Previous Page Next Page 
గుళ్ళో వెలిసిన దేవతలు పేజి 12

                          


    "పావనీ! ప్రతిరోజూ ఇంటికొస్తూ నేను ఇంటికొచ్చేసరికి నువ్వు నాకోసం నిరీక్షిస్తూ ఇంటి దగ్గిర ఉంటావని కలలు కనేవాణ్ని...ఇన్నాళ్ళకు నా కల నిజమయింది..."
    పావని చేతులు తన చెక్కిళ్ళకు అదుముకుంటూ ఆప్యాయంగా అన్నాడు విఠల్...పావని మాట్లాడలేదు విఠల్ గుండెలలోంచి కదలలేదు.
    "నీ ధోరణిచూసి ఏ నాటికైనా ఆ పాడు సమాజాన్ని వదిలి నా దగ్గిరకు వస్తావనే నమ్మకం లేకపోయింది. అబ్బ! మళ్ళీ సమాజం గిమాజం అంటూ నా ప్రాణాలు తియ్యకు పావనీ?"
    ఉలికిపడింది పావని. నెమ్మదిగా విఠల్ చేతులు విడిపించుకుని దూరంగా జరిగింది...
    "పావనీ!..."
    ఆశ్చర్యంగా చూశాడు విఠల్...
    తనణు తను అదుపులో పెట్టుకుని మాట్లాడటానికి కొన్ని నిముషాలు పట్టింది పావనికి...
    "నేను సామాజాన్ని వదిలి రాలేదు..."
    "వదలలేదూ? అయితే ఎందుకొచ్చినట్లూ? ఏ అపఖ్యాతి భరించలేక ఉన్న పాటున ఊరు వదిలి పొరుగూళ్ళు పట్టానో, ఆ అపఖ్యాతి ఇక్కడికికూడా మోసుకొద్దామని వచ్చావా? ఇక్కడయినా నన్ను స్థిమితంగా ఉండనియ్యదలుచుకోలేదా? ఇప్పటికయినా నా చెల్లెలి పెళ్ళిచేసుకోనియ్యవా?"
    తన పావని తన దగ్గిర కొచ్చిందనే సంతోషం ఆవిరి కాగా కలిగిన ఆశాభంగం భరించలేక ఉద్రేకంతో అన్నాడు...
    ఇంత అవమానం భరించలేకపోయింది పావని-
    "నా చెల్లెలికి పెళ్ళిచేసుకోనియ్యవా?" అని అడుగుతున్నాడు.....తనెందుకు రావలసివచ్చిందో తెలిస్తే...
    "క్షమించండి. ఇప్పుడే వెళ్ళిపోతాను."
    "వెళ్ళు-వెంటనేవెళ్ళు-మళ్ళీ మళ్ళీ వచ్చి మానుతోన్న గాయాన్ని రేపకు...
    అప్పటికప్పుడే ప్రయాణమయింది పావని. పద్మావతి కలవరపడుతూ "ఏమిటిరా ఇది? ఉండనీ!" అంది.
    "అమ్మా! నువ్వూరుకో?" అని కసిరాడు విఠల్...
    మొదటినుండీ మొగవాళ్ళ అధార్టీకి అలవాటుపడిన పద్మావతి....ఆ అధార్టీకి లొంగడమే నీతి అనుకునే పద్మావతి మళ్ళీ మాట్లాడలేదు. తన తరపున అత్తగారు అలా బ్రతిమాలటంకూడా చిన్న తనమనిపించింది పావనికి....ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా తలవంచుకుని ఆ ఇంట్లోంచి బయటకొచ్చేసింది-
    
                                                10


    తన పొలం నాలుగెకరాలు అమ్మేసి నలభైవేలు పద్మావతికి పంపించింది పావని...
