తను ఎదురుగా పడుకొన్నందుకు సిగ్గుపడిపోతూ అరుంధతి అక్కడి నుంచి లేచి పోయింది.
    ఇట్లాంటివె , ఏవో సంఘటనలు, తన హృదయంతర్భాగంలో అపురూపంగా దాచుకున్నాడు.
    చేతి నిండా డబ్బుతో, విచ్చలవిడిగా ఆనందాన్ని వెతుక్కుంటూ గడిపిన ఇన్ని సంవత్సరాలలో ఆనాడు తాననుభావించిన ఆనందపు చాయలనైనా , ఎక్కడా గుర్తించలేకపోయాడు. ఒక్కమాట కూడా లేని, కనీసం చేతి వేలు నైనా , స్పృశించని , ఆ ప్రణయం లోని మాధుర్యానికి సాటి అతని కెక్కడా కనుపించలేదు.
    మళ్ళీ అలాంటి ఆనందాన్ని పొందాలనుకోవటం అడియాస? కాలం వేగంగా ముందుకు పరిగెడుతుంటే గాని, వెనక్కు రాదు. అది పూర్తిగా అసంభవం.
    కానీ, అరుంధతి తో ఒక్కసారి మనసు విప్పి మాట్లాడగలుగుతే? ఒక్కసారి, తన నోటితో తను, ఈ లోకంలో అన్నింటి కంటే ఆమె తనకు ప్రియమైనదని చెప్పగలుగుతే?
    అది మాత్రం సంభవమా? అరుంధతి నిర్లిప్తత తనకు స్పష్టంగా, తెలుస్తూనే ఉంది. తన పట్ల ఒక విధంగా నిర్లక్ష్యాన్నే వ్యక్త పరుస్తుంది. కానీ అదంతా, నటన అని తనను తాను నమ్మించుకోవటానికి ప్రయత్నించాడు-- అరుంధతి వంటి వ్యక్తీ తన తిరస్కారానికీ ఆమాత్రం పౌరుషపడటం సహజమే!
    కానీ, ఈనాడు తారను ఒక సామాన్యుడయిన ప్లీడర్ గుమస్తా తో అనురాగాన్ని పంచుకోవటానికి అరుంధతి ప్రోత్సహిస్తుందంటే , అతని మనసు భగభగ మండిపోయింది. తనను తిరస్కరించి నందుకు అరుంధతికి కసి ఉండచ్చు గాక! కానీ తన ద్వేషానికీ నోరేరుగని అమాయకురాలిని బలి చేస్తుందా?  

 

                                  
    తక్షణమే అరుంధతి దగ్గిరకు బయలుదేరాడు సుందరరావు. సాధారణంగా , సుందరరావు ఒక్కడినీ అరుంధతి దగ్గిరకు వెళ్ళనీయదు మనోరంజని. కానీ, రోషంతో భగ్గున మండుతున్న అతని కళ్ళను పళ్ళ మధ్య నలిగిపోతున్న క్రింది పెదవినీ చూసి అతని ననుసరించడానికీనాడు సాహసించలేకపోయింది.

                                *    *    *    *
    "నీ కసి తీర్చుకోవటానికి కిదా మార్గం?"
    సుడిగాలిలా వచ్చి, వస్తూనే విరుచుకు పడిన సుందర్రావును , ఆశ్చర్యంగా చూస్తూ చేతిలో నవల మూసి ప్రక్కన పెట్టింది అరుంధతి.
    "కూర్చో! నువ్వేం మాట్లాడుతున్నావో నా కర్ధం కావటం లేదు. కొంపదీసి బార్ నుంచి రావటం లేదు కదా!"
    అరుంధతి పెదవుల మీది చిరునవ్వు చూస్తూ, ఆమె కంఠస్వరాన్ని వింటూ, తన కోపాన్ని నిలుపు కోవటం కష్టమవుతుంది సుందర్రావు'కు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS