"అబద్దాలు మాట్లాడ్డానికి అలవాటు పడ్డవాళ్ళు ఒక్కోసారి అబద్ధం చెప్పబోయి నిజం చెప్పేస్తారట. వాళ్ళు ఉన్నమాట చెప్పే అలవాటు లేని వాళ్ళు కనుక. అలా తన కొడుకు ఓట్ల కోసం ఎంతలా గడ్డి కరుస్తున్నాడు? పట్టరాని వాళ్ళ కాళ్ళు పడుతున్నాడు. డబ్బుతో ఓట్లు కొనుక్కుంటున్నాడు. కొందర్ని చాటుగా తన్నిస్తున్నాడు. ఇవాళ తనని నమ్మించడానికి ఈ అబద్ధం ఆడలేడూ! అప్పటికే ఏదో ఆవేశంతో అంతదూరం నడిచి వచ్చిన రంగనాధం అలసటగా చతికిలబడి, "మహాప్రభో కానియ్ రా. స్నేహితుడి కూతురో మేనమామ కూతురో....కొంప పరువు ప్రతిష్ఠలతో నీకు పనేమిటి! దైవం రక్షించి పిల్లా జెల్లా లేరు...."
"ఈ అమ్మాయిని మీ మానవరాల్లా చూసుకోండి నాన్నా." నీరసంగా విస్త్రాణగా చతికిల బడిపోయిన రంగనాధంవైపు చిన్నగా నవ్వుతూ చూసి అన్నాడు శ్రీనివాసరావు.
"ఆ అదృష్టమే నాకుంటే, నువ్వు.....నువ్వు... ఊసరవెల్లిలా ఇన్ని రంగులు మార్చకపోదువు."
ఇంకా అతన్ని మాట్లాడిస్తే తనే సంగతులు రాధ దగ్గర దాచాలని ప్రయత్నిస్తున్నాడో. అవన్నీ వర్ణించేస్తారు రంగనాధం అనుకున్న శ్రీనివాసరావు "అమ్మ రాధా, అదిగో బాత్ రూమ్- కాస్త కాళ్ళూ చేతులూ కడుక్కురా అక్కడ నీళ్లుంటాయ్" అన్నాడు.
భర్తా మామగారూ ఘర్షణ పడ్డం. ఎవరో అమ్మాయి రావడం కనిపెట్టిన శాంత. నెమ్మదిగా కాఫీగ్లాసుతో శ్రీనివాసరావు గదిలోకొచ్చింది.
"చిరునవ్వుతో ఆమె చేతులో గ్లాసందుకుమూ నీకొక చక్కని కూతుర్ని తీసుకువచ్చాను. చూడు అదిగో...నాన్నకుకూడా కాస్త కాఫీయో, మజ్జిగో తీసుకురా బాగా అలసిపోయారు." అంటూ పకాల్ని తీసుకురా. బాగా అలసిపోయారు." అంటూ పకాల్న నవ్వాడు శ్రీనివాసరావు.
"సిగ్గులేక పోతే సరి.....నలుగురూ ఏమనుకుంటారు?.....నన్నిలా అన్యాయం చేస్తారని కలలో నన్నా అనుకోలేదు." రోషంగా. అసహ్యంగా అతనివైపు చూసి చప్పున దుఃఖం ఆపుకోలేక మొహం చీర చెంగుతో కప్పుకుంది శాంత.
"సిగ్గెందుకు? సిగ్గుపడాల్సిన పని నేనేం చెయ్యలేదు. హృదయమున్న మనిషిచేసే పనిచేశాను. నే చేసిన పాపాలు కడుక్కోడాన్కి ఇంతకన్నా మంచిపని ఏమీ ఉండదనుకుని, దిక్కులేని, తల్లీ, తండ్రీ....అందరూ కరువై అఘోరిస్తున్న ఆ అమ్మాయిని ఆదుకోకుండా ఉండలేకపోయాను. ఆ ఆ తర్వాత అన్నీ నీకు చెప్తాగా.....అక్కడే నిల్చుండిపోయింది పాపం. రాధా.......రామ్మా మీ పిన్ని చాలా మంచిది." అన్నాడు శ్రీనివాసరావు.
కాస్త కోలమొహం కాంతివంతమైన కళ్ళూ, నొక్కునొక్కుల జుట్టూ ఎత్తైన నాసికా, తన పెళ్ళికి తన భర్తమొహం పల్చగా ఇలానే అందంగా ఉండేదీ. చక్కని రంగు. బాగా పండిన బంగిని పల్లి మామిడిపండు రంగు. అందంగా ఆకర్షణీయంగా ఉన్న ఆ అమ్మాయివైపు చకితయై చూసింది శాంత.
కొన్ని క్షణాల మౌనం తర్వాత. గబగబా వంట ఇంటివైపువెళ్ళి రెండు గ్లాసుల కాఫీతెచ్చి, రాధ కొక గ్లాసూ రంగనాధానికొకగ్లాసూ ఇచ్చింది.
కళ్ళజోడు సరిజేసుకుంటూ అక్కడికి ప్రవేశించిన జానకమ్మ. "అమ్మాయ్ నీ పేరేవిటమ్మా" అడిగింది.
ఒక్కసారి శ్రీనివాసరావు మొహంలోకి చూసి. రాధ అని చెప్పింది. మీ అమ్మా నాన్నా ఎక్కడున్నారు? మళ్ళీ ప్రశ్న.
"పోయారండి."
"అయ్యో పాపం.
కొన్ని క్షణాలు నిశ్శబ్దం.
"పెళ్ళయిందా?"
లేదండి.
'మరెవరి దగ్గరుంటున్నావ్?"
చప్పున దుఃఖ మొచ్చింది రాధకు...." నాకు ఎవ్వరూ లేరు బామ్మగారూ. మీ కుటుంబమే దిక్కు నేను కులటనూ, పతితనూకాను దైవంలా. తండ్రిలా మీ అబ్బాయి....బాబయ్య గారూ నన్ను రక్షించారు.....నేనొక నష్ట జాతకురాలను" వెక్కి వెక్కి ఏడుస్తుంది రాధ.
"అయ్యో పాపం ఏడవకమ్మా. మా వాడు వారానికో డిన్నరిస్తాడు. నీకు గుప్పెడన్నం పెట్ట లేమూ." "ఏమిటండీ మీరూ మంచీచెడ్డా లేకుండానూ" అంటూ భర్తను మందలించింది. "అబ్బాయ్ స్నానాలు చెయ్యండి వడ్డించేస్తాను." అని శ్రీనివాసరావుకి చెప్పి ఇంటివైపు నడిచింది జానకమ్మ.
"నీదొక చీరియ్యి శాంతా అమ్మా అమ్మాయికి" అన్నాడు శీనివాసరావు.
మౌనంగా చీర తెచ్చి రాధకిస్తూ, "బాయిలర్ లో నీళ్ళూ షెల్ఫు మీద సబ్బూ ఉంటాయి. తీసుకో" అంది శాంత.
రాధ వెళ్ళగానే "నన్ను మీ మాటలు నమ్మమంటారా? నిజంగా ఆపదలోంచి రక్షించి తీసుకువచ్చారా ఆ అమ్మాయిని నన్ను అన్యాయం చెయ్యకండి" ఏడ్చేసింది శాంత.
పకపకా నవ్వాడు శ్రీనివాసరావు. "మీటింగు లకీ, ఫంక్షన్లకీ దర్జాగా రెండో బుజం మీద పవిట చెంగు కప్పకుండా.... సిగ్గభినయించకుండా తల వంచకుండా హాజరవుతూ ఓట్ల కోసం నాకన్నా ఎక్కువగా నీ గొంతు ఎత్తి ఉపన్యాసాలిస్తూ. ఇంట్లో మా అందరిమీదా అజమాయిషీ చేస్తూ తిరిగే నువ్వూ ఆడదానివే శాంతా" అంటూ-
"మీరు ఇప్పుడు చేసిన పనికి నలుగురూ ఏమనుకుంటారు?" కళ్ళూ మొహం తుడుచుకుంటూ అంది శాంత.
"ఎవరేమనుకున్నా నాకేం ఫర్వాలేదు. నేనేం కానిపని చెయ్యలేదు. నువ్వేమీ అనుకోకుండా ఉంటే అదే చాలు" అన్నాడతను.
* * *
ఎవ్వరి మనస్సులూ స్తిమితంగా లేవు. ఇవ్వాళ కూతురంటాడు. రేపు నా ఇష్టం. తెచ్చుకున్నా డంటాడు. వాడి మాటలు నమ్మ తగ్గవికావు. ఒకటి చెప్తాడు. ఇంకోటి చేస్తాడు. కొడుకు వ్యక్తిత్వం మీద పూర్తిగా నమ్మకం సడలిపోయిన రంగనాథం. కుటుంబ గౌరవం గంగ పాలవుతూందని విసవిసలాడిపోతున్నాడు. ఆ అమ్మాయి తన కొడుకు పట్ల ఎలా ప్రవర్తిస్తుందో వెయ్యి కళ్ళతో కనిపెడుతున్నాడు.
