"మా అమ్మపేరు రమాదేవి. మా నాన్నగారి పేరు శ్రీనివాసరావు,"
త్రుళ్ళిపడ్డాడు శ్రీనివాసరావు........." తన కూతురు తన గదికి....అతని హృదయం గట్టిగా పిండినట్టయింది......మనస్సు ద్రవించిపోయింది. హృదయ పంచలవానికీ, మానసిక బాధకీ తట్టుకో లేక గట్టిగా కళ్ళు మూసుకు దిండుకు చేరబడ్డాడు. రమ కూతురు తనది కాదన్నాడుగా ఓ రోజు. ఏమో రమ నిర్లక్ష్యానికి పగ పెంచుకున్నాడు కాని. ఆమె అలాటిదని, పతితగా కులటగా నిందించాడు ఆమెనుంచి దూరంకావాలని ఆమెనలా శిక్షించాలని. కాని ఆమెతో తాను కాపురంచేసిన నాలుగేళ్ళూ, మాటా ప్రవర్తనా అన్నీ ఖచ్చితమైనవి కల్మషంలేనివీ అన్పిస్తూంటుందిప్పుడు. తాను కాదన్న తన కూతురు తన గదికి పడుపు కత్తెగా పంపబడింది. తాను విటుడుగా గుర్తించ బడ్డాడు. ఛీ ఛీ. జన్మకు నా జన్మకు. ఇంత కన్నా నరకమేముంది? రమా! నువ్వు ప్రమాదానికి గురై వెంటనే చచ్చిపోయావా. కొన్ని క్షణాలన్నా బ్రతికి ఏ కూతురు గురించి ఆలోచించలేదా? అలా కొన్ని క్షణాలు బ్రతికుంటే...ధైర్యంగా నీ కూతురిని నువ్వు తీసుకుపో ...అని ఏ చిన్నవార్త నాకు పంపినా. మనబిడ్డ ఇన్ని బాధలకు గురయ్యేదా?.....విడాకులిచ్చావు ఫో...నీకూ నాకూ సరిపడలేదు ఎవరికి నచ్చిన త్రోవన వారు జీవితం గడపాలని బహుశా ఇద్దరం అనుకున్నాం. నేను నీనుంచి వేరయి బ్రతకాలనుకుని అభాండం వేశాను. నాతో విసిగి నా నుంచి విడిపోవాలనే కోరిక నీకూ వుంది. తేలిగ్గా విడాకులు వ్రాసి ఇచ్చావు.. కాని పసిదాన్ని....దిక్కులేనిదాన్నిగా చేసిపోవడానికి నీ మనస్సెలా వప్పింది నేను బ్రతికున్నానని, పిల్లలకోసం వాచి చచ్చేవాడిననీ నీకు తెల్సు.....నా అడ్రసు తెల్సు.... నా కెందుకు వైరిచ్చావుకాదు ......అర్ధరహితంగా పగ పెంచుకున్నాను. పోనీ ఆఖరి సారిగా నిన్నొకసారి చూచే అవకాశం నాకు ఎందుకు కల్పించలేకపోయావ్, తీవ్రంగా, ఎలక్షన్ ల గొడవ నుంచి రమా తనూ కలసి బ్రతకి విడిపోయే గత సంఘటనలవైపు అతని ఆలోచనలూ సాగిపోయాయ్ అప్రయత్నంగా వెచ్చని కన్నీళ్ళు ప్రసవించాయి. చప్పున మొహం తుడుచుకు చూశాడు రాధవైపు.
కూచున్న చోటే అలసి శోషవచ్చి, సొమ్మసిలిపోయినటుగా వాలిపోయింది రాధ. ఆమె కనురెప్పలు బరువుగా మూసి ఉన్నాయ్ తడిగా. తన కూతురనే దృష్టితో చూసిన శ్రీనివాసరావుకి కొట్టవచ్చినట్టు తన పోలికలు కన్పించాయ్. తన ప్రతిబింబం అద్దంలో చూసుకున్నాడు. రాధ వైపు చూశాడు అలా ఎన్నిసార్లో ఒకటికి పది సార్లు చూసిన శ్రీనివాసరావు బాధగా నిట్టూర్చాడు... భగవాన్. మమ్మల్నిద్దర్నీ యిలా కలపడం న్యాయమా, తండ్రీ కూతుళ్ళను కలపడానికి ఇంకో మార్గమే తోచలేదా? నీకు? లేదు పవిత్రస్త్రీని కులటగా లోకంలోకి అడుగు పెట్టబోయే ప్రాణిని అనామకంగా చేసి లోకంలో వదిలిన ఘాతకుడి కిదే శిక్షనుకున్నావ్.....పోనీ నీవు కరుణా మయుడివి కాకుంటే దీనరక్షకుడివి కాకుంటే నా కూతురు మరొక గదికి పంపబడి సర్వనాశనమయ్యేది. నువ్వు దయామయుడివి. పిచ్చిగా దీనంగా ప్రార్ధించాడు భగవంతున్ని.
ఎంతసేపో పరిశీలనగా రాధవైపు చూసిన శ్రీనివాసరావు "అమ్మా రాధా?" తట్టి పిల్చాడు
కంగారుగా లేచి కూర్చుని మళ్ళీ ఏడుస్తూంది రాధ.
"నీకేం భయంలేదు. నేను అభయమిస్తున్నాను. నిన్నీ ఊరిలోంచి ఎంత డబ్బైనాసరే, ఎన్ని అవాంతరాలెదుర్కొనైనా సరే తప్పిస్తాను. కాని .. కొంచెం మనస్సు సంభాళించుకుని నేనడిగిన ప్రశ్నలకు జవాబియ్యమ్మా? లాలనగా అడిగాడు.
కృతజతాభావం నిండిన హృదయంతో వణికే చేతులు జోడించి నమస్కరించింది రాధ.
"మీ అమ్మ నువ్వు పుట్టక పూర్వం ఏ ఊర్లో ఉండేదో తెల్సా?" అడిగాడు. ఉత్సుకతతో ఆమెవైపు చూస్తూ.
చెప్పింది రాధ.
"మీ నాన్నగారు?....." పాలిపోయిన వదనంతో తడబడేగొంతుతో అడిగాడు శ్రీనివాసరావు.
"లెక్చరర్ గా పనిచేసేవారట. నేను అమ్మ కడుపులో ఉండగా ఆయన ఉద్యోగానికి రిజైనిచ్చి స్వగ్రామం వెళ్ళిపోయారట.
"ఆ ఊరు పేరేమిటో తెల్సా అమ్మా?"
"అమ్మకి తెల్సేమో నేను అడగలేదు ఎవరూ నాకు చెప్పలేదు మీరు నన్ను అనుమానిస్తున్నా రనుకుంటాను మోసగత్తెగా. లేక అతనికి నన్నప్పగించాలనే ఉద్దేశ్యమైతే.. ప్రాణమైనా తీసుకుంటాను కాని అతని దగ్గర కు వెళ్ళమంటే అతనికి నా మొహం చూపించను.... నన్నీ ఊరి లోంచి మీరు తప్పించి వున్నాడు....నేను స్కూలు ఫైనలు ప్యాసయ్యాను ఏదన్నా ఉద్యోగంచేసి బ్రతుకుతాను....మీలాటి సహృదయులు నాకు అండగా ఉన్నప్పుడు నాకేం భయం చెప్పండి?
"మీ నాన్న దగ్గరకు నువ్వు ఎందుకు వెళ్ళవమ్మా? బాధగా నవ్వాడు.
"మీకు చెప్పానుకదా! సార్.....నన్ను తన బిడ్డను కానని. నిప్పులాటి అమ్మ వ్యభిచారిణి అనీ నిందించి మమ్మల్ని లోకంలో వదిలిన నాన్న పంచను చేరితే మా అమ్మ ఆత్మకు శాంతి ఉండదు...." నేను లేకుండా చేసుకుంటే.....అంటే అమ్మ అప్పటిలో ఏదన్నా మందుమింగి భ్రూణహత్యకు ఒప్పుకుంటే అతనితో కాపురం నిలబెట్టడానికి ప్రయత్నిస్తానని మా తాతగారు అన్నారట అమ్మమనస్సు బాధగా మెలికలు తిరిగి పోయిందట వెంటనే మా నాన్నగారికి విడాకులు వ్రాసి ఇచ్చిందట.... నన్ను పెంచి.... నన్ను చూస్తూ ఏదో ఆనందం అనుభావించాలనుకున్న అమ్మ.... చచ్చిపోయింది నేను పసిదాన్నిగా ఉన్నప్పుడే..... మళ్ళీ తెరలు తెరలుగా ఆమెకు దుఃఖం ముంచుకు వచ్చింది..... కాని ఆమె కంఠంలో ఏదో ధైర్యం సముద్రంలో కొట్టకు పోయే వ్యక్తి ఒడ్డుకు విసిరివేయబడి బ్రతికినట్టు మహాపథంలోంచి తప్పించుకు బ్రతికిపోయినట్టు ధ్వనించింది."
"పోన్లే. ఇక్కడనుంచి బైటపడ్డాక నీ చరిత్ర చెబుదువుగానిలే..... విశ్రాంతి తీసుకో హాయిగా నిద్రపోమ్మా" అలా మంచం మీద మంచం చూపిస్తూ అన్నాడు శ్రీనివాసరావు.
"నాకు నిద్ర ఎలా వస్తుంది?.... పేలవంగా నవ్వింది.
"తలుపు ఘడియ సరిగ్గా ఉందో లేదో చూసి. సోఫాలో పడుకొంటూ" ఉదయం హోటలు యజమానిని కల్సుకుంటాను నాతో నిన్ను పంపెయ్యడానికి ఏం కావాలో అడుగుతాను. మరోలా ఫీలవ్కు నువ్వు నాకు కావాలని ఎంత ఖరీదైనా ఇచ్చుకొంటాను. మన ఇంటికి వెళ్ళి పోదాం." అన్నాడు.
ఆ రాత్రి ఇద్దరికీ నిద్రపట్టలేదు..... పశ్చాత్తాప హృదయంతో ద్రవించే మనస్సుతో తన్నుతానే దూషించుకుని రాధకోసం ఏమైనా చెయ్యాలనే పట్టుదలతో ప్రస్తుత కర్తవ్య మేమిటో ఆలోచనలతో తలవేడెక్కి అస్వస్థతతో ఉండిపోయాడు శ్రీనివాసరావు.
అతని దయా, సానుభూతీ యదార్ధమో నటనో. తఃనతో తన ఊరు తీసుకెళ్ళి .... అక్కడ ఇతనేం చేస్తాడో? .... భగవాన్ నన్నెందుకు పుట్టించావ్? అమ్మా! నువ్వు తాతగారు చెప్పినట్టూ చేస్తే. అప్పుడే నేను అంత మయ్యేదాన్ని అనామకురాలిగా ఈ భూమ్మీదకు తీసుకురావడానికి ఎందుకు సాహసించావమ్మా! ఇప్పుడు నా కేది దారి'? ఎలా బ్రతకు పయనించబోతుంది." గుండెలవిసేలా విలపించిన రాధ. అలసటగా మంచంమీద వాలిపోయింది.
సోఫాలో నడుంవాల్చిన శ్రీనివాసరావు కళ్ళు మూశాడు కాని నిద్రపట్టలేదు.
ఉదయం బోయ్ పిలవడానికొచ్చాడు రాధని. "కాఫీ తీసుకురా ఇంకొంచెంసేపు ఆ అమ్మాయి ఇక్కడే ఉంటుంది." అన్నాడు శ్రీనివాసరావు.
ఎన్ని గంటల దాకానండి? నోట్ బుక్, పెన్ను తీశాడాబోయ్.
"పదిగంటల వరకూ."
ఏదో బుక్ లో వ్రాసుకుని వెళ్ళిపోయాడతను.
"లేమ్మా!.....కాస్త మొహం కడిగి కాఫీ తాగు" పిల్చాడు శ్రీనివాసరావు. అతని చెయ్యి ఆమె తల మృదువుగా. ఆప్యాయతగా నిమర బోయింది. "నన్నపార్ధం చేసుకుంటుందేమో! అని తోచగానే ముందుకు దాచుకున్న చెయ్యి టక్కున వెనక్కి వెళ్ళింది.
కంగారుగా లేచి కూర్చుంది రాధ.
"అబ్బ. కళ్ళెలా వాచిపోయాయ్. నా మాట మీద, నామీద నమ్మకం లేదా అమ్మా! నీ జీవితం ఒక సక్రమమార్గాన పయనించే వరకూ.... ఈ శ్రీ....అని చప్పున ఆగి.... నా భార్యా, తల్లి తండ్రులమీదా ప్రమాణం చేసి చెప్తున్నాను. నిన్ను విడిచిపెట్టను. నువ్వు నా కన్నబిడ్డవని భావిస్తున్నాను." అతని గొంతు ఆవేశంగా వణికింది.
"నా పాలిటి దైవంలా ఉన్నారు మీరు. మీ ఋణం జన్మలో తీర్చుకోలేను." ఆమె కళ్ళు అనంతమైన కాంతి నింపుకున్నాయి ధైర్యంగా.
సంతోషంగా ఉన్నప్పుడు, నవ్వేప్పుడు రమ కళ్ళల్లో ఇదే వెలుగు తొణికిసలాడేది అనుకున్నాడు శ్రీనివాసరావు.
తలుపు గడియవేసుకో ఫ్లాస్కులో కాఫీ ఉంది తాగు ఎవ్వరు పిల్చినా బయటికి వెళ్ళకు. అంటూ గది బయటికెళ్ళాడు శ్రీనివాసరావు.
* * *
హోటలు ప్రొప్రయిటరుకు పదివేల రూపాయలు చెక్కు వ్రాసిచ్చి రాధను తీసుకు ప్రయాణమయ్యాడు శ్రీనివాసరావు.
నాలుగు స్టేషన్లు దాటిన తర్వాత కాఫీ, టిఫినూ బలవంతంగా తినిపించాడు శ్రీనివాసరావు రాధ చేత.
"ఆమె కనులు వర్షిస్తూనే ఉన్నాయ్.
నెమ్మదిగా అన్నాడు. "నువ్వలా ఏడుస్తూంటే ఎన్నో అనుమానాలొస్తాయ్ చూసేవారికి" అని.
గబగబా కళ్ళు తుడుచుకుంది. కట్టుబట్టతో.....ఆమె గొంతు పూడిపోయింది.
నీ తాలూకు బట్టలూ వగైరా ఇచ్చెయ్యమని అడిగాను. వాడు మూర్ఖుడు ఏమీ తీసుకెళ్ళడానికి వీలులేదన్నాడు"
"కనీసం అమ్మా నాన్నా కలిసి తీయించుకున్న ఫోటో అన్నా తెచ్చుకునేదాన్ని..."
అదా.... ఎలాగో సంపాదించి ఇస్తాలే. మళ్ళీ ఆ ఊరువెళ్తుంటానుగా.... మీ నాన్నను ఫోటో చూసి ఉన్నావు కనుక గుర్తుపట్టగలవా?
తల తాటించింది రాధ.
నవ్వుకున్నాడు శ్రీనివాసరావు. అప్పటి శ్రీనివాసరావు సన్నగా, నాజూగ్గా అందమైన క్రాపుతో ఉండేవాడు. ఇప్పటి శ్రీనివాసరావు, లావుగా చిన్నబొజ్జా, పట్టబుర్రా, కళ్ళజోడూ, ఏం గుర్తు పడుతుంది? అనుకుంటూ.
రైలు స్పీడుగా పరుగెడుతుంది. ఏదో గుర్తొచ్చినట్టు టక్కున రాధవైపు తిరిగి "అమ్మాయ్, అక్కడికి వెళ్ళాక మా ఇంట్లో వాళ్ళు అందరూ నీ తల్లితండ్రుల పేర్లు అడుగుతాడు. చెప్పవద్దు అన్నాడు.
కొంచెం ఆశ్చర్యంగా అతనివైపు చూసింది.
"మరేం లేదు. మీ అమ్మని నాన్నవదిలెయ్యడం....ఇద్దరూ పోలేదు అతను బ్రతికున్నాడు. అనవసరమైన గొడవలొస్తాయ్ అలా చెప్పనని మాట ఇయ్యి" అతను చెయ్యి ముందుకు చాచాడు.
అతని చేతిలో చెయ్యివేస్తూ "మరేమని చెప్పాలి" అంది.
"తండ్రిపేరు సుబ్బారావు. తల్లి సీత అని చెప్పు. ఇద్దరూ పోయారని ఆ హోటలు యాజమాని నిన్నన్యాయంగా చెరపట్టి, హింసించాడనీ చెప్పు"
అలాగే అన్నట్టు తల ఊపింది రాధ.
* * *
నలుగురు పెద్ధమనుష్యులతో కలిసి బస్సెక్కిన కొడుకు. పద్దెనిమిదేళ్ళ అమ్మాయిని తీసుకు బస్ దిగుతూంటే. కళ్ళు నులుపుకునీ చెయ్యి ఎండకి చాటుచేసుకునీ, బస్ స్టాండులో ఉన్న రంగనాధం దిగ్ భ్రాంతుడై తన కొడుకేనా ఆ దిగింది? అన్నట్లు నమ్మి, నమ్మలేకా చూశాడు.
"ఇక్కడ నిల్చున్నారేం నాన్నా!" చిన్నగా నవ్వుతూ అన్నాడు శ్రీనివాసరావు.
"వాళ్ళేరీ.....నీతో బయల్దేరిన శ్రేష్టిగారూ. రాజూ, సుందరం, మన పంచాయతీ మెంబర్లూ వాళ్ళంతా..."
"వచ్చేటప్పుడు వాళ్ళను కలియ లేదునాన్నా," బేగ్ చేత్తో పట్టుకు ఇంటికెళ్ళే రోడ్డువైపు గబగబా మళ్ళిపోయాడు శ్రీనివాసరావు అతన్ని అనుసరిస్తూంది రాధ.
"ఈ అమ్మాయి ఎవరింటికొచ్చింది?" సందేహా నివృత్తికోసం ఆత్రుతగా ప్రశ్నించాడు రంగనాధం.
"మనింటి కే.... జవాబు.
రంగనాధం వదనంలో రంగులు మారి పోతున్నాయ్. అడుగులు గబగబా పడ్తున్నాయ్. ఉచ్చ్వాస నిశ్వాసలు వేడిగా తీవ్రంగా వస్తున్నాయ్. బంధువులూ, స్నేహితులూ ఎవ్వరి అమ్మాయి కాదనుకున్న రంగనాధం మరొక రకంగా కొడుకు నపార్ధం చేసుకోడానికి ఎంతో టైము పట్టలేదు. రాజకీయాలంటూ నాలుగురకాల మనుష్యులతో తిరుగుతున్నాడు. బంగారంలాటి ఉద్యోగం రిజైన్ చెయ్యలేదా? నిక్షేపంలాటి భార్య నొదిలెయ్యలేదా ప్రెసిడెంటు పదవికోసం బంగారంపండే భూములమ్మలేదా! వెధవది రాజకీయాల్లో జొరబడ్డాక పదవుల కోసం ఎగబడి ఎన్ని అబద్దాలాడుతున్నాడు! ఎన్ని మాయలు చేస్తున్నాడు! తానెరగ డేవిటి! భార్య గేదెలా ఊరిపోయింది. అందం చందం లేకుండా దీన్ని తెచ్చుకునుంటాడు అన్న నిశ్చయానికొచ్చేశారు.
శ్రీనివాసరావు వెనుకే గుమ్మం ఎక్కబోతూన్న రాధకు అడ్డుగా చేతులు చాచి నిల్చుని "ఆగు....అన్నాడు రంగనాధం గర్జిస్తూన్నట్టు పెదవులు వణుకుతూంటే.
"నాన్నా! అడ్డు తొలగండి" అంటూ రాధను చెయ్యి పట్టుకు గుమ్మం ఎక్కించాడు శ్రీనివాసరావు.
ఒళ్లెరగని కోపంతో. "నేనింకా బ్రతికే ఉన్నాన్రా ఇంత తెగిస్తావా? నలుగురూ మొహాన ఉమ్మేస్తారనన్నా సిగ్గులేదా అప్రాచ్యపు వెధవా" అంటూ - నలభైదాటి ఏభయ్యో వడిలోకి వెళ్ళబోతూన్న శ్రీనివాసరావు చెంపపై బలంగా తనకున్న శక్తినంతా కూడతీసుకు కొట్టారు డెబ్బైయేళ్ళ రంగనాధం.
రొప్పుతూ మళ్ళీ ఎత్తబోతూన్న రంగనాధం చెయ్యిపట్టుకు. "తప్పుగా నన్నపార్ధం చేసుకు ఆవేశ పడకండి నాన్నా, మీ కొడుకెలాటి తప్పు అన్నా చేశాడు కాని జీవితంలో పరస్త్రీ వ్యామోహంలో ఎప్పుడూ పడలేదు. చెయ్యరాని పాపాలెన్నో పెద్ధమనిషీ. మర్యాదస్థుడిగా గౌరవించ బడుతూనే రెండో కంటికి తెలియకుమ్డా చేశాను.... ఇవాళ ఒక మంచిపని చేశానని గుండెలమీద చెయ్యివేసుకు చెప్తున్నాను. ఆ అమ్మాయి నా స్నేహితుడి కూతురు. ఓ ఆపదలో చిక్కుకుంది. తీసుకువచ్చాను. రభస చెయ్యకండి మీరే అర్ధం లేకుండా నన్నంటే అందరూ అనరూ? అన్నాడు శ్రీనివాసరావు కంపించే గొంతుతో.
