4
నరసయ్య హడావిడిగా రామదాసుగారి బంగళాని చేరుకున్నాడు గబగబా మేడెక్కి రామదాసుగారి గదిలోకి వెళ్ళేడు.
నరసయ్య హడావిడిని చూచి రామదాసు, అతన్ని కూచోవలసిందిగా కళ్ళతో చెప్పేరు.
"కుట్ర జరిగిపోతోందండిబాబు! నా కళ్ళారా చూశాను. నా చెవులారా విన్నాను," అన్నాడు నరసయ్య.
కళ్ళతో కాకుండా ఈ తడవ నోటితో చెప్పేరాయన....
"ముందు కూచోవయ్యా! కూచుని, ఇదిగో ఇది కొంచెం పుచ్చుకుని చెప్పవలసిందంతా చెప్పు, ఓపిగ్గా వింటాను. ఈలోగా మాత్రం ఖంగారుపడి చావకు."
రామదాసుగారు పుచ్చుకోమని కోరిన ద్రవాన్ని చూచింతర్వాత నరసయ్య కూచోక తప్పిందికాదు. కూచుని కొంచెం పుచ్చుకున్నాడు. పుచ్చుకుని తలమీద చేయి వేసుకున్నాడు అక్కడ నున్నగా తగలడంలో చేయి గబిక్కిన తీసుకున్నాడు.
అప్పుడు రామదాసుగారు పకపకా నవ్వేసి చెప్పేరు-
"తప్పు నరసయ్యా! గుండు కొట్టించుకున్నందుకు సిగ్గుపడమాకు. స్వాములవారు వెళ్ళి సరిగ్గా నెల తిరగలేదు. జుట్టుకోసం బెంగపడితే ఎల్లా? నాది ఉంగరాలజుట్టు కదుటయ్యా? బెంగపడి చస్తున్నానా? ఆఫ్టరాల్ నీది సాదాజుట్టు, అంతమాత్రానికే వర్రీ అయిపోతే ఎట్లా? కనకేమిటంటే సిగ్గుపడకు. ఇంతకీ విషయం చెప్పేవు కాదు. మొదలెట్టు! విషయం చెబుతూనే- మధ్య మధ్య పుచ్చుకుంటూండు- ధైర్యంగా వుంటుంది కానివ్వు."
"ఏం చెప్పమంటారు బాబూ? ముందు నాకళ్ళు పొడిచేయండి. నా చెవులు కోసేయండి. అప్పుడింక దిగులుండదు."
"నాకు మంటెత్తించకు. నీ కళ్ళూ చెవులగురించి చెప్పడానికే వచ్చేవుటయ్యా? ఏం జరిగిందో చెప్పేడు."
నరసయ్య మరికొంచెం పట్టేడు.
"అయ్యా......తిమ్మాపురం మరి బాగుపడి ఏడవదండి. తమతో చేతులు కలిపి తమకి జై కొడుతున్నారే యెదవలు......తమని సింహాసనం నుంచి తోసేయాలనుకుంటున్నారండి."
"ఎవడది లోకనాథంగాడేనా?"
"నరసయ్య కళ్ళింతవి చేసి చూడటానికి మందు ప్రభావం కానేకాదు. ధర్మప్రభువు రామదాసుగారి మాట ప్రభావం!
ఆ మాట విని గబగబా గుండెల్ని బాదుకుని,
"అమ్మమ్మ......నేను యెదవనిగాని తమరుకాదు, ఎంత చక్కగా గ్రహించారండి విషయం. సరిగ్గా లోకనాథం బాబేనండి. ఆ బాబింటో ఏడెనిమిది మంది మనుషులుండి, ఒకడి చెవులొకడు తినేస్తున్నారండి. తవఁరింక ఈ తిమ్మాపురాన్ని ఏలుబడి చేయడానికి తగ్గరంటే తగ్గరంట! కలికాలం బాబూ......కలికాలం......!" అన్నాడు నరసయ్య.
రామదాసుగారు నవ్వేస్తూలేచి నిలబడ్డారు. మందు పుచ్చుకున్న సమయంలో వారు తెగనవ్వేయడం అలవాటు. ఎంతదారుణాన్నైనా విని తట్టుకోడవేఁ గాకుండా నవ్వుకోడం గూడా చేస్తారాయన. ఎంత మందు ప్రభావమైనా అది అందరికీ చేతవుతుందా?