ఏ పిల్లో-దిక్కులేని పిల్ల లక్ష్మిలా నట్టింట్లో బామ్మగారూ అని నోటినిండా పిలుస్తూ తిరుగుతూంది. వాడి బ్రతుకు సవ్యంగా ఉంటే ఈపాటి కింత పిల్ల నట్టింట ఉండనే ఉండేది. అనుకుంటూ కొడుకును మరోలా అపార్ధం చేసుకోలేకపోయింది జానకమ్మ. అతను ఉదారంగా డబ్బు ఖర్చుచెయ్యడం ఎరుగున్నదే కనుక.
అమ్మాయి మంచిపిల్ల లానే ఉంది అనుకుంది. శ్రీనివాసరావు తల్లితండ్రుల పేర్లు మినహా తఃక్కినదంతా జరిగింది జరిగినట్టూ చెప్పింది రాధ ఆమెతో.
ఇప్పుడు అత్యవసరమైతే తప్ప శ్రీనివాసరావుతో మాట్లాడ్డమే మానేసింది రాధ.
ఆమె జీవితచరిత్ర తెల్సుకోవాలనే తహతహ ఉన్న శ్రీనివాసరావు. ఏకాంతంగా ఆ అమ్మాయితో మాట్లాడే అవకాశంకోసం ఎదురు చూస్తున్నాడు. అతను ఎప్పుడూ ఏ పరిస్థితుల్లో ను తెలియని తృప్తీ, సంతోషం అనుభవిస్తున్నాడు "రాధకోసం పల్చని, అందమైన చీరలూ, జాకెట్ ముక్కలూ తెచ్చాడు. హోటల్లో జరిగిన సంగతంతా చెప్పి. ఆ అమ్మాయి నా సేహితుడు సుబ్బారావు కూతురని తెల్సుకున్నాక తీసుకొచ్చేశాను అని తల్లికీ, తండ్రికీ చెప్పాడు.
నమ్మీ నమ్మలేకా కొడుకు పై ఏదోలా చూచాడు రంగనాధం. "నిజమే" అని సరిపెట్టుకుంది జానకమ్మ. రాధ ప్రవర్తన అనుమానాస్పదమైనది కాదని తోచేక శాంత హాయిగా, తేలిగ్గా గుండెల నిండా గాలి పీల్చుకుంది.
కాని లోకులు పల్లే పట్నమూ కాని ఆ ఊరు ప్రజలు ఊరుకోలేదు. నీలాటి రేవున. రచ్చ సావిడి దగ్గర బస్ స్టాండులో శ్రీనివాసరావు ని చూసీ చూడనట్టు అతను వినేలా చక్కని పిట్టను పట్టేడు లే. ఇదేం పొయ్యేకాలం ఎభయ్యో వడిలో పడి పాపం పిల్లలు పుడ్తారని కాబోలు ఇంట్లో అందరూ సరిపెట్టేసుకున్నారు?.....మరేం చేస్తారు తన్ని తగలేస్తాడు నోరెత్తితే....పోనీ ముసలాడు ఇతనితో ఏం ఏడుస్తుంది. ఏదైనా ధరకి పలికే రకమే కదూ; చూడ్రాదురా అబ్బాయ్.
అతనికి వళ్ళు మండించే కోపం వచ్చేది. మనస్సు ఉడికిపోయేది. "చంపేస్తాను, మీ నాలుకలు కోసేస్తాను. అలా అన్నారంటే అది నా కూతురు. నిప్పులాటిది అని అరవాలన్పించేది. కానీ వినీవిననట్లు కందిన మొహంతో వణికే పెదవులతో కంపించే తనువుతో. తడబడే అడుగు లతో. ముందుకి సాగిపోయేవాడు శ్రీనివాసరావు.