    ఊళ్ళో చెలరేగే దుమారం భరించలేక విఠల్ తన ప్రాక్టీస్ మరో ఊళ్ళో ప్రారంభించినా రవిని మాత్రం చదువు పాడవుతుందని ఆ ఊళ్ళోనే హాస్టల్లో ఉంచాడు. రవి ఒకటి రెండుసార్లు పావనిని డబ్బు అడిగాడు. కాదనలేక ఇచ్చింది పావని. కానీ రవి ఆ డబ్బు దుర్వినియోగం చేస్తున్నాడని తెలుసు కుంది. రవికి కొందరు రౌడీ స్నేహితులు పోగయ్యారు. పరీక్షల్లో కాపీకొట్టి పాసయిపోగలమనే ధీమా స్టూడెంట్స్ లో ఏర్పడిపోయింది. అంచేత చాలామంది పుస్తకాలు పట్టుకోవటంకూడా మానేశారు. వాళ్ళలో రవి ప్రముఖుడైపోయాడు. పావని దగ్గిర తీసుకున్న డబ్బుతో సినిమాలకూ హోటళ్ళకూ తిరగటం మొదలుపెట్టాడు...
    మరొకసారి రవి డబ్బు అడగటానికి వచ్చినప్పుడు పావని ఊరుకోలేక మందలించింది.
    "రవీ! నీ జీవితంలో ఈ దశ ప్రధానమైన మలుపు. తెలివితక్కువగా జీవితం నాశనం చేసుకోకు....మళ్ళీ మళ్ళీ నీ కెరియర్ నిర్మించుకోవాలన్నా నీ వల్ల కాదు. ఆ రౌడీ స్నేహాలు మానెయ్యి..."
    రవి అప్పటికే చాలా పొగరుబోతుగా తయారయ్యాడు. పావని డబ్బు ఇయ్యకపోగా, ఎదురు నీతులు చెప్పబోవటం రవికి నచ్చలేదు.
    "నాకు బుద్ధి చెప్పబోయేముందు నీ సంగతి నువ్వు చూసుకో! నలుగురూ నిన్నెంత నీచంగా అనుకుంటున్నారో తెలుసా! నువ్వు నా వదినవి అని చెప్పుకోవటానికి సిగ్గుగా ఉంది. ఏ ముఖం పెట్టుకుని నాకు బుద్ధులు చెబుతున్నావ్?" అనేసాడు.
    నిర్ఘాంతపోయింది పావని. ఆ ముఖంచూసి ఒక్కక్షణం తప్పుచేసిన వాడిలా బాధపడినా, తప్పు ఒప్పుకోగలిగే స్థైర్యంలేక పొగరుగా వెళ్ళిపోయాడు.
    కాలేజీలో ఉద్యోగం....సమాజంపని....శిరీష ఏ ఊళ్ళో మీటింగ్ ఏర్పాటు చేస్తే ఆ ఊరికెళ్ళి తమ ఆశయాల గురించి ఉపన్యాసాలివ్వటం ...ఇలా గడిచిపోతున్నాయి పావనికి రోజులు.
    అనుపమ ఉత్తరం రాసింది...
    "వదినా.
    నా పెళ్ళికి నువ్వు లేకపోవటం తలచుకున్న కొద్దీ నాకెంత  బాధగా ఉందో రాయలేను. అన్యాయమని తెలిసీ అన్నయ్యను ఎదిరించలేని అశక్తురాలినయిపోయాను. నా ఇంటికి నేను వెళ్ళాక నిన్ను ఆహ్వానిస్తాను. నన్ను క్షమించి తప్పకుండా వస్తావుకదూ! ఎన్ని ఉన్నా నీ ఆశీర్వచనంలేని ఈ పెళ్ళి నాకు వెలితిగానే ఉంది. కొంచెం రోజుల్లోనే నిన్ను నా ఇంటికి పిలిపించుకుని కరువుతీరా నీతో నాలుగురోజులైనా గడపగలననే ఆశతోనే ఈ నిస్పృహకు తట్టుకోగలుగుతున్నాను.