రామదాసుగారి నవ్వుని నరసయ్య భరించలేకపోయేడు.
ఆ నవ్వు ముందుగా మంద్రస్థాయిలో ప్రారంభమై, ఒకచోట వెకిలిగా మారి, తారస్థాయి నందుకున్నప్పుడది భయంకరమైపోయింది.
చివరకి-
ఆ నవ్వు వొళ్ళుమండి నవ్వుతున్నదో, ఉత్సాహానికి చిహ్నమో, ఏడవలేక నవ్వడమో తెలీని విధంగా తయారయ్యింది.
ఒకపక్క రామదాసుగారి కళ్ళుసైతం చింతనిప్పుల్లా మండిపోడంతో - అదంతా కోపమేనని అర్ధం చేసుకున్నాడు నరసయ్య.
రామదాసుగారు ఆ నవ్వుని ఠక్కున ఆపి నరసయ్య వేపు ప్రేమగా చూస్తో చాలా కటువుగా మాటాడేరు.
"ప్రజల్ని అందరూ ఏలలేరు నరసయ్యా! అడ్డమైన వెధవకీ ఆ విద్య చాతకాదు. ప్రజల్ని ఏలేందుకు-ఇదుగో నేను పుట్టేను. నే నందుకు పుట్టాను. నేను కారణ జన్ముడ్ని. ఇక్కడ కారణం ప్రజల్నేలడం. ఆరు నూరయ్యేది నూరు ఆరయ్యేదీ- లోకనాధాలు పదివేలు నుంచునేది- నేనే ప్రభువుని. ప్రభువుని నే నొక్కన్నే. ఈ వాజమ్మలంతా ప్రభువులు కాలేరు. వీళ్ళు ప్రభువులైన్నాడు ప్రజలుండరు! వీళ్ళు మట్టినీ గడ్డినీ ఏలవలసిందేగాని మనుషుల్నికాదు. అందుచేత నేను ఈ లోకనాథం గాడికి భయపడిచావను ఇన్నేళ్ళూ వాడు నా కుడిచెయ్యని మురిసిపోయేనుగదా......ఇక ఈ రోజునుంచి ఆ వెధవ నా వంటిమీద వెలిసే రోమ సమానుడు, తొలిగిస్తాను. కొడుకు కుట్ర చేస్తాడూ? చూస్తాను. ఈ కొడుకు మొహాన్న 'ఉప ప్రభువు' పదవొకటి తగలేస్తే వెధవ నోరెత్తడింక. ఒక్క లోకనాథంగాడే కాదు, ఏ కొడుకైనాసరే యిదే మందు. నాకు వళ్ళుమండిందంటే రూల్సు మార్చేసి రోడ్డుకో ఉప ప్రభువుని నిలబెట్టేసి వాళ్ళ నోళ్ళు కట్టేస్తాను, ఆ ఎత్తులు నాకూ తెలుసు. ఉప ప్రభువు......వల్లకాడు.....ఏదైతేనేం ఒక పదవి. పదవి కోసం పడిచచ్చే వెధవలందరికీ ఇదేమందు. నరసయ్యా! నేను తుగ్లక్ ని కాను. ఆందోళనని అణచాలంటే ఉపపదవులవసరం. ప్రజల్ని ఉద్దరించాలనే కోరిక నాజాతి వాడికెవడికీలేదు. వుండదు. నువ్వెళ్ళిపో నరసయ్యా! వెళ్ళి లోకంగాడికి చెప్పు- "బాబు నీకు ఉప ప్రభువిస్తానని అంటున్నాడ," ని. వాడీ మాటకేం డేన్స్ చేస్తాడో నేను రేపు చూస్తాను. నువ్వెళ్ళిపో....."
నరసయ్య చేతిలో ప్రకాశిస్తున్న మందుగ్లాసు తక్షణం నోటికి చేరుకుంది. గబగబా తాగేసి మూతి తుడుచుకున్నాడు.
రామదాసుగారి వేపు కళ్ళింతపని చేసుకుని చూస్తో అతివినయంగా అన్నాడు.
"బాబు గట్టోడు. బాబు ధర్మబాబు, బాబొక్కడే ప్రభువు. ప్రభువంటే ప్రభువు. బాబూ! నమస్కారం......వెళ్ళొస్తా!"
రామదాసుగారు చిద్విలాసంగానవ్వి నరసయ్య భుజంతట్టి అన్నారు.