ఛ. ఛ ఆనాడు పిల్లను తీసుకుని విడాకులు తీసుకోవలసింది. రమ తెలివితక్కువది కాదు. ఆమెనుంచి విడాకులు పొందడం చాలా కష్టంగా తోచిందప్పుడు. ఆమెను విడిపించుకోవాలనీ ఆమె నోరు కట్టెయ్యాలనీ, ఆమెను అవమాన పరచాలనీ, నిందమోపాడు. ఆ రోజు నా భార్య అక్రమంగా గర్బవతి అయిందని కసిగా చెప్పాడు నలుగురిలో. నలుగురూ ఆమెను తిడ్తూంటే సంతోషంగా వినాలని. కానిఈ రోజు తను తన కూతుర్ని ఉంపుడు కత్తె అంటున్నారు. ఎన్నో దుర్భాషలు ఇష్టమొచ్చినట్టూ మాట్లాడుతున్నారు. "వినలేక కుళ్ళి కృశించిపోతున్నాడు" ఆ నాడు తను నోరు కట్టెయ్యాలని ఆత్రుత మాడాడు. ఈ నాడు నిజం చెప్పలేక నోరు కట్టుబడి పోతూంది. ఆనాడు ఆమెను అవమానం పాలుచేద్దామనుకున్నాడు. ఈ నాడు ఇంటా బయటా. అందరి దృష్టిలో వెధవయ్యేడు. రోడ్డున పోతూంటే, తనను చూసి కాండ్రించి ఉమ్ముతున్నారు కూడా," వీళ్ళ కెందుకో తానెలా పోతే, భార్యా తల్లీ తండ్రీ ఎవరికీ లేని బాధా. నాలుక దురదా లోకులకి, వెధవలు అరిచి చావనీ మాకేం పోయింది. నా పాపం పంచుకుంటారు. నా కూతురు పాపం పంచుకుంటారు. కసిగా నవ్వు కుంటున్నాడు శ్రీనివాసరావు.

జానమ్మా శ్రీనూ అనీ. రంగనాధం, బాసూ అనీ పిలుస్తూంటే. "బామ్మాగారూ బాబయ్య గారి పేరేమిటి?" అని అడిగింది రాధ.
శ్రీనివాసరావు.
ఆ పేరు విన్న రాధ త్రుళ్ళిపడింది. కాని వెంటనే శ్రీనివాసరావు పేరున్న వ్యక్తులు చాలా మంది ఉంటారు అని సరిపెట్టుకుంది.
పల్చని అందమైన చీరల్లో రమ ఎంత అందంగా ఉండేదో అంతకు రెట్టింపు అందంగా కన్పిస్తూంది రాధ.
ఆ నాడు రమను చూసి పళ్ళు కొరికిన శ్రీనివాసరావు ఈ నాడు రాదను చూసి, వాత్సల్యంగా, ప్రేమగా, తృప్తిగా, గుంభనంగా ఇంకా పట్టలేని సంతోషంతో నవ్వుకుంటున్నాడు "అంత అందమైన పిల్ల. తన రక్తంలో, రక్తం, తన జీవంలో జీవం, ఇన్నాళ్ళూ అతనికి తన జీవితమంతా శూన్యంగా కన్పించేది. డబ్బూ, హోదా, పలుకుబడీ పదవీ ఇవన్నీ కప్పలేని శూన్యాన్ని. తనబిడ్డ రాధ కప్పేసింది." అతని ఊహాపథంలో, భవిష్యత్ లో, రాధ, ఆమెకు అందంగా పెద్ద ఆఫీసరైనా భర్తా, పిల్లలూ, పచ్చని ఆమె సంసారం. తనను నాన్నా అని పిల్చే రాధా. మామగారూ అని పిల్చే ఆమె భర్తా తాతా, అని పిల్చే వారి పిల్లలూ, ఎన్నో కథ అల్లుకు మురిసిపోతున్నాడు శ్రీనివాసరావు.
రాధవచ్చి రెండునెలలు దాటింది. రమ ప్రసక్తి ఎప్పుడూ ఆ ఇంట్లో రాలేదు. "అందరూ ఇలా అనుకుంటున్నారు" అని జానికమ్మా. శాంతా గుసగుసలాడ్డం. రంగనాధం చురచురగా తనవైపు చూడ్డం గ్రహించిన రాధ ఓ రోజు అందరూ ఒక దగ్గర కూర్చుని ఉండగా. "బాబయ్యగారూ పిల్చింది నెమ్మదిగా.
చిరునవ్వుతో ప్రశ్నార్ధకంగా చూశాడు శ్రీనివాసరావు.
"మీ ఇంటికొచ్చి చాలా రోజులైంది. మీకు చాలా ఋణపడిపోతున్నాను." సన్నగా గొంతు వణికింది.