    నువ్వెలా ఉన్నావు వదినా! అన్నయ్యను చూస్తే జాలీ, కోపమూ రెండూ కలుగుతున్నాయి. వెనుకటి మనిషే కాడు. ముఖంలో నవ్వు అన్నది లేదు. మళ్ళీ మిమ్మల్నిద్దరినీ జంటగా చూసే అదృష్టం మాకు కలగదా వదినా!
                                                                                                              ఉంటాను.
                                                                                                                ప్రేమతో,
                                                                                                                   నీ
                                                                                                               అనుపమ..."
    అనుపమకు పెళ్ళయిపోయిందన్నమాట! ఆ పెళ్ళిదూరంనుంచి చూడటానికి కూడా తను పనికి రాకపోయినది పోనీలే! ఆ భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా సంసారం చేసుకుంటే అంతే చాలు.
    రామాపురంనుంచి వచ్చిన రైతు "అమ్మాయిగోరూ! సిన్నమ్మాయిగోరు దేవతయి యెలిసినారండీ! అయ్యగోరు గుడి కట్టించి నారండీ! రేపు ఉత్సవం జరుగుతాదండి మీరు రాటంలేదండీ?" అన్నాడు వుత్సాహంగా...
    పావని తెల్లబోయింది. సరళ దేవతయిందా? సరళకు గుడికట్టించారా? ఉత్సవాలు కూడా చేస్తున్నారా? తనను పిలవలేదు బహుశ దేవతగా వెలసిన సరళకు పూజలు చెయ్యటానికి తను పనికిరాదని కాబోలు!
    కుతూహలం ఆపుకోలేక రామాపురానికి వెళ్ళింది. నిజంగానే జగన్నాథం గుడికట్టించి అందులో సరళ విగ్రహాన్ని ప్రతిష్టించాడు ... ఎవరికో సరళ దేవతలా కలలో కనపడి తనకు గుడి కట్టించమందిట! తఃరువాత తరువాత సరళ దేవత అయినట్లు చాలా నిదర్శనాలు కనిపించాయట! జగన్నాథానికి కూడా సరళ దేవతగా కలలో కనిపించి గుడికట్టించమని అడిగిందట...
    పూజలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మ్రొక్కులతో, కానుకలతో, (జనం విరగబడి పోతున్నారు)
    హరిబాబును నిర్దాక్షిణ్యంగా హత్యచేసిన జనం - సరళణు నిలవనీయకుండా తరిమికొట్టిన జనం....సరళణు గుళ్ళో నిలబెట్టి పూజలు చెయ్యటానికి అహమహమికతో ముందుకొస్తున్నారు!
    ఇందులో వింత లేదేమో! ఇది అనాదిగా వస్తోన్న కథేనెమో! ఇంచుమించు ప్రతి గ్రామంలోను సజీవంగా ఉన్నప్పుడు సాంఘిక మౌఢ్యానికి బలిఅయిపోయి ప్రాణాలు పోయాక దేవతలుగా వెలసిన, స్త్రీమూర్తులు అసంఖ్యాకంగా కనిపిస్తోనే ఉన్నారుగా!
    రాను రాను చదువుకుంటామంటూ 'పురోగామి'సంఘంలో చేరడానికి వచ్చే బీద విద్యార్ధినుల సంఖ్య ఎక్కువ కాసాగింది. ఇంతమందికి వసతి కల్పించటానికి ప్రభుత్వం సేంక్షన్ చేసిన డబ్బు సరిపోదు. పావని తన పొలంమీద వచ్చిన డబ్బంతా సంఘంకోసమే ఖర్చుపెడుతున్నా ఖర్చులకి తట్టుకోవటం కష్టంగానే ఉంది అలాంటి సమయంలో నళినివచ్చి సంఘానికి మరొక అండగా నిలిచింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS